You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే వరకూ పార్లమెంటులోనే కూర్చుంటాం – బిలావల్ భుట్టో

పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యుటీ స్పీకర్ తోసిపుచ్చారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసినట్టు తెలిపారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ధన్యవాదాలు

    ధన్యవాదాలు. ఇక్కడితో ఈ లైవ్ పేజీలో అప్‌డేట్లు ముగిశాయి.

    తాజా సమాచారం చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  2. ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

  3. చేపలు మనుషులను చంపాలనుకుంటాయా.. ఏ చేపలు ప్రమాదకరం?

  4. పాకిస్తాన్: పార్లమెంటును ఇమ్రాన్ ఖాన్ ఎందుకు రద్దు చేశారు? దీనిపై పాకిస్తానీలు ఏం అంటున్నారు?

    ఊహించని రీతిలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. దీంతో నేషనల్ అసెంబ్లీని ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు.

    ‘‘నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ అంగీకారం తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 58 (1), ఆర్టికల్ 48 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు’’అని పాక్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

  5. పుడింగ్ మింక్ పబ్‌: హైదరాబాద్‌ పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఎవరెవరు ఆ పార్టీలో ఉన్నారు?

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ పుడింగ్ మింక్ పబ్‌లో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి సోదాలు నిర్వహించారు.

    తెల్లవారుజామున సుమారు 3 గంటలు దాటిన తర్వాత కూడా పబ్ నడుపుతుండటంతో అక్కడున్న దాదాపు 144 మందిని అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, పార్టీలో పాల్గొన్న కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హోటల్ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

  6. ఉల్కాపాతమా? ఉపగ్రహం ముక్కలా? రాకెట్ అవశేషాలా? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?

    శనివారం సాయంత్రం, రాత్రి అంతరిక్షంలో కనిపించిన కాంతులతో మహారాష్ట్ర ప్రజలు షాకయ్యారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు కనిపించాయి.

    ఇది ఉల్కాపాతం అంటూ చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఉల్కలు ఆకాశం నుంచి రాలుతున్నాయంటూ పోస్టులు చేశారు. కొందరేమో ఇవి ఉపగ్రహాల ముక్కలు అయ్యుండొచ్చని, మరికొందరేమో ఇవి భారతదేశంపై విదేశాల నిఘా పరికరాలు అని ప్రచారం చేశారు.

    ఇంతకీ ఈ అగ్ని గోళాలు ఏంటి?

  7. ‘‘పార్లమెంటులోనే కూర్చుంటాం.. అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సిందే’’

    ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే వరకూ నేషనల్ అసెంబ్లీలోనే కూర్చుంటామని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో చెప్పారు.

    ఈ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి తిరస్కరించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

    ‘‘ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనివ్వలేదు. మేం ఇప్పుడు పార్లమెంటును వదిలి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం’’అని బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.

    ‘‘మా న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు. రాజ్యాంగంలోని నిబంధనల అమలు కోసం మేం పోరాడుతున్నాం’’అని ఆయన అన్నారు.

  8. ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

    అంతర్జాతీయం

    యుక్రెయిన్ యుద్ధం:

    • కీయెవ్ నగరాన్ని, పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని యుక్రెయిన్ రక్షణ శాఖ డిప్యుటీ మంత్రి తెలిపారు. గత కొద్ది వారాలుగా కీయెవ్ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలలో భీకర పోరాటం జరిగింది. ఫలితంగా, రష్యా దళాలు వెనక్కు తగ్గాయని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
    • రష్యా దాడులు మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇర్పిన్ నగరంలో కనీసం 200 మంది పౌరులు మరణించినట్టు అధికారులు తెలిపారు.
    • యుక్రెయిన్ దళాలు గత రెండు రోజుల్లోనే బుచా నగరంలోకి ప్రవేశించగలిగాయి. అంతకుముందు దాదాపు నెలరోజులుగా ఈ నగరం అందుబాటులో లేదు. శనివారం ఒక వీధిలో కనీసం 20 మృతదేహాలను చూసినట్టు ఏఎఫ్‌పీ తెలిపింది. అయితే, కనీసం 280 మందిని బుచాలో సామూహిక ఖననం చేసినట్టు ఆ నగర మేయర్ చెప్పారు. నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయని అన్నారు.
    • కీయెవ్‌కు సమీపంలో ఉన్న హాస్టమెల్‌లో ప్రారంభం నుంచి భీకర పోరాటం జరుగుతోంది. అక్కడ ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నించింది. ప్రపంచంలో అతిపెద్ద విమానం ఆంటోనోవ్ యాన్-225 మ్రియా ఇక్కడే ఉంది. ఈ విమానం పూర్తిగా ముక్కలుముక్కలైపోయింది. కాగా, రష్యా దళాలు విమానాశ్రయం నుంచి వెనక్కు మరలాయి.
    • లిథువేనియా ఇకపై రష్యా నుంచి సహజ వాయువులను దిగుమతి చేసుకోదని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. రష్యాతో అన్ని రకాల ఇంధన సంబంధాలను తెంచేసుకుంటున్నామని లిథువేనియా తెలిపింది. "మేం ఇది చేయగలిగినప్పుడు, మిగిలిన యూరప్ దేశాలు కూడా చేయగలవని" లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నాసెడా ట్వీట్ చేశారు.
    • యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఒడెసా పోర్టులో భారీ పేలుళ్లు సంభవించినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఆదివారం ఉదయం ఈ నగరంలో పొగలు కనిపించాయని రాయిటర్స్ సాక్షి తెలిపారు. నగరవాసులందరూ షెల్టర్లలోకి వెళ్లాలని ఒడెసా ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి సెర్హి బ్రాట్‌చుక్ కోరారు.

    పాకిస్తాన్:

    • ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరి తోసిపుచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 5కి విరుద్ధమని డిప్యూటీ స్పీకర్ అన్నారు.
    • తరువాత, ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాశారు. ప్రజలు ఎన్నికలను సిద్ధం కావాలని కోరారు.
    • అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పార్లమెంటును రద్దు చేశారు. దాంతో, ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డాయి. ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహానికి పాలపడ్డారని ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ అన్నారు.

    స్థానికం:

    • హైదరాబాద్ బంజారహిల్స్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. రాడిసన్ బ్లూ హోటల్ లోపల ఉన్న ఫుడింగ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.30 - 3.00 గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
    • మొత్తం 33 మంది అమ్మాయిులు సహా 144 మందిని టాస్కుఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న వారి పేర్లు, ఇతర వివరాలు రాసుకుని పోలీసులు అందర్నీ పంపేశారు.
  9. ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహానికి పాల్పడ్డారు - ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షం సమర్పించిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటు డిప్యుటీ స్పీకర్ తోసిపుచ్చారు.

    తరువాత, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షుడిని కోరారు.

    అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పార్లమెంటును రద్దు చేశారు కూడా.

    దాంతో, ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడుతున్నాయి.

    పార్లమెంటు రద్దు తీర్మానంపై ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.

    "ఇది దేశద్రోహానికి తక్కువేం కాదు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని అరాచకం వైపుకు నెట్టారు. రాజ్యాంగానికి భంగం కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు సుప్రీం కోర్టు తన వంతు కృషి చేస్తుందని ఆశిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.

  10. హైదరాబాద్ బంజారహిల్స్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం

    హైదరాబాద్ బంజారహిల్స్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. రాడిసన్ బ్లూ హోటల్ లోపల ఉన్న ఫుడింగ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.30 - 3.00 గంటల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

    సమయం దాటిపోయినా పబ్ మూయనందుకు పోలీసులు సోదాలు చేయగా, అక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయి.

    మొత్తం 33 మంది అమ్మాయిులు సహా 144 మందిని టాస్కుఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

    అదుపులోకి తీసుకున్న వారిలో నటి నీహారిక, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు.

    అదుపులోకి తీసుకున్న వారి పేర్లు, ఇతర వివరాలు రాసుకుని పోలీసులు అందర్నీ పంపేశారు.

    సోదాలో కొన్ని రకాల డ్రగ్స్, గంజాయి, ఎల్సీడీ సిగరెట్లు దొరికినట్టు తెలుస్తోంది. స్వల్ప మొత్తంలో దొరికిన కొకైన్‌ను సీజ్ చేశారు. అలాగే పబ్‌ను కూడా సీజ్ చేశారు.

    పబ్ యజమాని ఉప్పాల అభిషేక్‌ను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు డ్రగ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సప్పెండ్ చేశారు కమిషన్ సీవీ ఆనంద్. బంజారహిల్స్ ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో ఇచ్చారు.

    పార్టీకి వచ్చిన అందరూ డ్రగ్స్ తీసుకోలేదని చెబుతూ, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు సరఫరా చేశారు అనేది విచారణ చేస్తున్నట్టు కొందరు పోలీసులు తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    అక్కడకు వెళ్లిన సెలెబ్రిటీలు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రస్తుతానికి ఆధారాలు లేవు.

  11. బ్రేకింగ్ న్యూస్, పార్లమెంటు రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్.. ప్రజలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

    పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యుటీ స్పీకర్ తోసిపుచ్చారు.

    అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, పార్లమెంటు రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసినట్టు తెలిపారు.

    "అసెంబ్లీలను రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిస్తున్నాను" అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

  12. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చిన పార్లమెంటు డిప్యుటీ స్పీకర్

    ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పార్లమెంటు డిప్యుటీ స్పీకర్ ఓటింగ్‌కు ముందే దాన్ని తోసిపుచ్చారు.

    పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి అధ్యక్షతన ఈ సభ జరుగుతోంది.

    ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 5కి విరుద్ధమని డిప్యూటీ స్పీకర్ అన్నారు.

  13. యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు కాస్త దూరంలో ఖాళీగా ఉన్న మెయిన్‌ రోడ్డుపై వేగంగా వెళ్తున్న మూడు కార్లు ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగాయి. అందులో రెండు కార్లు అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, ఒక్కటి మాత్రం అలా చేయలేదు.

    ఇదంతా ఒక డ్రోన్ ఫుటేజీలో కనిపించింది.

    తెలుపు రంగులోని ఆ కారు కూడా వెనక్కి తిరిగింది. కానీ, వెంటనే ఆగిపోయింది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి చేతులు ఊపారు. ఆ మరుక్షణంలోనే ఆయన నేల మీద పడిపోయారు. వెంటనే, కారులో నుంచి పిల్లాడిని తీసుకొని దిగిన ఒక పెద్దావిడ అక్కడి నుంచి పారిపోయారు.

    నేలపై పడి ఉన్న వ్యక్తి పేరు మక్సీమ్ లోవింకో. రష్యా సైనికుల కాల్పుల్లో 31 ఏళ్ల మక్సీమ్ మరణించారు. కారులో ఉన్న ఆయన భార్య కెసినియా కూడా చనిపోయారు.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  14. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కొత్త గవర్నర్‌ ఉమర్ సర్ఫరాజ్ చీమా

    పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ కొత్త గవర్నర్‌గా పీటీఐ నేత ఉమర్ సర్ఫరాజ్ చీమా నియమితులైనట్లు పాకిస్తాన్ న్యాయ మంత్రి ట్వీట్ చేశారు.

    ఆదివారం తెల్లవారుజామున ఉద్వాసనకు గురైన మహ్మద్ సర్వర్ స్థానంలో చీమా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  15. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌పై కూడా అవిశ్వాస తీర్మానం సమర్పించిన ప్రతిపక్షం

    ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు ముందు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌పై కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి.

    జాతీయ అసెంబ్లీలోని 100 మందికి పైగా సభ్యుల ఈ తీర్మానంపై సంతకాలు చేశారు.

    నిబంధనల ప్రకారం, జాతీయ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సమర్పిస్తే, ఆయన సెషన్‌కు అధ్యక్షత వహించలేరు, వాయిదా వేయలేరు.

  16. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసి బయటకు రాగానే, ఆయన్ను అరెస్ట్ చేస్తారు - మంత్రి షేక్ రషీద్

    అవిశ్వాస తీర్మానం తరువాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తే, "వీళ్లు ఆయన్ను ఉపేక్షించరు. వెంటనే అరెస్టు చేస్తారు" అని పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ అన్నారు.

    స్థానిక ఛానల్ ఏఆర్‌వై న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడిందని అన్నారు.

    "ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడమే ఏకైక మార్గం. ఇమ్రాన్‌ ఖాన్‌ బయటకు రాగానే ఆయన్ను అరెస్టు చేస్తారు. వీళ్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఉపేక్షించరు" అని ఆయన అన్నారు.

    "ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించాలని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని" మంత్రి షేక్ రషీద్ అన్నారు.

    ఇస్లామాబాద్ కాలమానం ప్రకారం, ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభం కానుంది.

  17. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ శాంతియుతంగా జరిగేలా చూస్తాం - పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి

    ఫెడరల్ ప్రభుత్వం, పంజాబ్ గవర్నర్ చౌదరి మహ్మద్ సర్వర్‌ను పదవి నుంచి తొలగించిందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు.

    కొత్త గవర్నర్‌ను తరువాత ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం, పంజాబ్ డిప్యూటీ గవర్నర్‌ను తాత్కాలిక గవర్నర్‌గా నియమించారు.

    అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన్మంపై ఓటింగ్ శాంతియుతంగా జరిగేలా చూస్తామని మంత్రి ఫవాద్ చౌదరి హామీ ఇచ్చారు.

    "తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మధ్యతరగతి పార్టీ. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు హింసను ప్రేరేపిస్తారని ప్రత్యర్థి మీడియా సంస్థలు ప్రచారం చేయడం దిగ్భ్రాంతికరం" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    "అంతా రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. హింసకు తావు లేదు. సభ్య సమాజంలో నిరసన కూడా సవ్యంగానే ఉంటుంది. హింసాత్మక నిరసనలు జరుగుతాయనే వార్తలన్నీ ఫేక్ న్యూస్‌లే" అని ఆయన అన్నారు.

    రెడ్ జోన్‌లో పీటీఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.

    శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఈ కుట్రను తిప్పికొట్టాలని నిన్న ఇమ్రాన్ ఖాన్ ప్రజలను కోరారు.

  18. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు ముందు ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ప్రారంభం కానుంది. ముందు జాగ్రత్త చర్యగా రాజధాని ఇస్లామాబాద్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం మొత్తం 144 సెక్షన్ విధించారు.

    శాంతిభద్రతలను కాపాడడం కోసం అదనపు విధులపై వారిని పిలిపించినట్లు పోలీసులు చెప్పారు.

    "ప్రదర్శనలకు, సమావేశాలకు అనిమతి లేదని మాకు చెప్పారు" అని ఒక అధికారి తెలిపారు.

    ఇస్లామాబాద్ పోలీసులు, పంజాబ్ పోలీసులు, రేంజర్లు, ట్రాఫిక్ పోలీసులు నగరంలోని వివిధ ప్రదేశాలలో మోహరించి ఉన్నట్టు భద్రతా అధికారులు తెలిపారు.

    బని గాలాలోని ప్రధాని నివాసం వద్ద పరిస్థితి సాధారణంగానే ఉంది. అయితే, బని గాలా నుమంచి మెయిన్ మూరి రహదారికి ఎడమ వైపున, బారి ఇమామ్‌కు వెళ్లే మొదటి పాయింట్‌ను కంటైనర్‌తో బ్లాక్ చేశారు.

    ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి విధుల్లో ఉన్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

  19. ఆంధ్ర‌ప్రదేశ్‌‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య 26 జిల్లాలుగా మారుతాయి.

    కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, నరసాపురం, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్‌ జిల్లాలు అమలులోకి రానున్నాయి.

    ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి

  20. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్‌లోని ఒడెసా పోర్టులో భారీ పేలుళ్లు

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని ఒడెసా పోర్టులో భారీ పేలుళ్లు సంభవించినట్టు రిపోర్టులు వస్తున్నాయి.

    ఆదివారం ఉదయం ఈ నగరంలో పొగలు కనిపించాయని రాయిటర్స్ సాక్షి తెలిపారు.

    "ఒడెసా డౌన్‌టౌన్‌లో ఇప్పుడు భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. నా హోటల్ గది కిటికీ ఊగింది. ఎందుకనేది స్పష్టంగా తెలియలేదు" అంటూ వాషింగ్‌టన్ పోస్ట్ కరస్పాండెంట్ ఇసాబెల్లె ఖుర్షుద్యాన్ ట్వీట్ చేశారు. ఆమె ప్రస్తుతం ఒడెసాలో ఉన్నారు.

    నగరవాసులందరూ షెల్టర్లలోకి వెళ్లాలని ఒడెసా ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి సెర్హి బ్రాట్‌చుక్ కోరారు.

    "మనం దీన్ని జయిస్తాం. శత్రువులకు నరకమే" అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.