మరియుపూల్‌లో పౌరులు తలదాచుకున్న థియేటర్‌పై రష్యా బాంబు దాడులు, అందులో 1,200 మంది వరకు ఉండవచ్చన్న మేయర్
బాంబుదాడుల నుంచి రక్షణ కోసం మరియుపూల్‌లో సాధారణ పౌరులు తలదాచుకున్న థియేటర్‌పై రష్యా ఉద్దేశపూర్వకంగా బాంబుదాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆరోపించారు. అది నిజం కాదని, తాము దాడులు చేయలేదని రష్యా అంటోంది.
లైవ్ కవరేజీ
సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ
తెలంగాణ: బీజేపీ ఎమ్మెల్యేల ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’
అసెంబ్లీ నుంచి తమను బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు నేడు దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఇందిర పార్క్ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ పేరుతో నిరసన చేపట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు.
ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్, డీకే అరుణ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ వంటి ఈ దీక్షలో పాల్గొన్నారు.
అసెంబ్లీ నుంచి బహిష్కరించడాన్ని బీజేపీ శాసనసభ్యులు హై కోర్టులో సవాల్ చేశారు. అయితే అనుమతించే అంశాన్ని పరిశీలించమని స్పీకర్‌కు సూచించింది హైకోర్టు. కానీ స్పీకర్ ఆ సూచనను తిరస్కరించారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు దీక్ష చేపట్టారు.
కాంగ్రెస్: సోనియా గాంధీ సీనియర్లను ఓ చూపు చూస్తారా?
ఫొటో సోర్స్, Getty Images
ఇది 2014 లోక్‌సభ ఎన్నికల నాటి సంగతి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్ ఓటమి పాలు కావడానికి ఏడాది ముందు జరిగిన ఘటన. పార్టీ వర్కింగ్ స్టైల్ మార్చాలని రాహుల్ గాంధీ భావించారు.
లోక్‌సభ అభ్యర్ధుల ఎంపిక కోసం 16 నియోజక వర్గాలలోని కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అందులో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పోటీ చేసే చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం కూడా ఒకటి.
ఈ విషయం తెలిసి కపిల్ సిబల్ వెంటనే రాహుల్-సోనియా-ప్రియాంక వద్దకు పరిగెత్తారు. ఆ జాబితా నుంచి తన సీటు పేరును తొలగించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు అదే కపిల్ సిబల్ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండగా, రాహుల్ గాంధీని అసలు నాయకుడిగా కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారు. మరి సోనియా గాంధీ సీనియర్లను ఓ చూపు చూస్తారా? పార్టీలో జీ23 నేతల పనేంటి?
కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని మరింత జాగ్రత్తగా ఉండాలని దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సుమారు ఒక నెల నుంచి పెద్దగా పెరగని కరోనా కేసులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి.
చాలా వేగంగా వ్యాపించగల ఒమిక్రాన్ వేరియంట్‌తోపాట ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
కొన్ని దేశాల్లో టెస్టుల సంఖ్య తగ్గినప్పటికీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఈ తీరును చూస్తుంటే పైకి కనిపిస్తున్న దానికంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు.
రష్యా, అమెరికా మధ్య దెబ్బతింటున్న దౌత్య సంబంధాలు, ఆంథోని జర్చర్, బీబీసీ నార్త్ అమెరికా రిపోర్టర్
ఫొటో సోర్స్, Getty Images
రష్యా, యుక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు మరింతగా దెబ్బతింటున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరస్థునిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలవడం మరింత వివాదానికి దారి తీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్న ఆ మాటలను రష్యా అంత తేలికగా మరచిపోకపోవచ్చు. రష్యా మాటల్లో చెప్పాలంటే అవి క్షమించలేని వ్యాఖ్యలు.
అంతేకాదు రష్యాతో దౌత్యసంబంధాలను ముందుకు తీసుకుపోవడం, దానితో కలిసి పని చేయడం జో బైడెన్ ప్రభుత్వానికి ఇకపై కష్టంగా మారుతుంది.
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ఇండియన్ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 1.29శాతం, సెన్సెక్స్ 1.37శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 680 పాయింట్లు పెరిగి 36428 వద్ద ట్రేడ్ అవుతోంది.
బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలు పెరిగాయి. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1.83శాతం పెరిగి 99.85 డాలర్ల వద్ద ఉంది.
జపాన్‌లో భారీ భూకంపం... ఇద్దరు మృతి
ఫొటో సోర్స్, Getty Images
బుధవారం రాత్రి జపాన్‌లో శక్తిమంతమైన భూకంపం వచ్చింది. ఈశాన్య జపాన్‌లో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా సుమారు 90 మంది గాయపడ్డారు. 20 లక్షల ఇళ్లకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
జపాన్ రాజధాని టోక్యోలో ప్రజలు నిలబడటం కూడా కష్టంగా మారినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ చెబుతోంది. ఫుకుషిమాలో ఒక బుల్లెట్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే ఆపరేటర్లు తెలిపారు.
రష్యా టెర్రరిస్ట్ దేశంగా మారింది- జెలియెన్‌స్కీ
ఫొటో సోర్స్, Getty Images
రష్యా ఒక టెర్రరిస్ట్ దేశంగా మారిందనే విషయాన్ని ప్రపంచం
అధికారికంగా గుర్తించాలని ఒక వీడియో సందేశంలో కోరారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్
జెలియెన్‌స్కీ.
రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాలని, యుక్రెయిన్‌కు
మరిన్ని ఆయుధాలు అందించాలని, తమ దేశాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రష్యాతో జరిగే ఏ చర్చలైనా విజయవంతం కావడానికి తమ
దేశానికి నిజమైన రక్షణ అవసరమని యుక్రెయిన్ నేత అన్నారు.
‘చర్చల్లో నా ప్రాధాన్యతలు
చాలా స్పష్టంగా ఉన్నాయి. యుద్ధం ముగించాలి. భద్రతా హామీలు, సౌర్వభౌమాధికారం, ప్రాదేశిక
సమగ్రతను పునరుద్ధరించడం, మా దేశానికి అసలైన భరోసా, అసలైన రక్షణ ఇవ్వడమే తన లక్ష్యాల’ని జెలియెన్‌స్కీ చెప్పుకొచ్చారు.
యుక్రెయిన్ మీద కొనసాగుతున్న రష్యా దాడులు
ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్, రష్యా మధ్య ఏయే
ప్రాంతాల్లో యుద్ధం జరుగుతోందో డిఫెన్స్ థింక్‌టాంక్ ద రాయల్ యునైటెడ్ సర్వీసెస్
ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ ఫెలో జస్టిన్ బ్రోంక్ బీబీసీ టుడే ప్రోగ్రాంలో చెప్పారు.
కీయెవ్
మధ్య కీయెవ్‌లో రష్యా ఇప్పటికీ
క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నారు. కీయెవ్ ఉత్తర శివార్లలో భీకర
యుద్ధం కొనసాగుతోంది. కానీ, రష్యా సైనిక సామర్థ్యం పరిమితంగా ఉంది.
రష్యా ఆర్మీ సింగిల్ బెటాలియన్
ద్వారా చిన్న చిన్న దాడులు చేస్తోంది. దీంతో అది మరింత ముందుకు వెళ్లడానికి వీలు
కావడం లేదు.
బ్రోంక్ వివరాల ప్రకారం రష్యా
ప్రస్తుతం కీయెవ్ సిటీ సెంటర్‌ను చేజిక్కించుకునే స్థితిలో లేదు. రష్యా ఆర్మీ దగ్గర
ప్రస్తుతం పోరాడ్డానికి ఉన్న బలగాలతో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
అయితే, కాల్పుల విరమణ చర్చల్లో
యుక్రెయిన్ మీద ఆధిపత్యం సాధించడానికి కీయెవ్ మీద తమ ఒత్తిడి పెంచడాన్ని రష్యా
కొనసాగిస్తోంది.
ఒడెసా(దక్షిణం)
మంగళవారం రష్యా నావికాదళం మరింత
ముందుకెళ్లి రేవు నగరం ఒడెసాపై భీకరంగా బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత
వెనక్కు వెళ్లింది. కానీ, బుధవారం అది మరోసారి నగరానికి దగ్గరగా వచ్చింది.
ఒడెసాపై రష్యా పూర్తి సామర్థ్యంతో
దాడులు జరిగితే యుక్రెయిన్‌కు ముప్పు ముంచుకురావచ్చు. కానీ, నావికాదళానికి సాయం అందించాల్సిన
పదాతి దళం దానికి చాలా దూరంలో ఉండడంతో రష్యా ఇప్పటికీ అలాంటి దాడులు చేసే స్థితిలో
లేదు.
మికొలేవ్ నగరంలో యుక్రెయిన్
సైన్యం నుంచి రష్యా ఆర్మీకి తీవ్ర సవాలు ఎదురవుతోంది. అది ఒడెసా మీద సముద్రంలోంచి దాడులు
చేస్తే, యుక్రెయిన్ సైన్యానికి భారీ నష్టం కలగవచ్చు. రష్యా ఇప్పుడు అలా దాడులు
చేస్తుందా లేదా చూడాలి.
దోన్బస్(తూర్పు)
రష్యా ఆక్రమణలో ఉన్న లుహాన్స్క్
చుట్టుపక్కల భీకర పోరు కొనసాగుతోంది. రష్యా సైన్యం ఇక్కడ నుంచి పశ్చిమ ప్రాంతంలోని
నిప్రో వైపు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
అది దక్షిణాన తమ సైన్యంతో కాంటాక్ట్
కొనసాగించడానికి ఈ చర్యలు చేపడుతోంది.
అది ఇందులో సఫలమైతే, దోన్బస్‌లో
రష్యా దళాలు యుక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కి స్వాగతం
యుక్రెయిన్ మీద రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.
మరియుపూల్‌లో నగరంలోని సెంట్రల్ మార్కెట్ బాంబు దాడులతో దద్దరిల్లింది.
గురువారం వెయ్యి నుంచి 1200 మందికి ఆశ్రయం అందిస్తున్న ఒక థియేటర్‌పై బాంబు
దాడులు జరిగినట్లు నగర మేయర్ చెప్పారు.
యుక్రెయిన్‌కు అమెరికా వంద కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. ఈ
సాయంలో భాగంగా ఆదేశానికి వంద కిల్లర్ డ్రోన్స్ అందించనుంది.
యుక్రెయిన్ యుద్ధంతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన, జాతీయ,
అంతర్జాతీయ వార్తల కోసం ఈ లైవ్ పేజ్ చూస్తూ ఉండండి.