You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ జగన్: ‘ఏపీలో ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే’

ఆంధ్రప్రదేశ్‌లో ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లు తెచ్చింది గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం అనేక బ్రాండ్లకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేసిందని అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. ఇవాళ్టి ముఖ్యాంశాలు

    ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ అనేదే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే మద్యం ఉంది కానీ చీప్ లిక్కర్ లేదని అసెంబ్లీ వేదికగా తెలిపారు. తెలంగాణలో ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి.

    తెలంగాణ గిరిజన రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తప్పుదారి పట్టిస్తోందంటూ హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.

    సికింద్రాబాద్‌లోని బోయగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు.

    అత్యవసరం అనుకుంటే అణ్వాయుధాలు వాడుతామని రష్యా పేర్కొంది. అణ్వాయుధాలపై రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని అమెరికా పేర్కొంది.

    తూర్పు యూరప్‌లో తమ బలగాలను భారీగా పెంచడానికి నాటో ఆమోదం తెలుపుతుందని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు.

    నాటో సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యూరప్‌కు బయలుదేరారు.

    రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్‌లో తిండి నీరు లేక సుమారు లక్ష మంది ప్రజలు బాధపడుతున్నారని యుక్రెయిన్ తెలిపింది.

    రష్యా, యుక్రెయిన్ తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. RRR సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

    జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్‌ బుధవారం నాడు ట్విటర్‌లో ట్రెండయింది.

    ఈ సినిమా మార్చి 25వ తేదీన శుక్రవారం నాడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

    ట్విటర్‌లో #BoycottRRR ఎందుకు ట్రెండవుతోంది?

  3. యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల్లో చాలా మంది చిన్నారులు బలైపోతున్నారు.

    వారిని కాపాడుకోలేక తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో మునిగిపోతున్నారు.

    యుద్ధానికి బలైన కొందరు చిన్నారుల దుస్థితిపై బీబీసీ కథనం.

  4. తెలంగాణలో పెరగనున్న విద్యుత్ చార్జీలు

    తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి.

    ఇంటి వాడకానికి యూనిట్‌కి 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కి ఒక రూపాయి పెంచుకోవడానికి కరెంటు కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.

    అయితే వ్యవసాయ విద్యుత్ ధరలు పెరగలేదు.

    ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలవుతాయి.

    ప్రభుత్వ రంగంలోని తెలంగాణ విద్యుత్ సరఫరా కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ తమకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికిగానూ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని అనుమతి కోరాయి.

    కంపెనీలు ప్రతిపాదించిన మొత్తం కాకుండా కొంచెం తగ్గించి అనుమతులు ఇచ్చింది ఈఆర్సీ. రాబోయే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు 16వేల రెవెన్యూ గ్యాప్ వస్తుందని ప్రతిపాదించగా, 14 వేల 237 కోట్లను ఆమోదించింది ఈఆర్సీ.

    హైదరాబాద్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగా రావు ఈ వివరాలు వెల్లడించారు.

  5. వైఎస్ జగన్: ‘చంద్రబాబు హయాంలో 14 మద్యం కంపెనీలు వచ్చాయ్’

    ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ అనేదే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే మద్యం ఉంది కానీ చీప్ లిక్కర్ లేదని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

    2019లో తాము అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో 20 డిస్టలరీలున్నాయి. 1982కు ముందు ఉన్నది 5 కంపెనీలు మాత్రమే. ఆ తరువాత కొత్త కంపెనీలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. 2014-19 మధ్యలో 7 డిస్టిలరీలను తెచ్చారు.’ అని వైఎస్ జగన్ అన్నారు.

    ‘2019 తరువాత మద్యం పాలసీతో తాము ఎటువంటి మార్పులు చేయలేదు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెద్దపెద్ద లిక్కర్ కంపెనీలన్నీ జాతీయ ప్రమాణాల ఆధారంగా మద్యం తయారు చేస్తాయి. ప్రతి స్టేజ్‌లోనూ నాణ్యత మీద కంట్రోల్ ఉంటుంది. ప్రభుత్వం కూడా మద్యం మీద దాదాపు లక్షన్నర టెస్టులు చేసింది.

    బ్రాండ్ పేరు ముఖ్యం కాదు. లైసెన్స్ ఉన్న సంస్థల నుంచి నాణ్యత గల మద్యం వస్తుందా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది చూడాలి.’ అని జగన్ చెప్పుకొచ్చారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం బ్రాండ్లు అన్నీ గత చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నేడు ఊరుపేరు లేని బ్రాండ్లు అని చెబుతున్నవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చినవేనని జగన్ అన్నారు.

    బూంబూం బీర్, ప్రెసిడెన్స్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రొమనోవా, ఏసీబీ, 999లెజెండ్ వంటి 200 బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

    మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్నవన్నీ జగన్ బ్రాండ్లేనని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. కల్తీసారాను నియంత్రించలేకపోవడం వల్లే జంగారెడ్డి గూడెంలో చాలా మంది చనిపోయారని ఆరోపిస్తోంది.

  6. వైఎస్ జగన్: ‘ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ లేదు’

    ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్ అనేదే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే మద్యం ఉంది కానీ చీప్ లిక్కర్ లేదని అసెంబ్లీ వేదికగా తెలిపారు.

    నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం బ్రాండ్లు అన్నీ గత చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

    అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, జంగారెడ్డి గూడెం మరణాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నేడు ఊరుపేరు లేని బ్రాండ్లు అని చెబుతున్నవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చినవేనని జగన్ అన్నారు.

    బూంబూం బీర్, ప్రెసిడెన్స్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రొమనోవా, ఏసీబీ, 999లెజెండ్ వంటి 200 బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

  7. వైఎస్ జగన్: ‘చీప్ లిక్కర్ తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే’

    నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం బ్రాండ్లు అన్నీ గత చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, జంగారెడ్డి గూడెం మరణాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నేడు ఊరుపేరు లేని బ్రాండ్లు అని చెబుతున్నవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చినవేనని జగన్ అన్నారు.

  8. ‘హిందువుల ఉత్సవాల్లో ముస్లిం స్టాల్స్ వద్దు’

    కర్నాటకలో హిందూ దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని అడ్డుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వివరంగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించారు, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర.

    ‘దేవాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేయకుండా ముస్లిం వ్యాపారులను అడ్డుకుంటున్నారనే వార్తలను చూశా. ఆ విషయంపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా పోలీసులను అడిగా. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంద’ని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ అరగ జ్ఞానేంద్ర అన్నారు.

    కొన్ని సంవత్సరాలుగా కర్నాటకలో ఉత్సవాలు, పండుగల సందర్భంగా హిందూ దేవాలయాల వద్ద ముస్లింలు స్టాల్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.

    కానీ ఇటీవల ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేయకుండా కొన్ని హిందూ దేవాలయాల నిర్వాహకులు నిషేధించారు.

    విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా కర్నాటకలో చాలా మంది ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను బంద్ చేశారు. దీంతో పండుగలు, ఉత్సవాల సమయంలో స్టాల్స్ ఏర్పాటు చేయకుండా ముస్లిం వ్యాపారులను నిషేధించడం ప్రారంభించాయి హిందూ దేవాలయాల కమిటీలు.

    శివమొగ్గలో బాగా పేరుగాంచిన ‘కోటే మారికాంబ జాతర’లో హిందువులు మాత్రమే స్టాల్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది నిర్వాహక కమిటీ.

    ‘గతంలో అన్ని మతాల వారు స్టాల్స్ ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది హిందువులను మాత్రమే అందుకు అనుమతిస్తున్నామ’ని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన దీన్ దయాళ్ తెలిపారు.

    మరొకవైపు ముస్లిం వ్యాపారులను నిషేధించాలన్న నిర్ణయంలో తన పాత్ర ఏ మాత్రం లేదని మారికాంబ జాతర కమిటీ ప్రెసిడెంట్ కేఎస్ మారియప్ప అన్నారు.

    హిజాబ్ వివాదం నేపథ్యంలో అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక భజరంగ్ దళ్ నేత చెబుతున్నారు.

  9. తెలంగాణ గిరిజన రిజర్వేషన్ బిల్లుపై వివాదం

    తెలంగాణ గిరిజన రిజర్వేషన్ బిల్లు చుట్టూ వివాదం ముసురుకుంటోంది.

    ఎస్టీల రిజర్వేషన్ పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ తమకు ఎటువంటి ప్రతిపాదన పంపించలేదని కేంద్ర గిరిజనవ్యవహారాలశాఖ సహాయక మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్‌సభలో తెలిపారు.

    అయితే దీన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు.

    జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తయారు చేసి దాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిందని, బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత కేంద్రానికి పంపామని వారు తెలిపారు.

    బిల్లు తమకు చేరలేదంటూ లోక్‌సభను కేంద్ర మంత్రి తప్పుదారి పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు.

    ఇక బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వారు ప్రయత్నించారు.

    ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  10. హీరో మోటోకార్ప్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు

    బైకులు, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సీఎన్‌బీసీ-టీవీ18 వెల్లడించింది.

    పన్ను ఎగవేశారనే ఆరోపణలతో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్‌తోపాటు ఇతర ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు తయారు చేసే అతి పెద్ద కంపెనీల్లో హీరో మోటోకార్ప్ ఒకటి. దేశంలో సుమారు సగానికిపైగా మోటార్ సైకిల్ మార్కెట్ ఈ సంస్థ సొంతం.

    ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల్లో హీరో మోటోకార్ప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

    ఐటీ దాడుల వార్తలతో హీరో మోటోకార్ప్ షేరు ధర 1.70శాతం నష్టపోయింది.

  11. అమెరికా: ‘అణ్వాయుధాలపై రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం’

    అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. అణ్వాయుధాలున్న ఒక దేశం ఇలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని విమర్శించింది.

    రష్యా ఉనికికి ప్రమాదం కలిగితే తప్పకుండా తాము అణ్వాయుధాలు వాడతామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి అన్నారు. అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  12. పెరిగిన పెట్రోలు, వంట గ్యాస్ ధరలపై పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసన

    పెరిగిన పెట్రోలు ధరలు, వంట గ్యాస్ మీద పార్లమెంటులో ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. రాజ్యసభలో ఈ అంశం మీద చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పట్టుపట్టాయి. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించడం లేదు.

    ప్రతిపక్షాలు నిరసనలు ఆపకపోవడంతో రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

  13. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిడతలు వాయించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చిడతలు వాయించారు.

    వైసీపీకి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు చిడతలతో వాయించడం కనిపించింది.

    ఈ పరిణామంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని, ప్రతిష్టను తెలుగుదేశం సభ్యులు దిగజార్చుతున్నారని అన్నారు.

    అసెంబ్లీ బయటకు వెళ్లి చిడతలతో భజన చేసుకోవాలని స్పీకర్ టీడీపీకి సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ వైఖరి మీద తీవ్ర విమర్శలు చేశారు.

  14. ఆంధ్రప్రదేశ్: మహిళల రక్షణ కోసం దిశ పెట్రోలింగ్ వాహనాలు

    ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను పోలీసులు తీసుకొచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని ప్రారంభించారు.

    మొత్తం 163 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి. వీటిని జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేశారు.

    పట్టణాల్లో అయితే 4 నుంచి 5 నిమిషాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో అయితే 8 నుంచి 10 నిమిషాల్లో దిశ వెహికల్స్ వస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

    దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ.13.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

    మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని, ఇందుకోసం రూ.5.5 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

  15. ‘అత్యవసరమైతే అణ్వాయుధాలు వాడుతాం’

    రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్:

    • యుక్రెయిన్ మీద దాడిలో అణ్వాయుధాలు వాడే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి అన్నారు. సీఎన్‌ఎన్‌తో మాట్లాడిన ఆయన, రష్యాకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో తాము వాటిని వినియోగిస్తామని తెలిపారు.
    • అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. అణ్వాయుధాలున్న ఒక దేశం ఇలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని విమర్శించింది.
    • రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్‌లో సుమారు లక్ష మంది ప్రజలు తిండి, నీరు అందక ఇబ్బందులు పడుతున్నారని యుక్రెయిన్ తెలిపింది.
    • సుమారు 7వేల మందిని మరియుపూల్ నుంచి రక్షించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ప్రకటించారు.
  16. సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం...11 మంది మృతి

    సికింద్రాబాద్‌లోని బోయగూడలో గల ఒక గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగి, భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి.

    ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలుగా తెలుస్తోంది.

    ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశామని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. లోపల ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉందని చెప్పారు.

  17. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.