అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్
చట్టం కింద నమోదైన అన్ని దుకాణాలనూ తెరవొచ్చని కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 24వ తేదీ
శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత
ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు.
ఈ మేరకు ఏప్రిల్ 15వ తేదీన జారీ చేసిన ఆదేశాలను సవరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.
అంతకుముందు అన్ని షాపింగ్ కాంప్లెక్సులూ అన్న పదాన్ని మున్సిపల్
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని మార్కెట్ కాంప్లెక్సులుగా మార్చారు.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధి లోపల, బయట ఉన్న.. షాప్స్ అండ్
ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత
ప్రాంతాల్లోని షాపులు.. నివాస సముదాయాలు, మార్కెట్ కాంప్లెక్సుల్లోని షాపులతో సహా
అన్ని షాపులూ తెరవొచ్చు. అయితే, వీటిలో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి.
వారంతా మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి.
అయితే, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ లోని దుకాణాలకు మాత్రం ఈ
ఉత్తర్వులు వర్తించవు. అంటే వాటిని తెరవడానికి వీల్లేదు.
అయితే, కరోనావైరస్ ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలు, రెడ్‌జోన్లు/కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో
ఈ ఉత్తర్వులు అమలు కావని హోం శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
మార్చి 24వ తేదీన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రకటించారు.
ఇప్పటి వరకూ దేశంలో పాలు, నిత్యావసరాలు, మందుల దుకాణాలను తెరిచేందుకు మాత్రమే
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో అన్ని షాపులూ తెరుకుచుకునే అవకాశం
ఉంది.