You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 21 వేలు దాటిన మొత్తం కేసులు; ఏపీలో 893, తెలంగాణలో 980 మందికి పాజిటివ్

భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దాంతో, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. శాస్త్రీయతలేని లైట్, హీట్ ట్రీట్ మెంట్లను నమ్ముకొమ్మంటున్న ట్రంప్

    కరోనా చికిత్సకు వేడి, కాంతివంటి వాటితో జరిపే ట్రీట్ మెంట్లపై దృష్టిసారించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రతిరోజూ నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. శరీరంలోకి తీవ్రమైన కాంతి, వైరస్ ను చంపే ఔషధాలను పంపే విధానాలను అవలంబించాలనిఆయన అన్నారు. కానీ కొవిడ్ -19 చికిత్సలో ఇవన్నీ శాస్త్రీయమైనవిగా ఇప్పటి వరకు నిరూపితం కాలేదు.అయితే అదే మీడియా సమావేశంలో పాల్గొన్న వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిక్స్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. వేడి వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

  2. పేదల కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయలేదు: నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

    లాక్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొనే మిలియన్లమంది ప్రజలకు సాయం చేయడంలో భారత్ మరింత ఉదారంగా వ్యవహరించాల్సిందని నోబెల్ ప్రైజ్ విజేత, ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీ బీబీసీతో అన్నారు. ‘‘ మనం ఇంకా చేయాల్సినంత చేయలేదు’’ అని బీబీసీ ఇంటర్వ్యూ లో అభిప్రాయపడ్డారు అభిజిత్.మార్చి 24 లాక్ డౌన్ విధించిన తర్వాత భారత ప్రభుత్వం 23 బిలియన్ డాలర్లు ప్యాకేజ్ ను ప్రకటించింది.ఇందులో ఎక్కువభాగం పేద ప్రజలకు డబ్బు, ఆహార భద్రతకే కేటాయించారు.ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్ లతో కలిసి నోబెల్ బహుమతిని సంయుక్తంగా స్వీకరించిన ప్రొఫెసర్ బెనర్జీ, కొవిడ్ -19 మహమ్మారి కారణంగా వ్యవస్థ కుదుపుకు గురైందన్న ప్రభుత్వ అభిప్రాయం నిజమేనన్నారు. ’’లాక్ డౌన్ తో కథ ముగిసిపోలేదు. సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రావచ్చు. కానీ అది వచ్చే వరకు కొవిడ్ మనతోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు అభిజిత్ బెనర్జీ.

  3. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్...

    కరోనావైరస్‌కు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను ఎప్పటికప్పుడు మీకు ఎప్పటికప్పుడు అందిస్తోంది బీబీసీ తెలుగు కరోనావైరస్ లైవ్ పేజి.

    ఏప్రిల్ 23 వరకు LIVE అప్‌డేట్స్‌ను ఇక్కడితో ముగిస్తున్నాం.

    కరోనావైరస్ తాజా అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  4. కరోనావైరస్‌‌కు సంబంధించి ఈరోజు ముఖ్యాంశాలు

    ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 లక్షలకు చేరువవుతోంది.

    జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 26,71,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,86,372 మంది చనిపోయారు.

    • అమెరికాలో అత్యధికంగా 8.4 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి 46 వేలకుపైగా మృతి చెందారు.
    • స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్య 2.1 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 22,157కు చేరుకుంది.
    • మూడో స్థానంలో ఉన్న ఇటలీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 1.8 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ 21 వేలకుపైగా మంది చనిపోయారు.
    • భారత్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దేశంలో 21,700 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,689 కేసులు ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 4,324 చికిత్స పూర్తై డిశ్చార్జ్ అయ్యారు. 686 మంది చనిపోయారు.
    • తెలంగాణలో గురువారం కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 693కు తగ్గింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 25 మంది మరణించగా, 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
    • ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నమోదైన 80 కొత్త పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 893కి చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 27 మంది మృతి చెందగా, 141 మంది కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
  5. తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గాయి: ఈటల రాజేందర్

    తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

    గురువారం రాష్ట్రంలో కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 58 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

    కొత్త కేసుల్లో 13 జీహెచ్ఎంసీ పరిధిలో, 10 జోగులాంబ జిల్లాలో నమోదయ్యాయని ఆయన తెలిపారు.

    రాష్ట్రంలో బుధవారం నాటికి 725 యాక్టివ్ కేసులు ఉండగా, గురువారం అది 693కు తగ్గినట్లు రాజేందర్ వివరించారు..

    ఆయన చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణలో గురువారం వరకూ మొత్తం 980 మంది కరోనావైరస్ బారినపడ్డారు. వారిలో 25 మంది మరణించగా, 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సూర్యాపేట, గద్వాల్‌లలో, ఇదివరకు కరీంనగర్‌లో తీసుకున్నట్లే కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్ అన్నారు.

    జిల్లాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని రాజేందర్ తెలిపారు.

    ‘‘గాంధీ ఆస్పత్రిలో 99 శాతం కరోనా రోగులు ఉన్నారు. అక్కడి పరిస్థితులపై అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించాం. ల్యాబ్స్ అన్నీ అందుబాటులోకి తెచ్చాం’’ అని వివరించారు.

    నాలుగు లక్షల పీపీ కిట్లు, 4.5 లక్షల ఎన్95 మాస్కులు నిల్వ చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే అందులో సేవలు ప్రారంభిస్తామని అన్నారు.

    ‘‘రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయి. మరణాల శాతాన్ని కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయని ఆశిస్తున్నాం. క్యాన్సర్, కిడ్నీ, డయాలసిస్ లాంటి ఇతర సమస్యలున్నవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.

  6. తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన అందరినీ గుర్తించాం: కేరళ సీఎం

    తబ్లిగీ జమాత్‌కు హాజరై, కేరళకు వచ్చినవాళ్లందరినీ గుర్తించామని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ చెప్పారు.

    వాళ్లందరికీ కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

    ఈ అంశంపై కొందరు కావాలనే వదంతులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెల్లడించాల్సి వస్తోందని విజయన్ అన్నారు.

  7. కరోనావైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

    కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలకుపైగా మందికి ఈ వైరస్ సోకింది.

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 1.8 లక్షల మంది కోవిడ్‌-19తో మరణించారు. అత్యధికంగా అమెరికాలో 46 వేలకుపైగా మంది చనిపోయారు.

    భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 686 మంది చనిపోయారు.

    అసలు ఈ కరోనావైరస్ మనుషులపై ఎలా దాడి చేస్తుంది? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

  8. ‘చైనాలో అధికార సంఘర్షణ రావొచ్చు... కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్‌ది ముఖ్య పాత్ర’, బీజేపీ నేత రామ్ మాధవ్ బీబీసీ కోసం రాసిన వ్యాసం

    ‘‘రెండో ప్రపంచ యుద్ధం అనంతరం దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన, ఆధారపడ్డ అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడింది.

    ఒడిదుడుకులు ఎదురైనా, 75 ఏళ్లుగా ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతోంది. కానీ, ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి అది ఛిన్నాభిన్నమయ్యే ముప్పును తెచ్చింది.

    వాస్తవాలు దాస్తూ, వైరస్ తమ సరిహద్దులు దాటి మహమ్మారిగా మారేలా చేసిందని చైనా నాయకత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ దేశంలో అంతర్గత అశాంతి పెరుగుతోంది. పాలక కమ్యూనిస్టు పార్టీలో అధికార సంఘర్షణ కూడా రావొచ్చు.

    కరోనావైరస్‌పై పోరాటంలో ప్రజాస్వామ్యవాదానికి భారత్ ఓ ఉదాహరణగా నిలిచింది. దార్శనిక నాయకులు ఉంటే ప్రజాస్వామ్యాలు ఉదారవాద విలువలను వదులుకోకుండానే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోగలవని మోదీ నిరూపించారు.

    కొత్తగా ఏర్పడబోయే ప్రపంచ వ్యవస్థలో అమెరికా, జర్మనీ లాంటి దేశాలతో కలిసి భారత్ చాలా ముఖ్య పాత్ర పోషించవచ్చు’’

  9. స్పెయిన్: చిన్నారులు గంట సేపు ఆడుకోవచ్చు

    స్పెయిన్‌‌లో లాక్‌డౌన్ నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులకు అక్కడి ప్రభుత్వం ఓ మినహాయింపు ఇచ్చింది.

    రోజూ ఓ గంట సేపు బయట ఆడుకునేందుకు అనుమతి ఇచ్చింది.

    ఇందుకోసం 1-1-1 అనే పేరుతో ఓ నియమాన్ని పెట్టింది.

    దీని ప్రకారం ఓ వయోజన వ్యక్తి గరిష్ఠంగా ముగ్గురు చిన్నారులను బయటకు తీసుకురావొచ్చు. ఒక కి.మీ. దూర పరిధిలో ఒక గంట సేపు గడిపే అవకాశం వారికి ఉంటుంది.

    అయితే, ఈ సమయంలో వారు సామాజిక దూర నిబంధనలు పాటించాల్సిందే.

    స్పెయిన్‌లో గత ఆరు వారాలుగా లాక్‌డౌన్ అమలవుతోంది.

  10. అవగాహన కోసం ఆటో

    కరోనావైరస్ వ్యాప్తిపై జనాల్లో అవగాహన పెంచేందుకు చెన్నైలో ఓ కళాకారుడు ఆటోను ఇలా వైరస్‌ను తలపించేలా తీర్చిదిద్దారు.

  11. కరోనావైరస్ క్వారంటైన్ సెంటర్లుగా దేవస్థానాల భవనాలు... మతాలకు అతీతంగా రోగులకు సేవ

    ఆంధ్రప్రదేశ్‌లోని బడులు, గుడులు క్వారంటైన్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన భవనాలు కూడా క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి.

    కోవిడ్ బాధితుల కోసం తిరుమల-తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తమ దేవస్థానాల అనుబంధ భవనాలను క్వారంటైన్ కేంద్రాలకు ఇచ్చేశాయి.

    మతాలకు అతీతంగా ఈ భవనాలు ఇప్పుడు అందరికీ వసతి కల్పిస్తున్నాయి.

    ఈ దేవాలయ భవనాల్లో హిందూ, ముస్లిం మతస్థులతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశీయులు కూడా ఆశ్రయం పొందుతుంటే, మరికొందరు చికిత్స పొందుతున్నారు.

  12. భారత్‌లో 21,700కి చేరిన కరోనా కేసులు

    భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి చెప్పారు.

    కానీ, గడచిన 24 గంటల్లో 1229 కొత్త కేసులు నమోదయ్యాయని, 34 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 21,700కి చేరిందని, అందులో 16,689 మంది (యాక్టివ్ కేసులు) ప్రస్తుతం చికిత్స పొందుతుండగా, 4,325 మంది కోలుకున్నారని, 686 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

  13. స్కూళ్లు, కాలేజీలు గత ఏడాది నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలి, ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ కమిషన్

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేటు టీచర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్లలలో ఫీజుల విషయమై రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ ఆర్ కాంతారావు కొన్ని ఆదేశాలు జారీ చేశారు.

    • గత విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ప్రకారమే ఈ ఏడాది ఫీజు వసూలు చేయాలి.
    • ఈ ఏడాది పాఠశాలలు తిరిగి ప్రారంభించాక, నిర్వహణ సౌలభ్యం కోసం యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులో క్వార్టర్ (నాలుగో వంతు) మాత్రమే వసూలు చేయాలి.
    • ఆ నాలుగో వంతు ట్యూషన్ ఫీజు కూడా, తల్లితండ్రులు కోరితే రెండు వాయిదాల్లో, మొదటి వాయిదాకు రెండో వాయిదాకు 45 రోజుల గడువు ఉండేలా చెల్లించే అవకాశం కల్పించాలి.
    • ఫీజు ఒకేసారి చెల్లించలేదన్న కారణంతో ఎవరికీ అడ్మిషన్ తిరస్కరించకూడదు.
    • ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటింగ్ అండ్ మానిటరింగ్ కమిషన్ వారు 2020-21 ఏడాదికి ఫీజులు నిర్ణయించిన తరువాత, అప్పటికే విద్యార్థి చెల్లించిన ఫీజును క్రెడిట్‌గా గుర్తించి, మిగిలిన బ్యాలెన్స్ మాత్రమే వసూలు చేయాలి.
  14. 'వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి', రైల్వే మంత్రికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం లేఖ

    లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బందుల్లో పడ్డారని, వారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని కోరుతూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లేఖ రాశారు.

    పారిశ్రామిక రాష్ట్రమైన మహారాష్ట్రలో దాదాపు 6.5 లక్షల మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నారని, లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయిందని డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన కూలీలకు సహాయ శిబిరాల్లో ప్రభుత్వం ఆహారం, వసతి కల్పిస్తోందని, వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

    అయితే, వారంతా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారని, మే 3 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా లాక్ డౌన్ ఎత్తివేస్తే ఒక్కసారిగా వీరంతా రైల్వేస్టేషన్లకు పోటెత్తుతారని, అందువల్ల ముంబయి, పుణెల నుంచి వారి కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని ఆయన విజ్జప్తి చేశారు.

    లాక్ డౌన్ రద్దు తర్వాత రైళ్లు, ఇతర ప్రయాణ సాధనాలలో విపరీతమైన రద్దీ ఉంటుందని, ఇటీవల ముంబయిలోని బాంద్రా స్టేషన్ ఎదుట వేల సంఖ్యలో వలస కూలీలు గుమిగూడిన ఘటనలు పునరావృతమైతే శాంతిభద్రత సమస్య ఏర్పడుతుందని, మహారాష్ట్రలోని రైల్వే స్టేషన్లలో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని తన లేఖలో కోరారు అజిత్ పవార్.

  15. భారత్‌లో 24 గంటల్లో 1409 కొత్త కేసులు

    భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

    దాంతో, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు.

    దేశంలోని 12 జిల్లాల్లో గత 28 రోజులలో కొత్త కేసులు నమోదు కాలేదని, గత 14 రోజులలో కొత్త కేసులు నమోదు కాని జిల్లాలు 78 (23 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి) ఉన్నాయని తెలిపారు.

    మే 3వ తేదీ నాటికి దేశంలో కరోనా ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుతుందని చెప్పడం చాలా కష్టమని, అది ఎప్పటికి ఆ స్థాయికి చేరుకుంటుందో ఊహించడం కూడా కష్టమని భారత వైద్య పరిశోధనా మండలి డీజీ, డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు.

    ప్రస్తుతానికి దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి స్థిరంగా ఉందని, పాజిటివ్ కేసుల రేటు 4.5 శాతంగా ఉందని తెలిపారు. దీనిని బట్టి చూస్తే, కేసులు ఒక్కసారిగా పెరగకుండా చేయగలిగామని ఆయన చెప్పారు.

    ఇళ్లలో వృద్ధులకు సేవలు అందించేవారికి, ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ దుకాణాలకు, పట్టణ ప్రాంతాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ చెప్పారు.

  16. ఆయన యూకే ప్రధాని అయినా నాకు పేషెంటే: నర్సు

    కరోనా వ్యాధి బారిన పడి కోలుకున్న యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తనను మెచ్చుకుంటారని అనుకోలేదని ఆయనకు చికిత్స చేసిన నర్సు, న్యూజీలాండ్‌కు చెందిన జెన్నీ మెక్ గీ అన్నారు.

    ఆయనకు చికిత్స అందించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఆమె టీవీ న్యూజీలాండ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    ప్రధాని తనను పొగడాలని కూడా తాను కోరుకోలేదని ఆమె అన్నారు.

    చేతనైనంత మెరుగైన చికిత్స అందించడమే తన కర్తవ్యమని, ఆయన ప్రధాని అయినా తనకు మాత్రం ఓ మామూలు పేషంటేనని నర్సు జెన్నీ అన్నారు.

  17. స్పెయిన్‌లో 22వేలు దాటిన కరోనా మృతులు

    స్పెయిన్‌లో కోవిడ్-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 22 వేలు దాటిందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

    వరుసగా మూడోరోజు తక్కువ మరణాలు నమోదయ్యాయని తెలిపింది.

    గత 24 గంటల్లో స్పెయిన్‌లో 440 మంది ఈ వ్యాధితో మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 22,157కు చేరుకుంది.

  18. హరియాణాలో జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా

    కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ తెలిపారు.

    మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో విధి నిర్వహిణలో ఉన్న జర్నలిస్టులు వైరస్ బారిన పడ్డారన్న వార్తల తర్వాత హరియాణా ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.

  19. ఐసోలేషన్‌లో ఫిన్‌లాండ్ ప్రధాని

    ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తన కార్యాలయంలో పని చేసే ఒక వ్యక్తి, కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కలిసినట్లు తెలియడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ప్రధానికి కరోనా నిర్ధరణ పరీక్ష చేశామని, అయితే ఆమెలో వైరస్ లక్షణాలు ఏమీ కనబడలేదని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.

    ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా 34 ఏళ్ల సనా మారిన్ ఇటీవల వార్తల్లో నిలిచారు.

    గత డిసెంబర్‌లో ఆమె ఫిన్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

  20. ఏపీలో కరోనా కేసులు 893.. బుధవారం ఒక్క రోజే 80 కొత్త కేసులు నమోదు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు. దీంతో రాష్ట్రంలో 893కి చేరిన పాజిటివ్ కేసులు

    22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి 23వ తేదీ గురువారం 9 గంటల వరకు 6522 మంది నుంచి శాంపిల్స్ సేకరణ

    కర్నూలు 31, గుంటూరు 18, చిత్తూరు 14, అనంతపురం 6, తూర్పుగోదావరి 6,కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖ జిల్లాల్లో 1 కేసు చొప్పునకొత్త‌గా పాజిటివ్ కేసులు నమోదు.

    మొత్తంగా చూస్తే.. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదు.

    ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా, 141 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది.