You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా 3,900 పాజిటివ్ కేసులు, 195 మరణాలు; మొత్తం 46,711 మందికి వైరస్

లాక్‌డౌన్‌కు ముందున్న 3.4 రోజుల డబ్లింగ్ టైమ్ ఇప్పుడు 12 రోజులకు పెరిగిందని, గత 24 గంటల్లో 1,020 మంది పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరించారు. ఈ జాగ్రత్తలు ఇలాగే కొనసాగడం ముఖ్యమని సూచించారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్‌లో మరో 67 పాజిటివ్ కేసులు.. మొత్తం 1717

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీరిలో 14 మంది గుజరాత్ నుంచి వచ్చినవారు.

    ఇప్పటివరకు మొత్తం 1717 పాజిటివ్ కేసులు నమోదు కాగా 34 మంది మరణించారు.

    589 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 1,094 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

  2. దేశంలో గత 24 గంటల్లో 3,900 కొత్త కేసులు.. 195 మరణాలు

    భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.

    గత 24 గంటల్లో దేశంలో 3,900 కొత్త కేసులు.. 195 మరణాలు రికార్డయ్యాయి.

    దీంతో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 46,433కి పెరిగింది.

    మృతుల సంఖ్య 1568కి చేరింది.

    ఇప్పటివరకు 12,727 మందికి నయం కాగా 32,134 యాక్టివ్ కేసులున్నాయి.

  3. దిల్లీలో మద్యం కొంటున్నవారిపై పువ్వులు

    దిల్లీలోని చందర్ నగర్ ప్రాంతంలో మద్యం దుకాణం వద్ద బారులుతీరిన కొనుగోలుదారులపై ఓ వ్యక్తి పువ్వులు చల్లుతున్న వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ షేర్ చేసింది.

    ‘ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు. మీరే దేశ ఆర్థిక వ్యవస్థ’’ అంటూ ఆ వ్యక్తి మద్యం కొనేవారిపై పువ్వులు చల్లుతున్నారు.

  4. ముంబయిలో మే 17 వరకు 144 సెక్షన్

    కరోనావైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న ముంబయిలో మే 17 వరకు 144 సెక్షన్ విధించారు.

    రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య వైద్య అవసరాలకు తప్ప ఇంకే కారణంతోనూ బయటకు రావడాన్ని నిషేధించారు.

    అత్యవసర సర్వీసులకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు.

  5. మే 7న యూఏఈ నుంచి కేరళకు రెండు ప్రత్యేక విమానాలు

    విదేశాల్లో ఉన్న భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు మొదలవుతున్నాయి.

    ఈ క్రమంలోనే అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు మే 7న రెండు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు దుబయిలోని భారత కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

    అబుదాబి నుంచి కేరళలోని కోచికి ఒక విమానం.. దుబయి నుంచి కోజికోడ్‌కు మరో విమానం నడపనున్నట్లు తెలిపారు. ఈ రెండు విమానాల్లో వెళ్లే ప్రయాణికుల జాబితాను ఇప్పటికే నమోదు చేసుకున్నవారి పేర్లతో దుబయిలోని భారత ఎంబసీ నిర్ణయిస్తుంది.

    వైద్య అత్యవసరాలు ఉన్నవారికి, గర్భిణులు, వృద్ధులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

    ఎమిరేట్స్ నుంచి మరికొన్ని విమానాలూ నడపనున్నామని.. వాటి తేదీలను తరువాత ప్రకటిస్తామన్నారు.

    కాగా స్వదేశానికి తిరిగొచ్చేందుకు సుమారు 2 లక్షల మంది భారతీయులు ఎమిరేట్స్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు.

  6. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏమేం తినాలి?

    రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.

    మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

    అందుకోసం, మన ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి? ఎలాంటి పదార్థాలను దూరం పెట్టాలి? అన్న విషయాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

  7. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన 1000 మంది వలస కార్మికులు

    హైదరాబాద్‌లో సోమవారం రాత్రి సుమారు వెయ్యి మంది వలస కార్మికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా బహుదూర్‌పురా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    అనంతరం బస్సులను ఏర్పాటు చేసి వారినందరినీ ఒక ఫంక్షన్ హాల్‌కు తరలించారు.

  8. కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 35,80,247కి పెరిగింది. మృతుల సంఖ్య 2,51,365కు పెరిగింది.

    * అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 11,78,906కి పెరిగింది. దేశంలో మొత్తం 69,579 మంది చనిపోయారు.

    * స్పెయిన్‌లో కరోనా కేసులు 2,18,011కు చేరాయి. ఇక్కడ మొత్తం 25,428 మంది మృతిచెందారు.

    * ఇటలీలో 2,11,938 మందికి వైరస్ సోకగా 29,079 మంది చనిపోయారు.

    * భారత్‌లో 42,836 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,389 మంది మరణించారు.

    * తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1085కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1,650 కాగా, ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు.

    * దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడంతో షాపుల ముందు పెద్ద ఎత్తున జనం చేరారు. పలుచోట్ల లాఠీ చార్జీలు జరిగాయి.

    * తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను పంపించడానికి వారం రోజుల పాటు రోజుకు 40 శ్రామిక్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

    * అమెరికాలో మృతుల సంఖ్య లక్షకు చేరొచ్చని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు.

    * రష్యాలో వరుసగా రెండో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.