తెలంగాణలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది.
రోజూ సగటున 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు
చెబుతున్నాయి.
ఏప్రిల్ 27వ తేదీ తెలంగాణలో మొత్తం 8,061 కేసులు నమోదు కాగా, 5,093 మంది కోలుకున్నారు. 56 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 72,133 కి చేరింది. అలాగే నిన్న మొత్తం 82,270 శాంపిళ్లను పరీక్షించగా, ఇంకా 5,241 ఫలితాలు రావాల్సి ఉంది. అయితే 82 వేల శాంపిళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు 66,485 పరీక్షలు చేయగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం 15,785 పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,508 కేసులు, రంగారెడ్డిలో 514 కేసులు, మేడ్చల్ లో 673 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా నారాయణపేటలో 40, ములుగులో 47 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 వేల మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌లో
ఇప్పటివరకూ 35 లక్షల మందికి మొదటి డోస్, 5 లక్షల మందికి రెండవ డోస్ వేశారు.
ప్రస్తుతం తెలంగాణలో ఆక్సిజన్ కొరత
తీవ్రంగా లేదు. అలాగని ఆక్సిజన్ తేలికగా కూడా దొరకడం లేదు. అయితే రెమిడిసివిర్ తో
పాటూ కొన్ని అత్యవసరమైన, తప్పనిసరి ఇంజెక్షన్లు దొరకడం సమస్యగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ
ఇంజెక్షన్ల స్టాక్ తగినంత ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
కానీ చిన్న, మధ్య తరహా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ
చికిత్స తీసుకునే వారి కుటుంబ సభ్యులు ఆయా ఇంజెక్షన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
పైరవీలు చేసి, బ్లాక్
మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి వస్తోంది.
అటు పడకలు కూడా ఖాళీ ఉన్నాయని
ప్రభుత్వం చెబుతున్నా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు దొరకడం కష్టంగానే ఉంది.
మరోవైపు మృతుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని పలు స్థానిక
తెలుగు పత్రికలు కథనాలు ప్రచురించాయి.
కోవిడ్ చుట్టూ రాజకీయం కూడా జరుగుతోంది. తెలంగాణకు వ్యాక్సీన్ డోసులు, రెమిడిసివర్ తక్కువ కేటాయించారని, ఆక్సీజన్ దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి కేటాయించారనీ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించారు. ఒకవేళ తెలంగాణలో ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే ఆ బాధ్యత అని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా, వరంగల్, ఖమ్మం సహా పలు మునిసిపల్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొనసాగిస్తోంది. దీంతో ఆయా ఎన్నికల ప్రచారాల్లో కరోనా నిబంధనలు పాటించే పరిస్థితి లేదు.
ప్రస్తుతం తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మాత్రం అమలవుతోంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ ఇది ఉంటోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ (11,12 తరగతులు) పరీక్షలు వాయిదా వేశారు. అంతకుమించి పెద్దగా ఆంక్షలు పెట్టలేదు.
తెలంగాణతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా విపత్తు నిర్వహణ కోసం 11 మంది ఐఎఎస్‌ల బృందం నిరంతరం పనిచేస్తోంది.
తెలంగాణలో అందుబాటులో ఉన్న పడకల విషయంలో ప్రభుత్వ లెక్కలకీ వాస్తవాలకూ పొంతన ఉండడం లేదు. ఒకవైపు తమ ఆక్సిజన్ ఉన్న పడకలు దొరకడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తుండగా, మరోవైపు వేల సంఖ్యలో పడకలు ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మొత్తం 6,513 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, అందులో 3,133 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 10,857 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, వాటిలో 3,880 పడకలు ఖాళీగా ఉన్నాయి.
ఇక ఐసీయూ (వెంటిలేటర్ లేదా సీపీఏపీ) పడకల విషయంలో కూడా ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 2,148 ఐసీయూ బెడ్స్ ఉంటే, వాటిలో 799 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 7,289 ఐసీయూ పడకలు ఉంటే, వాటిలో 2,699 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇవికాక 3,942 ఆక్సిజన్ లేని మామూలు పడకలు గవర్నమెంటు ఆసుపత్రుల్లోనూ, 12,141 పడకలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.