రష్యా చమురును బహిష్కరించాలన్న జెలియెన్‌స్కీ.. ఆ ఊసెత్తని ఈయూ

రష్యా నుంచి దిగుమతులను బహిష్కరించాలని, ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు, చమురు ఉత్పత్తులను తిరస్కరించాలని జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు. యుక్రెయిన్ మీద దండయాత్రను రష్యా విరమించుకోలేదని, కాబట్టి రష్యా మీద కఠినమైన కొత్త ఆంక్షలను విధించాల్సిన అవసరముందని చెప్పారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. మీకు సమాధి కంటే ప్రశాంతమైన స్థలం లేదు - యుక్రెయిన్ అధ్యక్షుడు

    వొలదిమీర్ జెలియెన్క్సీ

    ఫొటో సోర్స్, Volodymyr Zelensky's office

    కీయెవ్ భూభాగంలో యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యా సైనికులను సమాధికి పంపేవరకూ యుక్రెయిన్ సేనలు విశ్రమించబోవని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ హెచ్చరించారు.

    ఆయన ఆదివారం రాత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మాస్కో సైన్యానికి హెచ్చరికలు చేశారు.

    తమ దేశం పై దాడి చేస్తూ ఉద్దేశపూర్వకంగా చేసే హత్యలకు శిక్ష ఎదుర్కొనే రోజును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    "యుక్రెయిన్ లో ఎన్ని కుటుంబాలు మరణించి ఉంటాయి? మేం క్షమించేది లేదు. మేము మర్చిపోం. మా భూభాగం పై యుద్ధంలో అకృత్యాలకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తాం" అని జెలియెన్క్సీ అన్నారు.

    "మీకు ఈ భూమిపై సమాధి కంటే ప్రశాంతమైన ప్రదేశం మరొకటి లేదు" అని అన్నారు.

    "ఇప్పటి వరకు రష్యా సేనలు పాల్పడిన అకృత్యాలు చాలినట్లు లేవు. ఇప్పటివరకు నాశనం చేసిన జీవితాలు సరిపోవా? జీవితాలను చిన్నాభిన్నం చేశారు. ఇంకా చాలా మందిని చంపాలని అనుకుంటున్నారు".

    మాస్కోకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని జెలియెన్క్సీ పశ్చిమ దేశాలను కోరారు. రష్యా తీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఆ దేశంపై విధించిన ఆంక్షలు వారికి ఇంకా సరిపోయినట్లు లేవని అన్నారు.

  2. రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 12వ రోజుకు చేరుకుంది.

    15 లక్షల మంది ప్రజలు యుక్రెయిన్ నుంచి ఇరుగుపొరుగునున్న దేశాలకు వెళ్లారని యూఎన్ పేర్కొంది.

    రష్యాలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేపట్టిన సుమారు 2వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.

    మాస్కో డిమాండ్లు నెరవేరే వరకు యుక్రెయిన్‌పై సైనిక చర్య ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.