శ్రీలంక: కొలంబోలో కర్ఫ్యూ.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?, బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్ రజినీ వైద్యనాథన్ విశ్లేషణ

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES
ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస తన పార్టీ సభ్యులతో నిరసన తెలుపుతూ ఆదివారం కొలంబో ఇండిపెండెన్స్ స్క్వేర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.
‘‘ఇక్కడి చట్టాలు ప్రజల హక్కులు పరిరక్షించేందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ఆ హక్కును ఎవరూ హరించలేరు’’అని ఆయన చెప్పారు.
కర్ఫూతోపాటు సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలు నియంతృత్వ ధోరణిని కళ్లకు కడుతున్నాయని ఆయన అన్నారు.
కర్ఫ్యూని ధిక్కరించి వీధుల్లోకి వస్తున్న మరికొంత మందితోకూడా నేను మాట్లాడాను.
రద్దీగా ఉండే కొలంబో రోడ్డులోని ఆసియా రెస్టారెంట్ పరిసరాల్లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిలో సుచిత్ర కూడా ఒకరు.
ఆయన తనతోపాటు 15 నెలల బాబును కూడా తీసుకొచ్చారు. తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు.
‘‘కరెంటు లేకపోతే ఫ్యాన్లు తిరగవు. ఇలాంటి వేడిలో బాబుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తను పడుకోవడం కూడా కష్టం అవుతోంది.’’
‘‘నా హక్కులను తీసేసుకోవడం వల్లే నేను బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాను. నాకు చాలా కోపంగా ఉంది’’ అని అంజలీ వనదుర్గాల అనే మహిళ చెప్పారు. ‘‘వారు ఎందుకు ఈ కర్ఫ్యూ విధించారు? మీ కోసమా? అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా?’’అని ఆమె అడిగారు.
బయటకు వచ్చి ఇలా నిరసన తెలపడం ఇదే తొలిసారని ఫ్రీల్యాన్స్ అడ్వర్టైజింగ్ కాపీరైటర్ సథసరా చెప్పారు. ‘‘ఇప్పుడు నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. గ్యాస్, విద్యుత్ కూడా లేవు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’అని ఆయన వివరించారు.






