You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్‌: రేపల్లె గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ జిందాల్

ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు తెగబడ్డారు. భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని బాపట్ల ఎస్పీ జిందాల్ మీడియాకు తెలిపారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. మరో రూ. 100 పెరిగిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్.. మూడు నెలల్లో రూ. 450 పైనే పెరిగిన ధర

    కమర్షియల్ ఎల్‌పీజీ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం ఆదివారం నాడు రూ. 102.50 మేర పెంచింది. దీంతో ఈ సిలిండర్ ధర రూ. 2,253 నుంచి రూ. 2,355.50 కు పెరిగింది.

    ఐదు కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 655కు పెరిగింది.

    ఇంతకుముందు ఏప్రిల్ 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం రూ. 250 పెంచింది. దానికిముందు మార్చి 1వ తేదీన కూడా ఈ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది.

    ఇదిలావుంటే.. ఉజ్వల దివస్ ఉత్సవాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 5,000 ఎల్‌పీజీ పంచాయతీలు నిర్వహించనున్నాయి.

    ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికీ ఒక ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ అందిస్తారు.

  2. దేశంలో కొత్తగా 3,324 కోవిడ్ కేసులు నమోదు, 40 మంది మృతి

    భారతదేశంలో గడచిన 24 గంటల్లో 3,324 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్ కారణంగా మరో 40 మంది చనిపోయారు.

    ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో 2,876 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు.

    మొత్తం కేసులు: 4,30,79,188

    యాక్టివ్ కేసులు: 19,092

    మొత్తం కోలుకున్న వారు: 4,25,36,253

    మొత్తం మరణాలు: 5,23,843

    మొత్తం వ్యాక్సినేషన్లు: 1,89,17,69,346

  3. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు దిశగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

    మొదటి దశలో విద్యుత్‌ వినియోగం 500 యూనిట్లు దాటిన గృహ వినియోగదారుల నివాసాలకు ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    అదేవిధంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాలతో పాటు పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్‌ మీటర్లను డిస్కంలు బిగించనున్నాయి.

    మొదటి దశను 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం 15 శాతం గ్రాంటు మంజూరు చేస్తుందని అధికారులు చెప్తున్నారు.

  4. భారత సైన్యంలో 97,000 పోస్టులు ఖాళీ, అయినా ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు

  5. ‘‘మోదీజీ.. దేశంలో విద్యుత్ సంక్షోభానికి ఎవరిని నిందిస్తారు? నెహ్రూనా? రాష్ట్రాలనా? ప్రజలనా?’’ – రాహుల్ గాంధీ

    దేశవ్యాప్తంగా చాలా చోట్ల విద్యుత్ కొరత పెరుగుతుండటం, విద్యుత్ కోతలు, బొగ్గు కొరతలపై పలువురు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు.

    దేశంలో విద్యుత్ సంక్షోభానికి ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరిని నిందిస్తారని ప్రశ్నించారు. ‘‘నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? ప్రజలనే నిందిస్తారా?’’ అని ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

    ప్రధానమంత్రి ఇచ్చే హామీలకు, ఆయన ఉద్దేశాలకు మధ్య ఎప్పుడూ సంబంధం ఉండదని రాహుల్ ఎద్దేవా చేశారు.

    దేశంలో అందరికీ 24 గంటల విద్యుత్ ఇస్తామంటూ, విద్యుత్ కోతలు, బొగ్గు కొరతలు లేవంటూ, విద్యుత్ మిగులు ఉంటోందని ప్రధాని మోదీ 2015లో, 2017లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు విద్యుత్ కొరత సమస్యలను చెప్తున్న దృశ్యాలను చూపుతున్న వీడియోను ట్వీట్‌తో షేర్ చేశారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.