You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 40,000 దాటిన కోవిడ్ కేసులు... ప్రపంచవ్యాప్తంగా 34.62 లక్షల బాధితులు, 2.44 లక్షల మృతులు

గత 24 గంటల్లో భారతదేశంలో 2,487 కరోనావైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 40,263కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 10,887 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ‘ఇప్పటివరకూ దేశంలో పది వేల మంది డిశ్చార్జ్’

    దేశవ్యాప్తంగా ఆదివారం వరకూ కోవిడ్-19 రోగుల్లో పది వేలకుపైగా మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

    ఇంకా చాలా మంది ఈ రోగం నుంచి కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.

    కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి ఇదివరకు 10.5 రోజులుగా ఉండేదని, ఇప్పుడది 12 రోజులకు పెరిగిందని ఆయన అన్నారు.

    కరోనావైరస్ సోకినవారిలో మరణిస్తున్నవారి శాతం భారత్‌లో 3.2గా ఉందని, ప్రపంచంలోనే మరణాల రేటు అత్యల్పం ఉన్న దేశాల్లోభారత్ కూడా ఒకటని చెప్పారు.

    ప్రస్తుతం భారత్‌లో 28వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

  2. సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత

    దిల్లీలోని సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ప్రభుత్వం మూసివేసినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఓ సీనియర్ అధికారి వద్ద పనిచేసే ఓ ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

    తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కార్యాలయం మూసే ఉంటుందని, కరోనావైరస్ సోకిన సదరు ఉద్యోగి స్పెషల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఓ అధికారికి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారని వివరించింది.

    కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు సీఆర్‌పీఎఫ్ ప్రకటించిందని తెలిపింది.

    స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి, డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సహా 40 మంది సిబ్బందికి హోం క్వారంటీన్ విధించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

  3. ‘మెరుగ్గానే భారత్ రికార్డు’

    పది లక్షల పరీక్షలు నిర్వహించేనాటికి నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య విషయంలో భారత్ రికార్డు మెరుగ్గా ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    శనివారం సాయంత్రానికి భారత్‌లో నిర్వహించిన పరీక్షల సంఖ్య పది లక్షలు దాటింది. అప్పటికి దేశంలో 39,980 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    పది లక్షల పరీక్షలు నిర్వహించే నాటికి స్పెయిన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,194గా ఉంది. అమెరికా 1,64,620, జర్మనీ 73,522, టర్కీ 1,17,589, ఇటలీ 1,52,271 కేసులతో ఉన్నాయి.

  4. ఏపీలో 58 కొత్త కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    వీటితో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తంగా 1,583 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

    వీరిలో 488 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 33 మంది మరణించారు.

    1,062 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.

  5. భారత్‌లో కొత్తగా 2,644 కేసులు, 83 మరణాలు

    భారత్‌లో కొత్తగా గడిచిన 24 గంటల్లో 2,644 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 83 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఇప్పటివరకూ మొత్తంగా దేశంలో 39,980 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

    10,633 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, 28,046 కేసుల ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని వివరించింది.

    ఇంతవరకూ దేశంలో 1,301 మంది కరోనావైరస్ కారణంగా మరణించారని పేర్కొంది.

  6. ‘ఐఎన్ఎస్ జలశ్వ థాంక్యూ’

    బంగాళాఖాతంలో భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధ నౌక‌పై సిబ్బంది ‘థాంక్యూ’ అన్న పదం ఆకారంలో నిలబడి, కరోనావైరస్‌పై పోరాటంలో సేవలందిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపిపారు.

    గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సిద్దమవుతున్న నౌకల్లో జలశ్వ కూడా ఒకటి.

    నావికాదళానికి చెందిన ఇతర నౌకాలు, సిబ్బంది కూడా కరోనావైరస్‌పై పోరాడుతున్నవారికి వందనం తెలిపే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  7. రాష్ట్రపతి భవన్ వద్ద...

    కరోనావైరస్‌పై పోరాడుతున్నవారికి వందనం సమర్పిస్తూ దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద భారత వాయుసేన విమానాలు ఇలా నింగిలో కనిపించాయి.

  8. వైద్య సిబ్బందిపై పూల వర్షం

    దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వైద్య సిబ్బందిపై భారత వాయుసేన హెలికాప్టర్లు ఇలా పూల వర్షం కురిపించాయి.

  9. ముంబయిలో సుఖోయ్ విమానాల వందనం

    కోవిడ్-19పై పోరాటంలో సేవలందిస్తున్న వైద్య, పారిశుధ్య తదితర విభాగాల సిబ్బందికి ముంబయిలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 విమానాలు ఇలా వందనం సమర్పించాయి.

  10. అమెరికాలో 24 గంటల్లో 1,435 మరణాలు

    అమెరికాలో గడిచిన 24 గంటల్లో కోవిడ్-19 కారణంగా 1,435 మంది మరణించినట్లు జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

    మొత్తంగా ఆ దేశంలో ఇప్పటివరకూ 11.3 లక్షలకుపైగా మందికి కరోనావైరస్ సోకిందని, వారిలో 66,385 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

    ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 34 లక్షలు దాటిందని, మృతుల సంఖ్య 2.43 లక్షలకు చేరుకుందని పేర్కొంది.

  11. భారత్‌లో పది లక్షలు దాటిన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు

    భారత్‌లో ఇప్పటివరకూ నిర్వహించిన కోవిడ్-19 ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష సంఖ్య పది లక్షల మార్కును దాటినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఏఎన్ఐ సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం వరకూ దేశంలో 10.4 లక్షల ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు జరిగాయి. 9.7 లక్షల పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకూ 1,37,346 పరీక్షలు జరిగాయి.

    ఈ పరీక్షల నిర్వహణలో మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ మందున్నాయని... ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, దిల్లీ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని ఇంకా పెంచాల్సి ఉందని ఐసీఎంఆర్ తెలిపింది.

    కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ను గుర్తించడంలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ప్రాధాన్యత గురించి ఐసీఎంఆర్ పదేపదే చెబుతోంది. దీని ద్వారా వైరస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉందని అంటోంది.

    దేశవ్యాప్తంగా 310 ప్రభుత్వ ల్యాబ్స్‌లో, 111 ప్రైవేటే ల్యాబ్స్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

  12. కర్నూలులో కరోనా నుంచి కోలుకున్న ఐదేళ్ల బాలిక

    కర్నూలులో ఓ ఐదేళ్ల బాలిక కోవిడ్-19 నుంచి కోలుకున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.

    ఆ బాలికతోపాటు మరో 38 ఏళ్ల వ్యక్తి నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.

    వీరితో కలిపి ఇప్పటివరకూ జిల్లాలో 68 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నట్లు వీరపాండియన్ వివరించారు.

    కరోనావైరస్ బారినపడ్డవారి చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరిస్తోందని, కోలుకున్నవారికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున నగదు సాయం చేస్తోందని చెప్పారు.

  13. హకీంపేటలో పోగైన వలస కార్మికులు, వరంగల్‌లో నిరసన

    హైదరాబాద్‌లోని హకీంపేటలో శనివారం సుమారు 300 మంది వలస కార్మికులు పోగైనట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    రైళ్ల రాకపోకలు మొదలైనట్లు భావించి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వారంతా వచ్చారని, తాము నచ్చజెప్పడంతో వెనక్కి వెళ్లిపోయారని అదనపు ఇన్‌స్పెక్టర్ కేఎన్ రెడ్డి చెప్పినట్లు పేర్కొంది.

    మరోవైపు వరంగల్ రైల్వే స్టేషన్‌లో వలస కార్మికులు శనివారం నిరసన చేపట్టారని, తమ తమ రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారని ఏఎన్ఐ తెలిపింది.

  14. వారియర్స్‌కు వందనానికి కేరళలో ఏర్పాట్లు

    కోవిడ్-19పై పోరాటంలో పాలుపంచుకుంటున్నవారికి సంఘీభావంగా, ‘ఇండియా సెల్యూట్స్ కరోనా వారియర్స్’ పేరుతో దేశవ్యాప్తంగా ఈ రోజు కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి.

    వైద్య, పారిశుధ్య తదితర విభాగాల సిబ్బందిని రకరకాల రూపాల్లో ఆదివారం వందనం సమర్పించబోతున్నారు.

    ఈ కార్యక్రమం కోసం సన్నద్ధమవుతూ సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన నాలుగు నౌకలు కేరళలోని కోచిలో శనివారం రాత్రి ఇలా కనిపించాయి.

  15. లాక్ డౌన్ పొడిగింపు, కోవిడ్-19పై పోరుపై కాంగ్రెస్ ప్రశ్నలు, మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్

    లాక్ డౌన్ కొనసాగింపు, కోవిడ్0-19పై పోరుకు సంబంధించి కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధించింది. తమ సందేహాలను నివృత్తి చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

    కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.

    “లాక్ డౌన్‌ను మరో రెండువారాలు పొడిగిస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

    ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. హోం మంత్రి కూడా మీడియా ముందుకు రాలేదు. కనీసం ఒక్క ప్రభుత్వ అధికారి కూడా మీడియా ముందుకొచ్చి ప్రకటించలేదు. దేశ ప్రజలకు ఓ అధికారిక ఉత్తర్వుల ప్రతిని మాత్రమే ఇచ్చారు” అని ఆ ప్రకటనలో సుర్జేవాలా పేర్కొన్నారు.

    ఈ ప్రకటన ద్వారా ఆయన కేంద్రానికి కొన్ని ప్రశ్నలు వేశారు.

    • లాక్ డౌన్ 3.0 ఉద్దేశం ఏంటో 130 కోట్ల మంది భారతీయులు తెలుసుకోవాలనుకుంటున్నారు. దీని అవసరం, లక్ష్యం, వ్యూహం ఏంటి? లాక్ డౌన్ 4.0, 5.0 కూడా ఉంటాయా?
    • మే 17 తర్వాత కరోనావైరస్ మహమ్మారిని, దాని ద్వారా తలెత్తిన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికలేంటి? మే 17 నాటికి మీర సాధించబోతున్న లక్ష్యాలేంటి? మే 17 నాటికి ఎలాంటి కచ్చితమైన చర్యలు చేపట్టబోతున్నారు?
    • మే 17న లాక్ డౌన్ ఎత్తివేయడానికి మీ దగ్గరున్న వ్యూహం ఏంటి? దేశం గురించి మీ ఆలోచనలు ఏంటి?
    • రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం మాత్రమే కాదు, వచ్చే సీజన్‌కు ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై మీ ప్రణాళికలేంటి?
    • 40 కోట్ల గ్రామీణ పేదలు, కూలీలకు నిత్యావసరాలు, జీవనోపాధికి సంబంధించి మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి?
    • మధ్య తరగతి వారికి ఉద్యోగ, వేతన భద్రతను ఎలా కల్పిస్తారు?
    • పర్యటకం, హోటళ్లు, టెక్స్‌టైల్ పరిశ్రమ, నిర్మాణరంగం, ఆటోమొబైల్, ఐటీ, రవాణా, విమానయానం.. ఇలా వివిధ రంగాలను పునఃప్రారంభించేందుకు, వాటికి పూర్వ స్థితిని తీసుకురావడానికి వ్యూహాలేమిటి?
  16. విశాఖలో నావికాదళం రిహార్సల్స్

    విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సమీపంలో తూర్పు నావికాదళ సిబ్బంది యుద్ధ నౌకల నుంచి రిహార్సల్స్ చేస్తున్న దృశ్యాలివి.

  17. ముంబయిలో నావికాదళం సన్నాహాలు, కరోనావైరస్‌పై పోరులో వీరులకు సంఘీభావంగా...

    కరోనావైరస్‌పై పోరులో ముందు నిలిచిన వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు చేపట్టనున్న కార్యక్రమాల కోసం ముంబయిలోని నావికాదళం చేస్తున్న సన్నాహాల వీడియో ఇది.

  18. మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేసిన స్పెయిన్

    బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ప్రజలకు మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ స్పెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. క్రమక్రమంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునే ప్రదేశాల్లో 60 లక్షల మాస్కులను పంపిణీ చేస్తామని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. మరో 70 లక్షల మాస్కులను స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలకు అందిస్తామని చెప్పారు.

    ఏడు వారాల తర్వాత స్పెయిన్‌లో కొందరు ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చారు.

    వారం రోజుల క్రితమే 14 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించిన లాక్ డౌన్ నిబంధనలను స్పెయిన్ సడలించింది.

    యూరప్‌లోని ఇతర దేశాల్లో కూడా లాక్ డౌన్‌ను సడలిస్తున్నారు. అయితే సామాజిక దూరం పాటించడం మాత్రం తప్పనిసరి. కొన్ని దేశాల్లో షాపులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేశాయి.

    ప్రస్తుతం ఇటలీలో యూరప్‌లోనే అత్యధిక కరోనావైరస్ మరణాలు సంభవించాయి. ఆ తర్వాత స్థానం బ్రిటన్‌, స్పెయిన్‌లది.

  19. కరోనావైరస్: బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    కరోనావైరస్‌‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీ.

    ఇప్పటివరకు ముఖ్యాంశాలు

    • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 34,24,254 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 2,43,674 మంది మరణించారు.
    • భారత్‌లో కేసుల సంఖ్య 37వేలు దాటింది. 1223 మంది ప్రాణాలు కోల్పోయారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 1525 కాగా మృతుల సంఖ్య 33.
    • తెలంగాణలో కేసుల సంఖ్య 1061కి పెరగగా.. ఇప్పటివరకు 29 మంది మరణించారు.
    • అమెరికాలో 11.3 లక్షల మందికి పాజిటివ్ అని నిర్ధరణైంది. 66వేల మంది చనిపోయారు.