You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పశ్చిమ బెంగాల్‌లో హింస: ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది మృతి

పశ్చిమ బెంగాల్‌‌లోని బీర్భమ్ జిల్లా బగ్తుయ్ గ్రామంలో హింస చెలరేగి పలు ఇళ్లకు నిప్పు పెట్టగా ఎనిమిది మంది మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. రష్యాతో శాంతికి మధ్యవర్తిత్వం వహించే అంశాన్ని పరిశీలించాలని పోప్‌ను కోరానని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు.

    రష్యా సైన్యం యూరప్‌లోకి ప్రవేశించాలని అనుకుంటోందని ఇటలీ ఎంపీలను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడుతూ జెలియెన్‌స్కీ అన్నారు.

    మరియుపూల్, ఖార్కియెవ్‌ నగరాల్లో యుక్రెయిన్, రష్యా సైన్యాల మధ్య భీకర పోరాటం వల్ల కనీసం పది ఆస్పత్రులు పూర్తిగా ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.

    రష్యా దాడుల్లో 117 మంది చిన్నారులు చనిపోయారని యుక్రెయిన్ వెల్లడించింది.

    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నాయకుడి మృతితో హింస చెలరేగింది. పలు ఇళ్లకు నిప్పు పెట్టగా ఎనిమిది మంది చనిపోయారు.

    మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా గెలిచింది.

    యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. యుక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోతున్న రష్యా సైనికులు

    యుక్రెయిన్‌తో పుతిన్ తలపెట్టిన యుద్ధానికి వేలమంది సైనికులు మూల్యం చెల్లిస్తున్నారు.

    రష్యా పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఓ సైనికుడి అంత్యక్రియలకు హాజరయ్యారు బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్‌బర్గ్.

  3. పశ్చిమ బెంగాల్‌లో హింస: ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది మృతి

    పశ్చిమ బెంగాల్‌‌లోని బీర్భమ్ జిల్లా బగ్తుయ్ గ్రామంలో హింస చెలరేగి పలు ఇళ్లకు నిప్పు పెట్టగా ఎనిమిది మంది మృతి చెందారు. మొదట పది మంది మరణించారని వార్తలు వచ్చినా, ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు నిర్ధరించారు.

    బర్సోల్ గ్రామానికి చెందిన పంచాయితీ ఉపాధ్యక్షుడు, టీఎంసీ నాయకుడు బాద్‌షేక్‌‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం కాల్చి చంపారు.

    ఆ రోజు సాయంత్రం ఆయన మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

    బాద్‌షేక్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అదే సమయంలో హింస చెలరేగి, ఆందోళనకారులు పలు ఇళ్లకు నిప్పుపెట్టారు.

    మంగళవారం సాయంత్రం వరకు కూడా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

    ఈ వ్యవహారంలో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

    ఇటు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఘటనపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ పలువురు స్థానిక పోలీసుల అధికారులను విధుల నుంచి తప్పించింది.

    ఈ ఘటన తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ డిమాండ్ చేసింది.

    పశ్చిమబెంగాల్ రాష్ట్రపతి పాలన దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ అన్నారు.

    అయితే, ఇది స్థానికంగా జరిగిన గొడవని, దీనికి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదని టీఎంసీ నాయకుడు కుణాల్ ఘోష్ అన్నారు.

  4. పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య, ‘ఇంట్లోకి చొరబడి కాల్చి చంపేశారు’

    పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ సక్కర్ జిల్లాలో పూజ అనే 18 ఏళ్ల హిందూ యువతి హత్యకు గురైంది. ఈ హత్య తర్వాత సక్కర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    ''ఈ సంఘటన తర్వాత పూజ ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. ఇప్పుడు మా అందరి హృదయాలలో స్థానం సంపాదించుకుంది'' అని పూజ కుమారి సమీప బంధువు అజయ్ కుమార్ బీబీసీతో అన్నారు.

    తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారని, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హత్య చేశారని పూజ తండ్రి ఆది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  5. రష్యా దాడుల్లో 117 మంది చిన్నారులు చనిపోయారు: యుక్రెయిన్

    యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 117 మంది చిన్నారులు చనిపోయారని, మరో 155 మంది గాయపడ్డారని యుక్రెయిన్ ప్రాసిక్యుటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అత్యధిక శిశు మరణాలు సంభవించాయని తెలిపింది. కీయెవ్‌లో 58 మంది, ఖార్కియెవ్‌లో 40 మంది చిన్నారులు చనిపోయారని పేర్కొంది.

    మరియుపూల్‌లో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న బస్సులపై రష్యా దాడులు చేసిందని వివరించింది.

    548 స్కూల్ భవనాలు, ఇతర విద్యా సంస్థలపై బాంబులు వేశారని, వీటిలో 72 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని యుక్రెయిన్ ప్రాసిక్యుటర్ జనరల్ కార్యాలయం తెలిపింది.

  6. మహిళగా జీవనం, పాస్‌పోర్టులో పురుషునిగా గుర్తింపు

    యుక్రెయిన్ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తోన్న వందలాది మంది ట్రాన్స్‌జెండర్ మహిళలకు సరిహద్దుల వద్ద అనుమతి లభించకపోవడంతో నిరాశ ఎదురవుతోంది.

    90 శాతం మంది ట్రాన్స్ మహిళలు ఈ ప్రయత్నంలో విఫలమయ్యారని ఆ మహిళలకు దేశం వదిలి వెళ్లిపోవడంలో సహాయం చేసేందుకు ప్రయత్నించిన చారిటీలు బీబీసీతో చెప్పాయి.

    18-60 ఏళ్ల వయస్సున్న యుక్రెయిన్ పురుషులు దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదు. కానీ ఇప్పటికీ చాలామంది ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు, వారి పాత పేరు మునుపటి జెండర్‌నే కలిగి ఉంది. దీంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.

  7. పెట్రోలు రేట్లు పెంచడంతో లాభపడ్డ ఇంధన స్టాక్స్

    భారత్ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 197(1.16శాతం) పెరిగి 17,315 వద్ద ముగియగా సెన్సెక్స్ 696 పాయింట్లు పెరిగి 57,989 వద్ద ముగిసింది.

    రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.96%, ఎనర్జీ 1.70%, ఆటో 1.19% చొప్పున లాభపడ్డాయి. ఇక హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, ఫార్మా వంటి రంగాలు నష్టపోయాయి.

    రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ వంటి షేర్లు బాగా యాక్టివ్‌గా ట్రేడ్ అయ్యాయి.

    టాప్ గెయినర్స్:

    • టెక్ మహీంద్రా - రూ.1,538 (3.95%)
    • బీపీసీఎల్ – రూ.368 (3.14%)
    • రిలయన్స్ ఇండస్ట్రీస్ – రూ.2,531 (2.90%)
    • ఇండియన్ ఆయిల్ – రూ.120 (2.25%)

    టాప్ లూజర్స్:

    • హిందుస్థాన్ యూనిలీవర్ – రూ.1,993 (-2.81%)
    • నెస్లే – రూ.17,429 (-2.50%)
    • బ్రిటానియా – రూ.3,158 (-2.44%)
    • సిప్లా – రూ.1,032 (-1.69%)
    • దివీస్ ల్యాబ్స్ – రూ.4,448 (-0.17%)
  8. ‘రష్యాకు చెందిన 500కు పైగా యుద్ధ ట్యాంకులు ధ్వంసం’

    ఇప్పటి వరకు యుద్ధంలో 15,300 రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ ప్రకటించింది. ఈమేరకు యుక్రెయిన్ రక్షణశాఖ ట్వీట్ చేసింది.

    యుక్రెయిన్ రక్షణశాఖ చెబుతున్న ప్రకారం...

    • 15,300 మంది రష్యా సైనికులు చనిపోయారు
    • 509 ట్యాంకులు ధ్వంసమయ్యాయి
    • 1,556 ఆర్మర్డ్ పర్సనల్ వెహికల్స్ నాశనమయ్యాయి
    • 99 యుద్ధవిమానాలు, 123 హెలికాప్టర్లు కూలాయి
  9. యుక్రెయిన్: ‘ఖార్కివ్‌లో వెయ్యి భవనాల మీద రష్యా దాడులు’

    యుక్రెయిన్ ఈశాన్య భాగంలో ఉండే ఖార్కివ్ నగరం గురించి మరింత సమాచారం అందుతోంది. రష్యా బలగాల దాడుల్లో సుమారు వెయ్యి భవనాలు ధ్వంసం అయ్యాయని యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్(ఎస్‌ఈఎస్) తెలిపింది.

    చాలా వరకు ఈ భవనాలన్నీ ప్రజలు నివసించేవేనని ఎస్ఈఎస్ వెల్లడించింది.

    రష్యా సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖార్కివ్ నగరం మీద దాదాపు ఒక నెలగా దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు.

    ఇప్పటి వరకు ఖార్కివ్‌లో సుమారు 500 మంది పౌరులు చనిపోయినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

  10. ‘కరోనా సంక్షోభంతో భారత్‌లో పెరిగిన ఆరోగ్య బీమా పాలసీలు’

    భారత్‌లో కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. అలాగే కోవిడ్-19 వల్ల డెత్ క్లయిమ్స్ కూడా పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

    ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రకారం...

    • 2020-21ఆర్థికసంవత్సరంలో ఆరోగ్య బీమా పాలసీలు 28.5శాతం పెరిగాయి. 2021-22 ఏప్రిల్-జనవరిలో ఈ గ్రోత్ 25.9శాతంగా ఉంది.
    • ప్రతి మూడు ఆరోగ్య బీమా పాలసీలలో ఒక పాలసీని మహిళలు తీసుకున్నారు. 2020-21లో మహిళలు తీసుకున్న పాలసీలు 93 లక్షలు. మొత్తం ఆరోగ్య బీమా పాలసీల్లో మహిళల పాలసీల వాటా 33శాతానికి పెరిగింది.
    • మహిళలు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రైవేటు బీమా సంస్థల వాటా 27శాతం కాగా ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) వాటా 35శాతంగా ఉంది.
    • 2020-21లో జీవిత బీమా క్లయిమ్స్ 40.8శాతం పెరిగి రూ.41,958 కోట్లకు చేరాయి.
    • వ్యక్తిగత జీవిత బీమా విషయంలో 10.84 లక్షల క్లయిమ్స్‌కు రూ.26,422 కోట్లు చెల్లించారు. కరోనా సంక్షోభం వల్ల జీవిత బీమా క్లయిమ్స్ పెరిగినట్లుగా భావిస్తున్నారు.
    • ఆన్‌లైన్, వెబ్ అగ్రిగేటర్స్ ద్వారా అమ్ముడు పోయే బీమా పాలసీల సంఖ్య 1.6శాతంగా ఉంది. ఇక బ్యాంకుల ద్వారా అమ్ముడు పోయే పాలసీల సంఖ్య 29శాతానికి పెరిగింది.
  11. బ్రేకింగ్ న్యూస్, మహిళా క్రికెట్ ప్రపంచకప్: బంగ్లాదేశ్ మీద గెలిచిన భారత్

    విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద భారత్ గెలిచింది. 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే భారత్ ఆలవుట్ చేసింది.

    ఆరంభం నుంచే చేజింగ్‌లో బంగ్లాదేశ్ తడబడింది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే వికెట్లు పోగొట్టుకోగా టాప్ ఆర్డర్ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరింది.

    భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చాలా మంది బంగ్లాదేశ్ ప్లేయర్లు సింగిల్ డిజిట్‌ స్కోర్‌ను దాటలేక పోయారు.

    భారత్ బౌలర్లలో స్నేహా రాణా 4 వికెట్లు తీసింది. ఇక సీనియర్ బౌలర్ జూలన్ గోస్వామి 2 వికెట్లు పడగొట్టింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యాస్తిక భాటియా 50, షఫాలీ వర్మ 42, స్మృతి మంధన 30, పూజా వస్త్రారకర్ 30 పరుగులు చొప్పున కొట్టారు. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ఖాతా తెరవకుండానే అవుట్ అయింది.

    80 బంతులకు 50 పరుగులు చేసిన యాస్తిక భాటియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

  12. ‘రష్యా బలగాల వద్ద మందుగుండు సామాగ్రి అయిపోతోంది’

    రష్యా బలగాల వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి, ఆహారం అయిపోతున్నట్లు యుక్రెయిన్ తెలిపింది. నిల్వలు మూడు రోజుల కంటే ఎక్కువ రావని వెల్లడించింది.

    గడిచిన 24 గంటల్లో ఒక రష్యా విమానం, రెండు హెలికాప్టర్లు, ఆరు అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

    రష్యా చేసిన 13 దాడులను తమ బలగాలు తిప్పికొట్టడంతోపాటు 14 యుద్ధట్యాంకులు, 8 ఇన్‌ఫేంట్రీ ఫైటింగ్ వెహికల్స్, 2 మల్టీపర్పస్ వెహికల్స్‌ను నాశనం చేసినట్లు వెల్లడించింది.

  13. మహిళా క్రికెట్ ప్రపంచకప్: కష్టాల్లో బంగ్లాదేశ్... 6 వికెట్లకు 83 పరుగులు

    విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇండియా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. 230 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

    టాప్ ఆర్డర్ పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. ఆరంభంలో ఓపెనర్లు తడబడ్డారు. ఆ తరువాత వచ్చిన ప్లేయర్స్ ఎవరూ కూడా సింగిల్ డిజిట్‌ స్కోర్‌ను దాటలేక పోయారు.

    స్నేహ రాణా 2, జూలన్ గోస్వామి 1, పూనమ్ యాదవ్ 1, రాజేశ్వరి గైక్వాడ్ 1 చొప్పున వికెట్లు తీశారు.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యాస్తిక భాటియా 50, షఫాలీ వర్మ 42, స్మృతి మంధన 30, పూజా వస్త్రారకర్ 30 పరుగులు చొప్పున కొట్టారు. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ఖాతా తెరవకుండానే అవుట్ అయింది.

    ఇప్పటికే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, వరల్డ్ కప్‌లో కొనసాగాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి.

  14. ఫరూక్ అబ్దుల్లా : ‘కుట్ర చేసి కశ్మీర్ పండితులను వెళ్లగొట్టారు’

    కశ్మీర్ పండితుల విషయంలో కుట్ర జరిగిందని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆజ్‌తక్ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆయన, 1990లో కుట్ర చేసి కశ్మీరీ పండితులను కశ్మీర్ నుంచి బయటకు వెళ్లగొట్టారని అబ్దుల్లా ఆరోపించారు. ఎవరు కుట్ర చేశారో ఎందుకు చేశారో తెలియాలంటే ఒక కమిషన్ వేయాలని కోరారు.

  15. గడిచిన 24 గంటల్లో 33 కరోనా మరణాలు

    గడిచిన 24 గంటల్లో 1,581 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 33 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నెల 19న 2,075, 20న 1,761, 21న 1,549 కొత్త కేసులు నమోదయ్యాయి.

    అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 23,913కు తగ్గాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో (43,010,971) ఇది 0.06శాతం.

    ఇక ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,16,510కి చేరింది.

  16. పేకాట ఆడుతూ పట్టుబడ్డ బాలకృష్ణ పీఏ, వైసీపీ నాయకులు, తులసి ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం..

    ఆంధ్రప్రదేశ్-కర్నాటక సరిహద్దుల్లో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపురం రూరల్ వైసీపీ కన్వీనర్ శ్రీరామిరెడ్డి ఉన్నారు.

    వీరితో పాటు అరెస్టు అయిన వారిలో వైసీపీ, టీడీపీ పార్టీల వారు, వ్యాపారులు ఉన్నారు. ఈమేరకు కర్నాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    చిక్ బళ్లాపుర్ జిల్లాలోని నగరగేరేలో ఆంధ్రా ప్రాంత నాయకులు పేకాట ఆడుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో రూ.1.56 లక్షల నగదు, 7 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  17. నాలుగు నెలల తరువాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

    సుమారు నాలుగు నెలల తరువాత దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం నుంచి లీటరుకు 80 పైసలు అదనంగా చెల్లించాలి.

    కొత్త ధరల ప్రకారం విజయవాడలో లీటరు పెట్రోలు రూ.110.80, డీజిల్ రూ.96.83గా ఉంది.

    అలాగే వంట గ్యాసు మీద సిలీండరుకు రూ.50 చొప్పున పెంచారు. దీంతో 14.2 కేజీల సిలీండర్ ధర రూ.949.50 చేరింది. ఇప్పటికే బల్క్‌లో కొనే డీజిల్‌పై లీటరుకు రూ.25 చొప్పున పెంచారు.

    2021 నవంబరు తరువాత పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నవంబరు నుంచి ఇంధన ధరలు పెరగలేదు.

  18. మహిళా క్రికెట్ ప్రపంచకప్: 50 ఓవర్లకు 229 పరుగులు చేసిన ఇండియా... బంగ్లాదేశ్ టార్గెట్ 230

    విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇండియా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 7 వికెట్లకు 229 పరుగులు చేసింది.

    యాస్తిక భాటియా 50, షఫాలీ వర్మ 42, స్మృతి మంధన 30, పూజా వస్త్రారకర్ 30 పరుగులు చొప్పున కొట్టారు. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ఖాతా తెరవకుండానే అవుట్ అయింది.

    ఇప్పటికే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, వరల్డ్ కప్‌లో కొనసాగాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి.

  19. మహిళా ప్రపంచకప్: 6 వికెట్లకు 203 పరుగులు చేసిన ఇండియా

    విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఇండియా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఆరు వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇప్పటి వరకు 47 ఓవర్లు అయిపోయాయి.

    యాస్తిక భాటియా 50, షఫాలీ వర్మ 42, స్మృతి మంధన 30 పరుగులు తీశారు. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ఖాతా తెరవకుండానే అవుట్ అయింది.

  20. యుక్రెయిన్: ‘మాకు బయటి నుంచి తిండి దొరక్కుండా చేస్తున్న రష్యా’

    మరియుపూల్ ప్రజలను ఆకలితో మాడ్చి వారు లొంగిపోయేలా చేసేందుకు రష్యా భావిస్తోందని యుక్రెయిన్‌కు చెందిన ఒక పార్లమెంటు మెంబర్ ఆరోపించారు.

    ‘హుమానిటేరియన్ కారిడార్స్‌ను రష్యా తెరవడం లేదు. బయటి నుంచి వచ్చే సాయాన్ని లోపలకు వారు అనుమతించడం లేదు. మరియుపూల్ నగరం ఆకలితో అలమటించాలనేది రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది.’ అని దిమిత్రో గురిన్ అన్నారు.

    మరియుపూల్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. ఆ నగరంలో సుమారు 3 లక్షల మంది ప్రజలు చిక్కుకొని పోయినట్లు అంచనా. ఒకవైపు నిత్యావసరాలు అయిపోతూ ఉండగా ప్రజలకు బయటి నుంచి సాయం అందకుండా రష్యా అడ్డుకుంటోందనే వార్తలు వస్తున్నాయి.

    కొద్ది రోజులుగా రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే తీవ్ర విద్యుత్, నీటి కొరతను ప్రజలు చవి చూస్తున్నారు.

    హుమానిటేరియన్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు మరియుపూల్‌లోని యుక్రెయిన్ బలగాలు ఆయుధాలు దించాలని రష్యా కోరింది. అయితే ఇందుకు యుక్రెయిన్ అంగీకరించలేదు.