You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా - యుక్రెయిన్‌ యుద్ధం: యుక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయం ప్రకటించిన బైడెన్

అమెరికా వారం రోజుల కిందట యుక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. దానికి అదనంగా ఇప్పుడు మరో 80 కోట్ల డాలర్ల సాయం ఇస్తామని చెప్పింది.

లైవ్ కవరేజీ

  1. ఈనాటి ముఖ్య పరిణామాలు...

    విద్యుత్ వాహనాల తయారీలో ఏ కంపెనీ అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే భారీ జరిమానా విధించటం, లోపభూయిష్టమైన వాహనాలన్నిటినీ రీకాల్ చేయాలని ఆదేశించటం జరుగుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

    మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022 పోటీల్లో భారత క్రీడాకారిణిలు సరితా మోర్, సుష్మా షోకీన్‌లు తమ మహిళల ఫ్రీస్టైల్ వెయిట్ కేటగిరీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

    వారం రోజుల కిందట యుక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తాజాగా మరో 80 కోట్ల డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.

    భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.

    హైతీలో ఓ చిన్న విమానం రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌లో ఒక ప్రధాన రహదారి మీద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.

    అఫ్గానిస్తాన్‌లో మజారే షరీఫ్, కుందూజ్ నగరాల్లో జరిగిన వేర్వేరు పేలుళ్లలో 15 మంది చనిపోగా మరో 40 మంది గాయపడ్డారు.

    యుక్రెయిన్‌లో రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్ నగరం నుంచి ఈగ కూడా బయటకు రాకుండా దిగ్బంధించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. అజోవస్తాల్ స్టీల్ ప్లాంట్ లోపల గాయపడిన సైనికులు, కొందరు ప్రజలు ఉన్నారని యుక్రెయిన్ చెబుతోంది.

    ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది.

    ఇవీ ఈనాటి ముఖ్యపరిణామాలు. బీబీసీ తెలుగు నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    యుక్రెయిన్ యుద్ధంపై తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.

  2. మండు వేసవిలోనూ చల్లగా ఉంచే జుగాడ్ మట్టికుండ

  3. విద్యుత్ వాహనాల నాణ్యత లోపిస్తే భారీ జరిమానాలు: గడ్కరీ

    విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వాటిపై భారీ జరిమానాలు విధించటానికి భారతదేశం సంసిద్ధమవుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న వాహనాలను కంపెనీలు రీకాల్ చేయటం తప్పనిసరి చేయబోతోందని పేర్కొంది.

    ఇటీవల ఈ-స్కూటర్లు మంటల్లో చిక్కుకున్న ఘటనలు వరుసగా సంభవించిన నేపథ్యంలో నాణ్యత ప్రధానంగా కొత్త నిబంధనలు రూపొందించనున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వరుస ట్వీట్లలో తెలిపారు.

    ‘‘గత రెండు నెలల్లో ద్విచక్ర వాహనాల వల్ల పలు ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఏ కంపెనీ అయినా తన ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే భారీ జరిమానా విధించటం, లోపభూయిష్టమైన వాహనాలన్నిటినీ రీకాల్ చేయాలని ఆదేశించటం జరుగుతుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    కొత్త నిబంధనలు రూపొందేలోగా కంపెనీలు లోపభూయిష్టమైన వాహనాలను తక్షణమే రీకాల్ చేయటానికి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

    రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇటీవలి వారాల్లో ఈ-స్కూటర్లకు నిప్పంటుకున్న ఉదంతాలు దాదాపు డజను వరకూ జరిగాయి. ఇందులో ఓలా ఎలక్ట్రిక్; ఒకినావా, ప్యూర్‌ఈవీ కంపెనీల స్కూటర్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనలతో కొందరు కొనుగోలుదారుల్లో భద్రత భయాలు తలెత్తుతున్నాయి.

    భారతదేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ప్రస్తుతం 2 శాతంగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల వాటా 2030 నాటికి 80 శాతానికి పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వందల కోట్ల డాలర్ల మేర ప్రోత్సహకాలు ఇస్తోంది.

  4. "..అలా చేస్తే ట్రాన్స్‌జెండర్లు వీధుల్లోకి వచ్చి సెక్స్ వర్కర్లుగా మారరు"

  5. ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచిన సరితా మోర్, సుష్మితా షోకీన్

    ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2022 పోటీల్లో భారత క్రీడాకారిణిలు సరితా మోర్, సుష్మా షోకీన్‌లు తమ మహిళల ఫ్రీస్టైల్ వెయిట్ కేటగిరీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

    మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం వీరిద్దరూ చెరో పతకం సాధించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    రెండు సార్లు ఏసియన్ చాంపియన్‌గా నిలిచిన సరితా మోర్.. 59 కిలోల విభాగంలో ఆడిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచారు.

    ఆమె తొలి రెండు మ్యాచ్‌లలో జపాన్ క్రీడాకారిణి సారా నటామీ, మంగోలియా క్రీడాకారిణి షూవ్దోర్ బాటార్జావ్‌ల చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ క్రీడాకారిణిలను ఓడించిన సరితా మోర్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ విభాగంలో సారా నటామీ చాంపియన్‌గా నిలిచారు.

    ఇక 55 కిలోల విభాగంలో సుష్మా షోకీన్ జపాన్ క్రీడాకారిణి ఉమి ఇమాయ్, మంగోలియా క్రీడాకారిణి ఓట్గాన్జార్గాల్ గాన్బాటర్ చేతుల్లో ఓడిపోయినప్పటికీ.. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణిలను చిత్తుగా ఓడించి కాంస్యం గెలుచుకున్నారు.

    గురువారం ఇతర మ్యాచ్‌లలో ఆడిన మిగతా భారత క్రీడాకారిణులు మనీషా (50 కిలోల విభాగం), సోనికా హూడా (68 కిలోల విభాగం), సుదేశ్ కుమారి (76 కిలోల విభాగం) పతకాలు సాధించలేకపోయారు.

  6. యుక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయం ప్రకటించిన బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. యుక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీ ప్రకటించారు.

    యుక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ గురువారం వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌ను సందర్శించారు.

    అమెరికా వారం రోజుల కిందట యుక్రెయిన్‌కు 80 కోట్ల డాలర్ల సాయం ప్రకటించింది. దానికి అదనంగా ఇప్పుడు మరో 80 కోట్ల డాలర్ల సాయం ఇస్తామని చెప్పింది.

    దీనితో పాటు.. జీతాలు చెల్లించటం, సేవలు అందించటం వంటి యుక్రెయిన్ ప్రభుత్వ కార్యకలాపాల కోసం మరో 50 కోట్ల డాలర్లు సాయం అందించనున్నట్లు అమెరికా టెరజరీ తెలిపింది.

    యుక్రెయిన్ పౌరుల కోసం బైడెన్ కొత్త శరణార్థి పథకం

    యుక్రెయిన్ పౌరులు తమ దేశం వదిలి తాత్కాలికంగా అమెరికా పారిపోవటానికి వీలుగా జో బైడెన్ కొత్త పథకాన్ని ప్రకటించారు.

    ఈ ‘యునైట్ ఫర్ యుక్రెయిన్’ పథకం కింద.. అమెరికన్ ఎవరైనా స్పాన్సర్ చేసినట్లయితే రెండేళ్ల వరకూ అమెరికాలో ఉండవచ్చునని బైడెన్ చెప్పారు. ఈ పథకం ద్వారా అమెరికా పౌరసత్వం పొందే వీలుండదని స్పష్టంచేశారు.

  7. గుజరాత్: గాంధీనగర్‌లో అక్షర్‌ధామ్ టెంపుల్‌ను సందర్శించిన బోరిస్ జాన్సన్

    భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.

    దానికుమందు పంచమహల్‌లోని జేసీబీ ఫ్యాక్టరీని కూడా బోరిస్ సందర్శించారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంతరి భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు.

    బోరిస్ జాన్సన్ శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అవుతారు.

  8. హైతీలో రోడ్డుపై కూలిన చిన్న విమానం.. ఆరుగురు మృతి

    హైతీలో ఓ చిన్న విమానం రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌లో ఒక ప్రధాన రహదారి మీద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.

    రాజధాని నగరం నుంచి జాక్మెల్ రేవు నగరానికి ప్రయాణిస్తున్న ఈ విమానం.. రాజధాని శివార్లలో కూలిపోయింది.

    ఈ ప్రమాదంలో రోడ్డు మీద ఉన్న పలువురు గాయపడ్డారు.

    విమానం పైలట్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డట్టప్పటికీ తీవ్రగాయాలవటంతో ఆ తర్వాత ఆస్పత్రిలో చనిపోయారు.

    విమానం ఇంజన్ విఫలమవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.

    విమానం టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు ప్రమాదంలో ఉన్నట్లు సిగ్నల్ పంపించిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.

  9. కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..

  10. అఫ్గానిస్తాన్‌లో వరుస పేలుళ్లు.. 15 మంది మృతి

    అఫ్గానిస్తాన్‌లోని వేర్వేరు నగరాల్లో గురువారం వరుస పేలుళ్లలో 15 మంది చనిపోగా మరో 40 మంది గాయపడ్డారు.

    మజారే షరీఫ్ నగరంలోని ఒక మసీదు దగ్గర తొలి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారని ఒక అధికారి బీబీసీకి తెలిపారు.

    కుందూజ్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు చనిపోగా మరో 18 మంది గాయపడ్డారని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

    మజారే షరీఫ్‌లోని షియా మసీదు దగ్గర జరిగిన పేలుడులో 65 మంది గాయపడ్డారని అఫ్గాన్ వార్తా సంస్థ టోలో న్యూస్ చెప్తోంది. షియా ముస్లింలకు అతి పెద్ద మసీదుల్లో ఈ మసీదు ఒకటి.

    అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ సహా పలు సున్నీ తీవ్రవాద సంస్థలు షియా ముస్లింలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నాయి.

  11. జానీ డెప్: 'నా పెళ్లాం నన్ను తిట్టేది, కొట్టేది': మాజీ భార్యపై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు వేసిన హాలీవుడ్ హీరో

    హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య ఆంబర్ హెర్డ్‌ను చంచలమైన భార్యగా, తనను హింసించిన, అవమానించిన వ్యక్తిగా చిత్రీకరించటానికి ప్రయత్నించారు.

    ఆంబర్ హెర్డ్ (35 ఏళ్లు) తను గృహ హింస బాధితురాలినంటూ రాసిన ఒక వ్యాసం మీద జానీ డెప్ (58 ఏళ్లు) 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 380 కోట్ల) పరువునష్టం దావా వేశారు.

    తాను ఏరకంగానూ హింసించలేదని డెప్ తెలిపారు. డెప్ మీద ఆంబర్ 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 760 కోట్ల) పరువునష్టం క్లెయిమ్ చేస్తూ ఎదురు కేసు వేశారు.

    ఆంబర్ వైపు నుంచి 'తీవ్ర ద్వేషం' తను చవిచూశానని డెప్ తన వాంగ్మూలంలో చెప్పారు. ఆయన రెండు రోజుల పాటు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆంబర్ తరఫు న్యాయవాదులు బుధవారం నాడు క్రాస్-ఎగ్జామినేషన్ ప్రారంభించారు.

    డెప్ వాంగ్మూలం గురువారం మళ్లీ మొదలవుతుంది.

  12. వర్జినిటీ: కన్నెపొర అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? మొదటిసారి సంభోగం తర్వాత దానికి ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

    మనలో ఉన్న అభిప్రాయం: ఒక మహిళ మొదటిసారి సంభోగంలో పాల్గొన్నప్పుడు హైమెన్(కన్నెపొర) విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల రక్తస్రావం అవుతుంది. అలా రక్తస్త్రావం అయిందంటే ఆ మహిళ కన్యత్వాన్ని కోల్పోయినట్లు.

    వాస్తవం ఏంటంటే సంభోగం తర్వాత హైమెన్(కన్నెపొర) మార్పుకు గురికాదు అనే వాస్తవాన్ని వంద సంవత్సరాల కిందటి నుంచే ఆధునిక వైద్య శాస్త్రం గుర్తించినా, సమాజంలో ఇప్పటికీ ఈ కన్నెపొర అనే స్త్రీ శరీర భాగం ఆమె లైంగిక చరిత్రను చెబుతుంది అన్న భావన ఇప్పటికీ ప్రబలంగా ఉంది.

  13. ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు పేలకుండా చూసుకోవచ్చు

    అప్పుడప్పుడూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు పేలుతుంటాయి. వేసవిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ. అయితే అవి ఎందుకు పేలుతాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను తప్పించవచ్చు.

  14. పుతిన్: ‘అక్కడ నుంచి ఈగ కూడా బయటకు రాకూడదు’

    యుక్రెయిన్‌లో రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్ నగరంలో కొందరు యుక్రెయిన్ సైనికులు చిక్కుకు పోయారు.

    మరియుపూల్‌లో గల అజోవస్తాల్ ఉక్కు ఫ్యాక్టరీలో యుక్రెయిన్ సైనికులు తలదాచుకున్నారు.

    అయితే ఆ ఫ్యాక్టరీలో నుంచి ఎవరూ బయటకు రాకుండా దాన్ని పూర్తి సీల్ చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఆదేశించారు.

    సుమారు 2,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అజోవస్తాల్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఇంత కాలం యుక్రెయిన్ సైనికులు పోరాడుతూ వచ్చారు.

    ప్లాంట్ లోపల గాయపడిన సైనికులు, కొందరు ప్రజలు ఉన్నారని యుక్రెయిన్ చెబుతోంది. వీరిని బయటకు తరలించేందుకు సహకరించాలని రష్యాను కోరుతోంది.

  15. అమిత్ షా: ‘అత్యంత ఎక్కువగా మానవహక్కులను హరిస్తోంది ఉగ్రవాదమే’

    అత్యంత ఎక్కువగా మానవహక్కులను హరిస్తోంది ఉగ్రవాదమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

    ‘యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు చేపట్టినప్పుడల్లా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ కొన్ని మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. కానీ నా దృష్టిల్లో అత్యంత ఎక్కువగా మానవహక్కులను హరిస్తోంది ఉగ్రవాదమే. కాబట్టి ఉగ్రవాదాన్ని నిర్మూలించి మానవహక్కులను రక్షించాల్సిన అవసరం ఉంది.’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 13వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    2008 డిసెంబరు 31న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏర్పడింది. ఈ 13 ఏళ్లలో సంస్థ ఎన్నో అద్భుతాలు చేసిందని అమిత్ షా ప్రశంసించారు.

  16. కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ‘‘థంగం రౌడీ’’ ఎవరు? ఆయన్ను ‘‘జూనియర్ వీరప్పన్’’ అని ఎందుకు పిలుస్తారు?

  17. విశాఖపట్నం: తవ్వోడ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది?

  18. రోజా ఫోన్ కొట్టేశారు

    ఆంధ్రప్రదేశ్ టూరిజం, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆమె పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    రోజా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించారు.

    ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలిసారిగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం జిల్లా కేంద్రం తిరుపతికి చేరుకున్నారు.

    ఆ తర్వాత రోజా రుయా ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలోనే రోజా మొబైల్ చోరీ జరిగింది.

  19. ‘హిజ్రాలతో రాత్రివేళ పూజలు.. ఊళ్లోకి ఎవరూ రాకుండా కంచెలు’

  20. ఒంగోలు: సీఎం కాన్వాయ్ కోసం కారు తీసుకున్న వివాదంలో ఇద్దరు సస్పెండ్

    ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అంటూ తిరుపతి వెళ్లే వారి నుంచి కారు తీసుకున్నారనే వివాదంలో ఇద్దరిని సస్పెండ్ చేశారు.

    ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్ పి.తిరుపతి రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    రేపు వైఎస్ జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు.