యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఏడవ రోజు ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 24న రష్యా, యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య" ప్రారంభించింది.
రష్యా యుక్రెయిన్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
ఇవాళ, ఏడవ రోజు జరిగిన సంఘటనలు క్లుప్తంగా మీకోసం..
- రష్యా బలగాలు యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులను ముమ్మరం చేశాయి.
- ఖెర్సాన్ పోర్టును స్వాధీనం చేసుకున్నట్టు రష్యా చెబుతోంది. కానీ, యుక్రెయిన్ బలగాలు దానిపై పట్టు కోల్పోలేదని ఆ నగర మేయర్ అంటున్నారు.
- రష్యా సరిహద్దులకు దగ్గరగా ఉన్న మరియుపూల్‌లో భారీ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని యుక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రం "దాదాపుగా ధ్వంసమైందని" నగర డిప్యూటీ మేయర్ తెలిపారు.
- యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో ఒక పోలీసు విభాగం భవనం, ఒక యూనివర్సిటీలోని కొంత భాగం రాకెట్ దాడికి దెబ్బతిన్నాయి.
- గత రాత్రి రష్యా, ఖార్కియేవ్ నగరంలోకి పారాట్రూపర్లను దించిందని, నగరాన్ని ఆక్రమించుకోవడానికి దాడులు జరుపుతోందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.
- రష్యా దాడులు మొదలైన దగ్గర నుంచి 2,000 మందికి పైగా యుక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
- రష్యా, యుక్రెయిన్‌ల మధ్య తిరిగి శాంతి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ తెలిపింది.
ఇవీ ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.