ఇరాక్: రాజధానిలో చెలరేగిన ఘర్షణల్లో కనీసం 15 మంది చనిపోయారు
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భద్రతా దళాలకు, శక్తిమంతమైన షియా మతపెద్దల మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
షియా నేత ముక్తాదా అల్-సదర్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత బాగ్దాద్‌లో హింస చెలరేగింది.
ఇరాక్ రాజకీయ వ్యవస్థను సంస్కరించడానికి ప్రత్యర్థి షియా నాయకులు, పార్టీలు నిరాకరించడంతో ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దాంతో, సదర్ మద్దతుదారులు నిరసనలకు దిగారు. నిరసనకారులు ఇరాక్ రాష్ట్రపతి భవనానంలోకి చొరబడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని ఇరాక్ తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్-కజేమి కోరారు.
ఇతర నగరాల్లో కూడా అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో సైన్యం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది.
సోమవారం రాత్రి భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి.
ఇరాక్‌లో అంతర్గత పోరు నేపథ్యంలో ఇరాన్ ఆ దేశంతో సరిహద్దులను మూసివేసింది.
తమ దేశ పౌరులు వెంటనే ఇరాక్ విడిచిపెట్టాలని కువైట్ కోరింది.
సదర్ మద్దతుదారులు 15 మంది తుపాకీ కాల్పులకు చనిపోయారని, సుమారు 350 మంది నిరసనకారులు గాయపడ్డారని డాక్టర్లు తెలిపినట్లు ఏఎఫ్‌పీ వెల్లడించింది.