శ్రీలంక అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్ష రాజీనామా

శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష తమ దేశానికి వచ్చినట్లు సింగపూర్ ధ్రువీకరించింది. తొలుత మాల్దీవులు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ వెళ్లిపోయారు.

లైవ్ కవరేజీ

  1. శ్రీలంక: ‘శాంతి పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయండి’ – సైన్యానికి ప్రధాని సూచన

    శ్రీలంక నిరసనలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, శ్రీలంక ప్రధాని కార్యాలయాన్ని ఆక్రమించుకున్న నిరసనకారులు

    శ్రీలంకలో ఆందోళనకారులు బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూసుకురావటంతో.. దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయాలని సైన్యానికి ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే సూచించారు.

    దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్ష.. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.

    శ్రీలంక స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ చూడనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభానికి కారణం రాజపక్ష కారణమని చాలా మంది నిందిస్తున్నారు. మే నెలలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ కూడా ఈ సమస్యలో భాగమని భావిస్తున్నారు.

    ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లి, దానిని ఆక్రమించుకున్న ఆందోళనకారులు.. బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు.

    శ్రీలంక నిరసనలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోవటానికి నిరసనకారులు ససేమిరా అంటున్నారు

    ఆందోళనకారులు తన కార్యాలయాన్ని, ఇతర ప్రభుత్వ భవనాలను విడిచి వెళ్లాలని, యంత్రాంగానికి సహకరించాలని రణిల్ విక్రమసింఘే టెలివిజన్‌లో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.

    ‘‘మన రాజ్యాంగాన్ని మనం చించివేయలేం. దేశాన్ని ఫాసిస్టులు హస్తగతం చేసుకోనివ్వకూడదు. ప్రజాస్వామ్యానికి ఈ ఫాసిస్టు ముప్పును మనం అంతమొందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

    అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోవటానికి ఆందోళనకారులు తిరస్కరిస్తున్నారు. గొటబయ వైదొలగటంతో పాటు, ప్రధానమంత్రి రణిల్, ఇతర మంత్రులు రాజీనామా చేయటం తమ లక్ష్యంగా కొందరు నిరసనకారులు బీబీసీతో చెప్పారు.

    ‘‘ఇప్పుడు దేశాన్ని పునర్నించటానికి నిజాయితీ అయిన, సత్యవంతులైన నేతలు అవసరం’’ అని నిక్సన్ చంద్రనాథన్ అనే నిరసనకారుడు వ్యాఖ్యానించారు.

    శ్రీలంక నిరసనలు

    ఫొటో సోర్స్, Reuters

    శ్రీలంక నిరసనలు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ప్రధాని కార్యాలయాన్ని ఆక్రమించిన నిరసనకారులను దాటుకుని లోపలికి వెళ్లటానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు
  2. స్త్రీ, పురుషుల సమానత్వ సూచీలో అట్టడుగున 135వ స్థానంలో భారత్

    లింగ వివక్ష

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదిక ప్రకారం.. లింగ సమానత్వ సూచీలో భారతదేశం మొత్తం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది.

    సుమారు 66.2 కోట్ల మహిళా జనాభా ఉన్న ఇండియా, గ్లోబల్ జెండర్ గ్యాప్ విషయంలో 2022 సంవత్సరంలో 0.629 స్కోరు సాధించినట్లు ఆ నివేదిక పేర్కొంది.

    లింగ సమానత్వంలో భారత స్కోరు గత 16 ఏళ్లలో 0.593 నుంచి 0.683 మధ్య ఊగిసలాడుతోందని తెలిపింది.

    ఈ సూచీ కోసం నాలుగు ప్రధానాంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

    • మహిళలకు ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల విషయంలో 143వ స్థానంలో ఉంది.
    • వైద్యం, మనుగడ అంశంలో అన్ని దేశాలకన్నా దిగువన 146వ స్థానంలో నిలిచింది.
    • విద్యాభ్యాసం అంశంలో 107వ స్థానంలో నిలిచింది.
    • రాజకీయ సాధికారత విషయంలో 48వ స్థానంలో ఇండియా నిలిచింది.
    లింగ సమానత్వ సూచీ

    ఫొటో సోర్స్, World Economic Forum

    ప్రపంచంలో అగ్ర స్థానంలో ఐస్‌లాండ్ (90.8 శాతం) నిలవగా.. రెండో స్థానంలో ఫిన్లండ్ (86 శాతం), మూడో స్థానంలో నార్వే (84.5 శాతం) నిలిచాయి.

    ఈ నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రపంచ లింగ అసమానత 68.1 శాతానికి తగ్గింది. ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం.. ప్రపంచం సంపూర్ణ లింగ సమానత్వం సాధించటానికి మరో 132 సంవత్సరాలు పడుతుంది.

    అయితే, ప్రాంతాల వారీగా చూసినపుడు, భారతదేశంతో కూడిన దక్షిణాసియా ఈ సూచీలో అట్టడుగున ఉంది. ఈ ప్రాంతంలో సంపూర్ణ లింగసమానత్వం రావటానికి మరో 197 సంవత్సరాలు పడుతుంది.

    ఈ జాబితాలో భారత్ తరువాత మొరాకో, ఖటార్, ఒమన్, అల్జీరియా, కాంగో వంటి దేశాలున్నయి. చివరన 146వ స్థానంలో అఫ్గానిస్తాన్ ఉంది.

  3. వానలు తగ్గినా.. వరదలు భయపెడుతున్నాయి

    కోనసీమ వరదలు

    ఫొటో సోర్స్, DGP OFFICE

    ఫొటో క్యాప్షన్, కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్3 బృందాలు.

    గోదావరి వరద తాకిడి పెరుగుతోంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత మాత్రం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండు రోజులుగా నిలకడగా ప్రవాహం సాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో సాగుతోంది. గురువారం మధ్యాహ్నం తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది.

    ఇప్పటికే కోనసీమలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద బాధితులను ఎస్టీఆర్ఎఫ్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. రాజమహేంద్రవరం వంతెనల వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా కనిపిస్తోంది.

    వరదబాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి.

    కోనసీమ

    ఫొటో సోర్స్, DGP OFFICE

    కోనసీమ

    ఫొటో సోర్స్, DGP OFFICE

    పోలవరం

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్న పోలవరం బాధితులు
  4. అనకాపల్లి అడవుల్లో నాలుగేళ్ళ పులి

    అనకాపల్లి అడవుల్లో పెద్ద పులి

    ఫొటో సోర్స్, ANI

    నాలుగేళ్ల వయసున్న మగ పులిని సబ్బవరం-అనకాపల్లి అటవీ ప్రాంతంల గుర్తించామని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ పులి ఇప్పటివరకు నాలుగు దూడలను చంపిందని ఆయన అన్నారు. ఇంతవరకు మనుషుల మీద ఎలాంటి దాడులు జరగలేదని చెప్పిన అటవీశాఖ అధికారి, ఇక్కడి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆగని వర్షాలు... ముంచెత్తుతున్న వరదలు

    ఏపీల వరదలు

    తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వాగులు పొంగి పొరలుతున్నాయి. ప్రాజెక్టులకు గండ్లు పడి వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది.

    బుధవారం రాత్రి కడెం ప్రాజెక్టుకు ఎడమ కాల్వ, పవర్ హైజ్, హరిత రిసార్ట్ వద్ద గండ్లు పడ్డాయనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఉదయం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దానిపై వివరణ ఇస్తూ, ఆ ప్రాజెక్ట్ సేఫ్‌గా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు.

    మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజి వద్ద నీటి మట్టం ప్రమాదకరంగా పెరగడంతో దాదాపు 20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలారు.

    గోదావరి ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం కాటన్ బరాజ్ వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఇన్-ఔట్ ఫ్లో 15.22 లక్షల క్యూసెక్కులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

    విపత్తుల శాఖ ప్రత్యేక స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏడు ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

    గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు.

  6. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.