జార్జియా, పెన్సిల్వేనియాల్లో జో బైడెన్ ముందంజ... జార్జియాలో రీకౌంటింగ్

పెన్సిల్వేనియాలో తన ఆధిక్యం తగ్గిపోతుండటంతో కౌంటింగ్ నిలిపివేయాలంటూ ట్రంప్ బృందం కోర్టునాశ్రయించింది. అయితే దీనికి ఫెడరల్ జడ్జి నిరాకరించారు. మరోవైపు, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని బైడెన్ కోరారు.

లైవ్ కవరేజీ

  1. ఈ కీలక రాష్ట్రాల్లో ఎవరు ముందంజలో ఉన్నారంటే...

    అమెరికా ఎన్నికల ఫలితాలు

    ఫొటో సోర్స్, EPA

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చటానికి ఇక కేవలం ఓ పిడికెడు రాష్ట్రాల ఫలితాలే మిగిలివున్నాయి.

    జో బైడెన్ ఇప్పటివరకూ 243 ఎలొక్టర్ కాలేజీ ఓట్లు గెలుచుకున్నారు. ట్రంప్ ఖాతాలో 214 ఓట్లు ఉన్నాయి. అధ్యక్షుడిగా గెలవాలంటే ఎవరికైనా కనీసం 270 ఓట్లు కావాలి.

    కీలకమైన ఆరిజోనా, జార్జియా, నెవడా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇంకా ఫలితం తేలలేదు.

    ఈ రాష్ట్రాల్లో గెలుపుఓటములు విభన్నంగా ఉండొచ్చు.

    ట్రంప్ 270 సీట్లు సంపాదించాలంటే.. విస్కాన్సిన్‌లో (10 ఓట్లు) ఓడిపోయినా కానీ.. జార్జియా (16 ఓట్లు), నార్త్ కరోలినా (15), పెన్సిల్వేనియా (20)లతో పాటు ఆరిజోనాను (11) కానీ, నెవడాను (6) కానీ గెలుచుకోవాల్సి ఉంటుంది.

    జో బైడెన్ 270 సీట్లు సాధించాలంటే.. పెన్సిల్వేనియా (20 ఓట్లు)లో ఓడిపోయినా కానీ ఆరిజోనా (11), జార్జియా (16), నెవడా (6)లలో గెలవాల్సి ఉంటుంది.

    అయితే.. విస్కాన్సిన్, ఆరిజోనాల్లో బైడెన్ గెలవబోతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు చెప్తున్నప్పటికీ.. ఇప్పుడే ఏదీ చెప్పలేమని బీబీసీ – తన పర్యవేక్ష భాగస్వాముల ద్వారా – భావిస్తోంది.

    విస్కాన్సిన్‌ (10 ఓట్లు)లో బైడెన్ గెలిచినట్లయితే.. ఆయన అధ్యక్ష పదవి చేపట్టటానికి ఇక ఆరిజోనా (11 ఓట్లు), నెవడా (6 ఓట్లు) ల్లో గెలిస్తే సరిపోతుంది.

    ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ఫలితాలు కొంత సమయం తర్వాత వెలువడవచ్చు.

    జార్జియాలో అన్ని బ్యాలట్లనూ లెక్కించే వరకూ రాత్రంతా ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. ఇంకా సుమారు 50,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇక్కడ ట్రంప్ ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతోందని.. ఇప్పుడు 24,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది.

    నెవడాలో పోటీ నరాలు తెగేంత ఉత్కంఠగా సాగుతోంది. ఇక్కడ బైడెన్ సుమారు 8,000 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కొనసాగుతున్నారు. తదుపరి ఫలితాలు ప్రకటించటానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

    పెన్సిల్వేనియాలో.. ట్రంప్ ఆధిక్యం తగ్గింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటల వరకూ 90 శాతం బ్యాలట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో ట్రంప్ 1,64,414 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఆరిజోనాలో బైడెన్ ప్రస్తుతం 68,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తదుపరి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

    నార్త్ కరోలినాలో చాలా వరకూ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మిగతా ఓట్లను క్రోడీకరించాల్సి ఉంది. ట్రంప్ సుమారు 77,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    విస్కాన్సిన్‌లో బైడెన్ సుమారు 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు చెప్తున్నారు. కొన్ని వార్తా సంస్థలు ఆయన గెలిచినట్లు కూడా చెప్తున్నాయి. అయితే.. బీబీసీ భాగస్వామి రాయిటర్స్ ఇంకా ఫలితాల సరళిని తెలియజేయాల్సి ఉంది.

  2. ఎన్నికల్లో విజేత ఎవరో కోర్టులు నిర్ణయించగలవా?

    మిచిగన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసన తెలుపుతున్నారు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, మిచిగన్‌లో నిరసన తెలుపుతున్న ట్రంప్ మద్దతుదారులు

    అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు గెలుచుకోనున్నారో ఇంకా స్పష్టత లేదు. ఇంతలోనే ఈ మొత్తం ప్రక్రియ విషయంలో చట్టబద్దమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.

    ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తుంటే డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు పథంలో వెళుతుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి, దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును సవాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగవచ్చు?

    ఎటువంటి ఆధారాలు లేకుండా ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, మిషిగన్ రాష్ట్రాలలో కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ పోటీ ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుందనే అంశంపై బీబీసీ న్యాయ నిపుణులతో మాట్లాడింది.

  3. ఆరిజోనాలో స్వల్పంగా తగ్గిన బైడెన్ ఆధిక్యం...

    అమెరికా ఎన్నికల ఫలితాలు

    ఫొటో సోర్స్, Reuters

    ఆరిజోనా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు తాజా లెక్కలు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం తగ్గినట్లు చెప్తున్నాయి.

    రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మారికోపా కౌంటీ తాజాగా 1,40,000 ఓట్ల లెక్కల వివరాలను విడుదల చేసింది.

    ఈ కౌంటీలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మీద బైడెన్ ఆధిక్యం ఇంతకుముందు కన్నా దాదాపు 11,000 ఓట్లు తగ్గిందని, ఆయన ప్రస్తుత ఆధిక్యం 74,514 ఓట్లుగా ఉందని తాజా ఫలితాలు చెప్తున్నాయి.

    రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ట్రంప్ మీద బైడెన్ 68,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఆరిజోనాలో ట్రంప్ గెలవాలంటే.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఇంకా లెక్కించాల్సి ఉన్న ఓట్లన్నిటినీ ట్రంప్ గెలుచుకోవాల్సి ఉంటుందని.. ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో సంప్రదాయంగా డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేసే ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పింది.

    ఆరిజోనాలో డెమోక్రాట్లు గెలవబోతున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ద్వారా పలు మీడియా సంస్థలు చెప్తున్నప్పటికీ.. ఈ రాష్ట్రంలో ఫలితాన్ని నిర్ధారించటానికి ఇంకా సమయం పడుతుందని బీబీసీ భావిస్తోంది.

  4. ఆరిజోనా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ట్రంప్ మద్దతుదారుల ఆందోళన

    ఆరిజోనాలో నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఆరిజోనాలో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్న మారికోపా కౌంటీ రికార్డర్ కార్యాలయం ముందు ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

    డోనాల్డ్ ట్రంప్‌కు పడిన ఓట్లను లెక్కించబోరంటూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులతో దాదాపు 200 మంది ట్రంప్ మద్దతుదారులు ఈ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.

    అయితే కొన్ని ఓట్లు లెక్కించటం లేదనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. తాము విధివిధానాలన్నిటినీ పాటిస్తున్నామని.. అన్ని ఓట్లూ లెక్కిస్తున్నామని అధికారులు పునరుద్ఘాటించారు.

    భద్రతా చర్యల కోసం అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే కౌంటింగ్ ఆపలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఇప్పుడు ఏం జరుగుతోంది?

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల లైవ్ పేజీకి స్వాగతం. గత కొన్ని గంటల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

    ఆరు కీలకమైన రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో తేల్చే రాష్ట్రాలు(అలాస్కా, అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్కెరోలినా, పెన్సిల్వేనియా) ఇవే. ఒకవైపు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపుకు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ట్రంప్ విజయ అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయలేం.

    • ప్రస్తుతం బైడెన్ చేతిలో 243 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ 214 ఓట్లు గెలుచుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే 270 ఓట్లు అవసరం.
    • డెమొక్రాట్ల కంచుకోటగా ఏళ్ల నుంచీ వస్తున్న మిషిగన్‌ను మళ్లీ బైడెన్ కైవసం చేసుకున్నారు. 2016 ఎన్నికల్లో ఇక్కడ ట్రంప్ గెలిచారు.
    • జార్జియాలో బ్యాలెట్లన్నీ పూర్తయ్యేవరకు లెక్కింపు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 90,000 ఓట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ కూడా ట్రంప్ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఇది 28,000కు పడిపోయింది.
    • నెవాడాలో పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ కేవలం 7,647 ఓట్లతో బైడెన్ ముందంజలో ఉన్నారు.
    • అరిజోనాలో కొన్నిచోట్ల ఇంకా ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ అంచనాలు ఎప్పుడు వస్తాయో స్పష్టతలేదు.
    • విస్కాన్సిన్‌లో ప్రస్తుతం 20,510 ఓట్లతో బైడన్ ముందంజలో ఉన్నారు.
    • పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆదిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.30నాటికి ట్రంప్‌కు జో బైడెన్ కంటే 1,64,414 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ముందు రోజు ఇది 3,79,639గా ఉండేది.
    • నార్త్ కెరోలినాలో 96 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇక్కడ 76,737 ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.
    • మరోవైపు జార్జియాలోనూ కౌంటింగ్‌పై ట్రంప్ బృందం కోర్టులను ఆశ్రయిస్తోంది. ఇలా కోర్టును ఆశ్రయించిన రాష్ట్రాల్లో జార్జియా నాలుగోది.
    • రెండు వర్గాల ప్రతినిధులూ నిరసనలు చేపడుతున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో మా ఓట్లు లెక్కించండి అంటూ డెమొక్రాట్లు నిరసన చేపడుతున్నారు. అరిజోనాలో కౌంటింగ్ నిలిపివేయాలని ట్రంప్ మద్దతుదారులు నిరసన చేపడుతున్నారు.
    • సెనేట్‌పై రిపబ్లికన్లు మళ్లీ పట్టు సంపాదించారు.
    • ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.
  6. పెన్సిల్వేనియాలో తగ్గిపోతున్న ట్రంప్ ఆధిక్యం

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కీలకమైన పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది.

    స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30నాటికి ట్రంప్‌కు జో బైడెన్ కంటే 1,64,414 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ముందు రోజు ఇది 3,79,639గా ఉండేది.

    బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ శాతం బైడెన్ వైపే వస్తున్నట్లు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ తెలిపింది.

    గత ఎన్నికల్లో ఇక్కడ ట్రంప్ గెలిచారు. అంతకుముందు ఆరు ఎన్నికల్లోనూ ఇక్కడ డెమొక్రాట్లే విజయం సాధించారు.

  7. బైడన్ ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలివే

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఫలితాల్లో బైడెన్ కాస్త ముందంజలో కనిపిస్తున్నారు. ఆయన ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాలివే.

    కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, కొలరాడో, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మెయిన్ (3), మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిషిగన్, మిన్నెసోటా, న్యూహాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూమెక్సికో, న్యూయార్క్, ఆరెగాన్, రోడ్ ఐలండ్, వెర్మోంట్, వర్జీనియా, వాషింగ్టన్, విస్కాన్సిన్.

    మొత్తంగా ఆయన ఇప్పటివరకు 243 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సంపాదించారు. నెవాడా, ఆరిజోనాలలోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  8. ఇప్పుడు ఏం జరుగుతోంది?

    వైట్‌హౌస్‌లో కూర్చొనేందుకు అవసరమైన మెజార్టీ ఇప్పటికే తనకు వచ్చిందని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ భావిస్తున్నారు. అయితే కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఫలితాల ప్రకటన ఇప్పటికీ పూర్తికాకపోవడంతో ఆయన ఇంకా గెలుపుపై ఎలాంటి ప్రకటనా చేయడంలేదు.

    మిషిగన్‌లో బైడన్ విజయం సాధించారని బీబీసీ తెలిపింది. అయితే విస్కాన్సిన్‌లోనూ ఆయన గెలుపు దిశగా దూసుకు వెళ్తున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. పెన్సిల్వేనియా ఫలితాలు ఇంకా ఎటూ తేలలేదు. అయితే తాను ఇప్పటివరకు సంతృప్తిగానే ఉన్నట్లు బైడెన్ తెలిపారు.

    మరోవైపు మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియాల్లో కౌంటింగ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ట్రంప్ వర్గం చట్టపరమైన చర్యలను మొదలుపెట్టింది.

    చాలా బ్యాలెట్లు మోసపూరితమైనవి ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే, తన వాదనను సమర్థించే ఎలాంటి ఆధారాలనూ ఆయన బయటపెట్టడం లేదు. మరోవైపు అంతర్జాతీయ పరిశీలకులు కూడా ఎలాంటి మోసం జరగలేదనే చెబుతున్నారు.

    కౌంటింగ్ జరిగే అన్ని చోట్లా పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. అయితే డెట్రాయిట్‌లో మాత్రం కౌంటింగ్ గదిలోకి తమను అనుమతించడం లేదంటూ డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీల ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

  9. పెన్సిల్వేనియాలో నిరసనలు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    మరో కీలకమైన రాష్ట్రం పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో నిరసనలు జరుగుతున్నాయి. పెన్సిల్వేనియాతోపాటు విస్కాన్సిన్, మిషిగన్, జార్జియాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రతి ఓటునూ లెక్కపెట్టాలని నిరసనలు జరుగుతున్నాయి.

    నిరసనలు చేపడుతున్నవారితో బీబీసీ ప్రతినిధులు లాంగ్ హిగ్గిన్స్, షిన్యన్ యు మాట్లాడారు. ఇక్కడ ప్రదర్శనలు చేపడుతున్నవారిలో చాలా మంది తాము జో బైడెన్ మద్దతు దారులమని చెబుతున్నారు. ఇక్కడ చాలా చోట్ల ఫలితాలు బైడెన్‌కు అనుకూలంగా మారుతున్నట్లు వారు వివరిస్తున్నారు.

    బుధవారం రాత్రి కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా అనిపిస్తున్నాయని 27ఏళ్ల మార్క్ వాల్ చెప్పారు.

    ‘‘జరుగుతున్న పరిణామాలతో నేనేమీ బాధపడటం లేదు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఇదంతా జరుగుతుందని అర్థం చేసుకోగలను. దీనికి ఒక ప్రోటోకాల్ అంటే ఏమీలేదు. కొంచెం ఆందోళనగానూ ఉంది. నాతోపాటు చాలా మంది ఇలానే ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. అయితే ప్రతి ఓటునూ లెక్కపెట్టాల్సిందే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

  10. ట్రంప్ చర్యల్లో అర్థమే లేదు – మిషిగన్ అధికారులు

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    కీలకమైన మిషిగన్ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుల్లో అక్రమాలు జరిగాయని, దీనిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు మొదలుపెట్టామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అర్థమూలేదని మిషిగన్ అధికారులు వ్యాఖ్యానించారు.

    సవ్యంగా నమోదైన అన్ని బ్యాలెట్లనూ తాము ఎలాంటి పక్షపాతమూ లేకుండా లెక్కపెట్టామని సెక్రటరీ ఆఫ్ మిషిగన్ జోస్లీ బెన్సన్ చెప్పారు.

    2016లో 10,700 ఓట్ల తేడాతో ఇక్కడ ట్రంప్ గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఇక్కడ బైడెన్ ముందంజలో ఉన్నారు.

    మరోవైపు జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలలోనూ బ్యాలెట్ల లెక్కింపుపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్లు ట్రంప్ బృందం బుధవారం తెలిపింది.

  11. ఫలితాలను తేల్చేది ఆ ఆరు రాష్ట్రాలే

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు

    అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లిక్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌ల మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతోంది.

    కీలకమైన రాష్ట్రం మిషిగన్‌లో జో బైడన్ ఆధిక్యం కనబరచడంతో ఆయన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైనట్లు కనిపించారు.

    ప్రస్తుతం బైడన్ ఖాతాలో 243 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. మరో 27 ఓట్లు దక్కితే ఆయన అధ్యక్షుడు అవుతారు. అంటే 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వస్తే ఆయన విజయం సాధిస్తారు.

    మరోవైపు ట్రంప్ ఖాతాలో 214 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఆయన అధ్యక్షుడు కావాలంటే మరో 56 ఓట్లు రావాల్సి ఉంది.

    ప్రస్తుతం అరిజోనా (11), విస్కాన్సిన్ (10) నెవాడా (6)ల్లో బైడన్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ మూడు చోట్లా ఆయన విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్‌కు చేరినట్లే. అయితే, ఈ రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరుగుతోంది.

    మరోవైపు జార్జియా (16), నార్త్ కెరోలినా (15), పెన్సిల్వేనియా (20) రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన అధ్యక్షుడు కావాలంటే ఈ మూడింటితోపాటు మరో రాష్ట్రంలోనూ విజయం సాధించాలి.

    అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నామని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు.