You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్

తమిళ సినీ హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. వైసీపీ ప్రకటించిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తెలంగాణవారు

  2. నాటోలో చేరేందుకు ఫిన్‌లాండ్, స్వీడన్ దరఖాస్తు

    నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాలు బుధవారం ఉదయం అధికారికంగా దరఖాస్తులు సమర్పించాయి.

    ‘‘ఇది ఒక చరిత్రాత్మక క్షణం, దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశాల చేరికతో భాగస్వామ్య భద్రత మరింత పెరుగుతుంది’’ అని నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.

    నాటోలో చేరాలనుకుంటున్నట్లు ఈ రెండు దేశాలు ఆదివారం తెలిపాయి. సోమవారం స్వీడన్ పార్లమెంట్ ఇందుకు అంగీకరించగా, మంగళవారం ఫిన్‌లాండ్ కూడా ఇదే బాటలో నడిచింది.

    రష్యాతో ఫిన్‌లాండ్ పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ అంశంపై తటస్థంగా వ్యవహరించిన ఫిన్‌లాండ్, స్వీడన్ దేశాలు... ఇప్పుడు నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం వారి మారిన వైఖరిని సూచిస్తుంది.

    ఈ ప్రక్రియను వారాల్లోనే ముగించేలా వేగంగా జరపవచ్చు. కానీ, దీనికి 30 సభ్య దేశాల మద్దతు అవసరం. ఇదంతా పూర్తయ్యేలోగా సంవత్సర కాలం పట్టొచ్చు. టర్కీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకత వ్యక్తం చేసింది.

  3. జ్ఞాన్‌వాపి మసీదు: ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది, ఈ చట్టం కింద సర్వే ఎలా జరిగింది?

  4. చైనా విమానాన్ని కావాలనే కూల్చివేశారా?

    చైనాలో మార్చి నెలలో ఈస్ట్రర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం కూలిపోవడం ఉద్దేశపూర్వక చర్యగా ఫ్లయిట్ డేటా సూచిస్తుందని అమెరికా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

    ఆ విమానంలో యాంత్రిక లోపాలు, సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ఇప్పటివరకైతే దర్యాప్తు అధికారులు దృష్టికి రాలేదని రాలేదని అమెరికా అధికారుల ప్రాథమిక అంచనాలను ఉటంకిస్తూ ఆ నివేదికలు తెలిపాయి.

    కున్మింగ్, గ్వాంగ్‌జౌ నగరాల మధ్య ప్రయాణిస్తుండగా బోయింగ్ విమానం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు సహా మొత్తం 132 మంది మరణించారు.

    ‘‘కాక్‌పిట్‌లోని ఎవరో చెప్పిన విధంగానే ఆ విమానం చేసింది’’ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ప్రమాదంపై ప్రాథమిక అంచనా చేస్తోన్న అమెరికా అధికారులకు దగ్గరి వ్యక్తిని ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ విధంగా చెప్పింది.

    ఉద్దేశపూర్వక చర్యల వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని యూఎస్ అధికారులు నమ్ముతున్నారని ఏబీసీ న్యూస్ తెలిపింది.

  5. పీరియడ్స్ లీవ్ అడగడానికి ఇంకా సిగ్గుపడాలా, వివిధ దేశాలలో చట్టాలు ఏం చెబుతున్నాయి?

    నెలసరి సమయంలో దాదాపు మహిళలందరూ నొప్పిని అనుభవిస్తారు. కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని డిస్మెనోహియా అంటారు. దీని కారణంగా ఉద్యోగాలు చేసే మహిళలు పని సమయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

    అయితే, తమ బాస్‌లను పీరియడ్స్ లీవ్ అడగడానికి మహిళలు ఆలోచిస్తుంటారు. అసలు పీరియడ్స్ లీవ్ గురించి చట్టాలు ఏం చెబుతున్నాయి. పీరియడ్స్ లీవ్స్ తీసుకోవాలా? వద్దా?

  6. రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి పేరరివాలన్ విడుదలకు సుప్రీం ఆదేశాలు

    భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పేరరివాలన్‌ను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ కూడా ఒకరు. ఆయనతో పాటు సంతన్, మురుగన్, నళిని, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

    19 ఏళ్ల వయస్సులో అరెస్టు అయిన పెరరివాలన్... గత 30 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు.

    రాజీవ్ గాంధీ హత్యలో ఉపయోగించిన బాంబు తయారీకి బ్యాటరీలను కొనుగోలు చేసినందుకు పేరరివాలన్‌కు శిక్ష పడింది. తొలుత ఆయనతో పాటు మరో ఇద్దరికి 1999 మే నెలలో మరణ శిక్ష విధించారు. తర్వాత దీన్ని జీవిత ఖైదుగా మార్చారు.

    1991 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీ ఆత్మాహుతి బాంబు దాడిలో మరణించారు.

  7. గుజరాత్: కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా

    గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

    ‘‘ఈరోజు నేను ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనే నమ్మకం ఉంది. దీని తర్వాత, భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నా’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    చాలా కాలంగా హార్దిక్ పటేల్, కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నారు. ఏప్రిల్ నెలలో తన అసమ్మతిని ఆయన బాహటంగానే వెళ్లగక్కారు.

    ‘‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి నన్ను పిలవరు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నన్ను సంప్రదించరు. ఇక ఈ పదవికి అర్థం ఏంటి?’’ అని పార్టీ నిర్లక్ష్యాన్ని నిలదీశారు.

  8. కార్తి చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్ అరెస్ట్

    లంచం ఆరోపణల కేసులో కార్తి చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్‌ను సీబీఐ అరెస్ట్ చేసినట్లు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    మంగళవారం రోజు సీబీఐ అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

    చిదంబరం స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.

    ‘‘సీబీఐకి చెందిన ఒక బృందం ఈ రోజు ఉదయం చెన్నైలోని నా ఇల్లు, దిల్లీలోని అధికారిక నివాసంలో సోదాలు చేసింది. వారు నాకు ఒక ఎఫ్ఐఆర్‌ను చూపించారు. అందులో నా పేరు లేదు. సోదాల్లో వారికేమీ లభించలేదు. వాళ్లేదీ సీజ్ చేయలేదు. వారు సోదాలు చేసిన సమయం ఆసక్తిగా అనిపించింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి సంబంధించి చిదంబరం కుమారుడు, లోక్‌సభ ఎంపీ కార్తి చిదంబరంపై కొత్త కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

    భాస్కరరామన్ అరెస్టును ఈ కేసులో పురోగతిగా చూస్తున్నారు.

  9. జ్ఞాన్‌వాపి మసీదు: ఈరోజు వారణాసి కోర్టు విచారించే అంశాలు...

    శృంగేరీ గౌరీ పూజ కోసం ముగ్గురు మహిళా పిటిషనర్లు మంజు వ్యాస్, రేఖా పాఠక్, సీతా సాహు వారణాసి కోర్టులో తాజాగా దరఖాస్తు చేశారు.

    ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

    దీనిపై ఈరోజే తమ అభ్యంతరాలను తెలియజేయాలని ఇతర పక్షాలను వారణాసి కోర్టు కోరింది.

    జ్ఞాన్‌వాపి మసీదులో కనిపించిందంటున్న శివలింగానికి సంబంధించిన ఈ పిటిషన్‌లో కొత్త వాదనలు చేర్చారు.

    ‘‘మసీదులో శివలింగం లభ్యమైన చోటుకు తూర్పు వైపు ఒక దర్వాజా ఉంది. దాన్ని ఇటుకలతో మూసివేశారు. ఈ దర్వాజా, కాశీ విశ్వనాధుని నంది ముఖం వైపు ఉంది. నందిముఖానికి ఎదురుగా ఉన్న బేస్‌మెంట్‌లోని చెత్తను తొలగించి తనిఖీ చేసేలా కమిషన్‌ను ఆదేశించాలి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    మసీదులోని వజూఖానా (నమాజ్‌కు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను)ను వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది మహేంద్ర పాండే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరారు.

  10. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.