శ్రీలంక సంక్షోభం: ఇలా అయితే ప్రజలు ఎలా బతుకుతారన్న సనత్ జయసూర్య

ఫొటో సోర్స్, ANI
వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే శ్రీలంక పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని క్రికెటర్ సనత్ జయసూర్య అన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజానిరసనలకు మద్దతు పలికిన జయసూర్య, ఇలా అయితే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.
‘పెట్రోలు, గ్యాస్ ప్రజలకు దొరకడం లేదు. మరొకవైపు రోజుకు 10 నుంచి 12 గంటలు కరెంటు ఉండటం లేదు. ఇలా అయితే ప్రజలు ఎలా బతుకుతారు? అందుకే వారంతా వీధుల్లోకి వస్తున్నారు. ఇది ఈ దేశ ప్రజలకు నిజంగా కష్ట కాలం.’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ జయసూర్య చెప్పుకొచ్చారు.
డీజిల్ కోసం మూడు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయని వెల్లడించారు.
శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎటువంటి హింసకు పాల్పడొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ ఆర్థికసంక్షోభానికి కారణం ప్రస్తుత ప్రభుత్వమేనని జయసూర్య ఆరోపించారు. ప్రజలు ఎంతగానో విశ్వసించినప్పటికీ గత మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వ పనితీరు బాగాలేదని తెలిపారు.



