యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి నేటికి 14 రోజులు.. ఈనాటి ముఖ్యాంశాలు ఇవి
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి నేటికి 14 రోజులు.
ఈరోజు ముఖ్యాంశాలు మరోసారి..
- యుక్రెయిన్‌లోని మరియుపూల్ నగరంలో పిల్లల ఆస్పత్రిని రష్యా ధ్వంసం చేసిందని సిటీ కౌన్సిల్ తెలిపింది. "రష్యా దళాలు ఆస్పత్రిపై చాలా బాంబులు వేశాయి. ఆస్పత్రి భవనం ఘోరంగా దెబ్బతింది" అని యుక్రెయిన్ అధికారులు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.
- యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపబోమని జర్మనీ తెలిపింది. జర్మనీ, ఆయుధాలు సహా "అన్ని రకాల రక్షణ సామగ్రిని అందించిందని, యుద్ధ విమానాలు అందులో భాగం కాదు" అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తెలిపారు.
- చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంటుకు అత్యవసరంగా మరమత్తులు చేయించాలని, అందుకు కాల్పుల విరమణ అవసరమని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.
- సుమీ నుండి బయలుదేరిన మొదటి కాన్వాయ్‌లో చాలావరకు భారతదేశానికి చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారు. సుమీ నుంచి తరలింపు ప్రక్రియ విజయవంతమైందని, అన్ని బస్సులూ సురక్షితంగా సుమీ నుంచి తరలివెళ్లాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
- భారత అధికారులు ఒక పాకిస్తానీ విద్యార్థికి కూడా యుక్రెయిన్ నుంచి తరలివెళ్లేందుకు సహాయం చేశారు. ఆమె భారత రాయబారులకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
- యుక్రెయిన్ నగరం సుమీలో ప్రజలను తరలించే పని విజయవంతంగా పూర్తయినట్లు కీయెవ్ ప్రకటించింది. పలు నగరాల్లో 12 గంటల పాటు కాల్పుల విరమణకు రష్యా అంగీకరించినట్లు యుక్రెయిన్ డిప్యూటీ పీఎం చెప్పారు. దీంతో ఆరు నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
- రష్యా చేసిన దాడుల్లో సోమవారమే 22 మంది మరణించగా, అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు. యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
- తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో నెలకొన్న వేర్పాటువాదులపై యుక్రెయిన్ దాడి చేయనున్నట్లు నిరూపించే రహస్య పత్రాలు లభించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో మాట్లాడుతూ, 'మేం వీధుల్లో, మైదానాల్లో, అడవుల్లో, సముద్ర తీరాల్లో అన్ని చోట్లా పోరాడుతాం' అని ప్రకటించారు.
ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.













