You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 29,974కి చేరిన కేసుల సంఖ్య, 937 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. 2,12,345 మంది మరణించారు.

లైవ్ కవరేజీ

  1. టోక్యో ఒలంపిక్స్ 2020... 2021... 2022?

    కరోనావైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది ఒలంపిక్స్ పోటీలను నిర్వహించడం ఇబ్బందేనని జపాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యొషిటకె యొకొకుర అన్నారు.

    ‘‘ఒలంపిక్స్ పోటీలకు జపాన్ ఆతిథ్యం ఇవ్వాలా? ఇవ్వకూడదా? అని నేను చెప్పట్లేదు, కానీ అలా చేయడం ఇబ్బందికరం’’ అని యెషిటకె చెప్పారు.

    ఈ ఏడాది జరగాల్సిన క్రీడలను 2021కి వాయిదా వేశారు. అయితే, వచ్చే ఏడాదైనా ఈ పోటీలు జరుగుతాయా? అన్న దానిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    వచ్చే ఏడాది క్రీడలు జరుగుతాయన్న హామీని తాను ఇవ్వలేనని టోక్యో గేమ్స్ ఛీఫ్ ఈ నెల మొదట్లో అన్నారు.

  2. లాక్ డౌన్‌ను సడలించిన న్యూజీలాండ్

    ఇప్పటి వరకూ కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేసిన న్యూజీలాండ్ ఇప్పుడు సడలింపుకు సిద్ధమైంది. కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని అడ్డుకున్నామని, కరోనావైరస్‌ను సమర్థవంతంగా రూపుమాపామని ఆ దేశం ప్రకటించింది.

    అలాగే, దేశంలో హెచ్చరికల స్థాయిని నాలుగు నుంచి మూడుకు తగ్గించింది. దీంతో నిత్యావసరాలు కాని వ్యాపారాలు, వైద్య సేవలు, పాఠశాలలు కూడా మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

    దేశంలో దాదాపు 4 లక్షల మంది తిరిగి పనులకు బయలుదేరారు. కొన్ని పాఠశాలలు, పిల్లల బాగోగులు చూసే సదుపాయాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రజలు ఆహారాన్ని కొనుగోలు చేయడం కూడా తిరిగి మొదలైంది.

    సరిహద్దుల్ని సులభంగా మూసివేయగలగడం, ఐసోలేషన్ వంటివి న్యూజీలాండ్ మొదట్లోనే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాయి.

    దేశంలో ఇప్పటి వరకూ సుమారు 1500 కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 19 మంది మరణించారు.

  3. బంగాళాదుంపల చిప్స్ ఎక్కువగా తినండి, బెల్జియం ప్రజలకు రైతుల విజ్ఞప్తి

    బెల్జియం ప్రజలు బంగాళాదుంపలతో చేసిన చిప్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. కనీసం రోజుకోసారైనా వారు చిప్స్ తినకుండా ఉండరు.

    అయితే, కనీసం రోజుకు రెండుసార్లు చిప్స్ తినాలని అక్కడి బంగాళాదుంపల రైతులు కోరుతున్నారు.

    కరోనావైరస్ కారణంగా తమ పంటను ఎగుమతి చేసుకునే వీలులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎక్కువగా తినడం వల్ల తమ దిగుబడులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని వారంటున్నారు.

    ప్రస్తుతం బెల్జియంలో దాదాపు 7.5 లక్షల టన్నుల బంగాళాదుంపల నిల్వలున్నాయి.

    “మనందరం ఇప్పటివరకూ రోజుకు ఒకసారి చిప్స్ తిన్నాం. ఇకనుంచి రోజుకు రెండుసార్లు చిప్స్ తిందాం” అని బంగాళాదుంప రైతుల యూనియన్ ప్రతినిధి రొమైన్ కూల్ అన్నారు.

    మార్చి రెండో వారం తర్వాత నుంచి బెల్జియంలోని చాలా రెస్టారెంట్లు లాక్ డౌన్‌లో ఉన్నాయి. చాలా రకాల పండగలు, ఉత్సవాలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో బంగాళాదుంపల నిల్వలు వేర్ హౌస్‌లలో పెరిగిపోయాయి.

    ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఎగుమతికి కూడా అవకాశాలు లేవు.

    బంగాళాదుంపలతో తయారయ్యే చిప్స్ వంటి ఉత్పత్తులను భారీ స్థాయిలో ఎగుమతి చేసే దేశాల్లో బెల్జియం ఒకటి. ప్రతి సంవత్సరం దాదాపు 100 దేశాలకు 1.5 మిలియన్ టన్నుల చిప్స్‌ను ఎగుమతి చేస్తుంది.

  4. మహమ్మారిపై పోరులో బ్రిటన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ప్రధాని బోరిస్ జాన్సన్

    కరోనావైరస్ మహమ్మారిపై పోరాటంలో బ్రిటన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా సహనాన్ని కోల్పోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    కరోనావైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత తొలిసారిగా ఆయన అధికారిక కార్యాలయం 10-డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

    వైరస్‌ వ్యాప్తి గతిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    లాక్ డౌన్‌ను అంత త్వరగా తొలగించడం సాధ్యం కాదని, దీనికి సంబంధించి ఏ చర్యలు, నిర్ణయాలు తీసుకున్నా త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

    ప్రస్తుతం నిలిచిపోయిన కేన్సర్ చికిత్స వంటి వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

    కరోనావైరస్ బారిన పడి మరణించిన జాతీయ వైద్య సేవల సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి చెందిన కుటుంబాలకు 60000 పౌండ్లు పరిహారంగా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

  5. కరోనావైరస్‌పై బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    ఇప్పటివరకూ ఉన్న విశేషాలు...

    • అమెరికాలో కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉంది.
    • సోమవారం నుంచి జర్మనీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
    • కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఇటలీలో లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
    • భారత్‌లో మొత్తం 23,380 కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,362మంది కోలుకున్నారు. 886 మంది మరణించారు.
    • కరోనావైరస్ మన జీవితాల్లో భాగమైపోతోందని, రాబోయే కాలంలో దానితో కలసి జీవించాల్సి ఉంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కరోనావైరస్ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి లేదని, వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుని, మందులు తీసుకుంటే నయం అయిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో టెస్టింగ్ సామర్థ్యం పెంచామని, రాష్ట్రంలో 80శాతం భాగం గ్రీన్ జోన్‌లో ఉందని తెలిపారు.
    • తెలంగాణలో సోమవారం కేవలం 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవి రెండూ జీహెచ్ఎంసీ పరిధిలోనే బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కు చేరింది. 25మంది మరణించారు.