You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్ విమాన ప్రమాదం: పైలట్ ఫోన్ సహాయంతో విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు
పైలట్ ఫోన్ రింగ్ అవుతుందని, దీని ద్వారా విమానం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని నేపాల్ విమానయాన అధికారులు చెబుతున్నారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ
అయోధ్య రామాలయం గర్భగుడిలో 2024 జనవరి లోపు శ్రీరాముడి విగ్రహ ఏర్పాటు
అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని 2024 జనవరి నాటికి ప్రతిష్టిస్తామని విశ్వహిందూ పరిషత్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కార్యక్రమం వేగంగా జరుగుతోంది.
గర్భగుడి నిర్మాణం 2024 జనవరి నాటికి పూర్తవుతుందని, అప్పటికి అందులో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఏఎన్ఐతో మాట్లాడిన విశ్వహిందూ పరిషద్ నేత శరద్ శర్మ చెప్పారు.
2024 జనవరిలో మకర సంక్రాంతి నాటికి గర్భాలయంలో శ్రీరాముడిని దర్శించుకోడానికి భక్తులను అనుమతిస్తామని ఆయన తెలిపారు.
భారత్ నాదికానీ, మోదీ, షాలది కానీ కాదు-అసదుద్దీన్ ఒవైసీ
మహారాష్ట్ర భివాండీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ తనదికానీ, మోదీ, అమిత్ షాలది కానీ కాదన్నారని ఏఎన్ఐ పేర్కొంది.
భారత్ ద్రవిడుదలది, ఆదివాసీలదని.. వారు ఇక్కడే ఉన్నారని, ఆర్యన్లు నాలుగు వేల ఏళ్ల తర్వాత వచ్చారని అన్నారు. కానీ, బీజేపీ మాత్రం మొఘలుల వెంట పడిందన్నారు.
ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన ప్రజలతో భారతదేశం ఏర్పడిందని ఆయన అన్నట్లు ఏఎన్ఐ చెప్పింది.
మహారాష్ట్రలో మొదటిసారి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ B.A.4, B.A.5 కేసులు నమోదు
మహారాష్ట్రలో మొదటిసారి కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
పుణెలో నలుగురికి B.A.4 సబ్ వేరియంట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించిన అధికారులు, మరో ముగ్గురికి B.A.5 సబ్ వేరియంట్ సోకినట్లు తెలిపారు.
పుణెలోని బీజే మెడికల్ కాలేజీలో వీరి శాంపిళ్లను పూర్తిగా జీనోమ్ సీక్వెన్స్ చేసిన తర్వాత తాజా రిపోర్ట్ విడుదల చేశారు.
ఇప్పటివరకూ ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు తమిళనాడు, హైదరాబాద్‌లో మాత్రమే నమోదయ్యాయి.
మహారాష్ట్రలో నమోదైన ఈ ఏడు కేసులూ పుణె నగరంలోనే బయటపడ్డాయి.
వీరిలో నలుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళలు. వీరిలో నలుగురి వయసు 50కి పైనే కాగా, ఇద్దరు 20 నుంచి 40 మధ్యలో, ఒకరు పదేళ్ల లోపు వారు ఉన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్: బాయిలర్ ఫ్యాక్టరీ పేలుడులో ఒకరి మృతి, నలుగురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్, రనియాలోని అక్బర్‌పూర్ కొత్వాలిలో ఒక బాయిలర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు కాన్పూర్ దేహత్ జిల్లా ఎస్పీ స్వప్నిల్ మామ్‌గాయ్ చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.
రష్యా, యుక్రెయిన్: జెలియెన్‌స్కీతో ప్రత్యక్ష చర్చలు జరపాలని పుతిన్‌కు జర్మనీ, ఫ్రాన్స్ వినతి
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో ప్రత్యక్ష చర్చలు జరపాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారని జర్మనీ చాన్సలర్ కార్యాలయం తెలిపింది.
తక్షణం కాల్పుల విరమణ పాటించాలని, రష్యా దళాలను ఉపసంహరించాలని పుతిన్‌తో 80 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడిన ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఓలాఫ్ స్కోల్జ్ కోరినట్లు చెప్పింది.
జెలియెన్‌స్కీతో చర్చలు కొనసాగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారని రష్యా అధ్యక్ష కార్యాలయం చెబుతోంది.
కానీ, పుతిన్, జెలియెన్‌స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందా, లేదా అనే వివరాలను అది ఇవ్వలేదు.
యుక్రెయిన్ అధ్యక్షుడు ఇంతకు ముందు చర్చల పట్ల తాను ఆసక్తిగా లేనని చెప్పారు. అయితే యుద్ధం ముగించడానికి అవి అవసరమన్నారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.