యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా దాడులు

యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులను ప్రయోగిస్తోంది. సిటీ కౌన్సిల్ భవనంపై క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని ఖార్కియెవ్‌ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: కర్ణాటక సీఎం

    యుక్రెయిన్‌లో చనిపోయిన కర్ణాటక విద్యార్థి నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు.

    నవీన్ మృతదేహం ఫొటోను ఆయన మిత్రులు యుక్రెయిన్ నుంచి పంపించారని, ఆ ఫొటోను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించామని ఆయన చెప్పారు.

    యుక్రెయిన్ రాయబార కార్యాలయ అధికారులతోనూ సంప్రదిస్తున్నామని బొమ్మై చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. బ్రేకింగ్ న్యూస్, ఖెర్సాన్ ఇప్పుడు మా అధీనంలో ఉంది: రష్యా

    రష్యా సేనలు

    ఫొటో సోర్స్, Reuters

    దక్షిణ యుక్రెయిన్‌లోని ఖెర్సాన్ నగరం మొత్తం తమ అధీనంలోకి వచ్చిందని రష్యా ప్రకటించుకుంది.

    ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    కాగా ఇంతకుముందే యుక్రెయిన్ వర్గాలు కూడా నగరంలోని చాలా ప్రాంతాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని ప్రకటించాయి.

    రైల్వే స్టేషన్, ఓడరేవులను మంగళవారం రాత్రి రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్నాయని ఖెర్సాన్ మేయర్ ఇగోర్ ఖొలికయేవ్ తెలిపారు.

    5 లక్షల జనాభా ఉన్న ఖెర్సాన్‌లో అనేక మంది యుక్రెయిన్ సైనికులతో పాటు పౌరులూ ప్రాణాలు కోల్పోయినట్లు మేయర్ చెప్పారు.

  3. పుతిన్ అంత బలమైన నేతగా ఎలా ఎదిగారు?

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వారం రోజులుగా దాడులు కొనసాగిస్తున్నారు.

    రాజధాని కీయెవ్‌ను అధీనంలోకి తీసుకునేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని అక్కడికి తరలిస్తున్నారు పుతిన్.

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోనే వివిధ నగరాలను ఇప్పటికే రష్యా సైన్యం తన అధీనంలోకి తీసుకుంది.

    యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి 6,50,000 మందికిపైగా ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోయారు.

    ఇంతకీ సుదీర్ఘ కాలంగా రష్యాను పాలిస్తున్న పుతిన్ నేపథ్యం ఏమిటి?

    అంత బలమైన నేతగా ఆయన ఎలా ఎదిగారు?

    పూర్తి వివరాలు ఈ వీడియోలో...

    వీడియో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్: ఒకప్పటి గూఢచారి.. ప్రపంచనేతగా ఎలా ఎదిగారు?
  4. యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?

    పుతిన్, మోదీ

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ విషయంలో అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యాతో సంబంధాలలో సమతౌల్యతను కొనసాగించడంలో ఇండియా తీవ్రమైన పరీక్షను ఎదుర్కుంటోంది.

    ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో ఈ అంశంపై దిల్లీ చేసిన మొదటి ప్రకటనలో నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించలేదు. అయితే దౌత్యానికి, చర్చలకు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన పిలుపులను పట్టించుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.

    రష్యాపై పరోక్షంగా చేసిన విమర్శ అంతటితోనే ఆగిపోయింది. యుక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యుఎన్ఎస్‌సి) ముసాయిదా తీర్మానంపై ఓటు వేయడానికి ముందు, సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీకి అటు రష్యా, యుక్రెయిన్, ఇటు అమెరికాల నుంచి కాల్స్ వచ్చాయి.

    సరైన నిర్ణయం తీసుకోవాలంటూ యుక్రెయిన్, రష్యాలు బహిరంగంగానే ఇండియాకు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఇండియా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, దాని ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని పరోక్షంగా మాస్కోను కోరినట్లు అర్ధమవుతుంది.

    ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలకు గౌరవం ఇవ్వడం గురించి ఇండియా తన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించింది.

  5. యుక్రెయిన్ శరణార్థులకు ఉచితంగా లక్ష విమాన టికెట్‌లు

    చౌకధరలకు విమాన టికెట్లు ఆఫర్ చేసే యూరోపియన్ ఎయిర్‌లైన్స్ ‘విజ్ ఎయిర్’ యుక్రెయిన్ శరణార్థుల కోసం ఉచితంగా లక్ష టికెట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.

    యుక్రెయిన్ శరణార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా సహకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హంగరీకి చెందిన ఈ విమానయాన సంస్థ ప్రకటించింది.

    మార్చి నెలలో పోలాండ్, స్లొవేకియా, హంగరీ, రొమేనియా నుంచి బయలుదేరే విజ్ ఎయిర్ విమానాలలో ఈ ఉచిత టికెట్లు అందుబాటులో ఉంటాయి.

    ఐరాస అంచనాల ప్రకారం ఇప్పటికే యుక్రెయిన్ నుంచి 6.6 లక్షల మంది పొరుగు దేశాలకు తరలిపోయారు. వీరిలో ఎక్కువ మంది శరణార్థులు పోలండ్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

    తమ దేశానికి 4,50,000 మంది యుక్రెయిన్ శరణార్థులు వచ్చారని పోలాండ్ మంత్రి ఒకరు అక్కడి ప్రైవేట్ రేడియో వార్తాసంస్థకు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. 136 మంది పౌరులు మృతి: ఐరాస

    దాడుల్లో ధ్వంసమైన కారు, భవనం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 136 మంది పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

    మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.

    అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ లిజ్ థ్రొసెల్ అంటున్నారు.

    షెల్లింగ్, వైమానిక దాడులు, పేలుళ్ల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని లిజ్ పేర్కొన్నారు.

    యుద్ధంలో 400 మంది మరణించారని ఐరాస చెప్పింది.

    కాగా యుక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన లెక్కల ప్రకారం 352 మంది పౌరులు ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోగా 1684 మంది గాయపడ్డారు.

  7. యుక్రెయిన్ సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాలే కారణం: ఉత్తర కొరియా

    kim

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌పై రష్యా దాడికి అమెరికాయే కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.

    ఐరాసలోని ఉత్తర కొరియా రాయబారి కిమ్ సోంగ్ ఈ మేరకు ఆరోపణలు చేశారు. అమెరికా ఆధిపత్య ధోరణి కారణంగా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల మధ్య అశాంతి నెలకొంటోందని అన్నారు.

    అమెరికా, దాని అనుకూల దేశాల అహంకార ధోరణి, ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వల్ల ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ముప్పు ఎదురవుతోందని సోంగ్ అన్నారు.

    ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ సోంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ఫిబ్రవరి 28న ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది.

    యుక్రెయిన్ సంక్షోభానికి అమెరికా, దాని మిత్ర దేశాల ఆధిపత్య ధోరణే కారణమని ఆరోపించింది.

    కాగా ఐరాస జనరల్ అసెంబ్లీలో దక్షిణ కొరియా రాయబారి మాట్లాడుతూ యుక్రెయిన్ సంక్షోభం అనేది రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధమని అన్నారు.

  8. రష్యా బలగాల గుప్పిట ఖెర్సాన్ నగరం

    దక్షిణ యుక్రెయిన్‌లోని మరో నగరం ఖెర్సాన్‌ వీధుల్లో రష్యా బలగాలు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

    నగరంలోని రైల్వే స్టేషన్, ఓడరేవులను మంగళవారం రాత్రి రష్యా సేనలు అధీనంలోకి తీసుకున్నాయని ఖెర్సాన్ మేయర్ ఇగోర్ ఖొలికయేవ్ తెలిపారు.

    అక్కడ రష్యా, యుక్రెయిన్ సైనికుల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతోంది.

    5 లక్షల జనాభా ఉన్న ఖెర్సాన్‌లో అనేక మంది యుక్రెయిన్ సైనికులతో పాటు పౌరులూ ప్రాణాలు కోల్పోయినట్లు మేయర్ చెప్పారు.

    యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని నగరాలను ఒక్కటొక్కటిగా రష్యా స్వాధీనం చేసుకుంటోంది. క్రిమియా నుంచి వస్తున్న రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి.

    మరోవైపు ఖెర్సాన్ సమీపంలోని మరో పట్టణం మిఖోలేవ్ ఇంకా యుక్రెయిన్ అధీనంలోనే ఉందని అధికారులు వెల్లడించారు.

  9. బ్రేకింగ్ న్యూస్, ఖార్కియెవ్‌లో దిగిన రష్యా పారాట్రూపర్లు, కొనసాగుతున్న దాడులు

    ఖార్కియెవ్‌లో ధ్వంసమైన భవనాలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఖార్కియెవ్ నగరాన్ని అధీనంలోకి తీసుకునేందుకు గాను రష్యా సైనికులు పారాచ్యూట్లలో దిగారని యుక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది.

    సైరన్‌లు మోగిన వెంటనే రష్యా వైమానిక దాడులు మొదలయ్యాయని యుక్రెయిన్ తెలిపింది.

    ఖార్కియెవ్‌లోని ఒక మిలటరీ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యా పారాట్రూపర్లు దాడులు చేశారని చెబుతున్నారు.

    బుధవారం ఉదయం నుంచి ఖార్కియెవ్‌లో రష్యా దాడులు, యుక్రెయిన్ ప్రతిఘటన కొనసాగుతోందని తెలిపారు.

    ఖార్కియెవ్ ఫ్రీడమ్ స్క్వేర్ వద్ద మంగళవారం జరిగిన దాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు కార్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.

    మంగళవారం ఒక్కరోజే ఖార్కియెవ్‌లో ఒక భారతీయ విద్యార్థి సహా 17 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

  10. అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

    పుతిన్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా అధ్యక్షుడు పుతిన్ తన జీవితంలో ఇప్పటివరకూ సాధించింది తక్కువేం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాన్ని రెండు దశాబ్దాలుగా శాసిస్తున్నారు.

    పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారు.

    అసలు పుతిన్ ఏం చేయలేదనేది చర్చించుకుంటే సులభం.

    యుద్ధాలు ప్రకటించారు. పెన్షన్ సంస్కరణలు తెచ్చారు.

    రష్యా భూభాగాన్ని విస్తరించారు. ఆఖరికి క్యాలెండర్లపైనా కనిపించారు.

    అధికార పగ్గాలు తన చేతుల్లోనే కొనసాగేందుకు వీలుగా రెండేళ్ల కిందట రాజ్యాంగంలో సమూల మార్పులను ప్రతిపాదించారు.

    పుతిన్ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఎలా కొనసాగుతున్నారో వివరించే ఈ కథనం కోసం క్లిక్ చేయండి..

  11. యుక్రెయిన్‌కు భారీ సహాయం ప్రకటించిన బైడెన్, బలగాలు మాత్రం పంపబోమని స్పష్టీకరణ

    బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌కు అండగా ఉంటామని బైడెన్ తెలిపారు. యుక్రెయిన్‌కు చేయబోయే సాయాన్ని ఆయన ప్రకటించారు.

    సాయం, హామీలు ఇలా..

    • 35 కోట్ల డాలర్ల( సుమారు రూ. 2,654 కోట్లు) విలువైన ఆయుధాలు అందివ్వడం.
    • 5.4 కోట్ల (రూ. 409 కోట్లు) డాలర్ల విలువైన మానవతా సహాయం
    • స్విఫ్ట్ మెసేజింగ్ సిస్టమ్ నుంచి రష్యాకు చెందిన అంతర్జాతీయ బ్యాంకులను కొన్నిటిని తొలగించడం.
    • రష్యా సెంట్రల్ బ్యాంక్‌పై ఆంక్షలు
    • రష్యాకు చెందిన బడా పారిశ్రామికవేత్తల ఆస్తులను సీజ్ చేసేలా ట్రాన్స్ అట్లాంటిక్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి పనిచేయడం.
    • రష్యాకు చెందిన, రష్యా నిర్వహిస్తున్న విమానాలకు అమెరికా గగనతలంలో నిషేధం.

    ఇవి కాకుండా రానున్న కొన్ని నెలలలో అత్యవసర సాయంగా యుక్రెయిన్‌కు 640 కోట్ల డాటర్లు (రూ. 48,500 కోట్లు) సాయం అందించేందుకు కాంగ్రెస్ అనుమతిని కోరారు బైడెన్.

    అయితే, రష్యాను ఎదుర్కొనడంలో యుక్రెయిన్‌కు సాయంగా అమెరికా బలగాలను మాత్రం పంపబోమని బైడెన్ స్పష్టం చేశారు.

  12. యుక్రెయిన్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రజలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నారు: బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘స్టేట్ ఆఫ్ ద యూనియన్’ ఉపన్యాసం మొదలైంది.

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన తన ప్రసంగంలో ఖండించారు.

    ‘‘ఆరు రోజుల కిందట రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ స్వేచ్ఛా ప్రపంచపు పునాదులను కదలించాలని ప్రయత్నించారు. తన హింసాత్మక మార్గానికి భయపడి ప్రపంచం మోకరిల్లుతుందని ఆయన భావించారు.

    కానీ, ఆయన అంచనాలు పూర్తిగా తప్పు’’ అన్నారు బైడెన్.

    పుతిన్ ఏమాత్రం ఊహించనట్లుగా యుక్రెయిన్ ప్రజలు దృఢమైన గోడలా రష్యాను ఎదుర్కొంటున్నారంటూ బైడెన్ ప్రశంసించారు.

    ‘‘యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ, ఆ దేశ ప్రజలు తమ నిర్భీతి, ధైర్యం, నిబద్ధతతో ప్రపంచానికి ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నారు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు.

    యుక్రెయిన్‌పై దాడికి పుతిన్ పూర్తిగా బాధ్యుడని... అందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బైడెన్ హెచ్చరించారు.

  13. నియంతలు మూల్యం చెల్లించుకోకతప్పదు: బైడెన్

    జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్యూఎస్ కాంగ్రెస్‌లో చేయబోయే తొలి ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ఉపన్యాస వివరాలను వైట్‌హౌస్ వెల్లడించింది.

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించేందుకు, రష్యాకు హెచ్చరికలు చేసేందుకు బైడెన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు.

    ‘‘నియంతలు తమ దూకుడుకి తగిన మూల్యం చెల్లించుకోకపోతే వారు మరింత అనిశ్చితికి కారణమవుతారని చరిత్ర మనకు చెప్పింది’’ అంటూ పుతిన్‌కు బుద్ధి చెప్పాలని బైడెన్ హెచ్చరించనున్నారు.

    రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌లో శాంతి స్థాపనకు నాటో ఏర్పాటైందని చెబుతూ నాటో సైనిక కూటమిపై బైడెన్ ప్రశంసలు కురిపించనున్నారు.

    ‘‘యుద్ధ నివారణకు చేసిన దౌత్య ప్రయత్నాలను పుతిన్ తోసిపుచ్చారు. పశ్చిమ దేశాలు, నాటో ఈ విషయంలో స్పందిస్తాయని ఆయన అనుకోలేదు. మనల్ని విభజింగలనని పుతిన్ అనుకున్నారు.పుతిన్ తప్పు చేస్తున్నారు... మేం సిద్ధంగా ఉన్నాం’’ అంటూ బైడెన్ తన ప్రసంగంలో హెచ్చరించనున్నారు.

  14. అమెరికా గగన తలంలో రష్యా విమానాల ప్రవేశంపై నిషేధం

    రష్యా విమానం

    ఫొటో సోర్స్, Reuters

    రష్యా విమానాలు తమ గగనతలంలో ప్రయాణించకుండా అమెరికా నిషేధం విధించనుందని సీబీఎస్ న్యూస్ తెలిపింది.

    ఇప్పటికే కెనడా, యూరప్ దేశాలు రష్యా విమానాలు తమ గగనతలంలో ప్రయాణించకుండా నిషేధం విధించాయి.

    ఇప్పటికే రష్యా నుంచి అమెరికా రావాల్సిన అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి.

    తాజాగా అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయంతో రష్యా విమానాలు అమెరికాకు రాకపోకలు సాగించడం, అమెరికా గగనతలం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం సాధ్యం కాదు.

    యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం తీవ్రం కావడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనవ్యక్తమవుతోంది.

    ఇప్పటికే అనేక దేశాలు రష్యాపై ఆర్థిక, ఇతర ఆంక్షలు ప్రకటించాయి.

  15. యుక్రెయిన్, రష్యా యుద్ధంలో మంగళవారం ఏమైందంటే..

    ఖార్కియెవ్‌పై దాడి

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లోని ఫ్రీడమ్ స్క్వేర్ ప్రాంతంలో రష్యా క్షిపణి దాడి చేయడంతో 10 మంది సాధారణ పౌరులు మరణించారు.

    ·యుద్ధం మొదలై దాదాపు వారం రోజులవుతున్నా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేకపోతున్నామన్న ఉద్దేశంతో రష్యా మరిన్ని దాడులకు పాల్పడవచ్చన్న ఆందోళన యుక్రెయిన్‌లో పెరుగుతోంది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చన్న భయాలు వ్యాప్తి చెందుతున్నాయి.

    ·యుక్రెయిన్ రాజధాని దిశగా సాగుతున్న భారీ రష్యన్ సాయుధ కాన్వాయ్ కీయెవ్ నగర పొలిమేర్లలో ఉంది.

    ·యుక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 2 వేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. మరో 8 వేల మందికిపైగా భారతీయులు యుక్రెయిన్ విడిచి అక్కడి పొరుగుదేశాలకు చేరగలిగారు. సుమారు 8 వేల మంది భారతీయులు ఇంకా యుక్రెయిన్‌లోనే వేర్వేరు పట్టణాల్లో చిక్కుకుపోయారు.

    ·యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంలో మంగళవారం ఉదయం కాల్పుల్లో మరణించిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావాలని అతని తండ్రి శేఖర్ గౌడ కోరారు.

  16. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్‌పై రష్యా దాడి తీవ్రమైంది.

    రాజధాని కీయెవ్ సహా పలు నగరాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.

    యుద్ధానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో అందిస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసంఇక్కడ క్లిక్ చేయండి.