బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.
ఆగస్ట్ 8 సోమవారం కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. వాటిలో 22 స్వర్ణం కాగా 16 రజతం, 23 కాంస్య పతకాలు.
సోమవారం రాత్రి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు ప్రజలు పూల మాలలు వేసి స్వాగతం పలికారు. కొంతమంది ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు.
కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన సాక్షి మాలిక్, కాంస్య పతక విజేత పూజా సిహాగ్, పూజా గెహ్లాట్‌ల కోసం ప్రజలు పుష్పగుచ్ఛాలతో నిరీక్షించారు. కొందరు వాళ్ల మెడలో నోట్ల దండ కూడా వేశారు.
తరువాత, సాక్షి మీడియాతో మాట్లాడుతూ, "స్వర్ణం సాధించిన ఘనత దేశానికే దక్కుతుంది. ఒలింపిక్ తరువాత కామన్వెల్త్‌లో పతకం సాధించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
పూజా సిహాగ్ తన పతకం క్రెడిట్ తన కోచ్‌కే దక్కుతుందని చెప్పారు.
రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన దిల్లీ రెజ్లర్ దివ్య కక్రాన్‌కు బాజాలు వాయిస్తూ స్వాగతం పలికారు.
అథ్లెట్లు సందీప్ కుమార్, అల్డోస్ పాల్, అవినాష్ సాబ్లే, అబ్దుల్లా అబూబకర్ కూడా స్వదేశానికి చేరుకున్నారు. 10,000 మీటర్ల రేస్ వాక్‌లో అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.
కామన్వెల్ట్ గేమ్స్ చివరి రోజు భారత్ నాలు 4 స్వర్ణాలు సాధించింది. దాంతో, మొత్తం 22 స్వర్ణాలు భారత్ ఖాతాలో పడ్డాయి.
చివరిరోజు, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ భారత్‌కు స్వర్ణాలు అందించి విజయ పతాక ఎగురవేశారు.
బ్యాడ్మింటన్‌లోనే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా స్వర్ణం సాధించారు. అలాగే, 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు.
వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ బాల్ మొదలుకొని అథ్లెటిక్స్ వరకు భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది.
బర్మింగ్‌హామ్‌లో భారత్ 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించింది.