యుక్రెయిన్‌కు మరింత సైనిక సాయం, సైబర్ మద్దతు: నాటో
యుక్రెయిన్‌కు మరింత సైనిక సరఫరాలు సాయంగా అందిస్తామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.
నాటో కూటమి నేతలు గురువారం బ్రసెల్స్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం స్టోల్టెన్‌బర్గ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ఈ తరంలో అతిపెద్ద భద్రతా ముప్పు అని అభివర్ణించారు. తమ స్వాతంత్ర్యం కోసం, భవిష్యత్తు కోసం యుక్రెయిన్ ఎంతో ధైర్యంగా పోరాడుతోందని ప్రశంసించారు.
‘‘వారికి మేం అండగా ఉన్నాం’’ అని చెప్పారు.
యుక్రెయిన్‌కు మరిన్ని సైనిక సరఫరాలను, సైబర్ రక్షణను అందిస్తామని ప్రకటించారు. దానితోపాటు.. అణ్వాయుధాలు, జీవాయుధాల ముప్పు నుంచి కూడా యుక్రెయిన్ తనను తాను రక్షించుకోవటానికి నాటో సాయం చేస్తుందన్నారు.
యుక్రెయిన్ మీద పుతిన్ దాడి భద్రతా వాతావరణాన్ని దీర్ఘకాలికంగా మార్చివేసిందని.. దీర్ఘకాలిక ప్రయాణానికి నాటో సంసిధ్దంగా ఉందని స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు.
నాటో కూటమి తూర్పు ప్రాంతంలో భూమి మీద అత్యధిక స్థాయి సంసిద్ధతతో మరిన్ని బలగాలను మోహరిస్తామని చెప్పారు. ఆకాశంలో మరిన్ని విమానాలను నిలుపుతామని, సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.