యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించిన డోనల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ధైర్యంగల నాయకుడని వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించారు. యుక్రెయిన్ ప్రజల కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
అయితే, మొదట్లో యుక్రెయిన్‌కు బలగాలు పంపాలని నిర్ణయించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మేధావి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా కూడా తమ దక్షిణ సరిహద్దులను కాపాడుకునేందుకు అలానే ‘‘శాంతి పరిరక్షణ’’ దళాలను పంపించాలని ట్రంప్ సూచించారు.
అయితే, ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తున్న వీడియోను రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. దీనిలో రష్యా దాడిని ట్రంప్ ఖండించారు. యుక్రెయిన్ ప్రజలకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించారు.
మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపైనా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్యంగల నాయకుడని కొనియాడారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పైనా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మోసపూరితంగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచారని, తను అధికారంలో ఉండుంటే, ఈ సంక్షోభం వచ్చేదికాదని అన్నారు.
‘‘మన ఎన్నికల్లో మోసం జరగకపోయుంటే, మళ్లీ నేనే అధ్యక్షుడిగా ఉండేవాణ్ని. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ వచ్చేది కాదు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
పుతిన్‌పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. పుతిన్ తెలివైనవారని ఎందుకు అన్నాననంటే.. నాటో, ప్రపంచ నాయకులను ఆయన ఓడించారు అని వ్యాఖ్యానించారు.
‘‘పుతిన్ చాలా తెలివైనవారు. నిజానికి మన నాయకులు తెలివి తక్కువవారు.. అదే అసలైన సమస్య’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే, పుతిన్ తెలివైనవారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ విమర్శించారు.