You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ ట్వీట్ చేశారు. రష్యా దాడుల గురించి మోదీకి వివరించానని, లక్ష మందికి పైగా రష్యా సైనికులు తమ భూభాగంలో దాడి చేశారని మోదీకి చెప్పినట్లు జెలియన్‌స్కీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. 3500 మంది రష్యా సైనికులు చనిపోయారు – యుక్రెయిన్

    యుక్రెయిన్‌పై దాడి చేసిన 3500 కంటే ఎక్కువ మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ ఆర్మీ ఫేస్‌బుక్ పేజీలోప్రకటించింది. మరో 200 మందిని ఖైదీలుగా పట్టుకున్నామని తెలిపింది.

    14 విమానాలు, 8 హెలికాప్టర్లు, 102 ట్యాంకులను కూడా ధ్వంసం చేశామని పేర్కొంది.అయితే, యుక్రెయిన్ ఆర్మీ చెప్పిన ఈ విషయాలను బీబీసీ ధృవీకరించలేకపోయింది.

    మరోవైపు, ఎంత మంది సైనికులు చనిపోయారన్న దానిపై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

  2. ఇప్పటి వరకు ఏం జరిగింది?

    • యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం ప్రయత్నిస్తోంది. నగరంలోని పలు దిశల నుంచి దాడులు చేస్తోంది.
    • రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు యుక్రెయిన్ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక ప్రధాన సిటీ ఎవెన్సు దగ్గర రష్యా దాడిని తిప్పికొట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
    • రాజధానిలోని కొన్ని వీధుల్లో కూడా రష్యా, యుక్రెయిన్ సైన్యాల మధ్య పోరాటం కొనసాగుతోందని ఫేస్‌బుక్‌ పోస్టులో యుక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. దీన్ని సిటీ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
    • కీయెవ్‌లో రాత్రంతా బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 50 కంటే ఎక్కువ పేలుళ్ల శబ్దాలే వినిపించాయని, రాజధానిలో భారీ స్థాయిలో తుపాకీ కాల్పులు చోటు చేసుకుంటున్నాయని కీయెవ్‌ ఇండిపెండెంట్ పేర్కొంది.
    • అయితే, కీయెవ్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని యుక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి చెప్పారు.
    • యుక్రెయిన్‌కు సాయం చేయడానికి 6.4 బిలియన్ డాలర్లు కావాలని అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌ను అడిగింది.
    • రష్యా దాడి వల్ల సుమారు 50 లక్షల మంది యుక్రెనియన్లు పొరుగున ఉన్న దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఎయిడ్ ఏజెన్సీలు అంచనా వేశాయి.
  3. యుక్రెయిన్‌పై రష్యా దాడి: భారత్ ఎటువైపు ఉంది?

    రష్యా- యుక్రెయిన్ సంక్షోభంలో భారత్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతోందా?ఈ వీడియోలో చూడండి.

  4. యుక్రెయిన్‌పై రష్యా దండెత్తినా అమెరికా సైన్యం ఎందుకు రంగంలోకి దిగలేదు?

    యుక్రెయిన్‌కు అండగా ఉంటామని చెప్పిన అమెరికా, రష్యా దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎందుకు రంగంలోకి దిగలేదు?

    ఎందుకు యుక్రెయిన్‌కు అండగా నిలబడలేదు? రష్యాకు, పుతిన్‌కు జోబైడెన్ భయపడుతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు.. ఈ కథనంలో చదవండి.

  5. రష్యా సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది – బ్రిటన్

    రష్యా పదే పదే దాడులు చేస్తున్నప్పటికీ.. కీలక నగరాలపై యుక్రెయిన్‌ పట్టు నిలుపుకుంటోందని బ్రిటన్ రక్షణ శాఖ పేర్కొంది.

    రాజధాని కీయెవ్‌పై పట్టు సాధించేందుకు రష్యా అనేక దిశల నుంచి దాడులు చేస్తున్న సమయంలో బ్రిటన్ ప్రకటన వెలువడింది.

    రష్యా సైన్యానికి యుక్రెయిన్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని తెలిపింది.

  6. యుక్రెయిన్ రాజధాని వీధుల్లో పోరాటం

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ వీధుల్లో రష్యా, యుక్రెయిన్ బలగాల మధ్య పోరాటం జరుగుతోందని కీయెవ్‌ సిటీ ప్రభుత్వం చెప్పినట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ఫ్యాక్స్‌ పేర్కొంది.

    'నగరంలోని వీధుల్లో ఇప్పుడు పోరాటం కొనసాగుతోంది' అని ప్రభుత్వం వెల్లడించింది.

    షెల్టర్లలోనే ఉండాలని, కిటీకీలు, బాల్కానీల్లోకి రావొద్దని నగర ప్రజలను హెచ్చరించింది.

  7. రాజధాని కీయెవ్‌ కోసం భీకర పోరు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పేలుళ్లు జరుగుతున్నట్లు, దాని చుట్టుపక్కల భీకర ఘర్షణలు జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.

    రాజధానిలోని మైదాన్ స్క్వేర్ దగ్గర భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి. ట్రోయిష్చినా ప్రాంతంలో అనేక పేలుళ్లు జరిగినట్లు చెబుతున్నారు.

    ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు శబ్దాలు రాజధానికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తున్నాయి.

    రాజధానిలోని ట్రోయిష్చినా జిల్లాలో ఉన్న సీహెచ్‌పీ-6 పవర్ స్టేషన్ సమీపంలో రష్యా, యుక్రెయిన్ బలగాల మధ్య ఘర్షణ జరుగుతోంది. రాజధానికి విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రయత్నంలో ఇక్కడ రష్యా దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    కీయెవ్‌లోని పెరెమోయ్ ఎవెన్సులో ధ్వంసమైన వాహనాలు, మంటలు కనిపించాయి.

    వాసిల్కివ్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌కు సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయి.

    మైకోలావ్ నగరం నుంచి రష్యా సైన్యాన్ని తిప్పికొట్టామని యుక్రెయిన్ సైన్యం చెబుతోంది.

  8. యుక్రెయిన్‌పై దాడి: తాజా పరిస్థితి ఇది

    యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి మూడో రోజు కొనసాగుతోంది.

    రష్యా సైన్యం మరికొన్ని గంటల్లో రాజధాని కీయెవ్‌ను ముట్టడించేందుకు సిద్ధంగా ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీచెప్పారు.

    కీయెవ్‌కు సమీపంలోని ఎయిర్‌బేస్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి.

    యుక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి దింపేయాలని యుక్రెయిన్ సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చారు.

    అమెరికా, యురోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి.

    తూర్పు యూరప్‌కు నాటో మరిన్ని అదనపు బలగాలను పంపిస్తోంది.

  9. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి మూడో రోజు కొనసాగుతోంది. ఈ ఘర్షణలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో అందిస్తాము.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసంఇక్కడ క్లిక్చేయండి.