You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’
‘‘దిల్లీలో విద్యా విదానంపై అవగాహన కల్పించేందుకు మా టీచర్లు, నాయకులను ఇక్కడకు తీసుకొస్తాం’’అని కేసీఆర్ వివరించారు.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
ధన్యవాదాలు..
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
నేటి ముఖ్యాంశాలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని జూరిక్‌కు చేరుకున్నారు.
పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెట్రోలుపై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తున్నట్లు ఆమె చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో ఇంతవరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు రాంబన్ ఎస్ఎస్‌పీ మోహిత్ శర్మ తెలిపారు.
హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాను అక్రమాస్తుల కేసులో దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది.
బిహార్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం, ఉరుములు, పిడుగుల కారణంగా కనీసం 33 మంది మృతి చెందారు.
భారత గ్రాండ్‌మాస్టర్, 16 ఏళ్ల ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మూడు నెలల వ్యవధిలోనే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు.
37 ఏళ్లుగా పురుషుడిలా జీవిస్తున్న మహిళ, ఎందుకు?
దోన్బస్‌లో రష్యా సేనల పురోగతి
తూర్పు యుక్రెయిన్ దోన్బస్‌లోలని మరిన్ని భూభాగాలపై పట్టు సాధించేందుకు రష్యా సైన్యం దాడులను వేగవంతం చేసింది.
ఈ ప్రాంతంలో యుక్రెయిన్ బలగాల స్థావరాలే లక్ష్యంగా రష్యా భారీ దాడులు చేస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న బీబీసీ ప్రతినిధి చెప్పినదాని ప్రకారం... రష్యా బలగాలు పురోగతి సాధిస్తుండగా, యుక్రెయిన్ సంరక్షక బలగాలు బలహీనపడుతున్నాయి.
యుక్రెయిన్‌లోని కీలక నగరమైన మరియుపూల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రష్యా ఉత్సాహం పెరిగింది. మరియుపూల్‌లోని స్టీల్ ప్లాంట్‌లో దాక్కొని రష్యా బలగాలతో పోరాడుతోన్న చివరి బలగాలు కూడా లొంగిపోవడంతో మరియుపూల్ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది.
వాయువ్య యుక్రెయిన్‌లో భారీ ఆయుధాలు, సైనిక సామగ్రితో వస్తోన్న కాన్వాయ్‌ని ధ్వంసం చేసినట్లు రష్యా పేర్కొంది.
పాశ్చాత్య దేశాల నుంచి ఈ ఆయుధాలు యుక్రెయిన్‌కు చేరుతున్నాయని, వీటిపై క్షిపణులతో దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, రష్యా చేసిన ఈ ప్రకటనను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించడం కాంగ్రెస్ విజయం – దాసోజు శ్రవణ్
పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడాన్ని కాంగ్రెస్ విజయంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు.
కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినట్లే, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా వ్యాట్,ఇతర సుంకాలను 30-40% తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలపై ఇంధన భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
పెట్రోలుపై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు.
కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’
‘‘విద్యా రంగంలో దిల్లీ ప్రభుత్వం ప్రశంసనీయంగా పనిచేస్తోంది. ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు క్పలించే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఈ విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించాలి’’అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
‘‘దిల్లీలో విద్యా విదానంపై అవగాహన కల్పించేందుకు మా టీచర్లు, నాయకులను ఇక్కడకు తీసుకొస్తాం’’అని కేసీఆర్ వివరించారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి శనివారం మోతీబాగ్‌లోని ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు.
దిల్లీ మొహల్లా క్లినిక్‌లపైనా కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మంచి విధానాలను మొదలుపెట్టేందుకు మేం భిన్న రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించాం. అప్పుడు మొహల్లా క్లినిక్‌ల నుంచి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మా రాష్ట్రంలోనూ వీటిని ప్రారంభించాం’’అని కేసీఆర్ అన్నారు.
ఉప్పు నీరు, అల్లం, హెర్బల్ టీ.. ఉత్తర కొరియాలో కోవిడ్ రోగులకు ఇవే మందులు
ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారా, బౌద్ధ ఆరామాలను కూల్చి గుడులు కట్టారా? చరిత్ర ఏం చెబుతోంది
రాహుల్ గాంధీ: ‘దేశమంతా బీజేపీ కిరోసిన్ చల్లింది, పెను విధ్వంసానికి ఒక్క నిప్పు రవ్వ చాలు’
దేశంలో పోలరైజేషన్ పెరుగుతోందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.‘బీజేపీ దేశమంతటా కిరోసిన్ చల్లింది. ఒక్క నిప్పురవ్వతో మనమంతా పెద్ద సమస్యలో కూరుకుపోతాం’ అని ఆరోపించారు.
లండన్‌లో జరిగిన 'ఐడియా ఫర్ ఇండియా' సదస్సులో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారనే దానిపై చర్చ మొదలైంది.
దాదాపు గంటసేపు జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, కాంగ్రెస్ చింతన్ శివిర్, చైనా, అమెరికా వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్‌ను సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌తో పోల్చారు.
భారత విదేశాంగ విధానం గురించి కూడా మాట్లాడారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురించి లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు.
‘‘భారతవిదేశాంగ శాఖ మారిపోయింది. అది భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తుంది. ఇతర దేశాలు చేసే వాదనలను సమర్థంగా తిప్పికొడుతుంది. దీన్ని గర్వం అనరు... ఆత్మవిశ్వాసం, దేశ ప్రయోజనాలను కాపాడటం అంటారు’’ అని జై శంకర్ వ్యాఖ్యానించారు.
మే 20వ తేదీన రాహుల్ గాంధీ లండన్‌లో మాట్లాడుతూ భారత విదేశాంగ శాఖ గురించి తనతో విదేశీ ప్రతినిధులు ఏమన్నారో చెప్పారు.
‘‘నేను యూరప్ ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నప్పుడు, వారు భారత విదేశాంగ శాఖ పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఆ శాఖ ఎవరి మాటలు వినదని, వారంతా అహంకారులు అని వ్యాఖ్యానించారు. కేవలం వారికేం ఆదేశాలు అందుతున్నాయో మనతో చెప్పడం తప్పా... మిగతా ఏదీ చర్చించరు అని అన్నారు. ఇలా చేయకూడదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ వ్యాఖ్యలపైనే జయశంకర్ స్పందించారు.
స్విట్జర్లాండ్ చేరుకున్న ఏపీ సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని జూరిక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో దావోస్ ప్రయాణమయ్యారు.
ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ అధికారులు, స్విట్జర్లాండ్‌లో ఉంటున్న కొందరు తెలుగువారు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ఆస్ట్రేలియా ఎన్నికలు: ఓటమి అంగీకరించిన స్కాట్ మోరిసన్
ఆస్ట్రేలియా ఎన్నికలలో తన ఓటమిని ‘లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా’ నేత స్కాట్ మోరిసన్ అంగీకరించారు.
2018 నుంచి ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్న ఆయన... తాజా ఎన్నికలలో విజయం సాధించిన లేబర్ పార్టీ నేత ఆంథోనీ అల్బనీస్‌ను అభినందించారు.
ఎన్నికలలో తమ పార్టీని విజయం వైపు నడిపించలేకపోవడంతో నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవి నుంచీ తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు చెప్పారు.
ఈ తగ్గింపులో పెట్రోలు ధర లీటరుకు రూ. 9.5 , డీజిల్ ధర లీటరుకు రూ. 7 తగ్గుతుందని నిర్మల సీతారామన్ చెప్పారు.
శ్రీకృష్ణ జన్మభూమి: మథురలో షాహీ ఈద్గా మసీదు వివాదం ఏమిటి
జమ్ముకశ్మీర్ సొరంగ ప్రమాదం: 9 మృతదేహాల వెలికితీత
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో ఇంతవరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు రాంబన్ ఎస్ఎస్‌పీ మోహిత్ శర్మ తెలిపారు.
ఇంకో మృతదేహం శిథిలాలలో ఉండొచ్చని అన్నారు.
మృతుల్లో అయిదుగురు పశ్చిమబెంగాల్‌కు చెందినవారు కాగా ఇద్దరు నేపాల్, మరో ఇద్దరు స్థానికులు.
ఏపీ, తెలంగాణ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్ల వివరాలు
మే, జూన్ నెలల్లో వేసవి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ మేరకు తాజాగా జాబితా విడుదల చేసింది.
సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళం, మదురై, రామేశ్వరం, విశాఖపట్నం, కటక్ మధ్య... హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్, జైపూర్ మధ్య... శ్రీకాకుళం, చిత్తూరు మధ్య.. తిరుపతి – విశాఖపట్నం, నాందేడ్ – బరంపురం, తిరుపతి – దహర్ కా బాలాజీ(రాజస్తాన్‌లోని జైపూర్ సమీప స్టేషన్) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
రైళ్ల నంబర్లు, తేదీలను ట్విటర్ వేదికగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
అక్రమాస్తుల కేసులో ఓం ప్రకాశ్ చౌతాలాను దోషిగా తేల్చిన కోర్టు
హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాను అక్రమాస్తుల కేసులో దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది.
శిక్ష ఖరారు చేసేందుకు మే 26న కోర్టు దీనిపై వాదనలు విననుంది.
జమ్ముకశ్మీర్ సొరంగ ప్రమాదం: 5 మృతదేహాల వెలికితీత
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో నిర్మిస్తున్న ఓ సొరంగ మార్గం కూలడంతో అందులో చిక్కుకున్నవారిలో అయిదుగురి మృతదేహాలను వెలికితీశారు.
మిగతా వారి ఆచూకీ కోసం సహాయ చర్యలు చేపడుతున్నారు.
వెలికితీసిన 5 మృతదేహాలలో మూడింటిని గుర్తించారు. మృతులంతా పశ్చిమబెంగాల్‌కు చెందినవారని అధికారులు చెప్పారు.
ఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇంతకీ ఏం జరిగింది
బిహార్: తుపాను, వర్షం, పిడుగుల కారణంగా 33 మంది మృతి
బిహార్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం, ఉరుములు, పిడుగుల కారణంగా కనీసం 33 మంది మృతి చెందారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు ప్రభావితమయ్యాయని భారీ నష్టం జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
శుక్రవారం మరణించిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.