You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కోవిడ్: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 71 మంది మృతి

తెలంగాణలో సగటున 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 27న మొత్తం 8,061 కేసులు నమోదు కాగా, 56 మంది మరణించారు. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,465 నుంచి దాదాపు లక్షకు పెరిగింది.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య విపత్తుకు కారణమైన కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో భారత్‌తో ప్రస్తుతం ఉద్ధృతంగా ఉంది.

    దేశవ్యాప్తంగా ప్రతి రోజూ వందలాది ప్రాణాలను బలిగొంటోంది.

    ఈ నేపథ్యంలో ‘బీబీసీ’ ఈ రోజు ప్రత్యేకంగా కోవిడ్ లైవ్ కవరేజ్ చేపట్టింది. అందులో భాగంగానే ‘బీబీసీ న్యూస్ తెలుగు’ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్త పరిస్థితులపై విస్తృతమైన సమాచారం, కథనాలు అందించింది.

    ఈనాటి ఈ లైవ్ కవరేజ్‌ను ఇక్కడితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.

  2. ఏపీలో కొత్తగా 60 కోవిడ్‌ కేంద్రాలు: ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

    ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది.

    మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

    కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత, ఆస్పత్రుల్లో పడకల పెంపు, హెల్ప్‌డెస్క్‌పై ప్రధానంగా చర్చించారు.

    సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు.

    రాష్ట్రంలో కొత్తగా 60 కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 30 వేల కొవిడ్‌ పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

    ఆక్సిజన్‌ కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

    ‘‘కరోనా బాధితులు పూర్తిగా కోలుకునే వరకు బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నాం. ఆస్పత్రుల్లో పడకల కోసం రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ బాధితులకు 37వేల పడకలు పెంచాం. మరో 33వేల కొవిడ్‌ కేంద్రాల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాల్లో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రం కేటాయించిన 482 టన్నుల ఆక్సిజన్‌ను వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ కొరత రాకుండా చేస్తున్నాం. రెమ్‌డెసివిర్‌ సరఫరా, వినియోగంలో అక్రమాలు జరగకుండా చూసేందుకు కమిటీని వేశాం’’ అని మంత్రి వివరించారు.

  3. తమిళనాడు: చెన్నైలో పెరుగుతున్న కేసులు

    తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా రోజు వారీ నమోదు అవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

    రాష్ట్రం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి.

    ఒక్క చెన్నై నగరంలోనే ఏప్రిల్ 27న 4,640 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 31,136 మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.

    చెన్నైలో చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 27న తమిళనాడులో కోవిడ్ సోకి 77 మంది మరణించారు. అందులో 27 మంది ఒక్క చెన్నై నగరం నుంచే ఉన్నారు.

    పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనంగా ఆక్సిజన్ తో కూడిన 12000 పడకలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మరో వైపు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి కోవిడ్ చికిత్సలో వాడే రెమిడిసివిర్ మందును సరఫరా చేసేందుకు కిల్పౌక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ బూత్ ని ఏర్పాటు చేసింది.

    ఈ ఔషధాన్ని కొనుగోలు చేయడానికి రోగి బంధువులు తగిన పత్రాలను తీసుకుని వెళ్ళాలి. "రెమిడిసివిర్ ప్రాణాలను కాపాడే మందు కాదు. అది కేవలం రోగి ఆసుపత్రిలో ఉండే రోజుల సంఖ్యను తగ్గిస్తుంది" అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ ఔషధం కోసం వేలాది మంది కిల్పౌక్ ఆసుపత్రికి తరలి వెళుతున్నారు.

    మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సీన్ తీసుకునే ప్రక్రియ ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 1.5 కోట్ల వ్యాక్సీన్ డోసులు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టింది.

  4. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 71 మంది మృతి

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్రటరీ అనిల్ సింఘాల్ తెలిపారు.

    అత్యధికంగా నెల్లూరులో 9 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 8, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖలో 5, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.

    గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,681 మందికి టెస్ట్‌లు చేయగా వారిలో 14,669 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.

    ఒకటిరెండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని.. కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని సింఘాల్ తెలిపారు.

    రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 5,572 ఐసీయూ బెడ్లలో ప్రస్తుతం 2,570 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

    ఆక్సిజన్ బెడ్లు 7,744 అందుబాటులో ఉన్నాయన్నారు. 7643 జనరల్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బెడ్‌ల లభ్యతకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

    ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28,994 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని.. గత 3 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 13,864 రెపిడెసివిర్ ఇంజక్షన్లు అందించామని చెప్పారు.

  5. కోవిషీల్డ్: రాష్ట్రాలకు విక్రయించే వ్యాక్సీన్ ధర తగ్గించిన సీరమ్ ఇనిస్టిట్యూట్

    దేశంలోని రాష్ట్రాలకు తాము సరఫరా చేయబోయే కోవిషీల్డ్ వ్యాక్సీన్ ధర రూ. 100 తగ్గిస్తున్నట్లు తయారీసంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా వెల్లడించారు.

    ఇంతకుముందు చెప్పినట్లు రూ. 400 కాకుండా రూ. 300కే అందిస్తామని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు.

    తమ ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు మిగులుతాయని..వారు మరిన్ని వ్యాక్సీన్లు కొనుగోలు చేసి మరింతమంది ప్రజల ప్రాణాలు కాపాడగలరని ఆయన అన్నారు.

  6. కోవిన్ యాప్, ఆరోగ్యసేతు: వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్‌లో సాంకేతిక సమస్యలు, సరిచేశామన్న ఆరోగ్య సేతు.. ఓటీపీ రావడం లేదంటున్న ప్రజలు

    దేశంలో 18 ఏళ్లు దాటినవారంతా మే 1 నుంచి కోవిడ్ టీకా వేయించుకోవడానికి వీలుగా కోవిన్ యాప్, ఆరోగ్య సేతు, కోవిన్ వెబ్‌సైట్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది.

    అయితే, ఈ యాప్‌లు, పోర్టల్‌కు తాకిడి ఒక్కసారిగా పెరగడంతో అవి సరిగా పనిచేయడం లేదు.

    చాలామంది రిజిస్ట్రేషన్ కోసం తమ వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ ‘వన్ టైం పాస్‌వర్డ్’(ఓటీపీ) పొందలేకపోతున్నారు.

    ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రయత్నిస్తున్నవారిలో చాలామందికి ‘సర్వర్ ఇష్యూ’ అని వస్తోంది.

    కాగా రిజిస్ట్రేషన్లు మొదలైన 4 గంటల సమయంలో ఇబ్బంది తలెత్తింది కానీ, ఆ తరువాత సమస్య పరిష్కారమైంది అంటూ ఆరోగ్యసేతు యాప్ ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

  7. ఒడిశా: పెరిగిన కేసులు, మే 1 నుంచి టీకాలు వేయడం సందేహమే, సందీప్ సాహు, భువనేశ్వర్ నుంచి

    మంగళవారం కొత్తగా 3073 కేసులు నమోదు కావడంతో, ఒడిశాలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 20 వేలు దాటింది. వీటిలో ప్రస్తుతం 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    మంగళవారం 10 మంది చనిపోవడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2007కు చేరింది.

    గత ఐదు రోజులుగా రోజూ 6 వేలు నుంచి 7 వేల మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి.

    కరోనా కేసులు పీక్స్‌కు చేరుతున్నట్లు ఇది సంకేతమని రాష్ట్ర ఆరోగ్య విభాగం చెబుతోంది. కానీ, అలా చెప్పడం తొందరపాటే అవుతుందని నిపుణుల చెబుతున్నారు.

    రాష్ట్రంలో ఇప్పటివరకూ పడకలు, మెడికల్ పరికరాలు, ఆక్సిజన్ కొరత ఏదీ కనిపించలేదు. కానీ, తగినన్ని టీకా డోసులు లేకపోవడంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మీద తీవ్ర ప్రభావం పడింది.

    రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు 2 కోట్ల మందికి ఉచితంగా టీకా వేస్తామని ఆదివారం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

    కానీ, తగినన్ని వ్యాక్సీన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో అది ప్రారంభం కావడం ఆలస్యం కావచ్చని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బిజయ్ పాణిగ్రాహి మంగళవారం చెప్పారు.

    రాష్ట్రంలో ప్రస్తుతానికి 1.23 లక్షల కోవిషీల్డ్ డోసులే ఉన్నాయి. అవి ఒక్క రోజు కూడా సరిపోవు.

  8. కోవిన్ యాప్: 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కోసం మొదలైన రిజిస్ట్రేషన్

    మూడో దశలో 18 ఏళ్లు, పైబడిన వారు టీకా వేసుకోడానికి రిజిస్ట్రేషన్ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి మొదలైంది.

    కోవిన్ యాప్, cowin.gov.in, ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లో టీకా కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు.

    కానీ, ఈ దశలో టీకా వేసుకోడానికి ప్రజలు కచ్చితంగా ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందులా నేరుగా ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్ చేసుకోవడం కుదరదు.

    రిజిస్ట్రేషన్ ఇలా

    ·మొదట cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేయాలి.

    ·మీ ఫోన్ నంబర్‌కు ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దానిని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి వెరిపై ఐకాన్ మీద క్లిక్ చేయాలి. దాంతో మీ నంబరు వెరిఫై అవుతుంది.

    ·ఆ తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజీ కనిపిస్తుంది.

    ·అక్కడ మీ వివరాలు ఎంటర్ చేయాలి. ఒక ఫొటో ఐడెంటిటీ కార్డ్ వివరాలు కూడా షేర్ చేయాలి.

    ·మీకు, ఇప్పటికే ఏవైనా వ్యాధులు అంటే షుగర్, బ్లడ్ ప్రెషర్, ఆస్తమా లాంటివి ఉంటే వాటి గురించి వివరంగా రాయాలి.

    ·వివరాలు ఇవ్వడం పూర్తి కాగానే రిజిస్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.

    ·రిజిస్ట్రేషన్ పూర్తికాగానే, కంప్యూటర్ స్క్రీన్ మీద మీ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి.

    ఇంతకు ముందు రెండు దశల్లో కూడా ప్రభుత్వం కోవిన్ ప్లాట్‌ఫాం ఆప్షన్ ఉంచింది. కానీ దానితోపాటూ ప్రజలకు వ్యాక్సీన్ సెంటర్‌ దగ్గరకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కూడా కల్పించింది. కానీ, ఈసారీ టీకా కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశారు.

    దీనితోపాటూ ప్రభుత్వం మూడో దశలో మరికొన్ని నియమాలు కూడా మార్చింది. మొదటి, రెండు దశల్లో ఒక వ్యక్తి, తనతోపాటూ మరో నలుగురిని యాడ్ చేసే ఆప్షన్ ఉండేది. కానీ ఇక మే 1 నుంచి మొదలయ్యే దశలో ఒక వ్యక్తి తన పేరును మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    రిజిస్ట్రేషన్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా వేయించుకోడానికి అపాయింట్‌మెంట్ లభిస్తుంది.

    మే 1 నుంచి ఎన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా వేస్తారు, అనేదానిలో ఎవరికి ఎక్కడ అపాయింట్‌మెంట్ లభిస్తుంది అనేదానిని బట్టి ఒక స్పష్టత రానుంది.

  9. రాజస్థాన్: కరోనా కేసులు పెరుగుతున్నా, ఏర్పాట్లు పెరగడం లేదు, మొహర్ సింగ్, జైపూర్ నుంచి

    రాజస్థాన్‌లో ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

    ప్రభుత్వ డాక్టర్లు, శ్మశానాల్లో, అంబులెన్స్ సిబ్బంది సహా మిగతా చాలా మంది రాష్ట్రంలో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా భయానకంగా ఉందని చెబుతున్నారు.

    రోగుల సంఖ్య హఠాత్తుగా పెరగడంతో బెడ్స్, ఆక్సిజన్, మందుల సమస్య కూడా పెరిగింది.

    రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల కొరతతో రోగులు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డాక్టర్ల వివరాల ప్రకారం పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో 429 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు జరుగుతున్నాయి. కానీ ఇవి కూడా సరిపోవడం లేదు.

    జైపూర్ సహా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుచేశారు. జనం వైద్యం కోసం అల్లాడుతుంటే, ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

    రాష్ట్రంలో ఇప్పటివరకూ 84,11,797 శాంపిళ్లలో 5,46,964 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 1,55,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3806 మంది చనిపోయారు.

    ఏప్రిల్ 27న నమోదైన 16,089 కేసులు, 121 మరణాలు ఇప్పటివరకూ అత్యధికం.

    జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, కోటాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గతంలో ప్రతి రోజూ 6500 ఆక్సిజన్ సిలిండర్లు వినియోగించేవారని, ఇప్పుడు అది 31,425 సిలిండర్లకు చేరిందని ప్రభుత్వం చెబుతోంది.

    రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న 429 ఆస్పత్రుల్లో 282 కోవిడ్ కేర్ సెంటర్లు, 87 డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులు, 225 ప్రైవేటు హాస్పిటళ్లకు ఆథరైజేషన్ ఉంది. కానీ రోగుల సంఖ్య పెరగడంతో ఈ ఏర్పాట్లు సరిపోవడం లేదు.

  10. ఝార్ఖండ్‌లో పరిస్థితి ఆందోళనకరం, ఆనంద్ దత్త, రాంచీ నుంచి

    ఝార్ఖండ్‌లో కోవిడ-19 పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది. ఏప్రిల్ 27 రాత్రి 9 వరకూ రాష్ట్రంలో 51,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    ఏప్రిల్ 1 నుంచి 26 వరకూ వెయ్యి మందికి పైగా చనిపోయారు.

    మరోవైపు మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకూ 2246 మందికి చనిపోయారు.

    గత మంగళవారం మొత్తం 103 మంది మృతులకు అంత్యక్రియలు చేశారు. రాష్ట్రంలోని రాంచీ, తూర్పు సింహభూమ్, రామగఢ్, ధన్‌బాద్, బొకారోలో ఎక్కువ మంది చనిపోయారు.

    పరిస్థితి ఘోరంగా మారుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 వరకూ లాక్‌డౌన్ విధించింది. బుధవారం సీఎం హేమంత్ సోరెన్ పరిస్థితిని సమీక్షిస్తారు.

    దీనిని పెంచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఇంతకు ముందుకంటే మెరుగుపడింది. కానీ రోగులు ఇప్పటికీ ఇబ్బందుల పడుతున్నారు.

    రాష్ట్రంలో అతిపెద్ద ఆస్పత్రి రిమ్స్ పేయింగ్ వార్డులో మంగళవారం అరగంటపాటు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. ఆసమయంలో అక్కడ 69 మంది రోగులు ఉన్నారు. అయితే తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.

  11. గుజరాత్- ఆస్పత్రుల బయట అంబులెన్సుల క్యూ, ఆక్సిజన్‌ కొరత, తేజస్ వైద్య, అహ్మదాబాద్ నుంచి

    కరోనాతో గుజరాత్‌ పారిశ్రామిక రాజధానిగా భావించే అహ్మదాబాద్‌లో పరిస్థితి రాష్ట్రంలోనే అత్యంత ఘోరంగా ఉంది.

    వారం రోజుల గణాంకాలు చూస్తే నగరంలో ప్రతి రోజూ 5500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య రోజూ 20నుంచి 25 మధ్య ఉంటోంది.

    రాష్ట్ర ప్రభుత్వం మరణాల సంఖ్యను తగ్గించి చెబుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

    బెడ్స్ కోసం వేచిచూస్తున్న రోగులతో ఉన్న అంబులెన్సులతో ఆస్పత్రుల బయట పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయి.

    రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచింది. కానీ అవి సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులకు రోగులు భారీగా తరలివస్తుండడంతో, నగరంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.

    ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కొరత తీవ్రంగా ఉంది. కానీ ఆక్సిజన్ అయిపోతే కొత్తగా సరఫరా ఎక్కడ్నుంచి తీసుకురావాలని ఆస్పత్రి నిర్వాహకులు ఆందోళనలో ఉన్నారు.

    రోగుల ఆక్సిజన్ లెవల్ 94-95 కంటే తక్కువ ఉంటే రోగులను చేర్పించుకోమని చాలా ఆస్పత్రులు ముందే చెబుతున్నాయి.

    అహ్మదాబాద్‌లోని కొన్ని మార్కెట్లన్నీ కలిసి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ వ్యాపారం నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

    అహ్మదాబాద్ నగరంలో పౌర కేంద్రాలను మే 4 వరకూ మూసివేశారు. నగరంలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ఇది ఆక్సిజన్ సరఫరా అందించేలా 24 గంటలూ పనిచేస్తోంది. కానీ ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.

  12. క్యాష్ చెల్లిస్తేనే చేర్చుకుంటామన్న ఆస్పత్రి, రోడ్డుపై కరోనా రోగి మృతి, శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఘటన

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సమయానికి వైద్యం అందక ఒక కరోనా బాధితురాలు రోడ్డుపైనే చనిపోయారు.

    హాస్పిటల్‌లో చేర్చుకోవాలంటే నగదు రూపంలో చెల్లింపులు చేయాలని.. ఆన్‌లైన్ పేమెంట్ తీసుకోబోమని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో బాధితురాలి కుటుంబీకులు ఏటీఎంలకు వెళ్లారు.. ఈలోగా ఆలస్యం కావడంతో ఆమె మృతిచెందారు.

    రాజాంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగినట్లు మృతురాలి కుమార్తె చెప్పారు.

    రోగి బంధువులు ఆన్ లైన్ పేమెంట్ చేస్తామని చెప్పినా అంగీకరించని ఆస్పత్రి సిబ్బంది, నగదు చెల్లింపులు జరిపితేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు.

    దీంతో రోగి బంధువులు డబ్బు తీసుకురావడానికి దాదాపు 3 గంటలపాటు చుట్టుపక్కల ఉన్న ఏటీఎంలన్నీ తిరిగారు.

    ఆలోపు వైద్యం అందకపోవడంతో బాధితురాలు రోడ్డుమీదే ప్రాణాలు విడిచారు.

    మృతురాలిది రాంజాం మండలం పెంట అగ్రహారం.

  13. అస్సాం: ఎన్నికల తర్వాత హఠాత్తుగా పెరిగిన కరోనా కేసులు, దిలీప్ కుమార్ శర్మ, గువాహటి నుంచి

    ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వారం నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18 మంది చనిపోయారు.

    ఇలా రాష్ట్రంలో కరోనాతో గత ఐదు రోజుల్లో 73 మంది చనిపోయారు. రాష్ట్ర రాజధాని గువాహటి, కామరూప్ మెట్రో జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ మంగళవారం 1313 కేసులు నమోదయ్యాయి.

    నిజానికి ఇదే నెల ఏప్రిల్ 6న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కరోనా కేసులు హఠాత్తుగా పెరగడం మొదలయ్యాయి. కామరూప్ మెట్రో జిల్లాలో గత ఐదు రోజుల్లో 4752 కేసులు నమోదయ్యాయి.

    మరోవైపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండడంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 వరకూ నైట్ కర్ఫ్యూ విధించారు.

    దీంతోపాటూ నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ స్కూళ్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసేశారు. రాజధాని దిల్లీ, మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం, మందులు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత్ బిస్వ్ సర్మా రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల కోసం అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    మీడియాతో మాట్లాడిన ఆయన అస్సాంలో రెమెడెసివీర్ 25 వేల ఇంజెక్షన్లు స్టాక్‌లో ఉన్నాయని, మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఉపయోగించేలా అస్సాంలో ప్రస్తుతం 8 ఆక్సిజ్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.

    “అస్సాంలో 8 ఆక్సిజన్ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల అవసరాలు పూర్తి చేయడానికి మేం పీఎం కేర్స్ నిధుల ద్వారా మరో 10 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మా దగ్గర 2 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు కూడా స్టాక్‌లో ఉన్నాయి” అని మంత్రి చెప్పారు.

    మంగళవారం అస్సాంకు 4 లక్షల కోవిషీల్డ్, లక్ష కోవాగ్జిన్ డోసులు కూడా అందినట్లు మంత్రి చెప్పారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 6,57,180 డోసుల నిల్వ ఉన్నాయని తెలిపారు.

    అస్సాం ఆరోగ్య విభాగం సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 19,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  14. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా కోవిడ్‌19 వ్యాప్తి ఎలా ఉంది? కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి, ఆక్సిజన్, మందుల కొరత తీర్చడానికి తెలుగు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో బీబీసీ ప్రతినిధులు సతీశ్, శంకర్, శ్రీనివాస్, పద్మ మీనాక్షి వివరించారు.

  15. పశ్చిమ బెంగాల్: పెరుగుతున్న కేసులు, ఆక్సిజన్ కొరత లేదన్న ప్రభుత్వం, పీఎం తివారీ, కోల్‌కతా నుంచి

    పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 16,403 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటాయి.

    గత 24 గంటల్లో కోవిడ్‌తో 73 మంది చనిపోయారు. రాజధాని కోల్‌కతాలో రాష్ట్రంలో అత్యధికంగా 3708 కేసులు, 24 మరణాలు నమోదయ్యాయి.

    ఆ తర్వాత పక్కనే ఉన్న ఉత్తర పరగణా జిల్లాలో దాదాపు మూడున్నర వేల కేసులు నమోదయ్యాయి, 13 మంది చనిపోయారు.

    రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం మంగళవారం చెప్పింది. రోజువారీ డిమాండ్ 300 మెట్రిక్ టన్నులు అయితే, రాష్ట్రంలో రోజూ 497 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపింది.

    రాష్ట్రంలోని 105 ఆస్పత్రులకు పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మరో 41 ఆస్పత్రులకు ఈ సౌకర్యం ప్రారంభించనున్నారు. కేంద్రం అనుమతితో ఐదు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో మూడింటి పనులు కూడా పూర్తయ్యాయి.

    గత 24 గంటల్లో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 29.67 ఉంది.

    ఆరోగ్య విభాగం జారీ చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుతం 12500 మంది రోగులకు 24 గంటలూ ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని, మే 15 నాటికి ఆక్సిజన్ సామర్థ్యాన్ని 15 వేల మందికి అందించేలా పెంచుతామని తెలిపారు.

    ఇప్పటివరకూ 2.61 లక్షల వ్యాక్సీన్ డోసులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల టీకా డోసులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 2 కోట్ల డోసులు ప్రభుత్వ ఆస్పత్రులకు, కోటి ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వనున్నారు.

    రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి మంగళవారం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.

  16. బిహార్: రాష్ట్రంలో ప్రతి రోజూ 12 వేలకు పైగా కొత్త కేసుల నమోదు, నీరజ్ సహాయ్, పాట్నా నుంచి

    బిహార్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా పరిస్థితిని సమీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

    బిహార్‌లో రోజురోజుకూ కరోనా సోకుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

    మంగళవారం రాష్ట్రంలో 12,604 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

    సోమవారం నమోదైన పాజిటివ్ కేసుల కన్నా మంగళవారం 801 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

    దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,275కు చేరింది.

    అధికారిక గణాంకాల ప్రకారం, మంగళవారం 85 మంది చనిపోయారు.

    అయితే, కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 3,31 418 కాగా రికవరీ రేటు 77.43 శాతం ఉంది.

    గత 24 గంటల్లో బిహార్‌లో 1,00,328 టెస్టులు చేశారు. కరోనా సంక్రమణ రేటు 14 శాతానికి పెరిగినట్లు గురించారు.

    సోమవారం సంక్రమణ రేటు 12.68 శాతంగా నమోదైంది.

    ప్రస్తుతం బిహార్ రాజధాని పాట్నాలో అత్యధికంగా 17 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

    ఏడువేల యాక్టివ్ కేసులతో మరొక జిల్లా రెండో స్థానంలో ఉండగా ఔరంగాబాద్, బేగూసరాయ్‌లలో నాలుగు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  17. కోవిడ్ మృతదేహాలను ఉచితంగా శ్మశానానికి తరలిస్తున్న మహిళ, గీతా పాండే, బీబీసీ ప్రతినిధి

    గత వారం రోజులుగా ఆస్పత్రి నుంచి శ్మశానవాటికకు ఎన్నిసార్లు తిరిగానో లెక్క లేదంటున్నారు లక్నోకు చెందిన వర్ష వర్మ. 42 ఏళ్ల వర్ష ఒక రచయిత్రి.

    ప్రాణాంతకంగా మారిన కరోనా సేకండ్ వేవ్‌లో ఆమె ఆస్పత్రుల నుంచి శ్మశానానికి ఉచితంగా మృతదేహాలను తరలిస్తున్నారు.

    రోజుకు 8 నుంచి 12 దాకా మృతదేహాలను తీసుకువెళుతున్నారు. ఒక్కోసారి వారికి దహన సంస్కారాలు కూడా చేస్తున్నారు.

    "అంతటా విషాదం, భయం కమ్ముకుని ఉన్నాయి. ప్రజలు దీనంగా సహాయం కోసం అర్థిస్తున్నారు" అని వర్ష అన్నారు.

    వర్ష బాల్య స్నేహితురాలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తున్న సమయంలో ఆమెకు అందులో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిసింది.

    అప్పటినుంచీ ఆమే స్వయంగా మృతదేహాలను స్మశానవాటికకు తరలించడం మొదలుపెట్టారు.

    ఇలా కోవిడ్ మృతులకు దగ్గరగా మసలడం ప్రమాదకరమని తన కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారని వర్ష చెప్పారు.

    కానీ ఈ మాత్రం సాయం కూడా చేయలేకపోతే ఎలా అంటున్నారు వర్ష. ఏది ఏమైనా ఈ పని ఆపేది లేదని ఆమె తేల్చి చెప్పారు.

  18. మహారాష్ట్ర: పుణెలో పెరిగిన రికవరీ రేటు, రెమెడెసివీర్ కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్, రాహుల్ గైక్వాడ్, పుణె నుంచి

    దేశంలో కరోనా ఫస్ట్ వేవ్‌లాగే సెకండ్ వేవ్‌లో కూడా మహారాష్ట్రలోని పుణె నగరం తీవ్రంగా ప్రభావితం అయ్యింది.

    ఇక్కడ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

    మందులు, ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కోసం జనం పోరాడుతున్నారు. కానీ ఏప్రిల్ 19 తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది.

    ఇక్కడ నమోదయ్యే కొత్త కేసుల కంటే, కోలుకుంటున్న కేసుల సంఖ్య పెరుగుతోంది.

    గత ఒక వారం నుంచీ అలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. జిల్లాలో ప్రతి రోజూ నమోదయ్యే కొత్త కేసులు 54 వేల నుంచి 47 వేలకు తగ్గాయి.

    ఏప్రిల్ 19న పుణెలో 4587 కొత్త కేసులు వచ్చాయి. 6473 మంది రోగుల కోలుకున్నారు. అటు ఏప్రిల్ 26న 2538 కొత్త కేసులు నమోదవగా, 4351 మంది రికవర్ అయ్యారు.

    కొత్త కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అందుకే ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడుతున్నట్టు కనిపిస్తున్నాయి.

    జనం ఇప్పుడు ఆస్పత్రులవైపు పరుగులు తీయడం తగ్గింది. అదే గత వారం పరిస్థితి చూస్తే ఆక్సిజన్ బెడ్ వెతకడానికి రోగి బంధువులు నానాతంటాలూ పడ్డారు.

    డివిజినల్ కమిషనర్ డాష్‌ బోర్డ్ ప్రస్తుత గణాంకాల ప్రకారం ఏప్రిల్ 27న నగరంలో 227 ఆక్సిజన్ బెడ్స్, 1158 ఐసొలేషన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా ఎన్జీవోలు కూడా కోవిడ్ సెంటర్లు ప్రారంభిస్తుండడంతో పడకల సంఖ్య బాగా పెరిగింది.

    రెమెడెసివీర్ కోసం ప్రభుత్వ హెల్ప్ లైన్

    ఈ మహమ్మారి చికిత్స కోసం నాన్ వైరల్ డ్రగ్ రెమెడెసివీర్‌కు చాలా డిమాండ్ ఉంది. ఈ మందు డిమాండ్ పుణెలో కూడా ఉంది.

    మెడికల్ షాపుల దగ్గర ఈ మందు కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వరకూ రోగుల బంధువులు ఈ మందు దొరకడం లేదంటూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు కూడా చేశారు.

    దాంతో రెమెడెసివీర్ ఔషధం అందుబాటులో ఉండేలా చూడడానికి కలెక్టర్ కార్యాలయం తరఫున ఒక హెల్ప్ లైన్ నంబర్ జారీ చేశారు. అయితే ఈ సమస్య ఇంకా పూర్తిగా తీరలేదు.

  19. 'ప్రభుత్వ వైఫల్యమే మా తాత మరణానికి కారణం'

    దిల్లీలో కోవిడ్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్ అందక చనిపోయిన ఒక కరోనా రోగి మనవరాలు, "ప్రభుత్వం నిద్రపోతోందా? ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే" అని ఆవేదన వ్యక్తం చేశారు.

  20. కర్ణాటక: లాక్‌డౌన్ అమలు, 20 మందిలో డబుల్ మ్యూటెంట్, ఇమ్రాన్ ఖురేషీ, బెంగళూరు నుంచి

    కర్ణాటకలో నిన్న రాత్రి నుంచి 14 రోజుల లాక్‌డౌన్ మొదలయ్యింది. ఉదయం 6 నుంచి 10 వరకూ మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు కోసం ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు.

    గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీగా 31, 830 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    బెంగళూరులో ఒక్కరోజులో అత్యధికంగా 17,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం 180 మరణాలు నమోదుకాగా, ఒక్క బెంగళూరులోనే 97 మంది చనిపోయారు.

    రాష్ట్రంలో మొదటి వేవ్ రికార్డులు బద్దలు కావడంతో బీజేపీ పాలిత కర్ణాటకలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సిఫారసులను అమలు చేయాల్సివచ్చింది.

    ఆక్సిజన్ వసతి ఉన్న పడకల కోసం ప్రయత్నిస్తున్నామని దాదాపు 500 నుంచి 700 మంది చెప్పారు.

    స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేవని, ఆక్సిజన్, అత్యవసర ఔషధాల కొరత తీవ్రంగా ఉందని స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థలు చెబుతున్నాయి.

    మరోవైపు, బెంగళూరు, కలబురగిలోని 20 మంది రోగుల్లో వైరస్ డబుల్ మ్యూటెంట్(బి 1617)ను గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ చెప్పింది.

    ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టే ముందు గత 24 గంటల్లో చాలా మంది పట్టణాల నుంచి గ్రామాలకు తరలిపోవడం కర్ణాటకలో కనిపించింది.