You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా సేనలను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ రాజధానిలోని ప్రజలకు 18,000 మెషీన్ గన్‌లు

యుక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరం, తూర్పు, దక్షిణ భాగాల నుంచి రష్యా సైన్యం దాడి చేస్తోంది. ఇప్పటివరకు 137 మంది సైనికులు, పౌరులు మరణించారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. యుద్ధం ముగియాలంటే రష్యా మాతో మాట్లాడాల్సి ఉంటుంది: యుక్రెయిన్ అధ్యక్షుడు

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలనుద్దేశించి మరోసారి వీడియోలో మాట్లాడారు. దాడి ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని రష్యాకు యుక్రెయిన్ భాషలోనూ, రష్యన్ భాషలోనూ ఆయన విజ్ఞప్తులు చేశారు.

    ‘‘శత్రుత్వాలకు ముగింపు పలకటానికి, సైనిక దాడిని ఆపటానికి రష్యా ఇప్పుడైనా, తర్వాతైనా మాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మాటలు ఎంత త్వరగా మొదలైతే, రష్యా నష్టాలు అంత తగ్గుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

    ఈ దాడులు ఆగేవరకూ తాము తమ దేశాన్ని రక్షించుకుంటూనే ఉంటామన్నారు. రాజధానిని విడిచి వెళ్లే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఇప్పుడు రష్యాకు ప్రప్రధమ శత్రువును తానేనని తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.

    రాజధాని నగరంపై దాడి తీవ్రమవుతుందని జెలెన్స్కీ గత రాత్రే హెచ్చరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి అనేకసార్లు క్షిపణి దాడులు జరిగాయని ఆయన ధృవీకరించారు.

    సైనిక, పౌర ప్రాంతాల రెండిటి మీదా రష్యా దాడులు జరిగాయన్నారు. పౌరులు లక్ష్యంగా తాము దాడులు చేయటం లేదని రష్యా ఇంతకుముందు చెప్పింది.

    అయితే.. శుక్రవారం ఉదయం కీవ్ నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. వాటిలో నివాస భవనం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.

  2. యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి పుతిన్ ప్రయత్నిస్తారు: అమెరికా

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తారని తాను నమ్ముతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లిన్కెన్ చెప్పారు.

    ఆయన అమెరికాకు చెందిన ఏబీసీ వార్తా చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. యుక్రెయిన్ మీద ఉత్తరం, తూర్పు, దక్షిణ సరిహద్దుల నుంచి బహుముఖ దాడి చేయటంతో పాటు, ఆ దేశ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై దాడి చేయటం రష్యా ప్రణాళికలో భాగమని పేర్కొన్నారు.

    యుక్రెయిన్‌ను దాటి రష్యా దాడిచేయటానికి ‘అవకాశం’ ఉందన్నారు. అయితే నాటో మిత్రపక్షాలను రక్షించుకోవటానికి అమెరికా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘‘ఒక నాటో సభ్య దేశం మీద దాడిచేస్తే అన్ని నాటో సభ్యదేశాల మీదా దాడి చేసినట్లే’’నని హెచ్చరించారు.

    ‘‘నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్నీ మేం రక్షించుకుంటామనే విషయంలో అధ్యక్షుడు (జో బైడెన్) చాలా స్పష్టంగా ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌ను దాటి వెళ్లకుండా ఇది చాలా బలమైన హెచ్చరికగా పనిచేస్తుందని నేను భావిస్తున్నా’’ అని చెప్పారాయన.

    పరిస్థితి మరింత విషమిస్తే.. పుతిన్‌ను నేరుగా లక్ష్యం చేసుకుని అమలులో ఉన్న అమెరికా ఆంక్షలను మరింత విస్తరించే అవకాశం ఇంకా ఉందనేది జో బైడెన్ వైఖరిగా బ్లిన్కెన్ ఉద్ఘాటించారు.

  3. కీవ్‌లో అపార్ట్‌మెంట్‌పై కూలిన రష్యా విమానం

    యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో శుక్రవారం ఉదయం పేలుళ్లు సంభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    అలాగే.. నగర వైమానిక రక్షణ వ్యవస్థ.. వైమానిక దాడిని అడ్డుకుందని, అనేక క్షిపణులను మధ్యలోనే అడ్డగించటంతో పాటు, శత్రు యుద్ధ విమానాన్ని ఒక దానిని కూల్చివేసిందని కూడా ధృవీకరించని వార్తలు వస్తున్నాయి.

    కీవ్‌లోని డార్నిట్స్కీ జిల్లాలో ఒక విమానం కూలిందని యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు.

    మరోవైపు కీవ్ నగరంలో ఓ తొమ్మిదంతస్తుల నివాస భవనం మంటల్లో చిక్కుకున్నట్లు స్థానిక కథనాలు చెప్తున్నాయి.

    రాకెట్ ముక్కలు పడటంతో చెలరేగిన ఈ మంటల్లో కనీసం ముగ్గురు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కీవ్ మేయర్ విటాలి క్లిషెకో ట్వీట్ చేశారు. ఆ భవనం ధ్వంసమయ్యే పరిస్థితిలో ఉందన్నారు.

  4. పుతిన్‌కు ఫోన్ చేసి ‘నిర్మొహమాటంగా’ మాట్లాడాను: మాక్రాన్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను ఫోన్ ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు.

    ఆయన బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన ఫోన్ కాల్స్ పుతిన్‌కు చేరటం లేదని, పుతిన్‌తో మాట్లాడాలని తనను కోరారని మాక్రాన్ చెప్పారు.

    దీంతో.. సైనిక చర్యలను నిలిపివేయాలని కోరటానికి తాను పుతిన్‌కు ఫోన్ చేసినన్నారు. ‘‘నిర్మొహమాటంగా, సూటిగా, వేగంగా’’ ఈ ఫోన్ కాల్ సాగిందని చెప్పారు.

    ‘‘యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చించాలని కూడా ఈ ఫోన్ కాల్‌లో పుతిన్‌ను కోరాను. జెలెన్స్కీ తాను పుతిన్‌ను చేరుకోలేకపోతున్నానని, తనతో చర్చించాలని పుతిన్‌కు చెప్పాలని నన్ను కోరారు’’ అని మాక్రాన్ వివరించారు.

  5. ‘కీవ్‌లో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేశాం’, యుక్రెయిన్ అధికారి వెల్లడి

    యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని దర్నిట్స్‌కీ జిల్లాలో ఓ రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు యుక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

    కోషిట్సియా స్ట్రీట్‌లో ఓ ఇంటి వద్ద ఆ విమానం కుప్పకూలిందని ఆంటన్ హెరాస్కెహెంటో తెలిపారు.

    కీవ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించిన అనంతరం రష్యా విమానాన్ని కూల్చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వీటిని బీబీసీ ధ్రువీకరించలేదు.

    గురువారం కూడా ఇలాంటి పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్‌లోని బ్రోవరీ వైమానిక స్థావరంపై రష్యా క్రూయిజ్ క్షిపణులు దాడి చేయడంతో గురువారం ఆరుగురు మరణించారు.

    శుక్రవారం ఉదయం కీవ్‌లోని ఒక ప్రాంతం నుంచి అగ్నికీలలు, దట్టమైన పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తున్న ఒక ఫోటోను న్యూస్ ఛానెల్ టెలికనల్‌ఎన్‌టీఏ పోస్ట్ చేసింది.

  6. రష్యా నన్ను చంపాలని చూస్తోంది – యుక్రెయిన్ అధ్యక్షుడు, ‘‘రష్యా నన్ను మొదటి లక్ష్యంగా చేసుకుంది’’

    తనను చంపడం ద్వారా దేశాన్ని రాజకీయంగా అస్థిరపరచాలని రష్యా చూస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

    సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

    ‘‘రష్యా నన్ను మొదటి లక్ష్యంగా చేసుకుంది. నా కుటుంబం వారి రెండో లక్ష్యం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    రాజధాని కీవ్‌లో ప్రభుత్వ క్వార్టర్లలోనే తాను ఉన్నానని, తన కుటుంబం కూడా అక్కడే ఉందని చెప్పారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

    కీవ్‌లోకి కొన్ని రష్యా బలగాలు ప్రవేశించాయని తమకు సమాచారం అందినట్లు యుక్రేనియన్ అధికారులను ఆయన హెచ్చరించారు.

  7. నాటో రంగంలోకి దిగాలి - యుక్రెయిన్ రాయబారి, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలని అభ్యర్థన

    రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పశ్చిమ దేశాలు, నాటో తమకు సాయం చేయాలని బ్రిటన్‌లోని యుక్రెయిన్ రాయబారి వాదిమ్ ప్రిస్టైకో అభ్యర్థించారు.

    లండన్ టైమ్స్‌కు ఆయన ఒక లేఖ రాశారు. కీవ్ లొంగిపోయే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు. రష్యాను వెనక్కి తరిమేందుకు తమకు సాయం చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలను ఆయన కోరారు.

    ‘‘బ్రిటన్‌తోపాటు పశ్చిమ దేశాలు రష్యాపై విధించే కఠినమైన ఆంక్షలకోసం మేం ఎదురుచుస్తూన్నాం. స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సిస్టమ్స్ నుంచి రష్యాను తొలగించడంతోపాటు.. రష్యా దాడి విఫలమయ్యేలా చేసేందుకు మరిన్ని చర్యలు అవసరం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    అయితే, స్విఫ్ట్ నెట్‌వర్క్ నుంచి రష్యాను తొలగించే దిశగా ఇప్పటివరకు పశ్చిమ దేశాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

  8. రష్యాపై కెనడా కొత్త ఆంక్షలు, 62 రష్యా బ్యాంకులు, సంస్థలు లక్ష్యంగా చర్యలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఖండించారు. 62 రష్యా బ్యాంకులు, సంస్థలే లక్ష్యంగా ఆయన కొత్త ఆంక్షలు ప్రకటించారు.

    అమెరికా సహా మిత్ర పక్షాలతో ఫిబ్రవరి 22నే రష్యాపై కెనడా తొలి దశ ఆంక్షలు విధించింది. తూర్పు యూరప్‌లో నాటో మిషన్‌లో భాగంగా 460 మంది సైనికులన్ని కెనడా మోహరించింది.

    యుక్రెయిన్‌కు మరింత మంది సైనికుల్ని పంపిస్తారా? అనే విషయంపై ట్రూడో స్పందించలేదు.

  9. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఇప్పటి వరకూ ఏం జరిగిందంటే.., రష్యా దాడుల్లో 137 మంది మృతి

    యుక్రెయిన్‌పై దాడి నడుమ రష్యాపై ప్రపంచ దేశాలు కొత్త ఆంక్షలు విధించాయి.

    మొదటి రోజు మొత్తం యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగాయి. రాజధాని కీవ్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది.

    యుక్రెయిన్‌ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రష్యా బలగాలు దాడులు చేశాయి. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లు, వైమానిక దాడుల శబ్దాలు వినిపించాయి.

    రాజధాని కీవ్‌లోని వైమానిక స్థావరం సహా పలు కీలక ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య దాడి కొనసాగుతోంది. రష్యా ఆధీనంలోకి తీసుకున్న ఈ ప్రాంతాన్ని యుక్రెయిన్ పారాట్రూపర్లు మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

    1986లో అణు ప్రమాదం జరిగిన చెర్నోబిల్ ప్రాంతాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో రేడియోధార్మిక పదార్థాల నుంచి రేడియేషన్ వ్యాపిస్తుంటుంది.

    రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని రష్యా అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. తమ దేశం పశ్చిమ దేశాలతోనే ఉండేలా చూడటం తన బాధ్యతని ఆయన చెప్పారు.

    తొలి రోజు దాడుల్లో మొత్తంగా 137 మంది సైనికులు పౌరులు మరణించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు.

    ఆయుధాలు చేపట్టగలిగే ప్రజలు అందరూ ఆయుధాలు తీసుకుని మాతృభూమిని కాపాడాలని యుక్రెయిన్ పిలుపునిచ్చింది.

    రష్యా బ్యాంకులు, ఉన్నతాధికారులే లక్ష్యంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే, యుక్రెయిన్‌కు నాటో ఎలాంటి బలగాలూ పంపకూడదని నిర్ణయించింది.

    యూరప్‌లో 7,000 మంది సైనికులను అదనంగా మోహరించనున్నట్లు అమెరికా తెలిపింది.

    రష్యాతోపాటు యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో యుక్రెయిన్‌కు మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

    దాడుల నడుమ ఇప్పటికే లక్ష మందికిపైగా ప్రజలు తమ సొంత ఇళ్లను వదిలి వేరే దేశాలకు పారిపోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. పోలండ్, హంగరీ, మాల్డోవాలకు శరణార్థులు ఎక్కువగా వెళ్తున్నారు.

  10. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ..

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    యుక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన సమాచారంతో పాటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ముఖ్యమైన పరిణామాల తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

    నిన్నటి లైవ్ పేజీని చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.