ఇప్పటివరకు ఏం జరిగింది?

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను ఆధీనంలోకి తీసుకొని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో విఫలమైన రష్యా.. ఇప్పుడు యుక్రెయిన్‌ను కొరియాలానే రెండు ముక్కలు చేయాలని భావిస్తోందని యుక్రెయిన్ సైన్యంలోని గూఢచర్య విభాగం అధిపతి కిరిలో బుదానోవ్ హెచ్చరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘‘కసాయి’’గా అభివర్ణించిన మరుసటి రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ దీనిపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో యుద్ధం మరింత తీవ్రమయ్యే ముప్పుందని అన్నారు.
మరోవైపు పుతిన్‌ను రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగకుండా చూడాలని రష్యన్లకు బైడెన్ పిలుపునిచ్చారు. అయితే, పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వాదనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ ఖండించారు.
రష్యాలో చేరే విషయంపై త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న ప్రాంతం లుహాన్స్క్ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.
అయితే, ఈ ప్రజాభిప్రాయ సేకరణ చెల్లదని యుక్రెయిన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.















