భారత్‌లో 60వేలకు చేరువలో పాజిటివ్ కేసులు, 2వేలకు దగ్గరలో మరణాలు; ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది బాధితులు

భారత్‌లో కరోనావైరస్ కేసులు 60వేలకు చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య 2వేలను సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 2.75 లక్షల మంది మరణించారు. అమెరికాలో 13 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్య ఉంది. ఈ ఒక్క దేశంలోనే 77వేలకుపైగా రోగులు మరణించారు.

లైవ్ కవరేజీ

  1. కరోనావైరస్ నేటి ముఖ్యాంశాలు ఇవీ...

    ప్రపంచమంతటా కరోనావైరస్ విస్తరించటం కొనసాగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 187 దేశాల్లో దాదాపు 40 లక్షల మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సుమారు 2.75 లక్షల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 12 లక్షల నిర్ధారిత కేసులు ఉన్నాయి. మరే దేశం కన్నా ఇది ఐదు రెట్లు అధికం.

    • భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60 వేలకు చేరువగా ఉంది. మృతుల సంఖ్య 1981కి పెరిగింది. దేశంలో మరణాల రేటు దాదాపు 3.3 ఉందని, కోలుకుంటున్నవారి రేటు 29.9కి పెరిగిందని ఇది చాలా మంచి సంకేతమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.
    • దేశీయంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) కలిసి కృషిచేయాలని ఒప్పందానికి వచ్చాయి.
    • మూడు రకాల యాంటీవైరల్ ఔషధాల మిశ్రమంతో తయారు చేసిన మందులను ప్రయోగాత్మకంగా పరిశీలించినపుడు.. స్వల్ప లక్షణాలున్న కోవిడ్-19 రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు కనిపించిందని హాంగ్ కాంగ్ పరిశోధకులు చెప్పారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1930కి చేరుకుంది. గత 24 గంటల్లో ముగ్గురు కోవిడ్-19 రోగులు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 44కు చేరింది.
    • తెలంగాణలో కొత్తగా 31 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రభుత్వం తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో మత్తం కేసుల సంఖ్య 1,163కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 30గా ఉంది.
    • రష్యాలో కేసుల సంఖ్య గత ఆదివారం నుంచి రోజుకు 10,000 కన్నా ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో రష్యా ఐదో పెద్ద దేశంగా ఉంది. గత 24 గంటల్లో 10,817 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 1,98,676కు చేరుకున్నాయి.
    • పాకిస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తోంది. ఆంక్షలకు దశల వారీ సడలింపుల్లో భాగంగా రాజధాని ఇస్లామాబాద్‌లో షాపులు, వ్యాపారాలు మళ్లీ తెరుచుకుకోవటం మొదలైంది.
    • కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు మసీదులను కొన్ని వారాల క్రితమే మూసివేశాయి. కానీ రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నమాజు కోసం కొన్ని దేశాలు వాటిని మళ్లీ తెరిచాయి.
    • బ్రిటన్‌లో గత 24 గంటల్లో మరో 346 మంది కరోనావైరస్ రోగులు చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 31,587కు పెరిగింది. బ్రిటన్‌ ప్రభుత్వం రవాణా విధానంలో సైకిళ్ల వినియోగం, నడకలను ప్రోత్సహించటానికి 200 కోట్ల పౌండ్ల ప్యాకేజీ ప్రకటించింది.
    • నటుడు ఆండీ సెర్కిస్.. ‘ద హాబిట్’ నవలను ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారంలో ఏకధాటిగా చదవటం ద్వారా 2.80 లక్షల పౌండ్ల విరాళాలు సమీకరించారు. ఈ ఫీట్ ద్వారా సమీకరించిన నిధులను బ్రిటన్ జాతీయ ఆరోగ్య వ్యవస్థకు, బెస్ట్ బిగినింగ్స్ అనే చిన్నారుల ఆరోగ్య స్వచ్ఛంద సంస్థకు పంచుతారు.
    కరోనావైరస్
  2. తెలంగాణలో కొత్తగా 31 కేసులు.. మొత్తం కేసుల సంఖ్య 1,163

    తెలంగాణలో కొత్తగా 31 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రభుత్వం తాజా బులెటిన్‌లో తెలిపింది. దీంతో మత్తం కేసుల సంఖ్య 1,163కు పెరిగింది.

    వీరిలో సోమవారం డిశ్చార్జ్ అయన 24 మందితో సహా మొత్తం 751 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 382 కేసులు కొనసాగుతున్నారని చెప్పింది.

    రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 30గా ఉంది.

    తెలంగాణ
  3. బ్రిటన్‌లో సైకిళ్ల వినియోగం, నడకను ప్రోత్సహించటానికి 200 కోట్ల పౌండ్లు

    సైక్లింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్‌ ప్రభుత్వం రవాణా విధానంలో సైకిళ్ల వినియోగం, నడకలను ప్రోత్సహించటానికి 200 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 18,700 కోట్లు) ప్యాకేజీ ప్రకటించింది.

    దేశంలో 2025 నాటికి సైకిళ్ల వినియోగాన్ని రెట్టింపు చేయటానికి, నడకను పెంచటానికి జూన్‌లో నేషనల్ సైక్లింగ్ ప్రణాళికను ప్రచురిస్తామని రవాణా మంత్రి షాప్స్ చెప్పారు.

    సైకిల్‌కు ప్రత్యేక లైన్లు, పాదచారుల కోసం విశాలమైన పేవ్‌మెంట్లు, సైకిళ్లు – బస్సులకు మాత్రమే అనుమతించే రహదారుల వంటి వాటిని ఏర్పాటు చేయటానికి వేగంగా అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తామన్నారు.

  4. 11 గంటల పుస్తక పఠనానికి 2.80 లక్షల పౌండ్ల విరాళం

    నటుడు ఆండీ సెర్కిస్.. ‘ద హాబిట్’ నవలను ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారంలో ఏకధాటిగా చదవటం ద్వారా 2.80 లక్షల పౌండ్ల విరాళాలు సమీకరించారు.

    1937 నాటి జేఆర్ఆర్ టోల్కీన్ నవల 300 పేజీలకు పైగా ఉంటుంది. సెర్కిస్ ‘మారథాన్ రీడింగ్’ను 6.50 లక్షల మంది వీక్షించారు.

    ఈ 56 ఏళ్ల ‘ద గోలం’ నటుడు బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు పుస్తకం చదవటం మొదలుపెట్టారు. 11:00 గంటలకు.. విక్టరీ ఇన్ యూరప్ డే సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించటానికి ఆపారు. ఆ తర్వాత కాలకృత్యాల కోసం ఒకసారి స్వల్ప విరామం తీసుకున్నారు.

    మొత్తం పుస్తకాన్ని కేవలం 11 గంటల్లో చదివేసి ‘హాబిటాథాన్’ విజయవంతంగా పూర్తిచేశారు.

    ఈ ఫీట్ ద్వారా సమీకరించిన నిధులను బ్రిటన్ జాతీయ ఆరోగ్య వ్యవస్థకు, బెస్ట్ బిగినింగ్స్ అనే చిన్నారుల ఆరోగ్య స్వచ్ఛంద సంస్థకు పంచుతారు.

    ఆండీ సెర్కిస్

    ఫొటో సోర్స్, @andyserkis

  5. జెనీవాలో ఆహార పొట్లాల కోసం క్యూలో వందలాది మంది

    జెనీవా

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి కావచ్చు. కానీ రాజధాని జెనీవాలో శనివారం నాడు ఉచిత ఆహార పొట్లాల కోసం పొడవాటి క్యూ కనిపించింది.

    స్వచ్ఛంద కార్యకర్తలు పంచుతున్న ఈ పార్సిళ్ల కోసం 1,500 మందికి పైగా క్యూలో నిలుచున్నారు.

    స్విట్జర్లాండ్‌లో మొత్తం జనాభా 86 లక్షలు కాగా.. వారిలో 6.60 లక్షల మంది పేదలు ఉన్నట్లు 2018లో కారిటాస్ అనే స్వచ్ఛంద సంస్థ అంచనా వేసింది.

    గత వారం ఉచిత ఆహార పొట్లాలు తీసుకుంటున్న వారిలో కొంతమందితో మాట్లాడినపుడు వారిలో సగం మందికి పైగా అధికారికంగా నమోదు కాని వలసలని వెల్లడైందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది.

    జెనీవా

    ఫొటో సోర్స్, Getty Images

  6. బ్రిటన్‌లో మరో 345 మంది మృతి

    కరోనా వైరస్

    బ్రిటన్‌లో గత 24 గంటల్లో మరో 346 మంది కరోనావైరస్ రోగులు చనిపోయారు.

    దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 31,587కు పెరిగింది.

    దేశంలో రోజుకు లక్ష కరోనా పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యం వరుసగా ఏడో రోజు కూడా అందుకోలేదు.

    గత 24 గంటల్లో 96,878 పరీక్షలు నిర్వహించినట్లు రవాణాశాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ తెలిపారు.

    ఇది ఆ ముందు రోజు పరీక్షల సంఖ్య 97,029 కన్నా తక్కువ.

    గ్రాంట్ షాప్స్

    ఫొటో సోర్స్, PA Media

  7. కర్నూలు జిల్లాలో మరో 21 మంది డిశ్చార్జ్

    ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 553 కరోనా కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో శనివారం నాడు మరో 21 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

    దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 239కి పెరిగింది.

    జిల్లాలో శనివారం ఆరు కేసులు నమోదయ్యాయి.

    ప్రస్తుతం 320 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

    జిల్లాలో ఇప్పటివరకూ కరోనా వల్ల 15 మంది మరణించారు.

  8. దేశీయంగా వ్యాక్సిన్ తయారీ కోసం ఐసీఎంఆర్, బీబీఐఎల్ సంయుక్త కృషి

    దేశీయంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) కలిసి కృషిచేయాలని ఒప్పందానికి వచ్చాయి.

    పుణెలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో వేరు చేసిన కరోనావైరస్ రకాన్ని ఉపయోగించుకుని వ్యాక్సిన్ తయారీకి కృషి చేయనున్నారు.

    ఈ వైరస్ స్ట్రెయిన్‌ను బీబీఐఎల్‌కు విజయవంతంగా బదిలీచేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. మలేసియా నుంచి 177 మందితో తిరుచ్చి బయల్దేరిన ప్రత్యేక విమానం

    విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి 177 మంది భారతీయులతో ప్రత్యేక విమానం తమిళనాడులోని తిరుచ్చికి బయలు దేరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ‘1940లో మా తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా?’

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ‘ఇంట్లో రోగికి విడిగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసుకున్న గదిలో వెలుతురు బాగా ఉండాలి. గాలి బాగా రావాలి. ఇంట్లో వాళ్లంతా నివసించే,తిరిగే చోటుకు వీలైనంత ఆ రోగి గది దూరంగా ఉండాలి.’’

    80 ఏళ్ల క్రితం మా తాతయ్య డాక్టర్ జాన్ డేవీ రోల్‌స్టన్ రాసిన ‘అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ -ఎ హ్యాండ్‌బుక్ ఫర్ ప్రాక్టిషనర్స్ అండ్ స్టూడెంట్స్’ పుస్తకంలో ఉన్న వాక్యాలివి.

    కోవిడ్-19 అలుముకున్న ప్రస్తుత చీకటి రోజుల్లోనూ అందులోని విషయాలు ప్రాధాన్యం కోల్పోలేదు.

    ‘‘మంట కాచుకునే ఫైర్ ప్లేస్ ఉల్లాసం కలిగించడమే కాదు, వైద్యానికి ఉపయోగించిన దూదిని, ఇతర వ్యర్థాలను పడేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చికిత్సకు ఉపయోగిస్తున్న గదిలో కార్పెట్లు, అలంకరణ సామగ్రి, అవసరం లేని వస్తువులేవీ ఉంచవద్దు. సులభంగా కడిగే సాధారణ ఫర్నిచర్ ఉంటే మేలు’’ అని అందులో రాసి ఉంది. ఈ సలహా ఇప్పటికీ ఉపయోగకరమైందే.

  11. మాస్కోలో నిర్మానుష్య రెడ్ స్క్వేర్ మీదుగా యుద్ధవిమానాల ఫ్లైపాస్ట్

    రష్యా

    ఫొటో సోర్స్, EPA

    రష్యాలో ఈసారి రెండో ప్రపంచ యుద్ధం విజయోత్సవాల 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని మాస్కోలో యుద్ధ ట్యాంకులు లేవు, సైనికులు, మాజీ సైనికుల కవాతు లేదు.

    మే 9వ తేదీన రెడ్ స్క్వేర్‌లో నిర్వహించాల్సిన విక్టరీ డే పరేడ్‌ను కరోనా కారణంగా రద్దుచేశారు. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలివిజన్‌లో ప్రసంగించారు. నాటి సైనికులు ‘‘మరణానికి వ్యతిరేకంగా జీవితం కోసం పోరాడార’’ని వారి త్యాగాలను కొనియాడారు. యుద్ధ స్మారకం దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

    అయితే.. నిర్మానుష్యంగా ఉన్న రెడ్ స్క్వేర్ మీదుగా రష్యా వైమానిక దళ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. మామూలుగా అయితే ఈ ఉత్సవాలకు రెడ్ స్క్వేర్ జనంతో నిండిపోతుంది.

    నాజీ జర్మనీ మీద మిత్రరాజ్యాల విజయం సాధించిన ఉత్సవాలను రష్యాలో ప్రతి ఏటా మే 9న నిర్వహిస్తారు. దానికి ఒక రోజు ముందు యూరప్‌లో మిత్రరాజ్యాలు విక్టరీ డే ఉత్సవాలు జరుపుకుంటాయి.

    రష్యా

    ఫొటో సోర్స్, Reuters

  12. కరోనావైరస్: ఊబకాయులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా?

    ఊబకాయంతో బాధపడేవారు గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 మధుమేహం సహా అనేక రకాల కొత్త రుగ్మతల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఊబకాయులపై ప్రస్తుత కరోనావైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.

    ఊబకాయంతో బాధపడేవారికి ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

    ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు నిపుణులు విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు.

    బ్రిటన్‌లో దాదాపు 17,000 కోవిడ్-19 రోగులపై ఒక పరిశీలన జరిగింది. ఊబకాయం లేనివారితో పోల్చితే బీఎంఐ 30కి మించి ఉండి, ఊబకాయంతో బాధపడేవారు చనిపోయే ప్రమాదం 33 శాతం అధికంగా ఉంది.

    ఊబకాయం

    ఫొటో సోర్స్, Getty Images

  13. మూడు రకాల ఔషధ మిశ్రమంతో పరిశోధన.. ‘‘రోగులు వేగంగా కోలుకుంటున్నారు’’

    పరిశోధన

    ఫొటో సోర్స్, EPA

    కోవిడ్-19 వ్యాధికి చికిత్స కోసం మూడు రకాల యాంటీవైరల్ ఔషధాల మిశ్రమంతో తయారు చేసిన మందులను ప్రయోగాత్మకంగా పరిశీలించినపుడు సానుకూల ఫలితాలిచ్చాయని హాంగ్ కాంగ్ పరిశోధకులు వెల్లడించారు.

    మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో శుక్రవారం ప్రచురించిన ఈ అధ్యయనం. స్వల్ప లక్షణాలున్న కోవిడ్-19 రోగులకు ఈ మందుతో చికిత్స చేసినట్లయితే వేగంగా కోలుకుంటున్నట్లు కనిపించిందని పేర్కొంది.

    మొత్తం 127 మంది వయోజనుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 86 మందికి ఇంటర్ఫెరాన్ బీటా-1బి, ఓపినావిర్-రిటోనావిర్, రిబావిరిన్ అనే మూడు రకాల ఔషధ మిశ్రమంతో చికిత్స చేశారు.

    ఈ ఫలితాలు ఇంకా తొలి దశలోనే ఉన్నా.. ముఖ్యమైన ఫలితాలని దీనిపై మరింతగా పరిశోధనలు నిర్వహించాలని అధ్యయన రచయితలు చెప్పారు.

    ‘‘స్వల్పంగా లేదా ఒక మోస్తరుగా లక్షణాలు కనిపించే కోవిడ్-19 రోగికి ఈ మూడు రకాల యాంటీవైరల్ ఔషధ మిశ్రమంతో త్వరగా చికిత్స చేస్తే.. రోగి శరీరంలో వైరస్ పరిమాణాన్ని ఇది వేగంగా తగ్గిస్తున్నట్లు మా పరిశీలనలో వెల్లడైంది’’ అని పరిశోధనకు సారథ్యం వహించిన క్వాక్-యంగ్ యేన్ వివరించారు.

  14. బెలారస్ వీధుల్లో భారీ జనసందోహం మధ్య సైనిక కవాతు

    బెలారస్

    ఫొటో సోర్స్, Getty Images

    బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యూకాషెంకో.. కరోనావైరస్ మహమ్మారి గురించిన సలహాలను దాదాపుగా విస్మరించారు. బహుశా అందుకే.. ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన 75వ వార్షికోత్సవాన్ని భారీ జనసందోహంతో నిర్వహించటం ఆశ్చర్యం కలిగించి ఉండదు.

    కోవిడ్-19 భయాలను ‘సైకోసిస్’ అని ల్యూకాషెంకో అభివర్ణించారు. దేశాన్ని దిగ్బంధిస్తే ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. దేశంలో ఫుట్‌బాల్ పోటీలను కూడా భారీ జనసమూహాల మధ్య నిర్వహించటానికి అనుమతించారు.

    శనివారం నాడు రాజధాని మినిస్క్‌లో యుద్ధ ట్యాంకులు, సైనికులు కవాతు నిర్వహించారు.

    చాలా యూరోపియన్ మిత్రరాజ్యాలు ఈ వారంలో ప్రపంచ యుద్ధ విజయ వార్షికోత్సవాలను పెద్దగా జరుపుకోలేదు.

    బెలారస్

    ఫొటో సోర్స్, Getty Images

  15. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు చేరువైన కరోనా కేసులు

    కరోనావైరస్

    ప్రపంచమంతటా కరోనావైరస్ విస్తరించటం కొనసాగుతోంది. ఇప్పటివరకూ మొత్తం 187 దేశాల్లో దాదాపు 40 లక్షల మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. సుమారు 2.75 లక్షల మంది చనిపోయారు.

    ఒక్క అమెరికాలోనే 12 లక్షల నిర్ధారిత కేసులు ఉన్నాయి. మరే దేశం కన్నా ఇది ఐదు రెట్లు అధికం.

  16. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు తగ్గించటం సరికాదు: ఐరాస సెక్రటరీ జనరల్

    ఆంటోనియో గుటెరస్

    ఫొటో సోర్స్, AFP

    కరోనావైరస్ మహమ్మారి విషయంలో అంతర్జాతీయంగా ఎన్నడూ లేనంత ప్రతిస్పందన అవసరమని.. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు తగ్గించటం సరికాదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక రష్యా సంస్థతో వ్యాఖ్యానించారు.

    కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ నిర్లక్ష్యం వహించిందంటూ ఆ సంస్థకు అందించే నిధులను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంలో గుటెరస్ పై విధంగా స్పందించారు.

    ‘‘కరోనావైరస్ కథ ముగిసిన తర్వాత మనం పూర్తిగా వెనక్కు చూసి.. ఇటువంటి వ్యాధి ఇంత వేగంగా ప్రపంచాన్ని ఎలా కబళించింది, ఇందులో ప్రమేయం ఉన్న వారందరూ ఎలా ప్రతిస్పందించారు అనేది అర్థం చేసుకోవటానికి సమయం లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘అందుకు ఇప్పుడు సమయం కాదు. ఈ మహమ్మారిపై పోరాటంలో డబ్ల్యూహెచ్ఓ లేదా మరే మానవతా సంస్థ ఆపరేషన్లకు నిధులు తగ్గించే సమయమూ కాదు’’ అని చెప్పారు.

    మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచమంతటా కాల్పుల విరమణ పాటించాలంటూ ఆయన మరోసారి పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి 100కు పైగా దేశాలు, సాయుధ బృందాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు.

  17. పసిఫిక్ మహాసముద్రంలో ఓ నావికుడి పీడకల, 3 నెలల పాటు నీళ్లపైనే జీవితం

    నావికుడు

    ఫొటో సోర్స్, PHOTO SUPPLIED: FMSRCC

    పసిఫిక్‌ మహాసముద్రంలో మూడేళ్లపాటు ఒంటరి యాత్ర చేయాలనుకున్న ఒక నావికుడి ఆలోచన, ఆశయం చివరకు ఒక పీడకలగా మిగిలింది. సముద్రంలోకి వెళ్లిన ఆయన్ను లాక్‌డౌన్‌ కారణంగా ఏ దేశమూ తమ తీరంలోకి అనుమతించలేదు. దాంతో ఆయన దాదాపు 3 నెలల పాటు సముద్రంలో ఒంటరిగా బతకాల్సి వచ్చింది.

    ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా లాక్‌డౌన్‌ కారణంగా సరకులు దొరకవన్న భయంతో ఎక్కువ మొత్తంలో కొని ఇంట్లో నిల్వచేసుకుంటున్న వేళ ఆయన ఆహారం, పెట్రోలు లేకుండా సముద్రంలో ద్వీపాల మధ్య తిరుగుతూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఆయన ఇంటి పేరు వాంగ్‌. 59 ఏళ్ల ఆ మాజీ నావికుడు సంవత్సరాల తరబడి సముద్రం మీద ప్రయాణించేందుకు చేసిన సాహసోపేత ప్రయత్నం ఇది. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తాను వెళ్లాలనుకున్న ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇంధనం సిద్ధం చేసుకున్నారు.

    సింగపూర్‌ నుంచి ఫిబ్రవరి 2న సముద్ర యాత్ర ప్రారంభించారు. ముందుగా ఫిలిప్పీన్స్‌ నుంచి పోలినేషియా వరకు ప్రయాణించాలన్నది ఆయన ఆలోచన. ఒక యాట్‌ (చిన్న పడవ)లో ప్రయాణిస్తే అక్కడికి వెళ్లేందుకు 4 నెలల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు తన యాట్‌లోనే తిరగాలన్నది ఆయన ప్రణాళిక.

    కానీ ఎంత మంచి ప్రణాళికలు వేసినా అవి ఒక్కోసారి విఫలమవుతాయని ఆయనకు అర్థమైంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆయన ప్రయత్నాలన్నీ తలకిందులయ్యాయి.

  18. వైరస్ సోకటంతో పోటీ నుంచి వైదొలగిన యూఎఫ్‌సీ ఫైటర్‌

    రొనాల్డో సౌజా

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో లాక్‌డౌన్ విధించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి భారీ క్రీడా కార్యక్రమం యూఎఫ్‌సీ 249 శనివారం జరుగుతుంది. కానీ.. ఫైటర్ రొనాల్డో సౌజా ఈ పోటీల్లో పాల్గొనటం లేదు. ఆయనకు, ఆయన సహాయకులు ఇద్దరికీ కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణవటమే దీనికి కారణం.

    ఈ 40 ఏళ్ల బ్రెజిలియన్ ఫైటర్.. యూరియా హాల్‌తో తలపడాల్సి ఉంది.

    ఈ పోటీలను ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్‌లో ప్రేక్షకులు ఎవరూ లేకుండా నిర్వహిస్తున్నారు. మొత్తం 22 మంది ఫైటర్లు పాల్గొనే ఈ కార్యక్రమాన్నిఇంటర్నెట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

    ‘‘మేం ఈ వారంలో 300 మీద 1,200 పరీక్షలు చేశాం. వారిలో ఒకరికి పాజిటివ్ రావటం అనూహ్యమైన విషయమేమీ కాదు’’ అని యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్ పేర్కొన్నారు.

  19. ఏపీలో మద్యం దుకాణాలను మరో 13 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు

    వైన్ షాపు

    ఆంధ్రప్రదేశ్‌లో మరో 13 శాతం మద్యం షాపులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    గతంలో మొత్తం 4,380 మద్యం షాపులు ఉండగా.. గత ఏడాది ఆగస్టులో వాటిని 3,500కి తగ్గించింది. తాజాగా ఈ షాపుల సంఖ్యను 2,934 కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

    దీంతో మొత్తం మద్యం దుకాణాల్లో 33 శాతం తగ్గించినట్లయిందని చెప్పింది. తగ్గించిన షాపులను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ఆదేశించింది.

    దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    మద్యపానాన్ని నిరుత్సాహ పరచటానికి మద్యం ధరలను కూడా పెంచామని చెప్పింది.