You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 21 వేలు దాటిన మొత్తం కేసులు; ఏపీలో 893, తెలంగాణలో 980 మందికి పాజిటివ్

భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దాంతో, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. యూరప్ ఐక్యతకు పిలుపునిచ్చిన మెర్కెల్

    కరోనావైరస్‌ను నియంత్రించడం యూరప్ ఐక్యతకు పెను సవాలని జర్మనీ ఛాన్స్‌ లర్ ఎంగెలా మెర్కెల్ అన్నారు.

    ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల జీవనం, ఆరోగ్యానికి ఇదే అతిపెద్ద సవాలు’’ అని దేశ పార్లమెంటు దిగువ సభలో ఆమె అన్నారు.

    గురువారం సాయంత్రం ఆమె ఈయూ నాయకుల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనున్నారు.

    ‘‘వీలైనంత క్రమశిక్షణతో మనం భద్రమైన జీవితంలోకి త్వరగా రాగలం’’ అని మెర్కెల్ చెప్పారు.

    లాక్‌డౌన్‌లను ఎత్తేయడం, తిరిగి విధించడం వంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి క్రమశిక్షణ అవసరమని తెలిపారు.

    ఇప్పటి వరకూ సాధించినదానిని వృధా చేయకూడదని వెల్లడించారు. జర్మనీ ఆరోగ్య వ్యవస్థను, సైనిక దళాల మద్దతును ఆమె కొనియాడారు.

    లెక్కలేనంతమంది ప్రజల జీవితాలను కాపాడే ఆరోగ్య వ్యవస్థపై అధిక భారం పడకుండా చూడటం ఎలా అన్నదే జర్మనీ, యూరప్ రాజకీయాలు చాలాకాలం పాటు ఎదుర్కొనే ప్రశ్న అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

    ప్రపంచ సరఫరాలపై ఆధారపడకుండా ప్రత్యేక మెడికల్ కిట్లను తయారు చేసుకునే సామర్థ్యాన్ని యూరప్ పెంచుకోవాలని ఆమె తెలిపారు.

  2. ఈ ఏడాదంతా సామాజిక దూరం తప్పదంటున్న యూకే

    కరోనా వైరస్ కారణంగా విధించిన కొన్ని సామాజిక నిబంధనల ఈ యేడాదంతా కొనసాగిస్తామని యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ప్రకటించారు.

    ‘‘వైరస్ కారణంగా మారిపోయిన లైఫ్ స్టైల్ ఒక్కసారిగా తిరిగి మామూలు స్థితికి రావడమనేది అసాధ్యం’’ అన్నారు ప్రొఫెస్ క్రిస్ విట్టీ.

    ప్రభావవంతమైన మెడిసిన్ ను కనుక్కోవడం, లేదా ఉన్న మందుల ద్వారా వ్యాధిని నిర్మూలించడం అనే మాటలు రాబోయే యేడాది కాలంపాటు దాదాపు మృగ్యం అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

    దానంతటదే మాయమైపోతుంది తప్ప ఈ జబ్బు నిర్మూలించేది కాదన్నారాయన.

    రాబోయే కాలంలో ఈ వ్యాధితో కలిసి పని చేస్తామన్న విషయాన్ని మనమంతా ఒప్పుకోక తప్పదన్నారు డాక్టర్ విట్టీ.

  3. రంజాన్‌ సందర్భంగా మసీదులకు హెచ్చరికలు

    రంజాన్‌ సందర్బంగా మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పాకిస్థాన్ అధికారులు, మత పెద్దలకు ఆ దేశంలోని ప్రముఖ డాక్టర్లు విజ్జప్తి చేస్తున్నారు.

    ఇలా సామూహిక ప్రార్ధనల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని, పరిస్థితి అదుపు తప్పుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

    ‘‘దురదృష్టవశాత్తు మన పాలకులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మత పెద్దలు దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదు’’ అని అంటున్నారు పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన డాక్టర్ ఖాసిర్ సజ్జాద్.

    బుధవారం నాడు నిర్వహించిన టెస్టుల్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా నెగిటివ్ వచ్చింది.

    అయితే పాకిస్థాన్ లో ఇప్పటికే 10, 000మందికి కరోనా వైరస్ సోకగా...దేశవ్యాప్తంగా 212మంది మృతి చెందారు.

    దక్షిణాసియాకు సంబంధించిన మరొకొన్ని వార్తలు

    • బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన 500మంది రొహింగ్యాలను రక్షించాల్సిందిగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల ఆరంభంలో కూడా సముద్రంలో చిక్కుకుపోయిన వందలమంది రొహింగ్యాలను బంగ్లాదేశ్ రక్షించింది.
    • 23 టన్నుల ఔషధాలను పంపినందుకు భారతదేశానికి నేపాల్ ప్రధాని కృతజ్జతలు తెలిపారు. ప్రస్తుతం నేపాల్ లో కరోనా పాజిటివ్ కేసులు 45కు చేరుకున్నాయి.
    • ఒక్కసారిగా 41 కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ ఎత్తేయాలన్న నిర్ణయాన్ని శ్రీలంక వెనక్కి తీసుకుంది. దీంతో అక్కడ ఏప్రిల్ 27 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.
  4. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?

    ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 సంస్థలు కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి.

    అందులో కొన్ని క్లినికల్ ట్రయల్స్ దశకు కూడా చేరుకున్నాయి.

    ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే సాధారణంగా కొన్ని సంవత్సరాలు ఒక్కోసారి దశాబ్దాలు కూడా పడుతుంది.

    కాకపోతే కరోనా వైరస్ కు 2021 తొలి అర్ధభాగం నాటికి అందుబాటులోకి రావచ్చని అంటే వ్యాధి పుట్టిన 12-18 నెలల్లోగా వ్యాక్సిన్ సిద్ధం చేయడం సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు.

    అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది సరిగ్గా పనిచేస్తుందనటానికి ఎలాంటి గ్యారంటీ లేదు.

  5. స్వస్థలాలకు గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రా మత్స్యకారులు, గుజరాత్ సీఎంతో జగన్ చర్చ.. సముద్ర మార్గంలో 3 వేల మంది తరలింపుకు చర్యలు

    గుజరాత్ లో చిక్కుకున్న ఆంధ్రా మత్స్యకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు మార్గం సులభమైంది. వారిని సముద్ర మార్గం ద్వారా గుజరాత్ నుంచి ఆంధ్రకు తిరిగి రప్పించనున్నారు.

    ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

    కోస్తా ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ రాష్ట్రం వెళతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు వీరిలో ఎక్కువ ఉంటారు. గతంలో వీరు పొరబాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించి అక్కడ జైళ్లల్లో చిక్కుకున్న సందర్భాలూ ఉన్నాయి.

    ఇలా వేల సంఖ్యలో అక్కడ చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు లాక్ డౌన్ వల్ల ఇరుక్కుపోయారు. అలాంటి వారు గుజరాత్ లోని విరావల్ ప్రాంతంలో దాదాపు 5 వేల మంది ఉంటారని ఆంధ్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారికి సహకరించాలని గతంలో ఏపీ సీఎం జగన్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు.

    వారికి అన్ని ఏర్పాట్లూ చేస్తామని గుజరాత్ సీఎం ఆంధ్రా సీఎం కు హామీ ఇచ్చినట్టు గుజరాత్ ఉన్నతాధికారులు ప్రకటించారు. దానికితోడు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన వాటికి అదనంగా ఏపీ ప్రభుత్వ ఖర్చుతో కూడా వారికి బియ్యం, దుప్పట్లు, ఇతర అవసరమైన వస్తువులు కూడా పంపిణీ చేసినట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ కార్యాలయం ప్రకటించింది.

    ‘‘లాక్ డౌన్ ఎన్నాళ్లు కొనసాగుతుందో కచ్చితంగా తేలకపోవడంతో అక్కడి మత్స్యకారులు మరింత ఒత్తిడి, భయానికి గురవతూండడంతో వారిని ఎలా తీసుకురావాలన్న విషయమై రెండు రోజులుగా వరుసగా సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ మళ్లీ గుజరాత్ సీఎంతో మాట్లాడారు. వారిని పంపడానికి ఆయన ఒప్పుకున్నారు. దీంతో వారిని సముద్ర మార్గం ద్వారా తీసుకురావాలని నిర్ణయించారు’’ అని మంత్రి కార్యాలయం ప్రకటించింది.

    ఐదు వేల మందిని రోడ్డు మార్గంలో తీసుకురావడం లాక్ డౌన్ వేళ సాధ్యం కాదు కాబట్టి, వారందరినీ సముద్ర మార్గం ద్వారా బోట్ల మీదుగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బోటు మీద సముద్ర మార్గంలో వారిని తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు.

    గుజరాత్ లోని నవరస్ ప్రాంతం నుంచి ఆంధ్రలోని శ్రీకాకుళం వరకూ సుమారు 3 వేల కిమీ వారు సముద్ర మార్గంలో ప్రయాణించి రావాల్సి ఉంటుంది.

  6. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే విధ్వంసమే - సీడబ్ల్యుసీ భేటీలో సోనియాగాంధీ

    ఇదే తరహాలో మే 3వ తేదీ తర్వాత కూడా దేశంలో లాక్‌డౌన్ కొనసాగితే అది చాలా విధ్వంసకరం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు.

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగిస్తూ..

    మే 3వ తేదీ తర్వాత దేశంలో పరిస్థితిని ఎలా చక్కదిద్దాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయమూ ఉన్నట్లు కనిపించడం లేదని అన్నారు.

    మార్చి 23వ తేదీన లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి తాను ప్రధానమంత్రికి పలు లేఖలు రాశానని, అందులో నిర్మాణాత్మకమైన సహకారానికి పలు సూచనలు చేశానని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిలో కొన్నింటిని మాత్రమే నామమాత్రంగా అమలు చేసిందని తెలిపారు.

    దేశంలో కోట్లాది మంది పేదలు ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలో లేని 11 కోట్ల మందికి త్వరితగతిన ఆహారాన్ని అందించాలని కోరారు.

    లాక్‌డౌన్ మొదటి దశలో 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని, ఈ నేపథ్యంలో ఒక్కో కుటుంబానికీ రూ.7,500 ఇవ్వాలని సూచించారు.

    దేశంలో ఇంకా కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, పీపీఈ కిట్ల కొరత ఉందని వెల్లడించారు. ఇస్తున్న కిట్లు కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నవి కాదని ఆరోపించారు.

    కరోనావైరస్ మహమ్మారిపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఇవ్వాలని కోరారు.

    ప్రతిఒక్క భారతీయుడూ కరోనాపై ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో బీజేపీ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తప్పు పట్టారు. దీనివల్ల సామాజిక సామరస్యానికి చాలా కీడు జరుగుతోందని వెల్లడించారు. దీన్ని సరిదిద్దేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.

    కాగా, దేశంలో ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఎన్జీఓలు, లక్షలాది మంది ప్రజలు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారని, వారందరి నిబద్ధత ఎంతో స్ఫూర్తినింపుతోందని అన్నారు.

    కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దేశవ్యాప్తంగా సహాయ చర్యలు కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు.

  7. క్రూయిజ్ షిప్పుల్లో కరోనా వైరస్

    జపాన్ తీరంలో నిలిచిపోయిన క్రూయిజ్ షిప్ లో మరో 14మంది కరోనా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ షిప్పులో ఉన్నవారిలో పాజిటివ్ బాధితుల సంఖ్య 50కి చేరుకుంది.

    632మంది సిబ్బంది మాత్రమే ఉన్న ది కోస్టా అట్లాంటికా అనేక క్రూయిజ్ షిప్ రిపేర్ల కోసం ఈ యేడాది జనవరిలో నాగసాకి పట్టణంలోని డాక్ యార్డుకు చేరుకుంది. సిబ్బంది అంతా 33దేశాల యాత్ర ముగించుకుని అక్కడికి వచ్చారు. కొవిడ్-19 బారిన పడిన ఓడల్లో అట్లాంటికా ఒకటి.

    అంతకు ముందు ది డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ షిప్ ఈ యేడాది ఫిబ్రవరిలో జపాన్ లోని యొకొహమా తీరంలో క్వారంటైన్ అయ్యింది. ఇందులో 7వందల మంది ప్రయాణికులుండగా...13మంది కరోనా కారణంగా చనిపోయారు.

    మార్చిలో 2వేల 7వందలమంది ప్రయాణికులున్న ది రూబీ ప్రిన్సెస్ నౌక సిడ్నీలో క్వారంటైన్ అయ్యింది. ఇందులో 6వందల కరోనా కేసులు బైటపడగా....21మంది మరణించారు. దీనిపై పోలీసులు విచారణ జరపుతున్నారు.

    ఇక ది గ్రాండ్ ప్రిన్సెస్ నౌకను మార్చి నుంచి కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర తీరంలో క్వారంటైన్ చేశారు. ఇందులో 100మందికి పైగా కరోనా బాధితులుండగా..ఇద్దరు చనిపోయారు.

    అంటార్కిట్ యాత్రలో ఉన్న గ్రెగ్ మార్టీమర్ షిప్పులో 217మంది ప్రయాణికులలో సగంమంది ప్రయాణికులు, సిబ్బందికి టెస్టు్లో పాజిటివ్ అని తేలింది. అయితే ఇందులో ఎవరూ మరణించలేదు.

  8. రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోండి - దిల్లీ జమా మసీదు ఇమామ్

    రంజాన్ నెల ప్రారంభం నేపథ్యంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని దిల్లీలోనిన జమా మసీదు ఇమామ్ విజ్ఞప్తి చేశారని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తేనే కరోనావైరస్‌ను నిర్మూలించగలమని ఆయన తెలిపారు.

    సామాజిక దూరాన్ని పాటించి, అందరినీ కాపాడగలమని వివరించారు.

  9. అమెరికాలో రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్

    న్యూయార్క్ కి చెందిన రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అవి అమెరికాలో తొలి కరోనా పాజిటివ్ పెంపుడు జంతువులుగా నిలిచాయి.

    అయితే ఈ పిల్లుల ద్వారా వైరస్ మనుషులకు వైరస్ సోకినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని అమెరికాకు చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆంథోనీ ఫాకి వెల్లడించారు.

    అవి నివసించే ఇంటి సమీపంలో ఉన్న ఇన్ ఫెక్షన్ బాధితుల నుంచి పిల్లులకు వైరస్ సోకి ఉండవచ్చని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ(సీడీసీ) అభిప్రాయపడింది.

    న్యూయార్క్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఈ పిల్లులు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే అవి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

    ఇప్పటి వరకు వైరస్ సోకిన జంతువుల జాబితా ఇలా ఉంది.

    • న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూలో ఐదు పులులు, మూడు సింహాలకు వైరస్ సోకినట్లు ఆ జూను నడుపుతున్న వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ ప్రకటించింది.
    • యజమాని వైరస్ బాధితుడు కావడంతో హాంకాంగ్ లో ఒక పొమెరానియన్ జాతికి చెందిన ఒక కుక్కకు కూడా వైరస్ సోకింది. ఫిబ్రవరిలో క్వారంటైన్ అయిన ఈ కుక్క తర్వాత కోలుకోవడంతో ఇంటికి పంపించి వేశారు. అయితే కొన్నాళ్లకు ఆ కుక్క చనిపోగా...మరణానికి కారణం మాత్రం అంతుబట్ట లేదు.
    • హాంకాంగ్ లోనే ఒక జర్మన్ షెపర్ట్ జాతి కుక్కకు కూడా యజమాని నుంచి వైరస్ సోకింది. దానిని క్వారంటైన్ చేశారు.
  10. లాక్ డౌన్ ను పట్టించుకోని సింగపూర్ వాసులు

    లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వ్యక్తికి సింగపూర్ ప్రభుత్వం ఆరువారాల జైలు శిక్ష విధించింది.

    ఈ తరహా లాక్ డౌన్ శిక్షల్లో ఆ దేశంలో ఇదే మొదటి కేసు మలేషియా నుంచి వచ్చి 14 రోజుల క్వారంటైన్ లో ఉన్న అలన్ థామ్, తనకిష్టమైన పోర్క్ సూప్ కోసం క్వారంటైన్ సెంటర్ నుంచి బైటికి వచ్చాడు.

    అతను ఈ సూప్ అతి తక్కువ ధరకు దొరికే హాకర్ సెంటర్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

    సింగపూర్ లో ఇప్పటికే 10వేల కరోనా పాజిటివ్ కేసులు బైటపడ్డాయి. ప్రస్తుతం ఆదేశం సర్క్యూట్ బ్రేకర్ గా చెప్పే పాక్షిక లాక్ డౌన్ ఎత్తివేతను అమలు చేస్తోంది.

    కేవలం ఫుడ్ డెలివరీ సంస్థలకే ఆహారాన్ని సరఫరా చేయడానికి అనుమతి ఉంది.

    అయితే అతితక్కువ ధరకు మాంసాహారాన్ని అందించే హాకర్ సెంటర్లను నడుపుతున్న వారిలో ఎక్కువమంది వృద్ధులు కావడం, వారికి ఫుడ్ సరఫరా చేసే యాప్ లపై అవగాహన లేకపోవడంతోపాటు, వాటి రుసుములను భరించే స్థితిలో లేరు.

    దీంతో చౌకధరలో ఆహారం కోసం కొందరు లాక్ డౌన్ ను ఉల్లంఘించి ఈ సెంటర్లకు వస్తున్నారు.

  11. భారత్ లో రెండోసారి ఒకేరోజులో అత్యధిక కరోనా కేసుల నమోదు

    భారత్ లో బుధవారం ఒక్కరోజే 1486 కొత్త కేసులు బైటపడటంతో అది రెండోసారి ఒకేరోజు అత్యధిక కేసులు తేలిన రోజుగా రికార్డయింది.

    గత 24 గంటల్లో 41మంది ఈ వైరస్ కారణంగా చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మరణాల సంఖ్య 681కి చేరింది.

    ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 21వేలు దాటింది.

    గత సోమవారమే దేశవ్యాప్తంగా కొత్తగా 1500మందిలో వ్యాధిని గుర్తించామన్న అధికారుల ప్రకటనతో ఒకే రోజులో అత్యధిక కేసుల రికార్డు నమోదైంది.

    అయితే ఇక్కడో శుభవార్త కూడా ఉంది. కేసులు రెట్టింపయ్యే రేటు అంటే వ్యాధి సోకే దినాలు రెండింతలయ్యే రేటు లాక్ డౌన్ కు ముందు 3.4 రోజులు కాగా... ఇప్పుడది 8 రోజులకు పెరిగిందని అధికారులు చెప్పారు.

  12. దేశవ్యాప్తంగా 4,85,172 శాంపిల్స్ పరీక్షలు

    దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 9 గంటలకల్లా 5లక్షల 542 శాంపిల్స్ తీసుకున్నామని, వాటిలో 4లక్షల 85 వేల 172 శాంపిల్స్ ను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

    ఇందులో ఇప్పటి వరకు 21వేల 797 కేసులు పాజిటివ్ గా తేలాయని సంస్థ చెప్పినట్లు ఏఎన్ఐ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.

  13. వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలుశిక్ష.. రూ.5 లక్షలు జరిమానా - ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

    కరోనావైరస్‌పై పోరాటంలో ముందున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలకు పదునుపెట్టింది.

    వైద్యులు, వైద్య సిబ్బందిని వేధించినా, వారి పనిని అడ్డుకున్నా, వారిపై దాడులు చేసినా కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తూ 1897 అంటువ్యాధుల చట్టానికి సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఈ చట్ట సవరణకు ఆమోదం తెలుపుతూ, ఆర్డినెన్స్ జారీ చేసింది.

    రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు వైద్యులపై జరుగుతున్న దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఈ చట్టపరమైన మార్పులు అవసరమయ్యాయని ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు.

    ఇకపై డాక్టర్లు, వైద్య సిబ్బందిని వేధించినా, వారి పనిని అడ్డుకున్నా, వారిపై దాడులు చేసినా.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.

    ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారికి కనిష్ఠంగా మూడు నెలల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ దాడుల్లో ఎవరైనా తీవ్రంగా గాయపడితే జైలు శిక్ష కనిష్ఠంగా ఆరు నెలల నుంచి గరిష్ఠంగా ఏడేళ్లు విధిస్తారు. జరిమానా కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు విధించొచ్చు.

    ఇలాంటి కేసుల్ని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి 30 రోజుల్లోపు విచారణ జరపాలి, ఏడాదిలోపు దర్యాప్తు పూర్తి కావాలి. కోర్టు లిఖితపూర్వకంగా అనుమతి ఇస్తే ఈ సమయాన్ని పొడిగించొచ్చు.

    కాగా, ఈ చట్ట సవరణ ద్వారా వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ లభిస్తుందని, వారి భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

  14. ఆసుపత్రుల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దు - వైద్యులు, సిబ్బందికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు

    డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వాడే మొబైల్ ఫోన్ల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందన్న హెచ్చరికలతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులలో మొబైల్ ఫోన్ వాడరాదని ఆదేశాలు జారీ చేసింది.

    సిబ్బందితోపాటు పేషెంట్లు కూడా ఆసుపత్రిలోకి ప్రవేశించేముందే వాటిని కౌంటర్ దగ్గరే భద్రపరచాలని, మళ్లీ ఆసుపత్రిని విడిచి వెళ్లే ముందు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్లు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

  15. ‘జూమ్’ కష్టాలకు తెరపడినట్లేనా?

    లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ కు విపరీతమై డిమాండ్ పెరిగింది.

    కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, స్నేహతులతో మాట్లాడుకోడానికి మిలియన్లమంది ప్రజలు ఈ యాప్ ను వాడటం మొదలు పెట్టారు.

    అదే దానికి సమస్యగా మారింది.

    ఇన్విటేషన్ లేని గెస్టులు కూడా గ్రూప్ వీడియో కాన్ఫరెన్సింగ్ లో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో వీడియో కాల్స్ తరచూ క్రాష్ కావడం మొదలు పెట్టాయి.

    దీంతో మార్పులు చేర్పులతో అప్ డేటెడ్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు ఈ యాప్ ను రూపొందించిన సంస్థ ప్రకటించింది.

    త్వరలో రాబోయో ఈ కొత్త వెర్షన్ 5.0లో ప్రస్తుత జూమ్ యాప్ కు భిన్నంగా డేటాను సురక్షితం చేసే ఎన్ క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

  16. హెల్త్ వర్కర్స్ పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కరోనా పాజిటివ్

    ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ఆరోగ్య కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

    ఆ ఐదుగురితో టచ్ లోకి వెళ్లిన 70మంది పోలీసు సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కు పంపించారు.

    ఈ నెలలో మొరాదాబాద్ జిల్లాలో అరెస్టయిన 17మందిలో ఈ ఐదుగురు కూడా ఉన్నారు.

    వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్ సెంటర్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలను వీరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు .

    వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత 73మంది పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించారు.

    ఆరోగ్య కార్యకర్తలపై దాడి ఇదే మొదటిది కాదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న అనేకమంది ఆరోగ్య కార్యకర్తలపై తరచూ దాడులు జరుగుతున్నాయి.

    వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు దిగేవారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా బుధవారంనాడు భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది.

  17. భారతదేశంలో కరోనా కేసులు 21393, మరణాలు 681

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 21393కు చేరింది.

    ఇందులో యాక్టివ్ కేసులు 16454, కోలుకున్నవారు 4257, మరణాలు 681 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

  18. లాక్‌డౌన్ ఎత్తేస్తే కరోనా ‘తిరిగొస్తుంది’ - డబ్ల్యుహెచ్ఓ

    కరోనావైరస్ మహమ్మారిపై పోరులో నిర్లక్ష్యం పనికిరాదని, ఈ వైరస్ చాలాకాలం పాటు మనతో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ హెచ్చరించారు.

    లాక్‌డౌన్లను ఎత్తేస్తే ఈ వైరస్ తిరిగి చెలరేగొచ్చని చెప్పారు.

    కాగా, కోవిడ్-19 వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగానే అందర్నీ హెచ్చరించిందని ఆయన తెలిపారు.

    కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందాల్సిన ప్రజారోగ్య అత్యయికస్థితి అని జనవరి 30వ తేదీన డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. కరోనావైరస్‌ను మహమ్మారిగా మార్చి 11వ తేదీన ప్రకటించింది.

  19. కరోనాను జయించిన నెలరోజుల పసికందు

    కరోనా కథనాల్లో ఒక శుభవార్త.

    థాయిలాండ్‌లో అత్యంత పిన్న వయసులో కరోనా బారిన పడిన నెలరోజుల పసికందు ఈ మహమ్మారిని జయించినట్లు వైద్యులు ప్రకటించారు.

    నాలుగు రకాల యాంటీవైరల్ డ్రగ్‌లను వాడామని, చిన్నారి ఇప్పుడు కోలుకున్నాడని బ్యాంకాక్‌లోని బమ్రస్నరదుర ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన విశాల్ మూలసర్త్ చెప్పారు.

    ‘‘పది రోజులపాటు మందులు వాడాం. ఆ పదిరోజులూ రోజూ వైద్య పరీక్షలు జరిపాం. ఆ తర్వాత మూడు రోజులకు, ఐదు రోజులకోసారి పరీక్షించాం. క్రమంగా కోలుకున్నట్లు ఎక్స్ రేలో తేలింది’’ అని విశాల్ వెల్లడించారు.

    థాయిలాండ్‌లో 2826 కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మరణించారు.

  20. ఆరు రోజులుగా చైనాలో మరణాలు లేవు.. గణాంకాలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న అంతర్జాతీయ సమాజం

    చైనా గత ఆరు రోజులుగా తమ దేశంలో కొత్తగా ఎవరూ కోవిడ్-19తో మరణించలేదని చెబుతోంది.

    బుధవారం చైనాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    ఎలాంటి లక్షణాలూ లేకున్నా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణవుతున్నవారి గణాంకాలు విడిగా చూపుతోంది చైనా.

    ప్రస్తుతం అక్కడ వైరస్ తీవ్రత అదుపులో ఉందని ప్రపంచానికి చెప్పేందుకు గాను చైనా గణాంకాల విషయంలో పారదర్శకంగా ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.