యుద్ధం తొలి దశ ముగిసిందన్న రష్యా.. యుక్రెయిన్ సరిహద్దుల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్

యూరప్ పర్యటనలోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ చేరుకున్నారు. పోలండ్‌లోని యుక్రెయిన్ సరిహద్దుల్లో శరణార్థులను బైడెన్ కలవబోతున్నారు. యుక్రెయిన్‌లో రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యాను బైడెన్ హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి, వరికూటి రామకృష్ణ

  1. టీఆర్‌ఎస్: ‘తెలంగాణ వాళ్లను నూకలు తినమంటూ అవమానించారు’

    టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దయాకర్ రావు

    ఫొటో సోర్స్, Dayakar Rao Errabelli/Facebook

    తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని, పైగా మమ్మల్ని నూకలు తినమంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ అవమానించారని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం కొనకపోయినా మేం కొంటామంటూ బీజేపీ నేతలు తెలంగాణ రైతుల చేత వరి వేయించారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు?

    రా రైస్, పారా బాయిల్డ్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ అంటూ కొర్రీలు వేయకుండా పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

    వరి వేయొద్దని కేసీఆర్ రైతులకు స్పష్టంగా చెప్పినా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి రైతులను వరి వేయమంటూ రెచ్చగొట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

  2. యుక్రెయిన్: ‘ఈయులో మమ్మల్ని వెంటనే చేర్చుకోండి’

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Ukraine President's Office

    యుక్రెయిన్ మీద రష్యా దాడిని అడ్డుకోవడంలో యూరప్ ఆలస్యంగా స్పందించిందని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు. యురోపియన్ యూనియన్ నేతలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    యుక్రెయిన్‌లో రష్యా పాల్పడ్డ విధ్వంసాన్ని వివరించిన జెలియెన్‌స్కీ, తమకు అండగా నిలిచినందుకు యూరప్‌కు ధన్యవాదాలు తెలిపారు.

    రష్యా మీద యూరప్ దేశాలు విధించిన ఆర్థికఆంక్షలు ప్రభావం చూపుతున్నా ముందుగానే ఈ పని చేసి ఉంటే రష్యా దాడికి దిగి ఉండేది కాదని ఆయన అన్నారు.

    ఈయూలో వెంటనే యుక్రెయిన్‌ను చేర్చుకోవాలని జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు.

  3. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

    అలాగే బీజేపీ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు.

    ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత మాయావతి వంటి వారికి కూడా ఆహ్వానాలు పంపారు.

    బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి రానున్నారు.

  4. బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్న చైనా విదేశాంగమంత్రి

    భారత ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, Narendra Modi/Facebook

    భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్‌తో సమావేశమవుతున్నారు.

    గురువారం దిల్లీకి చేరుకున్న వాంగ్ యి, భారత విదేశాంగశాఖమంత్రి జైశంకర్‌ను కూడా కలవనున్నారు. 2020 సరిహద్దు ఘర్షణల తరువాత చైనా టాప్ అఫిషయల్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

    సరిహద్దు వివాదాల మీద చర్చించడంతోపాటు ఈ ఏడాది చివర్లో చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని వాంగ్ యి ఆహ్వానించనున్నారు.

  5. రేపటి నుంచి ఐపీఎల్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022

    ఫొటో సోర్స్, IPL - Indian Premier League/Facebook

    రేపటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 మొదలవుతోంది. రేపు సాయంత్రం 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

    రవీంద్ర జడేజా కెప్టెన్సీలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. సీఎస్‌కేకు ఎన్నో టైటిల్స్ అందించిన మహేంద్రసింగ్ ధోని కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే.

  6. నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

    ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 0.22%, సెన్సెక్స్ 0.28% చొప్పున నష్టపోయాయి.

    నిఫ్టీ బ్యాంక్, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మెటల్, రియాల్టీ, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కొనుగోలు కనిపిస్తోంది.

  7. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

    బైకులో పెట్రోలు కొడుతున్న వ్యక్తి

    ఫొటో సోర్స్, Getty Images

    నేడు కూడా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగాయి. లీటరుకు 80 పైసలు చొప్పున పెంచారు. దీంతో ఇప్పటి వరకు ఇంధన ధరలు లీటరుకు రూ.2.40 పెరిగాయి.

    ఇలా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ పోతే ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం 6శాతానికి పైగా ఉన్న విషయం తెలిసిందే.

    మరోవైపు పోయిన ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ధరలు పెంచకుండా ఉండటం వల్ల హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం ఉమ్మడిగా సుమారు రూ.19,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు మూడీస్ వెల్లడించింది.

  8. యుక్రెయిన్: ‘రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలను అక్రమంగా నిర్బంధిస్తున్నారు’

    గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన జర్నలిస్ట్ విక్టోరియా రాస్‌చినా

    ఫొటో సోర్స్, Telegram

    ఫొటో క్యాప్షన్, ఇటీవల విడుదలైన జర్నలిస్ట్ విక్టోరియా రాస్‌చినా

    యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలను అక్రమంగా నిర్బంధించడంతోపాటు అపహరిస్తున్నారని, ఐక్యరాజ్యసమితి బీబీసీకి వెల్లడించింది.

    ప్రజలను నిర్బంధానికి సంబంధించి తాము సుమారు 36 కేసులను పరిశీలించి నిర్ధారించినట్లు యూఎన్ తెలిపింది. ఈ కేసుల్లో తమ వాళ్ల గురించి సంబంధిత కుటుంబాలకు సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరించారని వివరించింది.

    తాము ఆక్రమించుకున్న ప్రాంతాలపై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తున్న తరుణంలో... కిడ్నాపులు, బెదిరింపులు మరింత పెరగొచ్చనే భయంతో తమలో పెరుగుతున్నట్లు యుక్రెయిన్ ప్రజలు చెబుతున్నారు.

    రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో జర్నలిస్టుగా పని చేసే విక్టోరియా రాస్‌చినా‌ను మార్చి 15న గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.

    రష్యా ఇంటర్నల్ ఇంటెలిజెన్సీ సర్వీసుకు చెందిన వాళ్లే విక్టోరియా అపహరించినట్లు ఆమె పని చేసే పత్రిక ఆరోపించింది.

    ఆరు రోజుల తరువాత విక్టోరియాను వదిలి పెట్టారు. ఘర్షణలో భాగంగా ఆమెను కాపాడినట్లుగా చూపించి, ఆ వీడియోలను ప్రో రష్యా టెలిగ్రామ్ చానెల్స్‌లో ప్రచారం చేశారు.

  9. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక అంశాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.