రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందులో సైరస్ మిస్త్రీతో పాటు మరొకరు మరణించగా, మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ఝార్ఖండ్‌లో 14ఏళ్లగిరిజన బాలిక హత్య

    ప్రతీకాత్మక చిత్రం

    బీబీసీ రాంచీ నుంచి రవి ప్రకాష్

    ఝార్ఖండ్‌లో 14ఏళ్ల గిరిజన బాలిక హత్యతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక మరణం ఆత్మహత్యలా కనిపించేలా చేసేందుకు ఉరి వేసుకున్నట్లుగా చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు చెప్పారు.

    ఈ విషయాన్ని డుమ్కాడిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్‌పీ మండల్ తెలిపారు.

    "హత్యకు గురైన బాలికకు నిందితునితో ముందే పరిచయం ఉన్నట్లు పోలీసులప్రాధమిక విచారణలో తేలింది.

    ఆ అమ్మాయి నిందితుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. చాలా విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. మృతురాలి తల్లి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 302, 376, ఎస్ సీ, ఎస్ టీ చట్టం, పాక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశాం. ఆయనను విచారిస్తున్నాం" అని చెప్పారు.

    "నా కూతురు ఒక కూలి పని చేసుకునే అమ్మాయి. ఆమెతో కలిసి పని చేసే అర్మాన్ అన్సారీ అనే ఒక తోటి కూలీ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశారు. దీంతో, ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని అడగడంతో నా కూతురిని చంపేశారు" అని మృతురాలి తల్లి స్థానిక మీడియాతో చెప్పారు.

    ఈ సంఘటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాదనలు మొదలయ్యాయి.

    ఈ అంశం పై ఝార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసన సభ నాయకుడు బాబూ లాల్ మరాండీ కూడా ట్వీట్లు చేశారు.

    "డుమ్కాలో చోటు చేసుకున్న సంఘటన చాలా విచారకరమైనది. నిందితుడిని అరెస్టు చేశారు. న్యాయం దొరికేందుకు చట్టాన్ని కఠినంగా అమలు చేయమని పోలీసులకు సూచించాను. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మృతురాలి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని అంటూ హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు.

    "డుమ్కాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఘోరమైనది. అర్మాన్ అన్సారీ అనే వ్యక్తి గిరిజన అమ్మాయిని హత్య చేసి చెట్టుకు కట్టి హత్య చేసుకున్నట్లుగా వేలాడదీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్మాన్ ను అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లో ఇలాంటి దుర్మార్గుల చేతిలో మరెంత మంది గిరిజన బాలికలు బలవుతారో? అని బాబూ లాల్ మరాండీ ట్వీట్ చేశారు.

    డుమ్కాలోనే కొన్ని రోజుల ముందు ఒక యువతిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఛార్జ్ షీట్ తయారు చేస్తున్నారు.

  2. "ప్రతిపక్షాలు ఐక్యమైతే బీజేపీకి 50 సీట్లు కూడా రావు" - నితీశ్ కుమార్

    నితీశ్ కుమార్

    ఫొటో సోర్స్, Getty Images

    2024 ఎన్నికల్లో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే బీజేపీ 50 స్థానాలను కూడా గెలుచుకోలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

    "ఈ ప్రచారం చేసే దిశగా నేను పని చేస్తున్నాను. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్నాను. ఈ విషయమై నేను త్వరలో దిల్లీ వెళతాను" అని నితీశ్ అన్నారు.

    ఆయన వివిధ పార్టీల రాజకీయ నాయకులను కలిసేందుకు సెప్టెంబరు 05న దిల్లీ వెళుతున్నారు.

    నితీశ్ కుమార్ శనివారం జరిగినజనతా‌దళ్(యూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    బిహార్‌లో జేడీయూ బీజేపీ సంకీర్ణం విడిపోయిన తర్వాత ఇరు పార్టీల మధ్య ఘర్షణ మొదలయింది. ప్రస్తుతం జేడీయూ ఆర్‌జేడీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    "ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉంది. కేంద్రం ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి నిరంకుశత్వం వైపు పయనిస్తోంది. ప్రజల సమస్యల పట్ల దృష్టి పెట్టడం లేదు" అని నితీశ్ అన్నారు.

    బిహార్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్‌కు ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేసేందుకు ఆమోదం తెలపడంతో పాటు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నడుస్తోందని అంటూ రెండు తీర్మానాలను చేశారు.

  3. ఝార్ఖండ్‌లో ఏ పార్టీకి మెజారిటీ ఎందుకు రాదు? ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకంత బలహీనంగా ఉంటుంది?

  4. తెలంగాణ: సెప్టెంబరు 17న అధికారికంగా భారీ ఉత్సవాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి కారణాలేంటి?

  5. విమానం చోరీ చేసి వాల్‌మార్ట్ లోకి దూసుకెళతానని బెదిరింపులు

    విమానం

    ఫొటో సోర్స్, MARY ELLEN ROGERS

    అమెరికాలోని మిస్సిసిపీలో వాల్‌మార్ట్ షాపును విమానంతో కూల్చేస్తానని బెదిరించిన వ్యక్తినిపోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పేరు కోరీ వేన్ ప్యాటర్‌సన్ఆయన పై భారీ దోపిడీ, తీవ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు కేసును నమోదు చేశారు.

    కోరీ వేన్ ప్యాటర్‌సన్ఒక స్థానిక ఎయిర్‌పోర్టులో పని చేసేవారు. కానీ, ఆయన దగ్గర పైలట్ లైసెన్స్ ఉన్నట్లు భావించటం లేదని పోలీసులు తెలిపారు. కానీ, ఆయనకు విమానం నడపడంలో కొంత శిక్షణ ఉండవచ్చని చెబుతున్నారు.

    కోరీ వేన్ ప్యాటర్‌సన్ ఎగరడానికి సిద్ధంగా ఉన్న బీచ్ క్రాఫ్ట్ ఎయిర్ ట్విన్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను దొంగలించారు. ఈ విమానంలో 10-11 మంది వరకు ప్రయాణించవచ్చు.

    నిందితుడు విమానాన్ని అదుపులోకి తీసుకుని911కి ఫోన్ చేసి వాల్ మార్ట్ లోకి దూసుకుని వెళ్లనున్నట్లు బెదిరించారు.

    సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే వాల్‌మార్ట్ షాపును ఖాళీ చేయించారు. అధికారులు ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తనున్నట్లు హెచ్చరించడంతో వాల్‌మార్ట్ తో పాటు చుట్టు పక్కల ఉన్న భవనాలు, దుకాణాలను కూడా ఖాళీ చేయించారు.

    అయితే, విమానం గాలిలో ఎగురుతుండగానే పోలీసులు నిందితునితో సంప్రదింపులు జరిపి విమానాన్ని సురక్షితంగాల్యాండ్ అయ్యేలా చూశారు. ఆయనకు విమానం నడిపే అనుభవం లేదు. పోలీసులు నిందితునితో మాట్లాడిన వివరాలను బహిర్గతం చేయలేదు.

    విమానం ల్యాండ్ అవ్వగానే నిందితున్ని మిస్సిసిపీ దగ్గర టుపెలోలో అరెస్టు చేశారు.

    విమానాన్ని చోరీ చేయడానికి ముందు నిందితుడు ఫేస్‌బుక్‌లో గుడ్ బై అనే మెసేజీని పోస్ట్ చేసినట్లు తెలిపారు.

    భారీ దోపిడీ, తీవ్రవాద బెదిరింపులతో పాటు నిందితుడు ఫెడరల్ స్థాయి విచారణను కూడా ఎదుర్కొంటాడు.

  6. పాకిస్తాన్ వరదల్లో 1200 దాటిన మృతుల సంఖ్య

    పాకిస్తాన్ వరదల్లో 1200 దాటిన మృతుల సంఖ్య

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ వరదల్లో మృతుల సంఖ్య 1200 దాటింది. మరో వైపు పరిశుభ్రమైన నీరు కరువు కావడంతో రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని సహాయక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

    వరద బాధితులకు మంచి నీరు దొరకడం కష్టంగా మారిందని మెడికల్ చారిటీ మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ చెప్పింది.

    వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం శనివారం సమావేశమైంది. ఈ వరదల్లో దేశంలో మూడొంతుల ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

    ప్రతీ ముగ్గురి బాధితుల్లో కనీసం ఒక చిన్నారి ఉన్నారు.

    ఊహించని విపత్తును ఎదుర్కొనేందుకు దేశంలో తగినన్ని వనరులు లేవని మంత్రి అహసాన్ ఇక్బాల్ అన్నారు.

    రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితం కాగా 14లక్షల గృహాలు నాశనమయ్యాయి.

  7. రష్యాలో ఓ ఎత్తైన అగ్నిపర్వతం అధిరోహిస్తూ మరణించిన ఆరుగురు పర్వతారోహకులు

    కైవుచెవ్స్కాయా సోప్కా

    ఫొటో సోర్స్, Getty Images

    తూర్పు రష్యాలోని కంచత్కా ప్రాంతంలో ఉన్న ఎత్తైన అగ్ని పర్వతాన్ని అధిరోహిస్తూ ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

    కైవుచెవ్స్కాయా సోప్కా అగ్ని పర్వతం పై వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రక్షణ దళాలు పర్వతారోహకులను చేరలేకపోయినట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.

    ఇందులో ఇద్దరు పర్వతారోహకులు సముద్ర మట్టానికి 10,827 అడుగుల ఎత్తులో ఉన్న శిబిరంలో ఉండగా, మరో నలుగురు 4000 మీటర్ల ఎత్తులో ఉన్న శిబిరంలో క్యాంపింగ్ చేస్తున్నారు.

    వీరంతా రష్యన్ జాతీయులే.

    12 మంది పర్వతారోహకులతో కూడిన ఈ బృందంలో ఇద్దరు గైడ్ లు కూడా ఉన్నారు. వీరంతా 4754 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించేందుకు మంగళవారం పర్వతారోహణను మొదలుపెట్టినట్లు స్థానిక వార్తా కథనాలు తెలిపాయి.

    కానీ, పర్వతారోహణ మొదలుపెట్టిన నాలుగు రోజులకే, నలుగురు పర్వతారోహకులు శనివారం 4000 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయి మరణించారు. ఆ తర్వాత మరో ఇద్దరు మరణించారు.

    ఒక గైడ్‌కు కాలు కూడా విరిగినట్లు తెలిసింది. మిగిలిన పర్వతారోహకుల పరిస్థితి గురించి కూడా ఎటువంటి సమాచారం లేదు.

    యునెస్కో అంతర్జాతీయసాంస్కృతిక ప్రదేశంగా గుర్తించిన కంచాత్కలో కైవుచెవ్స్కాయా సోప్కా పర్వతాలు సహజంగా ఏర్పడిన అగ్ని పర్వతాలు.

    ఈ అగ్ని పర్వతాలను కొన్ని ఆదివాసీ సమాజాల్లో పవిత్రమైనవిగా భావిస్తారు.

  8. నాసా మూన్ మిషన్: రెండో సారి వాయిదా పడిన ఆర్టెమిస్-1 ప్రయోగం

    ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్‌

    నాసా శనివారం తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం రెండో సారి వాయిదా పడింది.

    స్పేస్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎల్‌ఎస్) వాహనాన్ని లిఫ్ట్ చేసేందుకు అధికారులు మరో సారి విఫలమయ్యారు.

    ఇంధన లీకేజీ సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపేస్తున్నట్లు నాసా వెల్లడించింది.

    ఇంజనీర్లు ఈ రాకెట్ ను పరిశీలించి అవసరమైన మరమ్మతులను లాంచ్ పాడ్‌లో కాకుండా వర్క్ షాపులో చేయాలని చూస్తున్నారు.

    ఈ మొత్తం ప్రక్రియతో ఆర్టెమిస్ లాంచ్ మరింత వాయిదా పడే అవకాశముంది.

    అక్టోబరు మధ్య వారం వరకు మరో లాంచ్ ప్రయత్నం జరిగే అవకాశం లేకపోవచ్చు.

    యాబై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుడి మీదకు రాకెట్‌తో సహా మనుషులను, వ్యోమనౌకలను పంపించేందుకు యూఎస్ స్పేస్ ఏజెన్సీ అత్యంత శక్తివంతమైన ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది.

    ఇంధనం నింపుతున్న సమయంలో రాకెట్‌లో ఉన్న నాలుగు ఇంజన్లలో ఒక్క ఇంజన్‌లో ఇంధన లీకేజీ సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేశారు.

    ప్రస్తుతం ఆర్టెమిస్1 మిషన్ మాత్రం మానవరహితంగానే ప్రయాణిస్తుంది.

    భవిష్యత్తులో ఈ రాకెట్‌తో పాటు మనుషులు కూడావెళ్లాల్సిన అవసరం ఉండటంతో దీనిని ప్రయోగించేందుకు అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నట్లు నాసా ఆర్టెమిస్ మిషన్ మేనేజర్ మైక్ సారాఫిన్ చెప్పారు.

  9. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.

  10. ఇంకా పెళ్లి కాలేదా?! అంటూ ఎందుకు జాలి చూపుతుంటారు? జంట లేకుండా ఒంటరిగా జీవించటం తప్పా?