You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రోజర్ ఫెదరర్: టెన్నిస్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజం

టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నెలలో లండన్ వేదికగా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ ఆయన ఆడే చివరి టోర్నీ. దీని తర్వాత రోజర్ ఫెడరర్, టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నారు.

లైవ్ కవరేజీ

  1. ‘యుక్రెయిన్ డ్యాం మీద రష్యా మిసైల్స్ దాడి’

    దక్షిణ యుక్రెయిన్‌లోని ఒక డ్యామ్‌ మీద రష్యా మిసైళ్లు దాడి చేశాయని ఆ దేశ అధికారులు తెలిపారు.

    డ్యామ్‌కు చుట్టుపక్కన ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని వెల్లడించారు.

    ఈ డ్యామ్ క్రివ్‌యి రిహ్‌ సిటీలో ఉంది. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ ఇక్కడే పుట్టారు.

    డ్యామ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో రష్యాను ‘టెర్రరిస్ట్ స్టేట్’గా జెలియెన్‌స్కీ అభివర్ణించారు.

  2. కర్నాటక శాసనమండలిలో ప్రవేశపెట్టనున్న మతమార్పిడి నిరోధక బిల్లు

    కర్నాటక శాసనమండలిలో నేడు మతమార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెడుతున్నారు.

    ఇప్పటికే ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.

    కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కూడా ఈ బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని బీజేపీ ఎంఎల్‌సీ డీఎస్ అరుణ్ అన్నారు.

    కర్నాటక రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్-2021ను గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత దాన్ని శాసనసభ ఆమోదించింది.

  3. షాంఘై కోపరేషన్ సదస్సు కోసం నేడు ఉజ్బెకిస్తాన్ వెళ్లనున్న మోదీ

    ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల 22వ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

    ఈమేరకు నేడు సాయంత్రం ఆయన ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లనున్నట్లు విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.

    ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షునితో పాటు ఇతర నాయకులతో మోదీ భేటీ అవుతారు.

  4. యూపీ: ‘ఇద్దరు మైనర్ బాలికల రేప్... ఆ తరువాత హత్య’

    ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతు కనిపించాయి.

    ‘ఆ అమ్మాయిలను మోసపూరితంగా ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి సొహైల్, జునైద్ అనే ఇద్దరు రేప్ చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ నిందితులను ఆ అమ్మాయిలు కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ వారిని గొంతు పిసికి చంపేశారు.

    ఆ తరువాత వారు కరీముద్దీన్, ఆరిఫ్‌ను పిలిచి శవాలను వేలాడతీశారు’ అని లఖీంపుర్ ఖీరీ ఎస్‌పీ సంజీవ్ సుమన్ తెలిపారు.

    ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, హత్య కేసులు వారి మీద నమోదు చేశారు. బాలికల ఇద్దరి వయసు 18ఏళ్లలోపు ఉందని, వారు దళితులని పోలీసులు వెల్లడించారు.

  5. ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?

  6. కెనడాలోని స్వామినారాయణ్ మందిరంలో భారత్‌ వ్యతిరేక రాతలు

    కెనడాలోని టొరొంటోలో గల స్వామినారాయణ్ టెంపుల్ వద్ద భారత్‌కు వ్యతిరేకంగా బొమ్మలు, గీతలు గీయడం మీద అక్కడి భారత హైకమిషన్ అభ్యంతరం తెలిపింది.

    కెనడా అధికారులు ఆ ఘటన మీద విచారణ చేపట్టి, నిందితుల మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

    ‘కెనడాలోని ఖలీస్తానీ తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీన్ని అందరూ ఖండించాలి’ అని కెనడా పార్లమెంటు మెంబర్ చంద్ర ఆర్య ట్వీట్ చేశారు.

  7. తమిళనాడులో విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్

    తమిళనాడులో పేద విద్యార్థులకు పాఠశాలల్లో ఉదయం టిఫిన్ పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

    తొలి విడతలో 1.16లక్షల మందికి, ఆ తరువాత విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

    ఎవరూ దీన్ని ఉచితమని అనుకోరని, ఇది ప్రభుత్వ బాధ్యతని స్టాలిన్ చెప్పారు.

    రాష్ట్రంలో చాలా మంది పేద పిల్లలు తిండి కోసం స్కూలు మానేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు వారికి టిఫిన్ పెడుతున్నట్లు వివరించారు.

    డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా స్టాలిన్ పథకాన్ని ప్రకటించారు.

  8. గుడ్‌మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.