శ్రీలంక: ‘శాంతి పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయండి’ – సైన్యానికి ప్రధాని సూచన
శ్రీలంకలో ఆందోళనకారులు బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూసుకురావటంతో.. దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఏం కావాలన్నా చేయాలని సైన్యానికి ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే సూచించారు.
దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్ష.. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.
శ్రీలంక స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ చూడనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభానికి కారణం రాజపక్ష కారణమని చాలా మంది నిందిస్తున్నారు. మే నెలలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ కూడా ఈ సమస్యలో భాగమని భావిస్తున్నారు.
ఆదివారం నాడు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లి, దానిని ఆక్రమించుకున్న ఆందోళనకారులు.. బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు.
ఆందోళనకారులు తన కార్యాలయాన్ని, ఇతర ప్రభుత్వ భవనాలను విడిచి వెళ్లాలని, యంత్రాంగానికి సహకరించాలని రణిల్ విక్రమసింఘే టెలివిజన్‌లో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.
‘‘మన రాజ్యాంగాన్ని మనం చించివేయలేం. దేశాన్ని ఫాసిస్టులు హస్తగతం చేసుకోనివ్వకూడదు. ప్రజాస్వామ్యానికి ఈ ఫాసిస్టు ముప్పును మనం అంతమొందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోవటానికి ఆందోళనకారులు తిరస్కరిస్తున్నారు. గొటబయ వైదొలగటంతో పాటు, ప్రధానమంత్రి రణిల్, ఇతర మంత్రులు రాజీనామా చేయటం తమ లక్ష్యంగా కొందరు నిరసనకారులు బీబీసీతో చెప్పారు.
‘‘ఇప్పుడు దేశాన్ని పునర్నించటానికి నిజాయితీ అయిన, సత్యవంతులైన నేతలు అవసరం’’ అని నిక్సన్ చంద్రనాథన్ అనే నిరసనకారుడు వ్యాఖ్యానించారు.