You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా 3,900 పాజిటివ్ కేసులు, 195 మరణాలు; మొత్తం 46,711 మందికి వైరస్
లాక్‌డౌన్‌కు ముందున్న 3.4 రోజుల డబ్లింగ్ టైమ్ ఇప్పుడు 12 రోజులకు పెరిగిందని, గత 24 గంటల్లో 1,020 మంది పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరించారు. ఈ జాగ్రత్తలు ఇలాగే కొనసాగడం ముఖ్యమని సూచించారు.
లైవ్ కవరేజీ
భారత్‌లో 46,711కు చేరిన కేసులు, 1,583కి పెరిగిన మరణాలు
- ప్రపంచవ్యాప్తంగా 3,610,006 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 253,381మంది మృతి చెందారు.
- అమెరికాలో 1,181,885 పాజిటివ్ కేసులు నమోదు కాగా 69,079 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 218,011 పాజిటివ్ కేసులుండగా 25,428 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 211,938 పాజిటివ్ కేసులు నమోదు కాగా 29,315 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో 191,832 మంది కరోనాబారిన పడగా 29,502 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో 169,583 మందికి కరోనావైరస్ సోకగా 25,204 మంది ప్రాణాలు కోల్పోయారు.
- భారత్‌లో 46,711 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,583 మంది మరణించారు.
- తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి పెరగ్గా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1717 కాగా, ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్: తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1096కు చేరిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇప్పటి వరకు 628 మంది డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 439 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
కరోనావైరస్‌ను కట్టడి చేయడంలో దేశానికే కరీంనగర్ ఆదర్శంగా నిలిచింది. దేశానికి కంటైన్మెంట్ అనే పదం తెలియనప్పుడే కరీంనగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాం. పకడ్బందీ ఏర్పాట్లతో వైరస్‌ను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కరీంనగర్‌లో ఒక్క కేసు కూడా లేదు. కరీంనగర్‌లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకున్నాం. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగతా ప్రాంతాల్లో అమలు చేశాం" అని సీఎం వివరించారు.
హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్, శాంతా బయోటిక్ సంస్థలు వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలలో ఉన్నాయని, ఆగస్టు లేదా సెప్టెంబరులోగా వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద రెడ్డి తనకు చెప్పారని కేసీఆర్ తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబరు నాటికే తెలంగాణ నుంచి వాక్సిన్ వస్తే మనం ప్రపంచానికి మేలు చేసిన వాళ్లం అవుతామని అన్నారు.
ముంబయిలో ఇవాళ 635 కొత్త కేసులు, 26 మంది మృతి
మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 34 మంది మరణించారు.
అందులో 635 కేసులు ముంబయి నగరంలోనే నమోదయ్యాయి. 26 మంది మృతి చనిపోయారు.
దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న ముంబయిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,758కి చేరిందని, మరణాల సంఖ్య 387కి పెరిగిందని నగరపాలక సంస్థ వెల్లడించింది.
తాజా కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,525కు చేరింది.
మరోవైపు, మహారాష్ట్రలో ఇవాళ 350 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ రాష్ట్రంలో ఒకే రోజు ఇంత మంది డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి.
ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 2,465 మంది కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది.
ముంబయిలోని ధారావి మురికివాడలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ 33 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో, ఈ మురికివాడలో మొత్తం బాధితుల సంఖ్య 665కు పెరిగింది.
అందులో 195 మంది డిశ్చార్జ్ అయ్యారని ముంబయి నగరపాలక సంస్థ వెల్లడించింది.
తమిళనాడులో ఒకే రోజు 508 కొత్త కేసులు
తమిళనాడులో ఇవాళ ఒక్క రోజే కొత్తగా 508 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు చనిపోయారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దాంతో, తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 4058కి చేరుకుంది. మరణాల సంఖ్య 33కి పెరిగింది.
గుజరాత్‌లో గడచిన 24 గంటల్లో 441 కొత్త కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. అందులో 39 మరణాలు, 349 కొత్త కేసులు అహ్మదాబాద్ నగరంలోనే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తాజా కేసులతో గుజరాత్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 6,245కి చేరింది. మరణాల సంఖ్య 368కి పెరిగింది.
దిల్లీలో కరోనా బాధిత జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం
దిల్లీలో విధులు నిర్వహిస్తున్న తెలుగు జర్నలిస్టులకు కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు, చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.12 లక్షలు విడుదల చేసింది.
దిల్లీలో పనిచేస్తున్న ముగ్గురు తెలుగు జర్నలిస్టులకు కరోనా సోకినట్లు ఇటీవల నిర్ధరణ అయ్యింది. వారి ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షల కోసం తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.75,000 విడుదల చేసింది.
జర్నలిస్టులకు చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపింది.
దిల్లీలో ఉన్న తెలుగు పాత్రికేయులకు పరీక్షలు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు.
అపోలో ఆస్పత్రి వైద్యులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడారని, తెలుగు పాత్రికేయులకు పరీక్షల కోసం అవసరమైతే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని వైద్యులు బృందం చెప్పిందని వెల్లడించారు.
దిల్లీలో పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, జర్నలిస్టులకు అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారని ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ: 1 నుంచి తొమ్మిదో తరగతి వరకు.. పరీక్షలు లేకుండానే పై తరగతులకు, వెలువడిన అధికారిక ఉత్తర్వులు
తెలంగాణలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పంజాబ్‌లో ఒక్క రోజే 219 కేసులు
పంజాబ్‌లో ఇవాళ ఒక్క రోజే 219 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో, ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,451కి చేరింది.
ప్రస్తుతం 1,293 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు పంజాబ్‌లో కరోనావైరస్ బారిన పడి 25 మంది మరణించారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కేరళలో రెండు రోజుల తర్వాత కొత్త కేసులు నమోదు
రెండు రోజులు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించిన కేరళలో ఇవాళ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆ మూడు కేసులూ వాయనాడ్ జిల్లాలోనే నమోదయ్యాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 502 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతున్నారని, మిగతా వారందరూ వ్యాధి నుంచి కోలుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లో 85 కొత్త కేసులు
పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 85 కరోనా కేసులు నమోదయ్యాయని, ఏడుగురు మరణించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తాజా కేసులతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1344కు చేరింది. మరణాల సంఖ్య 68కు పెరిగింది.
భారత్‌లో 24 గంటల్లో 3,900 కొత్త కేసులు, 195 మరణాలు
దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,900 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 195 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరిందని, మరణాల సంఖ్య 1,568కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇప్పటి వరకు 12,726 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారని, గత 24 గంటల్లోనే 1,020 మంది కోలుకున్నారని వెల్లడించారు.
కొన్ని రాష్ట్రాల నుంచి సమాచారం ఆలస్యంగా వస్తోందని, అందుకే ఇవాళ మరణాల సంఖ్యలో ఎక్కువ పెరుగుదల కనిపించిందని లవ్ అగర్వాల్ చెప్పారు.
సామాజిక దూరం పాటించేందుకు, వివాహ వేడుకలకు 50 మందికి మించి హాజరు కాకూడదని, అంత్యక్రియలకు 20 మందికి వెళ్లకూడదని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ చెప్పారు.
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వే ఇప్పటి వరకు 62 ప్రత్యేక రైళ్లను నడుపుతోందని పుణ్య సలీల తెలిపారు.
ఆ రైళ్లలో 70,000 మంది తమ సొంతూళ్లకు బయలుదేరారని, ఇవాళ మరో 13 రైళ్లు ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు.
విదేశాల్లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చేందుకు 64 విమానాలు
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు మే 7 నుంచి 13 వరకు 64 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే విమానంలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఆ విమానాల్లో వచ్చిన వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతామని మంత్రి చెప్పారు.
యూఏఈ నుంచి 10 విమానాలు, ఖతార్- 2, సౌదీ అరేబియా- 5, యూకే-7, సింగపూర్- 5, అమెరికా- 7, ఫిలిప్పీన్స్- 5, బంగ్లాదేశ్- 7, బహ్రెయిన్- 2, మలేసియా- 7, కువైట్- 5, ఒమన్- 2 విమానాలు నడుపుతామన్నారు.
ఎవరి ప్రయాణ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
'ఫ్రాన్స్‌లో డిసెంబర్‌లోనే కరోనా కేసు నమోదైంది'
ఫ్రాన్స్‌లో డిసెంబర్‌లోనే కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైందని ఓ వైద్యుడు అంటున్నారు.
పారిస్ నగర శివారు ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తికి న్యూమోనియా ఉన్నట్లు డిసెంబర్ 27న తేలిందని, నిజానికి అది కోవిడ్-19 అని డాక్టర్ వైవెస్ కోహెన్ తాజాగా వెల్లడించారు.
అప్పుడు ఆ వ్యక్తి నుంచి దూదితో సేకరించిన శాంపిళ్లను ఇటీవల పరీక్షించగా, కోవిడ్-19 అని బయటపడిందని ఆయన ఫ్రెంచ్ మీడియాతో చెప్పారు.
ఆ రోగి పూర్తిగా కోలుకున్నారు. అప్పటికి వైరస్ వ్యాప్తి చెందిన ఏ ప్రాంతానికీ ఆయన వెళ్లలేదు. అయినా, ఆ వైరస్ ఎలా సోకిందన్నది అర్థం కావడంలేదని వైద్యుడు అంటున్నారు.
ఆయన చెబుతున్న దాని ప్రకారం చూస్తే, ఫ్రాన్స్‌లో అధికారికంగా కేసులు నమోదైనప్పటికి దాదాపు నెల రోజుల ముందే ఆ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందని అర్థమవుతోంది.
ఆ బాధితుడి భార్య పారిస్ సమీపంలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తారని, చైనా నుంచి వచ్చినవారి ద్వారా ఆమెకు వైరస్ సోకి ఉంటుందని, తర్వాత అది ఆమె భర్తకు అంటుకుని ఉంటుందని డాక్టర్ కోహెన్ భావిస్తున్నారు.
ప్రజలకు నగదు బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను బతికించుకోవాలి: అభిజిత్ బెనర్జీ
లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు వారికి నేరుగా నగదు బదిలీ చేయాలని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అన్నారు.
దేశంలో అట్టడుగున ఉన్న 60 శాతం ప్రజలకు నగదు బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను బతికించుకోవాలని సూచించారు.
ప్రజల చేతిలో డబ్బు పడితే వారికి కొనుగోలు శక్తి వస్తుందని.. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం దొరుతకుందని.. అది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మార్గమేస్తుందని విశ్లేషించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఆయన మంగళవారం వీడియో కాల్‌లో సంభాషించారు. దానికి సంబంధించిన కొన్ని వివరాలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
భారత్ భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు బెనర్జీ.
మద్యం డోర్ డెలివరీ ప్రారంభించిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వం
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం ప్రారంభించింది.
అయితే.. ఇది గ్రీన్ జోన్‌ల వరకే పరిమితం. దీనికోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటున్నారు.
ఒకరు గరిష్ఠంగా 5 లీటర్ల వరకు ఆర్డర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం రూ.120 డెలివరీ చార్జీలు తీసుకుంటున్నారు.
29 మంది రోహింజ్యాలను బంగాళాఖాతంలోని ద్వీపంలో క్వారంటైన్ చేసిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రభుత్వం 29 మంది రోహింజ్యా శరణార్థులను బంగాళాఖాతంలో తుపానుల ముప్పు ఉన్న ఒక మారుమూల ద్వీపంలో క్వారంటీన్ చేసింది.
ఈ శరణార్థుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు.
కొన్నివారాలుగా సముద్రంలో చిక్కుకుపోయిన వీరంతా శనివారం బంగ్లాదేశ్ తీరానికి చేరగా బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిని భాషన్ చార్ ద్వీనంలో వదిలిపెట్టింది.
మయన్మార్ నుంచి మలేసియాకు సముద్రమార్గంలో వెళ్లే ప్రయత్నం చేస్తూ పెద్దసంఖ్యలో రోహింజ్యాలు సముద్రంలో చిక్కకుపోయారని.. వీరూ అలాంటివారేనని చెబుతున్నారు.
కాగా రోహింజ్యా శరణార్థులున్న కాక్స్ బజార్‌లో కరోనా వ్యాపించకుండా ఉండేందుకే వీరిని ఆ ద్వీపంలో క్వారంటీన్ చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన నేవల్ లెఫ్టినెంట్ అబ్దుర్ రషీద్ సీఎన్ఎన్‌కు చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం 10 వేల కరోనా కేసులున్నాయి. రోహింజ్యా శరణార్థులున్న కాక్స్‌బజార్‌లో ఇంతవరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలు దాటిన మృతులు
ప్రపంచంలో కరోనావైరస్ మృతుల సంఖ్య 2.5 లక్షలు దాటింది.
అత్యధికంగా అమెరికాలో 69 వేల మరణాలు సంభవించాయి.
ఇటలీలో 29 వేల మందికిపైగా మరణించారు.
భారత్‌లోనూ గత 24 గంటల్లో అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి.
ఇండియాలో గత 24 గంటల్లో దేశంలో 3,900 కొత్త కేసులు.. 195 మరణాలు రికార్డయ్యాయి.
దీంతో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 46,433కి పెరిగింది.మృతుల సంఖ్య 1568కి చేరింది.
మద్యం దుకాణాలు తెరవొద్దంటూ విశాఖలో మహిళల ఆందోళన
విశాఖ నగరంలో తెరిచిన మద్యం దుకాణాలను వెంటనే మూసేయాలంటూ మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.
నగరంలోని ఆరిలోవ, తోట గురువు ప్రాంతాలలో మంగళవారం ఉదయం మహిళలు మద్యం షాపుల వద్దకు చేరుకొని తెరవనివ్వకుండా అడ్డుకున్నారు.
షాపు తెరిస్తే మా తడాఖా చూపిస్తాం అంటూ నినాదాలు చేశారు.
40 రోజులుగా కరోనా వైరస్ వ్యాధి ప్రబలకుండా ఇంటి వద్దనే ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో మద్యం షాపులు తెరవడంతో వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని మహిళలు అంటున్నారు.
‘‘ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోతుందా’’ అంటూ ఆగ్రహించారు.
ఇప్పటివరకు ఏపీలో 1,33,492 శాంపిళ్లను పరీక్షించారు
ఏపీలో గత 24 గంటల్లో 8,263 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 1,33,492 శాంపిళ్లను పరీక్షించారు. అందులో 1,31,775 నెగటివ్‌గా తేలాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై మరో 50 శాతం ధర పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను మరో 50 శాతం పెంచారు.
దీంతో మొత్తం 75 శాతం పెంచినట్లయింది.
మద్యం వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ధరలను భారీగా పెంచి, దుకాణాల సంఖ్యనూ తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ నెలాఖరు నాటికి 15 శాతం దుకాణాలను తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది.
పెంచిన ధరలు ఈ రోజునుంచే అమల్లోకి వస్తున్నాయి.