You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్

తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతి.. అనంతబాబుపై తల్లిదండ్రుల అనుమానం

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కారు డ్రైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందటం వివాదాస్పదమవుతోంది. ఈ ఉదంతంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) పాత్రపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

    అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం గురువారం మరణించారు. ఎమ్మెల్సీ తన కారులోనే మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకొచ్చినట్టు మృతుడి బంధువులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి, కారు అక్కడే వదిలి, మరో కారులో వెళ్లిపోయారని చెబుతున్నారు.

    ఎమ్మెల్సీ కథనం అనుమానస్పదంగా ఉందని, అనంతబాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాకినాడలోని సంజీవిని ఆస్పత్రి వద్ద అనంతబాబుకి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. అనంతబాబు స్వయంగా కారులో మృతదేహాన్ని తరలించినట్టు సీసీ కెమెరాలో విజువల్స్ ఉన్నాయని, హత్య కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

    గతంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన అనంతబాబు ఆరు నెలల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనపై హత్యారోపణలు రావడం చర్చనీయాంశం అవుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాకినాడ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

    ఇదిలావుంటే.. ప్రమాదానికి గురయిన కారు అనంతబాబుది కాదని, విజయ్ అనే అభిమానిదని రంపచోడవరం వైసీపీ నాయకుడు రాయపల్లి సత్యన్నారాయణ చెప్పారు. ‘‘డ్రైవర్ సుబ్బు అంటే బాబుకి చాలా అభిమానం. మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అనంతబాబు ఏ తప్పు చేయలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

  2. నిఖత్ జరీన్ : 'తెలంగాణ పేరును నా కూతురు స్వర్ణాక్షరాలతో లిఖించింది'

  3. స్వీడన్, ఫిన్లండ్‌ల నాటో దరఖాస్తుకు పూర్తి మద్దతు: బైడెన్

    నాటో కూటమి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలన్న స్వీడన్, ఫిన్లండ్ నిర్ణయానికి అమెరికా పూర్తి మద్దతునిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

    పశ్చిమ దేశాల రక్షణ కూటమి అయిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరటం కోసం స్వీడన్, ఫిన్లండ్ దేశాలు రెండూ ఈ వారంలో దరఖాస్తులు సమర్పించాయి. ఈ పరిణామంతో యూరప్ భౌగోళిక రాజకీయాల్లో భారీ మార్పు వచ్చినట్లయింది.

    ఈ కూటమిలో చేరటానికి ఆ రెండు దేశాలకూ నాటోలోని మొత్తం 30 సభ్యదేశాలూ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.

    అయితే.. ఈ రెండు నార్డిక్ దేశాల దరఖాస్తును టర్కీ వ్యతిరేకిస్తోంది.

    స్వీడన్ ప్రధానమంత్రి మగ్దలీనా ఆండర్సన్, ఫిన్లండ్ ప్రధానమంత్రి సౌలీ నీనిస్టోలతో కలిసి జో బైడెన్ గురువారం నాడు వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాటోలో చేరికకు స్వీడన్, ఫిన్లండ్ దరఖాస్తులు యూరప్ భద్రతలో పెను మార్పుకు నాంది’’ అని అభివర్ణించారు.

    ‘‘నాటోలో కొత్త సభ్యులు చేరటం ఏ దేశానికీ ముప్పు కాదు. ఎగువ ఉత్తర ప్రాంతంలో రెండు కొత్త సభ్య దేశాలు ఉండటం వల్ల.. మన మిత్రపక్షాల భద్రత మెరుగుపడుతుంది. మన భద్రత సహకారం బలోపోతేమవుతుంది’’ అని పేర్కొన్నరు.

    నాటోను తమకు ముప్పుగా పరిగణిస్తున్నామని రష్యా పదే పదే చెప్తోంది. నాటో విస్తరణ ప్రణాళికలతో ముందుకు సాగితే ‘పర్యవసానాలు’ ఉంటాయని హెచ్చరిస్తోంది.

  4. సంక్షోభంలో ఇజ్రాయెల్‌ సంకీర్ణ సర్కారు.. ఎంపీ రాజీనామాతో మైనారిటీలో ప్రభుత్వం

    ఇజ్రాయెల్‌లో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. ఒక అరబ్ ఎంపీ రాజీనామా చేయటంతో ప్రభుత్వం తొలిసారిగా మైనారిటీలో పడింది.

    సమాజంలో తమ వర్గం వారి పట్ల ప్రభుత్వ నాయకుల ‘మితవాద వైఖరుల’ను తాను సహించలేకపోతున్నానంటూ వామపక్షమైన మెరెట్జ్ పార్టీ మహిళా ఎంపీ ఘాయిదా రినావీ జోవాబీ రాజీనామా చేశారు.

    ఈ అనూహ్య పరిణామంతో.. 120 మంది సభ్యుల పార్లమెంటులో అధికార సంకీర్ణం బలం 59కి తగ్గిపోయింది.

    ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత భిన్నత్వం గల ఈ సంకీర్ణ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాలేదు.

    జాతీయవాద ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్ సారథ్యంలోని ఈ సంకీర్ణంలో విభిన్న రాజకీయ వైఖరులు, సైద్ధాంతిక విభేదాలు గల ఎనిమిది పార్టీలు ఉన్నాయి.

    1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సారిగా ప్రభుత్వంలో ఒక స్వతంత్ర అరబ్ పార్టీని కూడా చేర్చుకున్నారు.

    ఇజ్రాయెల్‌ జనాభాలో అరబ్ మైనారిటీలు సుమారు 20 శాతం మంది ఉన్నారు. చట్టం ప్రకారం వారికి సమాన హక్కులు ఉన్నప్పటికీ.. తాము వివక్షకు గురవుతున్నామని వారు తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు.

    ‘‘అరబ్ సమాజానికి అత్యంత ముఖ్యమైన ప్రాధమిక అంశాలకు సంబంధించి సంకీర్ణ నాయకులు పదే పదే దుందుడుకు, కఠిన, మితవాద వైఖరులు అవలంబిస్తున్నారు’’ అని ఎంపీ ఘాదియా రినావీ జొవాబీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

    కొద్ది రోజుల కిందట ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఒక ఇజ్రాయెలీ సైనిక చర్య మీద టెలివిజన్‌కు వార్తలు అందిస్తున్న అల్ జజీరా రిపోర్టర్ షెరీన్ అబు అఖ్లా కాల్పుల్లో చనిపోవటం, జెరూసలేంలో ఆమె అంత్యక్రియల సందర్భంగా జరిగిన సంఘటనలు తనను కలచివేశాయని ఆమె చెప్పారు.

    శుక్రవారం నాడు అబు అఖ్లా అంత్యక్రియల్లో ఆమె శవపేటికను మోస్తున్న వారి మీద ఇజ్రాయెల్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడి కాళ్లతో తన్నారు. ఈ దృశ్యాలు అల్ జజీరాలో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పోలీసుల చర్య పట్ల సర్వత్రా ఆగ్రహం, తీవ్ర విమర్శలు పెల్లుబికాయి.

    అయితే.. అల్లరి మూకలు తమపై హింసకు పాల్పడటంతో తాము ప్రతిస్పందించామని పోలీసులు పేర్కొన్నారు.

    ‘‘మా సమాజాన్ని ఇలా అవమానకరంగా వేధించే సంకీర్ణం మనుగడకు నేను మద్దతును కొనసాగించలేను’’ అని జొవాబీ తన లేఖలో పేర్కొన్నారు.

    ఆమె తప్పుకోవటంతో ప్రభుత్వం బలహీనమైన పరిస్థితిలోకి దిగజారింది. అవిశ్వాస తీర్మానం పెడితే సర్కారు మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

    కొన్ని వారాల వ్యవధిలో సంకీర్ణం నుంచి వైదొలగిన రెండో ఎంపీ జొవాబీ. ప్రధానమంత్రి సొంత పార్టీ అయిన యామినా పార్టీ సభ్యుడు ఒకరు ‘‘యూదు గుర్తింపుకు సంకీర్ణం హాని చేస్తోందం’’టూ రాజీనామా చేశారు.

  5. కరవు కోరల్లో తూర్పు ఆఫ్రికా.. కెన్యాలో ఏడాదిలో 70 ఏనుగులు మృతి

    తూర్పు ఆఫ్రికా అంతటా కొనసాగుతున్న తీవ్ర కరవు కారణంగా కెన్యాలో గత ఏడాది 70 పైగా ఏనుగులు చనిపోయాయని ఆ దేశ పర్యాటక మంత్రి నజీబ్ బలాలా బీబీసీకి చెప్పారు.

    కెన్యాలో అతి పురాతన పార్కుల్లో ఒకటైన త్సావో నేషనల్ పార్క్‌లో ఈ ఏనుగులు చనిపోయాయి. ఈ అటవీ ప్రాంతం ప్రపంచంలో అతి పెద్ద వన్యప్రాణి ఆవాస ప్రాంతాల్లో ఒకటి.

    కరవు ఇలాగే కొనసాగితే మరిన్ని వన్యప్రాణులు చనిపోతాయని కెన్యా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

    ఇప్పటికే పెద్ద సంఖ్యలో జిరాఫీలు కూడా చనిపోయాయని బాలాలా తెలిపారు.

    ‘‘మాకు వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ప్రతి జంతువూ ముఖ్యమే. ఒక్కటి నేలకూలినా బాధగా ఉంటుంది’’ అన్నారాయన.

    జంతువుల మరణాలను నివారించటం కోసం ఈ ప్రాంతంలో చిన్న నీటి చెరువులను ఏర్పాటు చేయటానికి పాత డ్యామ్‌ను ఉపయోగించుకోవాలని కెన్యా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

    తూర్పు ఆఫ్రికాలో కరవు వల్ల వివిధ దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు కూడా ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డారు.

  6. మహిళా టీవీ ప్రజెంటర్లు, యాంకర్లు ముఖాలు కప్పుకోవాలంటూ తాలిబాన్ల ఆదేశం

    అఫ్గానిస్తాన్‌లో మహిళా టీవీ ప్రెజెంటర్లు, తెరపై కనిపించే యాంకర్లు తమ ముఖాలను కప్పుకోవాలని తాలిబాన్ పాలకులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

    ఈ ఉత్తర్వు గురించి బుధవారం నాడు మీడియా సంస్థలకు తెలియజేసినట్లు మత పోలీసు అధికార ప్రతినిధి ఒకరు బీబీసీ పాష్తోకు చెప్పారు. ఈ ఆదేశాలు మే 21వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ కథనం.

    దేశంలో మహిళలందరూ బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి బురఖా ధరించాలని లేదంటే శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని రెండు వారాల కిందట తాలిబన్ సర్కారు ఆదేశించింది.

    అఫ్గాన్‌లో మహిళల మీద ఆంక్షలు అంతకంతకూ కఠినంగా మారుతున్నాయి. పురుష సంరక్షకుడు తోడు లేకుండా మహిళలు ప్రయాణించటాన్ని నిషేధించారు. బాలికలకు ప్రాధమికోన్నత విద్యను నేర్పే స్కూళ్లను మూసివేశారు.

    ‘‘టీవీల్లో ప్రెజెంట్ చేయకుండా మాపైన పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. ‘‘నోరు మూసేసి ఉంటే వార్తలు ఎలా చదవగలను? ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీటం లేదు. నా కుటుంబానికి నేనే ఆధారం. నేను ఉద్యోగం చేసి తీరాలి’’ అని స్థానిక టీవీ స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా జర్నలిస్ట్ బీబీసీతో చెప్పారు.

    తాలిబాన్ ఆదేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు

    ‘‘ప్రపంచం కోవిడ్ నుంచి ప్రజలను కాపాడటానికి మాస్కులను రంగంలోకి దించుతోంది. మహిళా జర్నలిస్టుల ముఖం జనం చూడకుండా ఉండటానికి తాలిబాన్ మాస్కులను రంగంలోకి దించుతోంది. తాలిబాన్లకు మహిళలంటే ఒక జబ్బు వంటిది’’ అని ఓ యాక్టివిస్ట్ ట్వీట్ చేశారు.

  7. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.