సౌరవ్ గంగూలీ: పుకార్లకు చెక్ పెట్టిన దాదా

భారతీయ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడతారేమోననే ఊహాగానాలకు దారి తీసింది. అయితే, ఈ పుకార్లకు చెక్ పెడుతూ, విద్యకు సంబంధించిన యాప్ ను లాంచ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. ‘విజయవాడ నగరమంత విస్తీర్ణంలో ఉండే మొక్క.. భూమి మీద ఇదే అతి పెద్దది’

  2. భూమి మీద అతి పెద్ద మొక్కను ఆస్ట్రేలియా తీరంలో కనుగొన్న పరిశోధకులు, టిఫనీ టర్న్‌బుల్ - బీబీసీ న్యూస్, సిడ్నీ

    రిబ్బన్ వీడ్ అనే సముద్రపు గడ్డి

    ఫొటో సోర్స్, RACHEL AUSTIN

    ఫొటో క్యాప్షన్, 200 చదరపు కిలోమీటర్లలో విస్తరించివున్న రిబ్బన్ వీడ్ అనే సముద్రపు గడ్డి నిజానికి ఒకటే మొక్క అని శాస్త్రవేత్తలు గుర్తించారు

    భూమి మీద మనకు తెలిసిన అతి పెద్ద మొక్కను.. ఆస్ట్రేలియా తీరంలోని సముద్రగర్భంలో గుర్తించారు.

    పశ్చిమ ఆస్ట్రేలియాలో నీటి అడుగున దాదాపు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సముద్రపు గడ్డి.. నిజానికి ఒకే విత్తనం నుంచి మొలకెత్తినట్లు శాస్త్రవేత్తలు జన్యు పరీక్షల ద్వారా నిర్ధారించారు.

    ఈ సముద్రపు గడ్డి ఒకే విత్తనం నుంచి పుట్టి 4,500 సంవత్సరాల కాలంలో ఇంత భారీ ప్రాంతంలో విస్తరించినట్లు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకులు భావిస్తున్నారు.

    పెర్త్‌కు ఉత్తరంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘షార్క్ బే’లో ఉన్న ఈ మహా సముద్రపు గడ్డి యాదృచ్ఛికంగా పరిశోధకుల కంట పడింది.

    షార్క్ బేలో విస్తరించిన సముద్రపు గడ్డి ఏరియల్ వ్యూ

    ఫొటో సోర్స్, ANGELA ROSSEN

    ఫొటో క్యాప్షన్, షార్క్ బేలో విస్తరించిన సముద్రపు గడ్డి ఏరియల్ వ్యూ

    ఆస్ట్రేలియా తీరంలోని పలు ప్రాంతాల్లో కనిపించే ఈ సముద్రపు గడ్డిని రిబ్బన్ వీడ్ అని పిలుస్తుంటారు. ఈ జాతి గడ్డిలో జన్యు వైవిధ్యాన్ని అర్థం చేసుకోవటానికి శాస్త్రవేత్తలు నడుం కట్టారు.

    షార్క్ బే వ్యాప్తంగా గల గడ్డి నుంచి చిగుళ్లు సేకరించారు. ఒక్కో సాంపిల్ నుంచి ప్రత్యేక ‘వేలిముద్ర’ను తయారు చేయటానికి 18,000 జన్యు గుర్తులను పరీక్షించారు.

    ఈ మొత్తం గడ్డి గబురులో ఎన్ని మొక్కలు ఉన్నాయనేది తెలుసుకోవటం వారి లక్ష్యం.

    ‘‘సమాధానం మమ్మల్ని నిర్ఘాంత పరిచింది. 200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఆ గడ్డి మొత్తం ఒక్కటే మొక్క’’ అని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన శాస్త్రవేత్త జేన్ ఎడ్జిలో పేర్కొన్నారు.

    భూమి మీద ఇప్పటివరకూ మనకు తెలిసిన అతి పెద్ద మొక్క ఇదేనని ఆమె తెలిపారు.

  3. 15,000 అనుమానిత యుద్ధ నేరాలను గుర్తించామన్న యుక్రెయిన్

    యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఇరీనా వెనెడిక్టోవా

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఇరీనా వెనెడిక్టోవా

    రష్యా తమ మీద యుద్ధానికి దిగినప్పటి నుంచీ యుక్రెయిన్‌లో 15,000 కు పైగా అనుమానిత యుద్ధ నేరాల ఫిర్యాదులు వచ్చాయని యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఇరీనా వెనెడిక్టోవా చెప్పారు.

    రోజుకు 200 నుంచి 300 అనుమానిత యుద్ధ నేరాల ఫిర్యాదులు అందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

    ఈ కేసుల్లో సుమారు 600 మంది అనుమానితులను గుర్తించామని, 80 విచారణలు మొదలయ్యాయని ఆమె ద హేగ్‌లో విలేకరులకు తెలిపారు.

    అనుమానితుల జాబితాలో ‘‘రష్యాకు చెందిన ఉన్నతస్థాయి సైనిక, రాజకీయ ప్రముఖులు, ప్రాపగాండా ఏజెంట్లు’’ ఉన్నట్లు చెప్పారు.

    యుక్రెయిన్‌లో పౌరులు లక్ష్యంగా దాడులు చేశామని, యుద్ధ నేరాలకు పాల్పడ్డామని వస్తున్న ఆరోపణలను రష్యా తిరస్కరించింది.

    రష్యా - యుక్రెయిర్ యుద్ధం

    ఫొటో సోర్స్, Reuters

  4. గాయకుడు కేకే హఠాన్మరణంపై పోలీసుల దర్యాప్తు, ప్రభాకర్ మణి తివారి, కోల్‌కతా నుంచి బీబీసీ కోసం

    గాయకుడు కేకే

    ఫొటో సోర్స్, Sanjay das/BBC

    కోల్‌కతాలో మంగళవారం అర్ధరాత్రి హఠాత్తుగా చనిపోయిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కేకే (53) ఉదంతంలో పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    కేకే అని సుపరిచితుడైన కృష్ణకుమార్ కున్నథ్.. ఒక ప్రదర్శన నిర్వహిస్తూ అనారోగ్యానికి గురికావటంతో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

    కేకేది అసహజ మరణమంటూ ఆయన సహచరులు ఫిర్యాదు చేశారు. కేకే బసచేస్తున్న హోటల్ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

    కేకే మరణానికి కారణం గుండెపోటు కావొచ్చనే ప్రాథమిక అంచనాకు వైద్యులు వచ్చినట్లు వెస్ట్ బెంగాల్ మంత్రి అరుప్ బిశ్వాస్ తెలిపారు.

    కేకేను రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారని అప్పటికే ఆయన చనిపోయారని ప్రైవేటు ఆస్పత్రి అధికారి ఒకరు చెప్పారు. కేకే తల మీద, ముఖం మీద స్వల్పంగా దోక్కుపోయిన గాయాలు ఉన్నాయని.. హోటల్ గదిలో పడిపోయినపుడు ఆ గాయాలై ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇదిలావుంటే.. కేకే కుటుంబ సభ్యులు బుధవారం నాడు కోల్‌కతా చేరుకున్నారు. ఆయన భార్య జ్యోతి కృష్ణ, కుమారుడు నకుల్, కుమార్తె తామర దిల్లీ నుంచి విమానంలో కోల్‌కతా వచ్చారు.

    కేకే మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

    సంగీత ప్రపంచంలో కేకేగా సుపరిచితులైన కృష్ణ కుమార్ కున్నథ్... హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, బెంగాలీ, గుజరాతీ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు.

    తెలుగులో పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, గోపీ చంద్, రవితేజ వంటి నటుల సినిమాల్లో పాడారు.

    ఖుషి, బాలు, గుడుంబా శంకర్, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఘర్షణ, అతడు, సైనికుడు, డార్లింగ్, జయం, మనసంతా నువ్వే, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాల్లో పాడారు కేకే.

    ఏ మేరా జహా...(ఖుషి), మై హార్ట్ ఈజ్ బీటింగ్...(జల్సా), అవును నిజం నువ్వంటే నాకిష్టం...(అతడు), గుర్తుకొస్తున్నాయి...(నా ఆటోగ్రాఫ్) వంటి హిట్ పాటలున్నాయి.

  5. యుక్రెయిన్‌కు సాయంగా భారీ రాకెట్లు పంపిస్తామని అమెరికా ప్రకటన, లియో సాండ్స్, బీబీసీ న్యూస్

    జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్‌కు సాయంగా అధునాతన రాకెట్ వ్యవస్థలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    మరింత దూరం నుంచి శత్రు బలగాల మీద కచ్చితత్వంతో దాడి చేయటానికి తోడ్పడే ఈ భారీ రాకెట్లు తమకు అందివ్వాలని యుక్రెయిన్ చాలా కాలంగా కోరుతోంది.

    అయితే ఈ ఆయుధాలను రష్యాలోని లక్ష్యాల మీద దాడి చేయటానికి ఉపయోగిస్తారన్న భయంతో యుక్రెయిన్ విజ్ఞప్తిని అమెరికా ఇప్పటివరకూ తిరస్కరిస్తూ వచ్చింది.

    కానీ, ఈ ఆయుధాలను యుక్రెయిన్‌కు అందించటం వల్ల రష్యాతో చర్చల్లో ఆ దేశపు బలం పెరుగుతుందని, దౌత్య పరిష్కారానికి మరింత వీలు కలుగుతుందని బైడెన్ బుధవారం నాడు పేర్కొన్నారు.

    హిమార్స్ రాకెట్ వ్యవస్థ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, హిమార్స్ రాకెట్ వ్యవస్థ

    ‘‘అందుకే యుద్ద రంగంలో లక్ష్యాల మీద మరింత కచ్చితత్వంతో దాడిచేసే అధునాతన రాకెట్ వ్యవస్థలు, ఆయుధ సంపత్తిని యుక్రెయిన్‌కు అందించాలని నేను నిర్ణయించాను’’ అని న్యూయార్క్ టైమ్స్ పత్రికలో బైడెన్ రాశారు.

    యుక్రెయిన్‌కు అందించనున్న కొత్త ఆయుధాల్లో ఎం142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ (హిమార్స్) ఉంటాయని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఎన్ని రాకెట్లు అందిస్తామనేది ఆయన చెప్పలేదు.

    ఈ ఆయుధ వ్యవస్థ ద్వారా 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద కచ్చితమైన గురితో బహుళ రాకెట్లను సంధించవచ్చు.

    హిమార్స్ రాకెట్ వ్యవస్థ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, హిమార్స్ రాకెట్ వ్యవస్థ
  6. త్వరలో జనాభా నియంత్రణ చట్టం తెస్తాం: కేంద్రమంత్రి

    ప్రహ్లాద్ పటేల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్

    దేశంలో త్వరలో జనాభా నియంత్రణ చట్టం తేబోతున్నట్లు కేంద్ర ఆహార శుద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.

    ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’లో పాల్గొనటానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

    జనాభా నియంత్రణ చట్టం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ‘‘ఆ చట్టం త్వరలో తెస్తాం. ఆందోళన వద్దు. అటువంటి బలమైన, పెద్ద నిర్ణయాలు తీసుకున్నపుడు మిగతావి కూడా నెరవేర్చటం జరుగతుంది’’ అని వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    దేశంలో జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన ఒక బిల్లును (ముసాయిదా చట్టాన్ని) 2019లో ఎంపీ రకేశ్ సిన్హా నామినేట్ చేయటంతో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శివసేన ఎంపీ అనిల్ దేశాయ్.. ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (సవరణ) బిల్లు 20202ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

  7. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.