You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జ్ఞాన్‌వాపి మసీదు: ‘‘మీరు కన్నేసిన మసీదుల జాబితా ఒకేసారి ఇచ్చేయండి’’ – మెహబూబా ముఫ్తీ

‘‘ఇప్పుడు జ్ఞాన్‌వాపి మసీదు వెంట పడుతున్నారు. దీని తర్వాతైనా ఊరుకుంటారా? ఈ రోజు ఈ మసీదు, రేపు ఆ మసీదు, ఎళ్లుండి ఇంకో మసీదు.. ఇలా వెళ్లండి. మీరు కన్నేసిన మసీదుల జాబితా మొత్తం ఒకేసారి మాకు ఇచ్చేయండి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్, తిరుపతిలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది?

  2. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    నేపాల్ పర్యటన ముగించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లఖ్‌నవూ చేరుకున్నారు.

    కాశీ విశ్వనాథ ఆలయం పక్కనుండే జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో శివలింగం బయటపడింది. దీంతో ఆ పరిసరాలను సీల్ చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట యడ్లపాడు మండలంలోని ఎర్రకొండపై ఏసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలను విరగ్గొట్టారు.

    దేశంలోని భిన్న ప్రాంతాల్లో హింసాత్మక ఆరోపణలపై పట్టుబడుతున్న వ్యక్తులు ఆరెస్సెస్‌కు చెందినవారేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.

  4. కిదాంబి శ్రీకాంత్ గురించి ఆయన తల్లిదండ్రులు ఏమన్నారంటే..

  5. నేపాల్ పర్యటన ముగించుకుని లఖ్‌నవూ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    నేపాల్ పర్యటన ముగించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్‌కు చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని మోదీ నేపాల్ వెళ్లారు.

    లుంబినిలోని మహామాయ దేవాలయాన్ని మోదీ సందర్శించారు. నేపాల్ ప్రధాన మంత్రితోనూ భేటీ అయ్యారు.

    నేపాల్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు మోదీ వచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు.

    లఖ్‌నవూలోని యోగి ఆదిత్యనాథ్ నివాసంలో యూపీ మంత్రులతో మోదీ సమావేశమయ్యారు.

  6. గోదుమ ఎగుమతులను భారత్ ఎందుకు నిషేధించింది? ప్రపంచం కడుపు నింపుతామన్న మోదీ యూటర్న్ తీసుకున్నారా?

  7. జ్ఞాన్‌వాపి మసీదు: ‘‘మీరు కన్నేసిన మసీదుల జాబితా ఒకేసారి ఇచ్చేయండి’’ – మెహబూబా ముఫ్తీ

    ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ-ముస్లిం రాజకీయాలకు పాల్పడుతోందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

    ‘‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు. ఈ హామీల సంగతి ఏమైంది? ప్రజల దృష్టిని మళ్లించేందుకు హిందూ-ముస్లింల సంబంధాలపై రాజకీయాలు చేస్తున్నారు’’అని ఆమె అన్నారు.

    తాజ్ మహల్, కుతుబ్ మినార్‌ లాంటివి మూసేస్తే ఇంకేం చూడటానికి పర్యటకులు వస్తారని ఆమె ప్రశ్నించారు.

    ‘’50 శాతం మంది పర్యటకు మొఘల్ పాలకులు కట్టించిన నిర్మాణాలు చూడటానికి వస్తారు. ఆ మిగతా 50 శాతం మంది కశ్మీర్‌ను చూసేందుకు వస్తారు’’అని ఆమె అన్నారు.

    ‘‘ఇప్పుడు జ్ఞాన్‌వాపి మసీదు వెంట పడుతున్నారు. దీని తర్వాతైనా ఊరుకుంటారా? ఈ రోజు ఈ మసీదు, రేపు ఆ మసీదు, ఎళ్లుండి ఇంకో మసీదు.. ఇలా వెళ్లండి. మీరు కన్నేసిన మసీదుల జాబితా మొత్తం ఒకేసారి మాకు ఇచ్చేయండి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

    అయితే, మొహబూబాతోపాటు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా మౌనం పాటించాలని కేంద్ర సహాయక మంత్రి మీనాక్షి లేఖి సూచించారు. ‘‘ప్రస్తుతం జ్ఞాన్‌వాపీ మసీదు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని పరిస్థితులు చేయిదాటిపోనివ్వకండి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

  8. నేపాల్ లేకపోతే మా రాముడు అసంపూర్ణం – లుంబినీలో ప్రధాని మోదీ

    బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని నేపాల్‌లోని లుంబినీలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

    ‘‘నేపాల్ లేకపోతే మా రాముడు అసంపూర్ణంగా మిగిలిపోతాడు. భారత్‌లో రాముడి కోసం అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించడంపై నేపాల్ ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు’’అని మోదీ వ్యాఖ్యానించారు.

    రాముడితోపాటు బుద్ధుడిని కూడా మోదీ స్మరించుకున్నారు. తాను జన్మించిన వాద్‌నగర్ ఒకప్పుడు బౌద్ధ విద్యాభ్యాసానికి కేంద్ర బిందువుగా ఉండేదని ఆయన చెప్పారు.

    ‘‘మానవుల జ్క్షానానికి బుద్ధుడు ప్రతిరూపం లాంటివాడు. అన్నింటిలోనూ బౌద్ధం కనిపిస్తుంది’’అని మోదీ అన్నారు.

  9. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం.. సర్వే అక్రమం అన్న అసదుద్దీన్ ఒవైసీ

  10. ఫిన్‌లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?

  11. జి.ఎన్.సాయిబాబా: అండా సెల్ వద్ద సీసీటీవీ కెమెరాను తొలగించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న ఖైదీ..

  12. యడ్లపాడు: ఎర్ర కొండపై ఏసుక్రీస్తు, మేరీమాత విగ్రహాల ధ్వంసం.. మేరీ మాత మెడలోతాళిబొట్టు

    పదహారవ నెంబరు జాతీయ రహదారి పక్కన చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలోని ఎర్ర కొండపై ఏసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు విరగ్గొట్టారు.

    గుర్తుతెలియని దుండగులు మేరీ మాత మెడలో పసుపు కొమ్ములతో కట్టిన తాళిబొట్టు వేయడంతో పాటు ఏసుక్రీస్తు, మేరీ మాత విగ్రహాలు ధ్వంసం చేశారు.

    ఆదివారం ఉదయం ఇది గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఎర్ర కొండ వద్దకు తరలివచ్చారు.

    నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఎర్రకొండకు చేరుకున్నారు.

    ఈ ఘటనపై మంత్రి విడదల రజనీ స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో చిచ్చు రాజేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

  13. యుక్రెయిన్ యుద్ధం: ఖార్కియెవ్ సమీపంలో దేశ సరిహద్దులను పునరుద్ధరించిన యుక్రెయిన్ సైన్యం

    ఖార్కియెవ్‌లో రష్యా సైన్యాన్ని వెనక్కి నెడుతూ యుక్రెయిన్ దళాలు రష్యా బోర్డరు చేరుకున్నాయని రిపోర్టులు వస్తున్నాయి.

    యుక్రెయిన్ రక్షణ శాఖ ఒక వీడియో విడుదల చేసింది. అందులో ప్రాదేశిక రక్షణ దళానికి చెందిన అనేక మంది సైనికులు సరిహద్దులకు సమీపంలోని ఒక ప్రదేశంలో నిలబడి ఉన్నారు.

    ఖార్కియెవ్ ప్రాంత గవర్నర్ ఒలేహ్ సినెగుబోవ్ మాట్లాడుతూ, తమ సైనికులు సరిహద్దు ఆనవాళ్లను పునరుద్ధరించారని తెలిపారు.

    "మా సైనికుల పట్ల మాకు గర్వంగా ఉంది. దేశ సరిహద్దు రేఖలను వాళ్లు పునరుద్ధరించారు. తమ జీవితాలను పణంగా పెట్టి యుక్రెయిన్ కోసం పోరాడుతున్న వారందరికీ ధన్యవాదాలు" అని ఆయన టెలిగ్రాంలో పోస్ట్ చేశారు.

    మరోవైపు, డాన్‌బాస్ ప్రాంతంలో తమ పట్టు బిగించడానికి రష్యా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  14. డాన్‌బాస్‌లో రష్యాను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం - జెలియెన్‌స్కీ

    తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా రచించే కొత్త వ్యూహాలను, దాడులను ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.

    కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన రష్యాకు డాన్‌బాస్‌ చేజిక్కించుకోవడం ముఖ్యం. దాని ప్రధాన లక్ష్యాల్లో ఇదీ ఒకటి.

    "డాన్‌బాస్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా కొత్త వ్యూహాలు పన్నుతోంది. వాటిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆక్రమణదారులు, ఇక చివరి అంచుకు వచ్చేశామని, వాళ్ల 'ప్రత్యేక సైనిక చర్య' దివాలా తీసిందని ఒప్పుకోవడానికి సిద్దంగా లేరు" అని జెలియెన్‌స్కీ అన్నారు.

    రష్యాపై చమురు నిషేధం విధించాలని పశ్చిమ దేశాలకు మరోసారి పిలుపునిచ్చారు.

    "రష్యాపై ఆంక్షలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచంతో రష్యా సంబంధాలు వీగిపోయేలా చేసేందుకు ఇతర దేశాలు కృషి చేయాలి. యుద్ధం భారం ఆక్రమణదారులకు అనుక్షణం తెలియాలి" అని ఆయన అన్నారు.

  15. 'నా రికార్డును బ్రేక్ చేసేయ్, కానీ ఎముకలు విరగ్గొట్టుకోకు ' - ఉమ్రాన్ మాలిక్‌తో షోయబ్ అక్తర్

    ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గురించి మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

    షోయబ్ అక్తర్‌ను రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన ఆటగాడిగా షోయబ్ అక్తర్ రికార్డు సృష్టించాడు.

    ఇక, 150 KMPH కంటే ఎక్కువ వేగంతో బుల్లెట్ల లాంటి బంతులు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్‌ను క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

    భారత జాతీయ జట్టులో అతడికి చోటు కల్పించాలని మాజీ క్రికెటర్లు ఉమ్రాన్ తరుపున వకాల్తా పుచ్చుకున్నారు.

    షోయబ్ అక్తర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ, ఉమ్రాన్ మాలిక్ తన రికార్డు బ్రేక్ చేస్తే సంతోషమేనని అన్నాడు.

    "కానీ, రికార్డు బ్రేక్ చేస్తూ, ఎముకలు విరగ్గొట్టుకోవద్దు" అని ఉమ్రాన్‌కు సలహా ఇచ్చాడు.

    ఉమ్రాన్ యాక్షన్ చాలా బాగుందని షోయబ్ అక్తర్ ప్రశంసించాడు.

    "అతడు ఫిట్‌గా ఉండాలి, గాయపడకూడదన్నదే నా కోరిక. అతడిని ఎంతా బాగా ఉపయోగించుకోవచ్చో బీసీసీఐ ఆలోచించాలి" అని షోయబ్ అన్నాడు.

    షోయబ్ అక్తర్ 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ టైట్ ఉన్నాడు. టైట్ 161.1 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ మూడో స్థానంలో ఉన్నాడు. 160.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన రికార్డు బ్రెట్ లీ పేరిట ఉంది.

  16. ఉర్దూ భాష మీద హిందూవాదులకు కోపమెందుకు?

  17. బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లోని లుంబినీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మోదీకి స్వాగతం పలికారు.

    తొలుత, ఇద్దరు ప్రధానమంత్రులు మహామాయాదేవి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు.

    బుద్ధుడి జన్మస్థలం లుంబినీ. బౌద్ధులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం.

    ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు మోదీ, షేర్ బహదూర్ దేవుబాతో చర్చలు జరపనున్నారు. 2014లో ప్రధాని అయిన తరువాత మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది అయిదవసారి.

    నేపాల్‌కు చేరుకున్నట్టు మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. లుంబినీలో జరిగే అనేక ఇతర కార్యక్రమాల్లో మోదీ భాగం పంచుకోనున్నారు.

  18. గోదుమల ఎగుమతిపై భారత్ నిషేధం తరువాత అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర ఆకాన్నంటుతోంది

    గోదుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో గోదుమల ధరలు పెరిగాయి.

    అమెరికాలోని షికాగోలో బెంచ్‌మార్క్ ధరల సూచీ 5.9 శాతం పెరిగింది. గత రెండు నెలల్లో ఇదే అత్యధికం.

    భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు వీస్తున్నాయి. దాంతో, గోదుమల పంట దెబ్బతింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కారణంగా గోదుమ ఎగుమతిని నిషేధించారు.

    ఈ ఏడాది గ్లోబల్ మార్కెట్‌లో గోదుమల ధర సుమారు 60 శాతం పెరగడంతో బ్రెడ్, నూడుల్స్ సహా అనేక ఉత్పత్తుల ధరలు పెరిగాయి.

    అయితే, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు, ఆహార భద్రత అవసరాల కోసం అభ్యర్థించే దేశాలకు గోదుమల ఎగుమతి కొనసాగుతుందని భారత ప్రభుత్వం తెలిపింది.

    ప్రస్తుతం గోదుమల ఎగుమతులపై విధించిన నిషేధం తాత్కాలికమని, పరిస్థితులు చక్కబడగానే నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని భారత అధికారులు తెలిపారు.

    ప్రపంచంలో గోదుమల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. కానీ, ప్రధాన ఎగుమతిదారు కాదు. భారత్‌లో పండిన పంటలు చాలావరకు దేశీయ మార్కెట్లోనే అమ్ముడైపోతాయి.

    అయితే, భారత్ నిర్ణయాన్ని జీ-7 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు విమర్శించారు. జర్మనీలో జీ-7 దేశాల సదస్సు జరుగుతోంది. జీ-7 సమూహంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయి.

    "అందరూ ఎగుమతులపై నిషేధం విధిస్తే, సంక్షోభం మరింత ముదురుతుంది" అని జర్మన్ ఆహార, వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు.

    మరోవైపు, రష్యా దాడి తరువాత యుక్రెయిన్ గోదుమ ఎగుమతులు క్షీణించాయి. ఇతర ప్రధాన ఉత్పత్తి దేశాలు వరదలు, కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దాంతో, వ్యాపారులు గోదుమల ఎగుమతి కొోసం భారతదేశం వైపు చూస్తున్నారు.

    నిషేధానికి ముందు భారత్ ఈ ఏడాది కోటి టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  19. ఆలం ఆరా: ఈ భారతీయ తొలి టాకీ సినిమా ఎప్పటికైనా దొరుకుతుందా?

    ఈ నెలా ఆరంభంలో ముంబయికి చెందిన ఆర్కైవిస్టుల (పురాతన వస్తువులను భద్రపరిచేవారు) బృందం భారతదేశ తొలి టాకీ ఫిల్మ్ ఆలం ఆరాతో సంబంధం ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని గుర్తించగలిగారు.

    1931లో ఆలంఆరా సినిమాను ప్రింట్ చేసిన ఒక పాత మెషీన్‌ను శివేంద్ర సింగ్ దుంగార్పూర్, ఆయన బృందం కనుక్కొంది. శివేంద్ర సింగ్ సినీ దర్శకుడు. పాత సినిమాలను సేకరించడం, భద్రపరచడం ఆయన ఆసక్తులతో ఒకటి.

    ముంబయిలో ఓ చీరల దుకాణంలో ఈ మూలన పడి ఉంది ఈ మెషీన్. దీన్ని చికాగో లోని బెల్ అండ్ హావెల్ అనే కంపెనీ తయారు చేసింది. దీని అసలు ఓనర్ సినీ నిర్మాత ఆర్ధెశిర్ ఇరానీ కాగా, దీన్ని ఆయన నుంచి నళిన్ సంపత్ కొనుగోలు చేశారు.

  20. 'హింస, అల్లర్లను ప్రేరేపిస్తున్నవారు ఆర్ఎస్ఎస్-బీజేపీకి చెందినవారే' - అశోక్ గెహ్లాట్

    ఇటీవల వివిధ రాష్ట్రాల్లో హింసాత్మక ఆరోపణలపై పట్టుబడుతున్న వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీకి చెందినవారేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన చింతన్ శివిర్ తరువాత, గెహ్లాట్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

    "దేశవ్యాప్తంగా పట్టుబడుతున్నవారు ఆర్ఎస్ఎస్-బీజేపీ నేపథ్యం నుంచి వచ్చినవారని" అన్నారు.

    హింస, అల్లర్లతో బీజేపీ లబ్ధి పొందుతోందని ఆయన ఆరోపించారు.

    "అల్లర్లతో లబ్ధి పొందే పార్టీనే అల్లర్లను ప్రేరేపిస్తుందని అర్థం చేసుకోవాలి. అల్లర్ల వల్ల ఎవరికి లాభం? కాంగ్రెస్‌కు ఏమైనా లాభమా? అల్లర్లు జరుగుతున్న చోట కాంగ్రెస్ పరువు తీస్తున్నారు. కానీ, కాంగ్రెస్ అల్లర్లను రేకెత్తించదు.

    వాళ్లకి హిందుత్వ ఎజెండా ఉంది. దాని కోసం ఇదంతా చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలను విడదీస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది? భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది.. అక్కడ మైనారిటీలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వరు. ఎవరు ఇవ్వట్లేదు? బీజేపీ ఇవ్వట్లేదు. అధికార పార్టీ ఇవ్వట్లేదు. దీనివల్ల ప్రపంచానికి ఎలాంటి సందేశం వెళుతోంది?

    పోలరైజ్ చేసి హిందువుల ఓట్లను కొల్లగొడుతున్నారు. హిందువుల కూడా మీకే ఓట్లు వేస్తున్నారు. కానీ, ఎంతకాలం వేస్తారు? ధరలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ప్రజలకు ఉపాధి దొరకట్లేదు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు? అంతటా హింస, అశాంతి పేరుకుపోయింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం దేశం నడవాలి. కానీ, రాజ్యాంగాన్ని గాలికొదిలేశారు" అని గెహ్లాట్ అన్నారు.