You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో 700 కోవిడ్ కేసులు; వాటిలో 645 మర్కజ్‌ వెళ్ళివచ్చిన వారు, వాళ్ళ కాంటాక్ట్‌లేనన్న ఈటల రాజేందర్

గురువారం కొత్తగా నమోదైన 50 కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య 7 వందలకు చేరింది. ఇప్పటివరకు 186 మంది కోలుకున్నారు. మర్కజ్ వెళ్ళివచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరిన ఆరోగ్య శాఖ మంత్రి.

లైవ్ కవరేజీ

  1. దేశంలో 420.. ఏపీలో 14, తెలంగాణలో 18 మంది కరోనా మృతులు

    ప్రపంచవ్యాప్తంగా 20,90,000 మందికి పైగా కరోనా వైరస్ బారినపడ్డారు. మృతుల సంఖ్య 1,40,000కు చేరువలో ఉంది. అమెరికాలో అత్యధికంగా 26,708 మంది మరణించారు. ఇటలీలో 21,645.. స్పెయిన్‌లో 19,130 మంది మరణించారు.

    * భారత్‌లో 10,824 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 420 మంది మరణించారు. మొత్తం 1514 మందికి నయమై డిశ్చార్జయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2919 పాజిటివ్ కేసులుండగా 187 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 12,759.

    * ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ పోటీలను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

    * ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 534కి పెరిగింది. 14 మంది మరణించారు.

    * తెలంగాణలో పాజిటివ్ కేసులు సంఖ్య 700కి పెరిగింది. మొత్తం 18 మంది మరణించారు.

  2. పీపీఈలు, మాస్కులు సరిపడా ఉన్నాయి: ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హెల్త్) జవహర్ రెడ్డి వెల్లడి

    ఆంధ్రప్రదేశ్‌లో పీపీఈలు, మాస్కులు సరిపడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హెల్త్) జవహర్ రెడ్డి చెప్పారు. కరోనా నిర్ధరణ పరీక్షలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నామని.. ఇప్పటివరకు ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున 331 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. జాతీయ సగటు 198 మాత్రమే ఉందన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఎన్నికేసులు వస్తాయో పరిశీలించి.. దాని ప్రకారం రెడ్,ఆరెంజ్, గ్రీన్‌జోన్‌లుగా విభజిస్తామని చెప్పారు.

    ఇంకా ఏం చెప్పారంటే..

    * వాలంటీర్లు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వే చేయిస్తున్నాం.

    *ఇప్పటికి మూడు దఫాలుగా సర్వే పూర్తి చేశాం. 32,700 మందికి దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయి.

    * ఈ 32,700 మందికి రాబోయే వారం రోజుల్లో అందరికీ కోవిడ్‌ పరీక్షలు చేయడానికి నిర్ణయించాం.

    * ఫిబ్రవరి 15 నాటికి మన రాష్ట్రంలో టెస్టింగ్‌ కెపాసిటీ రోజుకు 90 ఉండేది. ఇప్పుడు ప్రతిరోజూ 3 వేల టెస్టులు చేస్తున్నాం. దీన్ని రోజుకు 17 వేలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం.

    * ప్రతి జిల్లాలో ఒక కోవిడ్‌ ఆసుపత్రిని పెట్టాం. ఇవి ఇప్పటికే పని చేస్తున్నాయి. కొత్త కోవిడ్‌ కేర్‌ సెంట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సూచించింది. కోవిడ్‌ ఎక్కువ ఉన్న చోట్ల క్వారంటైన్‌ సెంటర్లనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వాడాలని చెప్పింది.

    * హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం 14410 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ప్రారంభించాం. మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు డాక్టర్లే ఫోన్‌ చేసి వాళ్లకున్న లక్షణాలను బట్టి టెలీ మెడిసిన్‌ అందజేస్తారు. నాన్‌ కోవిడ్‌ పేషెంట్లు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

    * 8297104104 ఈ నెంబర్‌కు వాట్సప్‌ చేస్తే కోవిడ్‌ కోసం ప్రభుత్వం ఏఏ కార్యక్రమాలు చేస్తోందో సమాచారం ఇస్తుంది. కోవిడ్‌ గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్‌ చేస్తే చాలు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

    * క్వారంటైన్‌ సెంటర్స్‌లో 17,445 సింగిల్‌ రూములున్నాయి. 19,362 డబుల్‌ రూంలున్నాయి. ఇప్పటి వరకు 6,076 మంది క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారు.

    * 60 సంవత్సరాల కోవిడ్‌ బాధితుడు వస్తే వారిని వెంటనే.. స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రులకు షిఫ్ట్‌ చేయాలని సూచిస్తున్నాం. 60 సంవత్సరాల వారే కాకుండా.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని కూడా రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆసుపత్రులకు పంపాలని డాక్టర్లకు సూచించాం.

    * PPE లు 1.35 లక్షలు, N 95 మాస్కులు 1.16 లక్షలు ఉన్నాయి. * డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ పుష్కలంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

    * ఐసీయూ బెడ్లకే కాకుండా.. నాన్‌ ఐసీయూ బెడ్లకు కూడా పైప్‌లైన్‌ ద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కోవిడ్‌ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాటు చేశాం. కొన్ని చోట్ల ట్యాంకర్లు ఏర్పాటు చేశాం. ట్యాంకర్లు ఏర్పాటు చేయలేని చోట్ల సిలిండర్లు తగినన్ని ఉంచాం.

    * ప్రభుత్వం తరఫున వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు డాక్టర్లు ఉన్నారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ ఎలా జరుగుతోందో దీని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

  3. తెలంగాణలోని 700 కరోనా కేసుల్లో 645 మంది మర్కజ్ వెళ్లొచ్చినవారు, వారి కాంటాక్ట్‌లే: ఈటల రాజేందర్

    తెలంగాణలో కరోనా పాజిటివ్‌గా తేలిన 700 మందిలో 645 మంది మర్కజ్ వెళ్లొచ్చినవారు.. వారి కాంటాక్ట్‌లేని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

    మర్కజ్‌ వెళ్లొచ్చినవారిని కలిసినవారు ఎవరు ఉన్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ వారు స్వచ్ఛందంగా రాకుంటే పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు వారి జాడ కనిపెట్టి పట్టుకుంటారని అన్నారు.

  4. తెలంగాణలో 700కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి పెరిగింది.

    గురువారం 50 కొత్త కేసులు నమోదు కాగా మరణాలేమీ లేవు.

    గురువారం 68 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో కోలుకున్నవారి సంఖ్య 186కి చేరింది.

    ఇప్పటివరకు తెలంగాణలో 18 మంది ఈ వైరస్ బారినపడి మరణించారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో 496 యాక్టివ్ కేసులున్నాయి.

  5. భారత్ నుంచి 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి

    భారత్ 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేస్తోంది.

    అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, మయన్మార్, సీషెల్స్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, నైజీరియా, డొమినికన్ రిపబ్లిక్, యుగాండా, ఈజిప్ట్, అర్మేనియా, సెనెగల్, అల్జీరియా, జమైకా, ఉజ్బెకిస్తాన్, కజక్‌స్థాన్, ఉక్రెయిన్, నెదర్లాండ్స్, స్లొవేనియా, ఉరుగ్వే, ఈక్వడార్ సహా మరికొన్ని దేశాలకు భారత్ నుంచి ఈ ఔషధం ఎగుమతి అవుతోంది.

    కరోనా రోగులకు చికిత్స కోసం దీన్ని ఉపయోగిస్తుండడంతో ఈ మాత్రలు కావాలంటూ ప్రపంచ దేశాలు భారత్‌ను అభ్యర్థిస్తున్నాయి.

    దేశంలో 3.8 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు సిద్ధంగా ఉన్నాయని.. దేశీయ అవసరాలకు కోటి మాత్రలు సరిపోతాయని ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  6. 50 వేల కరోనా టెస్టింగ్ కిట్‌లు సిద్ధం: మంత్రి గౌతమ్ రెడ్డి

    ఏపీలో ఇప్పటికే 50 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్‌లు తయారు చేశామని, వీటిని అన్ని జిల్లాలు, మండలాలకు పంపిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

    ఈ కిట్ల సహాయంతో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తామన్నారు.

    మరో 50 వేల టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు గౌతమ్ రెడ్డి.

    ఈ మొత్తం కిట్‌ల సహాయంతో రానున్న నెల రోజుల్లో 20 లక్షల మందికి పరీక్షలు చేస్తామని చెప్పారు.

    మరో రెండు రోజుల్లో స్వదేశీ సాంకేతికతతో వెంటిలేటర్లు తయారు చేస్తామని తెలిపారు.

    కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ కిట్‌లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

  7. భారత్‌లో 12,759 కరోనావైరస్ కేసులు... 420 మరణాలు

    భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు అందిన సమచారం ప్రకారం 12,759 మందికి వైరస్ సోకింది. 420 మంది చనిపోయారు.

    భారత ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్ సైట్లో అప్‌డేట్ చేసిన సమాచారం ప్రకారం 1,515 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

    దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2,919 కరోనా కేసులు నమోదయ్యాయి. 187 మంది చనిపోయారు. దిల్లీలో 1,578 మందికి వ్యాధికి గురయ్యారు. 32 మంది చనిపోయారు.

    మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య వేయి దాటింది.

  8. భారత్‌లో 12,380 కరోనా బాధితులు, 414 మృతులు

    భారతదేశంలో కరోనావైరస్ సంక్రమించిన వారి సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.

    దేశంలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడి చేయడానికి ప్రతి నిత్యం ఏర్పాటవుతున్న విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఇప్పటివరకు 414 మంది చనిపోయారని తెలిపారు.

    గత 24 గంటల్లో 941 కొత్త కేసులు నమోదయ్యాయి. 37 మంది మరణించారు. 183 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    అయితే, దేశంలోని మొత్తం 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్ తెలిపారు.

    దేశవ్యాప్తంగా ప్రజలకు తాగునీటి లభ్యతను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

    దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,90,000 మందికి కరోనావైవరస్ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్‌కు చెందిన రమణ్ గంగాఖేడ్కర్ చెప్పారు. వైరస్ పరీక్షలను వేగవంతంగా నిర్వహించే కిట్లు అయిదు లక్షల వరకు అందుబాటులోకి వచ్చాయని, అవసరమైతే రెండు షిఫ్టులలో కలిపి 78 వేల టెస్టులు నిర్వహించే సామర్థ్యం, ఆరు వారాల పాటు పరీక్షలు నిరవధికంగా కొనసాగించే సంపత్తి మనకు సమకూరిందని ఆయన తెలిపారు.

    హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ్ కూడా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, లాక్‌డౌన్ సమయంలో సామాన్య ప్రజలకు కావలసిన నిత్యావసర సరకులను అందిస్తున్నామని, ఈ విషయంలో ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్ మాస్కులు ఉపయోగించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని శ్రీవాస్తవ్ కోరారు.

  9. ఉపాధి హామీ పనులు వెంటనే ఆపేసి కూలీలకు ముందస్తు వేతనాలు ఇవ్వాలి: మానవ హక్కుల వేదిక

    కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం(ఎన్‌ఆర్ఈజీఏ) పనులు వెంటనే నిలిపివేసి... లాక్‌డౌన్ కాలం మొత్తానికీ ఉపాధి హామీ కూలీలందరికీ పూర్తి వేతనాలు ముందస్తుగా చెల్లించాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరింది.

    పనులు కొనసాగించడం వల్ల కూలీల ప్రాణాలకు వైరస్ ముప్పు ఉంటుందని, పనులు చేయకుండానే వారికి పూర్తి వేతనాలు ముందస్తుగా ఇవ్వాలని డిమాండ్ చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో 93 లక్షల మందికిపైగా ఉపాధి హామీ కూలీలున్నారని.. వేసవిలో లక్షల కుటుంబాలకు ఈ పనులే జీవనాధారమని మానవ హక్కుల వేదిక పేర్కొంది.

    అయితే, బుధవారం(ఏప్రిల్ 15, 2020) 8.3 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారని.. కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న జిల్లాల్లోనూ ఈ పనులు కొనసాగాయని మానవ హక్కుల వేదిక చెప్పింది.

    ‘‘అనేక మండలాలు కంటెయిన్‌మెంట్ జోన్లుగా ఉన్న ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1.95 లక్షల మంది ఏప్రిల్ 15న ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు. కేంద్రం సూచిస్తున్నట్లుగా సామాజిక దూరం పాటిస్తూ ఈ పనులు చేయడం అసాధ్యం కాబట్టి వెంటనే నిలుపుదల చేయాల’’ని కోరింది.

    ఉపాధి హామీ కూలీలందరినీ భవన నిర్మాణ కార్మికుల చట్టం పరిధిలోకి తేవాలని.. అలా చేస్తే బీమా, వారి పిల్లలకు ఉపకారవేతనాలు, పెన్షన్ వంటి సదుపాయాలు లభిస్తాయని మానవ హక్కుల వేదిక ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ ఒక ప్రకటనలో సూచించారు.

  10. మార్చి 13 నుండి మే 31 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో మే 3 వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.

    అదేవిధంగా, ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను టీటీడీ మే 31 వరకు రద్దు చేసింది.

    ఈ నేపథ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు చర్యలు చేపట్టింది.

    ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను helpdesk@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని కోరింది. టీటీడీ ఐటి విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

  11. లాక్‌డౌన్‌తో కరోనా సమస్య పరిష్కారం కాదు.. ప్రత్యేక వ్యూహంతో వెళ్లాలి: రాహుల్ గాంధీ

    గాంధీ కేవలం లాక్‌డౌన్ చేసినంత మాత్రాన కరోనావైరస్ వ్యాప్తిని ఆపలేమని.. ఇది తాత్కాలికంగా ఆగడమే కానీ, లాక్‌డౌన్ ముగిశాక మళ్లీ వ్యాప్తి తీవ్రమవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

    ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలని సూచించారు.

    వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు, జిల్లాలు కీలకమని.. వారితో చర్చలు జరిపి వారికి ఎలాంటి సహాయం కావాలో తెలుసుకుని ఆ సహాయం అందించాలని రాహుల్ సూచించారు.

    అయితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీరు సూచనలిచ్చారా అని విలేకరులు అడగగా ఇవ్వలేదని చెప్పారు రాహుల్.

  12. దిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్

    దిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణైంది. దీంతో దాదాపు 72 మందిని కూడా క్వారంటైన్‌లో ఉండాలంటూ అధికారులు ఆదేశించారు.

    అతడితో కాంటాక్ట్‌లో ఉన్న మరో 17 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.

  13. హిందూ-ముస్లింలకు మతం ఆధారంగా కోవిడ్-19 వార్డు విభజన.. అహ్మదాబాద్ ఆస్పత్రిలో అలజడి, రాక్సీ గాగ్డేకర్ ఛారా, బీబీసీ కోసం

    మతం ఆధారంగా కరోనావైరస్ రోగులను వేరువేరు వార్డుల్లో ఉంచుతున్నారని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నాయి. ఏప్రిల్ 12కు ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కరోనావైరస్ వార్డును ఇప్పుడు హిందూ, ముస్లిం రోగుల కోసం వేరు వేరు వార్డులుగా విభజించారు.

    ఉదాహరణకు, అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని సీ4 వార్డు మొత్తాన్ని ప్రస్తుతం ముస్లిం రోగుల కోసమే కేటాయించారు.

    “ఏప్రిల్ 12కు ముందు సివిల్ ఆస్పత్రికి వచ్చే రోగుల్లో చాలా మందిని అంతకు ముందు ఏ4 వార్డులో ఉంచేవారు. అక్కడ హిందూ, ముస్లిం రోగులందరికీ కలిపి చికిత్స అందించేవారు” అని అదే వార్డులో ఉన్న 19 ఏళ్ల రోగి బీబీసీకి చెప్పారు.

    ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగితో బీబీసీ ఫోన్లో మాట్లాడింది.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

  14. ‘శిఖరాన్ని దాటేశాం, అమెరికా త్వరలోనే తెరుచుకుంటుంది’ - డోనల్డ్ ట్రంప్

    కరోనావైరస్ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్యలో శిఖర స్థాయిని దాటుకుని తమ దేశం కుదుటపడుతోందని, ఈ నెలలోనే మళ్లీ కొన్ని రాష్ట్రాలు తెరుచుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికావ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

    గవర్నర్లతో సంప్రదింపుల తర్వాత గురువారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తానని ట్రంప్ చెప్పారు.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

  15. వుహాన్‌లో పెళ్లిళ్ల సందడి

    చైనాలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

    కరోనావైరస్ మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్ నగరంలో అనేక జంటలు పెళ్లిళ్లు చేసుకునేందుకు రిజిస్టర్ ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు. వీటితో పాటు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ స్టూడియోలు కూడా బిజీగా మారాయి.

    11 వారాల పాటు లాక్ డౌన్ కొనసాగిన తర్వాత ఏప్రిల్ 8న తిరిగి నగరంలో కార్యకలాపాలు మొదలయ్యాయి. నగరంలో లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే పెళ్లిళ్ల కోసం వధూవరులు కార్యాలయాలకు క్యూలు కట్టారు. కొన్ని నెలలుగా వాయిదా పడిన తమ పెళ్లిని పూర్తిచేయడానికి ఉత్సాహంగా బారులు తీరుతున్నారు.

    “లాక్ డౌన్ తర్వాత వెడ్డింగ్ ఫొటోలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మహమ్మారి ప్రబలక ముందు రోజుకు 16కు పైగా జంటలకు ఫొటోలు తీసేవాళ్లం. కానీ ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురికి మించి తీయకూడదని నిర్ణయించుకున్నాం. ఇదంతా మా రక్షణ కోసమే” అని వెడ్డింగ్ ఫొటోగ్రఫీ స్టూడియో మేనేజర్ ఒకరు జాతీయ మీడియా ఈసీఎన్ఎస్‌కు తెలిపారు.

  16. ఏపీలో మరో 9 మందికి పాజిటివ్, మొత్తం కేసులు 534

    ఆంధ్రప్రదేశ్‌లో మరో 9మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థరణైంది.

    బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 534కు పెరిగింది.

    ఇప్పటివరకూ 14 మంది మరణించగా, 20 మంది కోలుకుని హాస్పటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

    ప్రస్తుతం 500 యాక్టివ్ కేసులున్నాయి.

  17. భారత్‌లో 12 వేలు దాటిన మొత్తం కేసులు, 414 మంది మృతి

    భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 12,380కి చేరింది.

    ఇప్పటివరకూ 414 మంది ప్రాణాలు విడిచారు.

    మొత్తం యాక్టివ్ కేసులు 10,477 కాగా, 1489 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

  18. భుజాలపై తండ్రిని మోసుకుంటూ కిలోమీటర్ పరుగు, కేరళలో జరిగిన ఘటన

    కేరళలో ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన 65ఏళ్ల తండ్రిని భుజాలపై మోసుకుని పరిగెడుతున్న ఓ వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

    పునలూర్‌కు చెందిన ఓ వ్కక్తి తన తండ్రిని ఆటోలో హాస్పటల్ నుంచి ఇంటికి తీసుకువస్తుండగా మధ్యలో పోలీసులు ఆపారని, లాక్ డౌన్ అమల్లో ఉందని, ఆటో నడపడం కుదరదని చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దాదాపు కిలోమీటర్ దూరం తండ్రిని భుజాలపై ఎత్తుకునే ఆ వ్యక్తి రోడ్డుపై పరిగెట్టారు.

  19. పాకిస్తాన్‌లో 6,200 దాటిన కేసులు; 117 మంది మృతి

    పాకిస్తాన్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 6వేలు దాటింది. ఈ వ్యాధి బారిన పడి 117మంది మరణించారు. 1446 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

    అన్ని రాష్ట్రాలకన్నా పంజాబ్ ఈ మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడొక్కచోటే 3 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సింధ్ రాష్ట్రంలో 1600 కేసులు నమోదయ్యాయి.

    ఖైబర్ పక్తుంఖ్వాలో 47 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 900 దాటింది. వీరిలో చాలామంది తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నవారే.

    బలూచిస్తాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 281.

    దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ప్రకటించారు. అయితే కొన్ని రంగాలకు దీన్నుంచి మినహాయింపునిచ్చారు.