యుక్రెయిన్: మరియుపూల్‌లోని ప్రసూతి, పిల్లల ఆస్పత్రిపై రష్యా బాంబు దాడి

యుక్రెయిన్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వలసపోతున్నారని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో వీడియో ప్రసంగం చేస్తూ, "మేం వీధుల్లో, అడవుల్లో, తీర ప్రాంతాల్లో అంతటా పోరాడుతాం" అని ప్రకటించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. యుక్రెయిన్ లో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలివి:

    రష్యా చమురు, గ్యాస్ దిగుమతులను నిషేధించినట్లు అమెరికా ప్రకటించింది. యూరోప్ కూడా 2022 చివరి నాటికి రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులను క్రమేపీ తగ్గించాలని చూస్తోంది. యూరోప్ అత్యధికంగా ఇంధన సరఫరా కోసం రష్యా పై ఆధారపడుతుంది.

    ఇందుకు స్పందనగా రష్యా కూడా తమ దేశం నుంచి ఎగుమమతయ్యే కొన్ని రకాల సరుకులు, ముడి పదార్ధాల ఎగుమతులను నిషేధించింది. యూరోప్ కు చేసే ఇంధన సరఫరాలో కోతలు విధిస్తామని బెదిరించింది.

    జర్మనీలో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ కు పంపేందుకు ఫైటర్ జెట్లు సిద్ధంగా ఉన్నట్లు పోలండ్ తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదన చేసే ముందు తమను సంప్రదించలేదంటూ అమెరికా ఈ ఆఫర్ తిరస్కరించింది. ఇది సాధ్యమయ్యే పని కాదని అంది.

    మెక్ డోనల్డ్స్, స్టార్ బక్స్, కోకో-కోలా, పెప్సీ లాంటి సంస్థలు రష్యా నుంచి తమ కార్యకలాపాలను ఆపేయాలని ప్రకటించే దిశలో ఉన్నాయి.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ యూకే హౌస్ ఆఫ్ కామన్స్ ను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేశారు.

    యుక్రెయిన్ పై ఆక్రమణ మొదలైనప్పటి నుంచి 20లక్షల మందికి పైగా యుక్రెయిన్ వదిలిపెట్టి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది.

  2. 'మేం వీధుల్లో, అడవుల్లో, తీర ప్రాంతాల్లో... అంతటా పోరాడుతాం' -జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ మంగళవారం రాత్రి బ్రిటన్ పార్లమెంటులో వీడియో ప్రసంగం చేశారు. బ్రిటన్ చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఆ దేశ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ను గుర్తుచేసుకున్నారు.

    "మేం వీధుల్లో, మైదానాల్లో, అడవుల్లో, తీర ప్రాంతాల్లో అంతటా యుద్ధం చేస్తాం" అని జెలియెన్‌స్కీ అన్నారు.

    ప్రతి రోజూ యుద్దం ఎలా జరుగుతోందో ఆయన బ్రిటన్ పార్లమెంటుకు వివరించారు. యుక్రెయిన్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది, వెనక్కి తగ్గదని ఆయన ప్రకటించారు.

    జెలియెన్‌స్కీ ప్రసంగానికి పార్లమెంటు సభ్యులు లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు.

  3. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై బీబీసీ లైవ్ పేజికి స్వాగతం

    యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 14వ రోజుకు చేరుకుంది.

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో వీడియో ప్రసంగం చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ను గుర్తు చేస్తూ ఆయన, "మేం వీధుల్లో, అడవుల్లో, మైదానాల్లో, తీర ప్రాంతాల్లో పోరాడుతాం" అని ప్రకటించారు.

    అంతకుముందు, రష్యా నుంచి చమురు దిగుమతులను 2022 చివరికల్లా రద్దు చేస్తామని బ్రిటన్ ప్రకటించింది.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.