కోవిడ్: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 71 మంది మృతి

తెలంగాణలో సగటున 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 27న మొత్తం 8,061 కేసులు నమోదు కాగా, 56 మంది మరణించారు. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,465 నుంచి దాదాపు లక్షకు పెరిగింది.

లైవ్ కవరేజీ

  1. ఉత్తరప్రదేశ్: ఒక బెడ్ కోసం క్యూలో 100 మంది కరోనా రోగులు, సమీరాత్మజ్ మిశ్రా, లఖ్‌నవూ నుంచి

    ఉత్తరప్రదేశ్ కరోనా పరిస్థితి

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా కేసులు యూపీలో అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో దాదాపు 34 వేల కేసుల నమోదయ్యాయి. కోవిడ్‌తో 265 మంది చనిపోయారు.

    గత 24 గంటల్లో 30 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ చెప్పారు.

    కరోనా కేసుల్లో అత్యధికం రాజధాని లఖ్‌నవూలోనే ఉన్నాయి. ఇక్కడ గత 24 గంటల్లో 4437 కేసులు నమోదయ్యాయి. 39 మంది చనిపోయారు.

    రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 3 లక్షలకు పైనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి వల్ల ఇప్పటివరకూ మొత్తం 11678 మంది చనిపోయారు. ఒక్క లఖ్‌నవూలోనే దాదాపు 50 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా కోవిడ్‌కు గురయ్యారు. ఆయన హోం ఐసొలేషన్‌లో ఉంటూ అధికారులతో విర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ ఆరు రోజులు హోం ఐసొలేషన్లో ఉన్న తర్వాత మంగళవారం లఖ్‌నవూ పీజీఐలో చేరారు. ఆరు రోజుల క్రితం ఆయనకు కూడా రిపోర్టుల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

    ఇటీవల బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్-19 వల్ల చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రోగులకు వైద్యం, ఆక్సిజన్, మందులు అందించడానికి వారి కుటుంబ సబ్యులు అల్లాడిపోతున్నారు.

    రాజధాని లఖ్‌నవూలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక ఆస్పత్రి నుంచి రోగిడిశ్చార్జ్ అవుతుంటే, ఆ బెడ్ కోసం వంద మంది రోగులు క్యూలో ఉండడం కనిపిస్తోంది.

    అయితే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కచ్చితంగా ఉపశమనం అందించింది. కానీ కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఇప్పటికీ ఆక్సిజన్ కోసం పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి.

  2. ఏడాదిలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్ విజయ శేఖర్

    డాక్టర్ విజయ శేఖర్ 2019 మార్చి 21 నుంచి ఇప్పటి వరకూ...గత 13 నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా విధుల్లో ఉన్నారని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గౌరీశ్వరరావు బీబీసీతో అన్నారు.

    వాస్తవానికి కోవిడ్ విధులు నిర్వహించిన వైద్యులకు వారంలో రెండు రోజుల నుంచి అవసరాన్ని బట్టి మరిన్ని రోజులు క్వారంటైన్‌కు అవకాశం ఇచ్చారు.

    సాధారణంగా ఐదు రోజులు కోవిడ్ బాధితులకు సేవలందించిన వారికి రెండు రోజుల విరామం దక్కేది. అంతేగాకుండా ఇతర వీక్లీ ఆఫ్‌లతో పాటు..నవంబర్ తర్వాత కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో సెలవులు తీసుకునేందుకు కూడా కొందరికి అవకాశం దక్కింది.

    కానీ, విజయ శేఖర్ మాత్రం ఎలాంటి సెలవులు తీసుకోకుండా విధులు నిర్వర్తించారు.

    పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి: ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని డాక్టర్

    పిఠాపురం డాక్టర్
  3. ఛత్తీస్‌గఢ్: పెరుగుతున్న కేసులు, నెమ్మదించిన వ్యాక్సినేషన్, ఆలోక్ ప్రకాశ్ పుతుల్, రాయ్‌పూర్ నుంచి

    ఛత్తీస్‌గఢ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 14,893 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది చనిపోయారు.

    ఏప్రిల్‌లో కరోనా కేసుల విషయంలో ఛత్తీస్‌గఢ్‌ మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరిగిన తర్వాత, దేశంలో మొత్తం కేసుల విషయంలో జాబితాలో దిగువనే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదు.

    ప్రభుత్వ గణాంకాల ప్రకారం మార్చి 31 వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,49,187. 4170 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 25,529.

    కానీ ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 27 రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 6,82,339కు చేరుకుంది. మరణాలు 7,782కి పెరిగింది.

    ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,068 ఉంది.

    రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతోందో, వ్యాక్సినేషన్ అంత నెమ్మదవుతోంది. ఉదాహరణకు ఏప్రిల్ 1న 2.34 లక్షల డోసులు, 2న 3.26 లక్షల డోసులు టీకా వేశారు.

    కానీ, ఆ గణాంకాలు మెల్లమెల్లగా తగ్గాయి. ఏప్రిల్ 15 నాటికి అవి రాష్ట్రంలో దాదాపు 42 వేలు, ఏప్రిల్ 21న 40 వేల డోసులకు తగ్గింది. ఏప్రిల్ 27 నాటికి రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో కలిపి, 27,111 డోసులే వేశారు.

    కేంద్రం నుంచి టీకాలు అందకపోవడం వల్లే ఆ పరిస్థిత వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు.

    ఛత్తీస్‌గఢ్‌లో కరోనా రికార్డు కేసులు

    ఫొటో సోర్స్, Getty Images

  4. మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారిపై నివేదిక సమర్పించాలన్న మానవ హక్కుల కమిషన్

    మధ్యప్రదేశ్ కరోనా పరిస్థితి

    ఫొటో సోర్స్, Getty Images

    ఆక్సిజన్ కొరత వల్ల సంభవించే మరణాలపై మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది

    మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కేసులు 5 లక్షల 25 వేలు దాటాయి.

    కొన్ని నగరాల్లో పరిమిత లాక్‌డౌన్‌ విధించినా గ్రాఫ్‌ను కిందకు దించడానికి ఏ మాత్రం సహాయపడలేదు.

    మంగళవారం మధ్య ప్రదేశ్‌లో కొత్తగా 13,417 కరోనా కేసులు నమోదయ్యాయి.

    సోమవారం మొరేనాలో ముగ్గురు, కట్నీలో ఇద్దరు కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు.

    దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, సంబంధిత జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులు మే 3 లోపు ఒక నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ కోరింది.

    మధ్యప్రదేశ్‌లో గత 26 రోజుల్లో కొన్ని రోజులు మినహాయించి ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.

    మంగళవారం పాజిటివిటీ రేటు 22.6 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలో టెస్ట్ చేయించుకున్న ప్రతి నాలుగో వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు లెక్క.

    ఈ నెలలో పాజిటివిటీ రేటు సాధారణ స్థాయి కన్నా మూడు రెట్లు పెరిగింది.

    అయితే సోమవారం నమోదైన 23 శాతం కంటే మంగళవారం పాజిటివిటీ రేటు కొంచెం తక్కువగా కనిపించింది.

    మంగళవారం 98 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 5,319కు చేరుకుంది.

    మధ్యప్రదేశ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇండోర్‌లో గరిష్టంగా 1,837 కేసులు నమోదయ్యాయి. తరువాత భోపాల్‌లో 1,836 మంది, గ్వాలియర్‌లో 1,198 మంది కరోనా బారిన పడ్డారు.

    గత 24 గంటల్లో 11,577 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళ్లడం కొంత ఉపశమనం కలిగించే విషయం. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,812కు చేరింది.

    ఏప్రిల్ 27 మంగళవారం నాటికి రాష్టంలో మొత్తం 94,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    మధ్య ప్రదేశ్‌లో కూడా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఉంది. వీటికి సంబంధించిన ఫొటోలు మీడియాలో కనిపిస్తున్నాయి.

    ఇండోర్‌లోని బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా సేకరించే కిట్ల కొరత ఉన్నట్లు కొన్ని రిపోర్టులు తెలిపాయి. దాంతో ప్లాస్మా ఇవ్వడానికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేస్తున్నారు.

    మధ్యప్రదేశ్‌కు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు జార్ఖండ్‌లోని బొకారో నుంచి మంగళవారం ఉదయం ఆరు ట్యాంకర్లతో రైలు బయలుదేరింది. వీటిలో 64 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నారు.

    శనివారం అర్థరాత్రి షాడోల్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

    ఆ ఇన్‌స్టిట్యూట్ డీన్ అందించిన సమాచారం ప్రకారం ఈ వార్తను పీటీఐ ప్రచురించింది.

    అయితే, తర్వాత మధ్య ప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందనే వార్తను ఖండించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు.

  5. భారత్‌లో గత 24 గంటల్లో 3.60 లక్షల కోవిడ్ కేసులు నమోదు

    భారత్‌లో కరోనా మహమ్మారి వేగం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి. 3,293 మంది చనిపోయారు.

    దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు, మృతుల సంఖ్య 2,01,18కు పెరిగింది.

    140 కోట్ల జనాభా ఉన్న భారత్‌, కరోనాతో 2 లక్షల మందికి పైగా చనిపోయిన నాలుగో దేశం అయ్యింది.

    అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

    దేశంలో మొత్తం 1,48,17,371 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 29,78,709కి పెరిగింది.

    ఇప్పటివరకూ దేశంలో 14,78,27,367 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పెరుగుతున్న కేసులు

    ఏపీలో కరోనా పరిస్థితి

    ఫొటో సోర్స్, Getty Images

    ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా తీవ్రరూపం దాల్చింది. నెల రోజుల వ్యవధిలోనే కేసులు 150 రెట్లు పెరిగాయి.

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నెల రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్ బాధితులు 150 రెట్లు పెరిగారు. మార్చి 25న రాష్ట్రంలో 35 వేల మందికి టెస్టులు చేస్తే 758 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పుడు పాజిటివ్ రేటు చాలా తగ్గింది. కానీ, ఏప్రిల్ 27 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాజిటివ్ రేటు 20 శాతానికి పెరిగింది. 74,435 మందికి పరీక్షలు చేస్తే 11,434 మందికి పాజిటివ్ అని తేలింది.

    సరిగ్గా నెల రోజుల కిందట కోవిడ్ మరణాలు 4 మాత్రమే. ఏప్రిల్ 27 నాటికి ఆ సంఖ్య 64కు పెరిగింది. ఈ నెల రోజుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,469 నుంచి 99,446కు పెరిగింది.

    ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఓటు హక్కు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారివల్ల శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రభావం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయా జిల్లాల్లో యాక్టివ్ కేసులు రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా ఉన్నాయి.

    ఏపీలో కరోనా పరిస్థితి

    అయితే మరణాల విషయంలో వాస్తవాలకు, ప్రభుత్వ లెక్కలకు చాలా తేడా ఉంది. ఇదే విషయం బీబీసీ పరిశోధనలో కూడా తేలింది. ఇక రోజు వారీ కేసుల నమోదులో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో ఉంది.

    ఆంధ్ర ప్రదేశ్ అంతటా నమోదవుతున్న కేసుల్లో 25 శాతం మూడు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఉంటున్నాయి. దీంతో ఒడిశా ప్రభుత్వం ఉత్తరాంధ్ర సరిహద్దులను మూసివేసింది. చాలా చోట్ల ప్రజలు, వ్యాపారులు కరోనా వ్యాప్తి అడ్డుకోడానికి స్వచ్ఛందంగా లాక్ డౌన్లు విధించుకున్నారు.

    ఈ ప్రాంతం నుంచి వలస కూలీలు ఎక్కువ. సెకండ్ వేవ్ ప్రారంభంలో వారంతా తిరిగి సొంత ప్రాంతాలకు రావడంతో, క్యారియర్లుగా మారుంటారని నిపుణులు భావిస్తున్నారు.

    వైజాగ్ స్టీల్ ఆక్సిజన్ ఉత్పత్తి

    ఫొటో సోర్స్, SRINIVAS/BBC

    ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొన్ని చోట్ల ఆసుపత్రి సిబ్బందే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్న ఘటనలు బయటపడ్డాయి.

    ఇక ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో వైజాగ్ స్టీల్ కీలక పాత్ర పోషిస్తోంది.రోజూ సుమారు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపించారు.

    కరోనా తాకిడికి అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరించింది. బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కొత్తగా వైద్య సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

  7. తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉధృతి

    తెలంగాణ కరోనా ఉధృతి

    ఫొటో సోర్స్, Getty Images

    తెలంగాణలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. రోజూ సగటున 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

    ఏప్రిల్ 27వ తేదీ తెలంగాణలో మొత్తం 8,061 కేసులు నమోదు కాగా, 5,093 మంది కోలుకున్నారు. 56 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 72,133 కి చేరింది. అలాగే నిన్న మొత్తం 82,270 శాంపిళ్లను పరీక్షించగా, ఇంకా 5,241 ఫలితాలు రావాల్సి ఉంది. అయితే 82 వేల శాంపిళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు 66,485 పరీక్షలు చేయగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం 15,785 పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,508 కేసులు, రంగారెడ్డిలో 514 కేసులు, మేడ్చల్ లో 673 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా నారాయణపేటలో 40, ములుగులో 47 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

    రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 వేల మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌లో ఇప్పటివరకూ 35 లక్షల మందికి మొదటి డోస్, 5 లక్షల మందికి రెండవ డోస్ వేశారు.

    ప్రస్తుతం తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా లేదు. అలాగని ఆక్సిజన్ తేలికగా కూడా దొరకడం లేదు. అయితే రెమిడిసివిర్ తో పాటూ కొన్ని అత్యవసరమైన, తప్పనిసరి ఇంజెక్షన్లు దొరకడం సమస్యగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ల స్టాక్ తగినంత ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

    కానీ చిన్న, మధ్య తరహా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స తీసుకునే వారి కుటుంబ సభ్యులు ఆయా ఇంజెక్షన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పైరవీలు చేసి, బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి వస్తోంది.

    అటు పడకలు కూడా ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు దొరకడం కష్టంగానే ఉంది. మరోవైపు మృతుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని పలు స్థానిక తెలుగు పత్రికలు కథనాలు ప్రచురించాయి.

    కరోనా ఉధృతి

    ఫొటో సోర్స్, Getty Images

    కోవిడ్ చుట్టూ రాజకీయం కూడా జరుగుతోంది. తెలంగాణకు వ్యాక్సీన్ డోసులు, రెమిడిసివర్ తక్కువ కేటాయించారని, ఆక్సీజన్ దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి కేటాయించారనీ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించారు. ఒకవేళ తెలంగాణలో ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే ఆ బాధ్యత అని ఆరోపించారు.

    ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా, వరంగల్, ఖమ్మం సహా పలు మునిసిపల్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొనసాగిస్తోంది. దీంతో ఆయా ఎన్నికల ప్రచారాల్లో కరోనా నిబంధనలు పాటించే పరిస్థితి లేదు.

    ప్రస్తుతం తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మాత్రం అమలవుతోంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ ఇది ఉంటోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ (11,12 తరగతులు) పరీక్షలు వాయిదా వేశారు. అంతకుమించి పెద్దగా ఆంక్షలు పెట్టలేదు.

    తెలంగాణతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా విపత్తు నిర్వహణ కోసం 11 మంది ఐఎఎస్‌ల బృందం నిరంతరం పనిచేస్తోంది.

    పడకలకు డిమాండ్

    ఫొటో సోర్స్, Getty Images

    తెలంగాణలో అందుబాటులో ఉన్న పడకల విషయంలో ప్రభుత్వ లెక్కలకీ వాస్తవాలకూ పొంతన ఉండడం లేదు. ఒకవైపు తమ ఆక్సిజన్ ఉన్న పడకలు దొరకడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తుండగా, మరోవైపు వేల సంఖ్యలో పడకలు ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

    ప్రభుత్వ లెక్కల ప్రకారం 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మొత్తం 6,513 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, అందులో 3,133 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 10,857 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, వాటిలో 3,880 పడకలు ఖాళీగా ఉన్నాయి.

    ఇక ఐసీయూ (వెంటిలేటర్ లేదా సీపీఏపీ) పడకల విషయంలో కూడా ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 2,148 ఐసీయూ బెడ్స్ ఉంటే, వాటిలో 799 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 7,289 ఐసీయూ పడకలు ఉంటే, వాటిలో 2,699 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

    ఇవికాక 3,942 ఆక్సిజన్ లేని మామూలు పడకలు గవర్నమెంటు ఆసుపత్రుల్లోనూ, 12,141 పడకలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

  8. కరోనా భయంతో మృతి... రిపోర్టులో నెగెటివ్

    కరోనా భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. అవగాహనతో పోరాడాలని, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ, కొందరు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు.

    నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో. బోర్గాం గ్రామానికి చెందిన అశోక్ కరోనా అనుమానంతో పరీక్షకు వచ్చారు. పీహెచ్ సీ లో పరీక్ష పలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటూ తల్లీ, ఇతర బంధువులూ వచ్చారు.

    ఫలితం వచ్చే లోపు కాసేపు దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుని తల్లి ఒడిలో తల పెట్టుకున్న అశోక్ అలాగే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఏప్రిల్ 26న జరిగింది. తరువాత ఆయనకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.

    కొడుకును ఇంటికి పోదాం రారా అంటూ ఏడుస్తూ ఆ తల్లి పిలిచిన పిలుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది.

    ఇదొక్కటే కాదు, కరోనా మొదటి వేవ్ లోనూ, ఇప్పుడూ కూడా కరోనా వచ్చిందన్న అనుమానం, భయంతో ఒత్తిడికిలోనై షాక్ తో చనిపోతున్న కేసులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ నమోదయ్యాయి.

    నిజామాబాద్

    ఫొటో సోర్స్, UGC

  9. కోవిడ్-19 వ్యాక్సినేషన్ మూడో దశ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌

    కోవిడ్ వ్యాక్సినేషన్

    ఫొటో సోర్స్, AFP

    కోవిడ్-19 వ్యాక్సినేషన్ మూడో దశ రిజిస్ట్రేషన్, ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి మొదలవుతోంది.

    ఈ దశలో 18 ఏళ్లు, ఆ పైబడిన వయసువారికి మే 1 నుంచి టీకా వేస్తారు.

    దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా వేయించుకోడానికి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    cowin.gov.in, ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లో టీకా కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు.

    కానీ, ఈ దశలో టీకా వేసుకోడానికి ప్రజలు కచ్చితంగా ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందులా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవడం కుదరదు.

    రిజిస్ట్రేషన్ ఎలా

    • మొదట cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
    • మీ ఫోన్ నంబర్‌కు ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దానిని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి వెరిపై ఐకాన్ మీద క్లిక్ చేయాలి. దాంతో మీ నంబరు వెరిఫై అవుతుంది.
    • ఆ తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజీ కనిపిస్తుంది.
    • అక్కడ మీ వివరాలు ఎంటర్ చేయాలి. ఒక ఫొటో ఐడెంటిటీ కార్డ్ వివరాలు కూడా షేర్ చేయాలి.
    • మీకు, ఇప్పటికే ఏవైనా వ్యాధులు అంటే షుగర్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా లాంటివి ఉంటే వాటి గురించి వివరంగా రాయాలి.
    • వివరాలు ఇవ్వడం పూర్తి కాగానే రిజిస్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.
    • రిజిస్ట్రేషన్ పూర్తికాగానే, కంప్యూటర్ స్క్రీన్ మీద మీ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి.

    ఇంతకు ముందు రెండు దశల్లో కూడా ప్రభుత్వం కోవిన్ ప్లాట్‌ఫాం ఆప్షన్ ఉంచింది. కానీ దానితోపాటూ ప్రజలకు వ్యాక్సీన్ సెంటర్‌ దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కూడా కల్పించింది. కానీ, ఈసారీ టీకా కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశారు.

    దీనితోపాటూ ప్రభుత్వం మూడో దశలో మరికొన్ని నియమాలు కూడా మార్చింది. మొదటి, రెండు దశల్లో ఒక వ్యక్తి, తనతోపాటూ మరో నలుగురిని యాడ్ చేసే ఆప్షన్ ఉండేది. కానీ ఇక మే 1 నుంచి మొదలయ్యే దశలో ఒక వ్యక్తి తన పేరును మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    రిజిస్ట్రేషన్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా వేయించుకోడానికి అపాయింట్‌మెంట్ లభిస్తుంది.

    మే 1 నుంచి ఎన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా వేస్తారు, అనేదానిలో ఎవరికి ఎక్కడ అపాయింట్‌మెంట్ లభిస్తుంది అనేదానిని బట్టి ఒక స్పష్టత రానుంది.

    అయితే, మూడో దశతోపాటూ మొదటి, రెండో దశ వ్యాక్సినేషన్ కూడా నడుస్తూనే ఉంటుంది. 45 ఏళ్లు పైబడిన వారు మే 1 తర్వాత కూడా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.

  10. అధికారిక లెక్కలు కాదు, శ్మశానాల్లో చితిమంటలు చూడండి

    'నేను ఇంత పెద్ద సంఖ్యలో శవాలు కాలుతుండగా చూడటం ఇదే మొదటిసారి. దిల్లీలోని ఓ మూడు శ్మశాన వాటికలను పరిశీలించినప్పుడు ఒక్కో దృశ్యం వెనక విషాదగాథ వినిపించింది.

    దిల్లీ ఆసుపత్రులలో రోగుల బంధువులు ఆక్సిజన్, ఐసీయూ, బెడ్లు, వెంటిలేటర్లు, మందుల కోసం పరుగులు పెడుతున్న దృశ్యాలు శనివారంనాడు విస్తృతంగా కనిపించాయి.

    సోమవారం నాడు శ్మశాన వాటికల్లో బంధువుల రోదనలు కనిపించాయి. వస్తున్న శవాలను కాల్చడానికి స్థలం సరిపోక ఓపెన్ ప్లేస్‌లను శ్మశానాలుగా మారుస్తున్న దృశ్యాలు కూడా దిల్లీలో కనిపించాయి.

    దేశ రాజధానిలో ప్రతి రోజూ కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 350 నుంచి 400 మధ్య ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.'

    బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ అందిస్తున్న ప్రత్యక్ష సాక్షి కథనం.

    దిల్లీలో కోవిడ్ మృతులు

    ఫొటో సోర్స్, Getty Images

  11. భారత్‌లో 2,00,000 దాటిన మరణాలు

    భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య 2,00,000 దాటింది. మొదటిసారిగా దేశంలో ఒకే రోజు 3 వేలకు పైగా మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాడు భారత దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల 3,286 మంది చనిపోయారు. కేవలం గత వారం రోజుల్లో 20 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు.

    కోవిడ్ మరణాల జాబితాలో ఇప్పుడు అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాల తరువాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఆ మూడు దేశాల్లో కన్నా ఇప్పుడు భారతదేశంలో సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది.

    శ్మశానం ఏరియల్ వ్యూ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, శ్మశానం ఏరియల్ వ్యూ
  12. బీబీసీ 'కోవిడ్ స్పెషల్ కవరేజ్ డే'

    కోవిడ్ మరణాలు

    ఫొటో సోర్స్, Getty Images

    గుడ్ మార్నింగ్, బీబీసీ ఈరోజు ‘స్పెషల్ కోవిడ్ కవరేజ్’ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి లక్షలాది ప్రజల ప్రాణాలు తీసింది. ఈ మహమ్మారి దాడి మొదలైనప్పటి నుంచి బీబీసీ న్యూస్ అన్ని భాషల్లో కరోనాపై పోరాటంలో భాగంగా అన్ని ప్రాంతాల నుంచి వరుస కథనాలను ఇస్తోంది. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

    ఒక్క వారం రోజుల్లో పరిస్థితి ఊహించని తీవ్ర స్థితికి చేరింది. గత ఏడు రోజుల్లో దేశంలో 20 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మృతుల సంఖ్య భారత్‌లో ఇప్పుడు 2,00,000 దాటింది.

    ఈ విపత్కర పరిస్థితి గురించి విశ్లేషిస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌తో ప్రజలు పడుతున్న కష్టాలను బీబీసీ నేడు ప్రత్యేక కథనాలుగా అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు, మహమ్మారి అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు, నిపుణులతో ఇంటర్వ్యూలను ఈరోజు లైవ్ పేజీలో ప్రముఖంగా చూడండి.

    రండి.. సమస్యలు తెలుసుకుందాం, విశ్లేషిద్దాం. సరైనా అవగాహనతో మహమ్మారి మీద మరింత సమర్థంగా పోరాడుదాం.