You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ భేటీ: టీఆర్ఎస్ కోసం ఐపాక్ పనిచేస్తుందని చెప్పిన కేటీఆర్
అయితే, టీఆర్ఎస్ ఐపాక్‌తో మాత్రమే పనిచేస్తుందని, ప్రశాంత్ కిశోర్‌తో కాదని... ప్రశాంత్ కిశోర్, ఐపాక్ రెండూ ఇప్పుడు వేర్వేరని కేటీఆర్ చెప్పారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
అనీ బిసెంట్: నాస్తికత నుంచి తాత్వికత వైపు మళ్లి, హిందూ మతంపై ప్రసంగాలు ఇచ్చిన బ్రిటిష్ మహిళ
ఈ రోజు లైవ్ పేజీలో ముఖ్యాంశాలు
* గత కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
* ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపాక్) టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ఆ పార్టీ నేత కేటీఆర్ ఆదివారం ధ్రువీకరించారు.
* తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ (శాంతి, సమైక్యతల కోసం తెలంగాణ) వేదిక ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో శాంతి యాత్ర నిర్వహించింది.
* లఖీంపురి ఖేరీ హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా పోలీసులకు లొంగిపోయారు.
* జపాన్‌లోని హక్కాయిడో దీవి వద్ద శనివారం నాడు సముద్రంలో 26 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఈ బోటు ఆచూకీ కోసం గాలిస్తున్న జపాన్ కోస్ట్ గార్డ్.. ఇప్పటివరకూ పది మంది చనిపోయినట్లు నిర్ధారించింది.
* నైజీరియాలోని దక్షిణాదిలో ఓ అక్రమ చమురు శుద్ధికర్మాగారంలో పేలుడు సంభవించటంతో 80 మంది చనిపోయినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
* ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన వివాదంలో.. స్వతంత్ర పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానాలను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సండే కోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ మహిళలకు బాంబులంటే భయం లేదు
అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసిన రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు
పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఒక మహిళతన పిల్లలతో కలసి ఆత్మహత్యకుయత్నించారు. ఇంటిలోనే ఇద్దరు పిల్లలకు విష పదార్థం తాగించి తాను కూడా తాగేయడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
విషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యులతో కలిసి వైద్యం అందించారు.
మంత్రి అప్పలరాజు వృత్తిరీత్యా వైద్యులు. గత ఐదేళ్లుగా ఆయన వైద్య వృత్తి వదిలి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
పోచంపల్లి చీర తయారవుతుంది ఇలా
ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయా
27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం - కోవిడ్ పరిస్థితులపై చర్చ
గత కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
బుధవారం (ఏప్రిల్ 27) ప్రధాని అధ్యక్షతన ఈ వర్చువల్ సమావేశం ఉంటుంది.
ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
టీఆర్ఎస్ కోసం ఐపాక్ పనిచేస్తుంది, ప్రశాంత్ కిశోర్ కాదు: కేటీఆర్
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపాక్) టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ఆ పార్టీ నేత కేటీఆర్ ఆదివారం ధ్రువీకరించారు.
అయితే, టీఆర్ఎస్ ఐపాక్‌తో మాత్రమే పనిచేస్తుందని, ప్రశాంత్ కిశోర్‌తో కాదని... ప్రశాంత్ కిశోర్, ఐపాక్ రెండూ ఇప్పుడు వేర్వేరని ఆయన చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ తనకు తానుగా ఐపాక్ నుంచి బయటకు వచ్చేశారని, ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గత 20 ఏళ్లుగా టీఆర్ఎస్‌ను నడిపిస్తున్నారని.. అయితే, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని పార్టీ వదులుకోవాలని అనుకోవడం లేదని, అందుకే వచ్చే ఎన్నికల కోసం ఐపాక్ సహకారం తీసుకుంటోందని కేటీఆర్ చెప్పారు.
ప్రశాంత్ కిశోర్, కేసీఆర్‌లు భేటీ అయిన నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు.
భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి పెళ్లి చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే
హైదరాబాద్‌లో ప్రజాసంఘాల ‘శాంతి యాత్ర’
తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ (శాంతి, సమైక్యతల కోసం తెలంగాణ) వేదిక ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో శాంతి యాత్ర నిర్వహించింది.
మత సామరస్యం, శాంతి కోరుతూ.. బషీర్‌బాగ్‌లోని ఎల్.బి.స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ సమీపంలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వరకూ సాగిన ఈ యాత్రలో వివిధ ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ప్రదర్శనలో.. ‘శాంతి కోసం సమైక్యంగా నిలుస్తున్నాం’, ‘మత విద్వేషాన్ని తిరస్కరించండి’, ‘మానవత్వం మన ఉమ్మడి మతం’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రదర్శన ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు. చివర్లో జాతీయ గీతాన్ని ఆలపించారు.
లఖీంపురి ఖేరీ కేసులో లొంగిపోయిన ఆశిష్ మిశ్రా
లఖీంపురి ఖేరీ హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా పోలీసులకు లొంగిపోయారు.
సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో ఆదివారం ఆయన లొంగిపోయారు.
లఖీంపురి ఖేరీలోని జైలు వెనుక గేటు నుంచి రహస్యంగా వచ్చిన ఆయన అక్కడి అధికారుల ఎదుట లొంగిపోయారు.
2021 అక్టోబర్ 3న లఖీంపురి ఖేరీ జిల్లా తికునియాలో రైతులు నిరసన చేపట్టగా... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన అనుచరులతో కలిసి తాను ప్రయాణిస్తున్న జీపును రైతుల మీదుగా పోనిచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ మరణించారు.
ఈ కేసులో మిశ్రాతో పాటు మరో 12 మంది నిందితులను జైలుకు పంపారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. దీనిని బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
సుప్రీంకోర్టు ఆశిష్ బెయిల్‌ను తిరస్కరిస్తూహైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. ఆశిష్ వారం రోజులలోగా లొంగిపోవాలని ఆదేశించింది.
కోర్టు ఇచ్చిన గడువు సోమవారం(ఏప్రిల్ 25)తో పూర్తవుతుండడంతో ఆశిష్ ఆదివారం లొంగిపోయారు.
జపాన్ వద్ద సముద్రంలో పడవ మునక.. 10 మంది మృతి, 16 మంది గల్లంతు
జపాన్‌లోని హక్కాయిడో దీవి వద్ద శనివారం నాడు సముద్రంలో 26 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఈ బోటు ఆచూకీ కోసం గాలిస్తున్న జపాన్ కోస్ట్ గార్డ్.. ఇప్పటివరకూ పది మంది చనిపోయినట్లు నిర్ధారించింది.
చనిపోయిన వారిలో ఏడుగురు పురుషులు కాగా ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఇంకా గల్లంతైన 16 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
కాజు 1 అనే పేరున్న ఈ బోటు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన షిరిటొకొ ద్వీపకల్పానికి పర్యాటకులను తీసుకువెళుతోంది. ఈ ప్రయాణంలో సముద్రంలో తిమింగలాలు, సీలయన్స్‌తో పాటు తీరంలో ఎలుగుబంట్లు కనిపిస్తాయి కనుక పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ బోటు ప్రయాణాలు చేస్తుంటారు.
అలా సముద్రంలో విహారానికి వెళ్లిన బోటు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:15 గంటలకు అధికారులకు ఎమర్జెన్సీ సందేశం అందింది.
బోటులో నీరు నిండుతోందని, 30 డిగ్రీల కోణంలో మునిగిపోతోందని, తక్షణం కాపాడాలని బోటు సిబ్బంది కోరారని జపాన్ మీడియా కథనాలు చెప్తున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో ఇద్దరు చిన్నారులు సహా 24 మంది పర్యాటకులు, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఈ ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రతలు సున్నీ డిగ్రీ సెల్సియస్‌కి పడిపోతాయి. ఇంత చల్లటి నీటిలో కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే స్పృహ తప్పిపోతారని స్థానిక అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ బోటును కనుగొనటానికి పెట్రోల్ బోట్లు, పోలీసులు, సైన్యానికి చెందిన మూడు విమానాలు, నాలుగు హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు.
ఆదివారం నాడు సముద్ర జలాల నుంచి కొందరిని వెలికితీసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మృతుల్లో వారు ఉన్నారా అనేది స్పష్టం కాలేదు.
ఈ బోటు ప్రమాదానికి గురికావటానికి కారణమేమిటనేది ఇంకా తెలీలేదని అధికారులు చెప్తున్నారు.
నైజీరియాలో అక్రమ చమురు రిఫైనరీలో పేలుడు.. 80 మంది మృతి
నైజీరియాలోని దక్షిణాదిలో ఓ అక్రమ చమురు శుద్ధికర్మాగారంలో పేలుడు సంభవించటంతో 80 మంది చనిపోయినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
ఈ రిఫైనింగ్ ప్లాంట్లకు నిప్పు అంటుకున్నపుడు వాటి దగ్గర పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నట్లు చెప్తున్నారు.
ఈ పేలుడులో మంటల్లో చిక్కుకున్న కార్మికులు చాలా వరకూ గుర్తుపట్టటానికి వీలు లేనంతగా దహనమయ్యారు.
దక్షిణ నైజీరియాలో పేదరికం, నిరుద్యోగం తీవ్రంగా ఉండటం వల్ల.. అక్రమంగా చమురు శుద్ధి చేయటం ఆకర్షణీయమైన వ్యాపారంగా మారింది.
ఈ ప్రాంతంలో చమురు సమృద్ధిగా లభిస్తుండటంతో.. దొంగతనంగా చమురు సేకరించి అక్రమంగా శుద్ధి చేసే పరిశ్రమలు నడుస్తున్నాయి. స్థానికులు ఉపాధి కోసం ఈ అక్రమ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.
ఈ అక్రమ పరిశ్రమల వ్యాప్తిని అరికట్టటానికి అధికారులు చాలా కాలంగా విఫలప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి ఒక అక్రమ రిఫైనరీలో శనివారం రాత్రి పొద్దుపోయాక సంభవించిన పేలుడుకు కారణమేమిటనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే భద్రతా చర్యలు ఏమీ లేని ఈ రిఫైనరీల్లో ప్రమాదాలు సాధారణ విషయంగా మారాయి.
తాజా ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ స్థానిక అధికారిని ఉటంకిస్తూ చెప్తోంది.
2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ
ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రానాలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన వివాదంలో.. స్వతంత్ర పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానాలను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సండే కోర్టు ఆదేశాలిచ్చింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కోర్టు తీర్పు నేపథ్యంలో నవనీత్, రవి రానాల తరఫు న్యాయవాది బెయిల్ దరఖాస్తు సమర్పించారు. దీనిని ఈ నెల 29వ తేదీన విచారించాలని కోర్టు నిర్ణయించింది. బెయిల్ దరఖాస్తు మీద పోలీసుల స్పందనను 27వ తేదీ నాటికి సమర్పించాలని నిర్దేశించింది.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని, దమ్ముతంటే తమను ఆపాలని హెచ్చరించిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలు ముంబైలో బస చేసిన ఇంటి వద్ద శనివారం నాడు శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం తర్వాత.. తాము హనుమాన్ చాలీసా పఠించే ఆందోళనను విరమించుకుంటున్నట్లు నవనీత్ కౌర్, రవి రానాలు మీడియాకు చెప్పారు.
ఆ తర్వాత సాయంత్రానికి వారిద్దరినీ ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153(ఎ) సహా పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆదివారం నాడు ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను బాంద్రా కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు వీరివురినీ 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. బెయిల్ దరఖాస్తుపై 29వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
జమ్మూకశ్మీర్‌లో కొత్త శకం మొదలైంది.. ప్రైవేటు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు: మోదీ
జమ్మూకశ్మీర్ సరికొత్త అభివృద్ధి చరిత్రను లిఖించటం ఆరంభమైందని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి చాలా మంది ప్రైవేటు పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.
ఆదివారం జమ్మూలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి బనిహాల్ - కాజీగుండ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సాంబా జిల్లాలోని పల్లి గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ఆవిష్కరించారు. దిల్లీ-అమృత్‌సర్-కార్తా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి, చీనాబ్ నది మీద నిర్మించబోయే రెండు జలవిద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు.
జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సభ్యుల సదస్సు ద్వారా.. దేశవ్యాప్తంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘ఈ ఏడాది పంచాయతీ దినోత్సవాన్ని జమ్మూలో నిర్వహించటం ఓ పెద్ద మార్పుకు నాంది. జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకోవటం గర్వించదగ్గ విషయం’’ అని చెప్పారు.
‘‘ప్రజాస్వామ్యం కావచ్చు, అభివృద్ధి కావచ్చు.. నేడు జమ్మూకశ్మీర్ నూతన ఒరవడి సృష్టిస్తోంది. గత రెండు, మూడేళ్లలో ఇక్కడ కొత్త అభివృద్ధి కోణాలు ఆవిష్కృతమయ్యాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ అభివృద్ధిని వేగవంతం చేయటానికి ఆదివారం నాడు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించినట్లు తెలిపారు.
సాంబా జిల్లాలోని పల్లి గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఆవిష్కరణతో.. దేశంలో మొట్టమొదటి ‘కార్బన్ న్యూట్రన్ పంచాయతీ’గా ఈ గ్రామం అవతరించనుందని మోదీ చెప్పారు. పల్లి ప్రజలు ‘సబ్‌కా ప్రయాస్’ (సమష్టి కృషి)తో ఏం సాధించవచ్చుననేది చేసిచూపించారని ఆయన ప్రశంసించారు.
‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అని తాను అన్నపుడు.. దూరాల మధ్య అనుసంధానం గురించి తాను మాట్లాడుతున్నాన్నారు. జమ్మూకశ్మీర్‌కు అన్ని వాతావరణాలకు అనుగుణమైన అనుసంధానం అందించాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు.
అనంతపురం: గాడిదలకు పరుగు పందెం
అర్జెంటీనా రాజధానిలో ట్రాక్టర్ల ర్యాలీతో రైతుల నిరసన
అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్‌లో రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో నిరసన నిర్వహించారు.
దేశంలో ఆహార ధరలను అదుపులో ఉంచటానికి, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికి అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్ అమలు చేస్తున్న విధానాలను రైతాంగం తప్పుపడుతోంది.
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ నిరసనను ఏ సంస్థా నిర్వహించటం లేదు. రైతులే తమకు తాము ఇందులో పాల్గొంటున్నారు.
లాటిన్ అమెరికాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అర్జెంటీనా.. ఆహార ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగమే కీలకం.
నిరసనకారులు రాజధానిలో అధ్యక్ష రాజభవనం కాసా రోసాడా ముందుగా ట్రాక్టర్లు నడుపుతూ అర్జెంటీనా జెండాలు ఊపుతూ ప్రదర్శన నిర్వహించారు. దేశంలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టే రైతులు రాజధాని నగరంలో ఆందోళనకు దిగటం అరుదు.
దేశంలో సరఫరాలకు ప్రాధాన్యం ఇవ్వటం కోసం ధాన్యాలు, మాంసం ఎగుమతులపై అధ్యక్షుడు పరిమితులు విధించారు.
మాజీ అధ్యక్షుడు మారిసియో మార్సి హయాంలో పెరగటం మొదలైన పన్నులు ఫెర్నాండెజ్ పాలనలో పెరగటం కొనసాగింది. ప్రస్తుతం గోధుమలు, మొక్కజొన్న ఎగుమతుల మీద 12 శాతం పన్ను విధిస్తున్నారు. సోయా, వంట నూనె ఎగుమతుల మీద పన్నులు 33 శాతంగా ఉన్నాయి.
నిరసనకారులు ‘‘రోడ్ల నిర్మాణానికి మేం పన్నులు చెల్లిస్తున్నాం. కానీ మాకు మురికి గుంటలే దక్కుతున్నాయి’’, ‘‘పన్నులు తగ్గించాలి’’ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.
‘‘మా గొంతులు బిగించటానికి ఉపయోగిస్తున్న తాడు కోసం మేమిక నిధులు అందించబోం’’ అంటూ పన్నులు తగ్గించాలనే డిమాండ్‌తో ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ ప్రదర్శనలో చదివి వినిపించారు.
జమ్ములోని పల్లి గ్రామంలో ప్రధాని మోదీ ఎందుకు పర్యటిస్తున్నారు?
జమ్ములోని సాంబా జిల్లా పల్లి గ్రామ పంచాయతీ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని తొలి కార్బన్ రహిత గ్రామ పంచాయతీగా 'పల్లి' అవతరించనుంది.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ, 500 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటును పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు అంకితం చేయనున్నారు. దీనితర్వాత ఇది కార్బన్ రహిత పంచాయతీగా నిలుస్తుంది. ఇక్కడి ప్రజలు స్థానిక పవర్ గ్రిడ్ స్టేషన్లలో ఉత్పత్తి చేసిన కార్బన్ రహిత విద్యుత్‌ను పొందనున్నారు.
రికార్డు స్థాయిలో 20 రోజుల వ్యవధిలోనే ఈ ప్లాంటును నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటు 340 ఇళ్లకు సౌర విద్యుత్‌ను అందిస్తుంది.
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పల్లి గ్రామ పంచాయతీ నూతనోత్తేజాన్ని సంతరించుకుంది. అక్కడ రోడ్లను తీర్చిదిద్దుతున్నారు.
ఈ గ్రామానికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలపై బీబీసీ ప్రత్యేక కథనం కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.