You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్‌: భారత్‌లో 49,391కి చేరిన కేసులు, 1,694 మంది మృతి

అమెరికాలో అత్యధికంగా 12 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌లో 2 లక్షల చొప్పున వైరస్ బారిన పడ్డారు. అమెరికా తరువాత అత్యధికంగా బ్రిటన్‌లో 30,070 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. ఏపీలో 24 గంటల్లో 7,782 శాంపిళ్ల పరీక్ష

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 7,782 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంతవరకు మొత్తంగా 1,41,272 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 1,39,497 నెగటివ్‌గా తేలాయి.

  2. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 60 కేసులు.. మొత్తం 1,777.. మృతులు 36 మంది

    ఏపీలో గత 24గంటల్లో 60 కేసులు నమోదు కాగా అందులో ఒకటి కర్ణాటక, 12 గుజరాత్‌కి చెందిన వారుగా ప్రభుత్వం ప్రకటించింది.

    మొత్తం కేసులు 1,777.. డిశ్చార్జ్ అయినవారు 729, మృతులు 36, కొత్తగా కర్నూలు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.

    ప్రస్తుతం 1012 మంది చికిత్స పొందుతున్నారు.

  3. ‘ఆరోగ్యసేతు’తో యూజర్ల డేటాకు ముప్పు లేదు: యాప్ నిర్వాహక బృందం, ఎథికల్ హ్యాకర్ లేవనెత్తిన అంశాలకు సమాధానాలతో ప్రకటన

    ఆరోగ్య సేతు యాప్‌‌‌లో డేటా సెక్యూరిటీ పరంగా లోపాలున్నాయంటూ ఒక ఎథికల్ హ్యాకర్ హెచ్చరించడంతో ఆ యాప్ బృందం స్పందించింది.

    హ్యాకర్ లేవనెత్తిన అంశాలు, వాటికి సమాధానాలను ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది.

    ఆరోగ్యసేతు యాప్ కొన్ని సందర్భాలలో యూజర్ లొకేషన్‌ డేటాను తీసుకుంటుందన్న హ్యాకర్ క్లెయిమ్‌కు.. ‘‘ఈ యాప్ డిజైన్‌లోనే అది ఉంది. అందుకే ప్రైవసీ పాలసీలోనూ స్పష్టంగా ఆ విషయం పేర్కొన్నాం. యూజర్ లొకేషన్ డేటాను తీసుకుని మా సర్వర్‌లో భద్రంగా, ఎన్‌క్రిప్టెడ్‌గా, అనామకంగా ఉంచుతాం’’ అని సమాధానం ఇచ్చింది.

    పరిధి, అక్షాంశరేఖాంశాలను మార్చుతూ యూజర్ తన చుట్టూ ఉన్న కేసుల వివరాలను తెలుసుకోగలుగుతాడన్న క్లెయిమ్‌కు సమాధానమిస్తూ.. 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరిధి స్థిర పరామితులు యాప్‌లోనే ఉన్నాయని.. వాటినే యూజర్ మార్చి గణాంకాలు తెలుసుకోగలరని.. ఇది కాకుండా ఇంకే పరిధిలో సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించినా అది ఒక కిలోమీటరు పరిధిలో సమాచారం మాత్రమే అందించేలా యాప్ డిజైన్ ఉందని వివరించింది.

    ఎవరి వ్యక్తిగత డేటాకైనా ముప్పు ఉందని ఈ హ్యాకర్ నిరూపించలేదని.. తాము నిరంతరం ఈ యాప్‌ను పరీక్షిస్తూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆరోగ్యసేతు టీం చెప్పింది. ఇంకెవరైనా ఇందులో లోపాలను గుర్తిస్తే తమ దృష్టికి తేవాలంటూ support.aarogyasetu@gov.inకు మెయిల్ చేయాలని కోరారు.

  4. తెలంగాణలో మద్యం దుకాణాల వద్ద బారులు

    తెలంగాణలో ఈ రోజు మద్యం దుకాణాలు తెరవడంతో ప్రజలు బారులు తీరడం కనిపించింది. భౌతిక దూరం పాటించడం కోసం ఏర్పాట్లు చేశారు.

    కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా పోలీసులు దుకాణాల వద్ద ఉన్నారు.

  5. భారత్‌లో 49,391 పాజిటివ్ కేసులు.. 1694 మంది మృతులు

    భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి పెరిగింది. మృతుల సంఖ్య 1694కి చేరింది.

    ఇప్పటివరకు 14,182 మందికి నయం కాగా 33,514 మంది ప్రస్తుతం చికిత్సలు పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది.

  6. విమాన సర్వీసులు మొదలయ్యాక టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి: ఐఏటీఏ

    విమాన సర్వీసులు పునఃప్రారంభమైన తరువాత మొదట టికెట్ ధరలు కొంత తక్కువ ఉన్నా ఆ తరువాత కనీసం 50 శాతం పెరిగే సూచనలున్నాయని ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) తెలిపింది.

    వీలైనంత వేగం విమాన సర్వీసులు మొదలుపెట్టేలా సంస్థలు యోచిస్తున్నాయని పేర్కొంది.

    మొదట్లో పాసింజర్లు తక్కువగా ఉంటారు కాబట్టి వారిని ఆకర్షించడానికి టికెట్లు తక్కువే ఉంచుతారని.. అయితే, భౌతికదూరం పాటించడం కోసం మధ్య సీట్లు విడిచిపెట్టాలన్న ఒత్తిడి విమానయాన సంస్థలపై ఉంటే వారు ధరలు పెంచుతారని ఐఏటీఏ పేర్కొంది.

  7. కరోనావైరస్‌కు పుట్టినిల్లయిన హుబే ప్రావిన్స్‌లో తెరుచుకుంటున్న స్కూళ్లు

    కరోనావైరస్ మొట్టమొదటగా ప్రబలిన చైనాలోని హుబే ప్రావిన్స్‌లో పాఠశాలలు తెరచుకుంటున్నాయి. విద్యార్థుల రాక మొదలైంది.

    9, 12 గ్రేడ్ల విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండడంతో వారిని అనుమతిస్తున్నారు.

    గ్రేడ్ 12 విద్యార్థులను చైనాలోని కొన్ని రాష్ట్రాల్లో మార్చి నెలలోనే స్కూళ్లు అనుమతించారు.

    హుబే ప్రావిన్స్‌లో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు తొలుత కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తారు.

    స్కూళ్లు, వాటిలోని క్యాంటీన్లలో భౌతిక దూరానికి సంబంధించిన ప్రమాణాలు పాటించాలి.

    ఇందుకు గాను విద్యార్థులు దూరదూరంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు.

  8. కేరళలో వలస కార్మికుల ఆందోళన

    కేరళలోని కోజికోడ్ జిల్లా కొడియాతూర్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను సొంత రాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళన చేశారు.

    తమకు రేషన్ కూడా సరిగా అందడం లేదంటూ వారు ఆరోపణలు చేశారు.

  9. గుర్‌గావ్ సరిహద్దుల్లో డాక్టర్లు, పోలీసులు, మీడియా సహా రాకపోకలన్నీ నిషిద్ధం

    దిల్లీ గుర్‌గావ్ సరిహద్దుల్లో పోలీసులు పెద్ద ఎత్తున వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో గురుగావ్‌కు పొరుగు రాష్ట్రాలు, జిల్లాలతో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు.

    డాక్టర్లు, పోలీసులు, మీడియా వ్యక్తులను కూడా వెళ్లనివ్వడం, రానివ్వడం లేదు.

  10. కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.

    ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌లలో మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

    అమెరికాలో మృతుల సంఖ్య 71 వేలు దాటగా బ్రిటన్‌లో 30 వేలకు సమీపంలో ఉంది.

    * జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 36,59,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,56,928మంది మృతి చెందారు.

    * అమెరికాలో 12,03,673 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71,031 మంది మరణించారు.

    * స్పెయిన్‌లో 2,19,329 పాజిటివ్ కేసులుండగా 25,613 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * ఇటలీలో 2,13,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా 29,315 మంది చనిపోయారు.

    * బ్రిటన్‌లో 1,96,240 మంది కరోనాబారిన పడగా 29,501 మంది మరణించారు.

    * భారత్‌లో 46,711 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,583 మంది మరణించారు.

    * తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1717 కాగా, ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు.

    * తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.