జెరూసలేం అల్ అక్సా మసీదు ఆవరణలో ఘర్షణలు.. 150 మందికి గాయాలు
జేరూసలేంలోని అల్-అక్సా మసీదు ఆవరణ వద్ద ఇజ్రాయెల్ పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 150 మంది పాలస్తీనియన్లు గాయపడ్డట్లు పాలస్తీనా వైద్య సిబ్బంది చెప్పారు.
పోలీసులపై టపాసులు, రాళ్లు, ఇతర వస్తువులతో దాడి జరగటంతో వారు మసీదు ఆవరణలోకి ప్రవేశించారని ఇజ్రాయెలీ పోలీసు విభాగం చెప్తోంది.
ఈ ఘర్షణలో ముగ్గురు ఇజ్రాయెల్ పోలీసులు గాయపడ్డట్లు తెలిపారు.
జెరూసలేం లోని ఈ ప్రార్థనా ప్రాంతం ముస్లింలకు, యూదులకు ఇరు వర్గాల వారికీ చాలా ముఖ్యమైన మత కేంద్రం. యూదులు టెంపుల్ మౌంట్‌గా దీనిని పిలుస్తారు.
ఇజ్రాయెల్‌లో తీవ్ర దాడులు, దాని తర్వాత వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్లు చనిపోయిన పరిణామాలతో.. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రంగా పెరిగిపోయాయి.
గత గురువారం నాడు టెల్ అవీవ్‌లో ఓ పాలస్తీనావాసి ముగ్గురు ఇజ్రాయెల్ వాసులను హత్య చేయగా.. ఇజ్రాయెల్ బలగాలు వెస్ట్ బ్యాంక్‌లో సైనిక ఆపరేషన్‌లో 20 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వారిలో ఎక్కువమంది సాయుధలని ఇజ్రాయెల్ చెప్తోంది.