కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 18,72,073 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో 9,352.. తెలంగాణలో 592.. ఏపీలో 439

ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18.5 లక్షలు దాటింది. 1.15 లక్షల మంది మరణించారు. 4.2 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ 9152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 308 మంది మరణించారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో 5.5 లక్షల కేసులు, 22 వేల మరణాలు

    అమెరికాలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5.5 లక్షలను దాటేసింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

    కరోనావైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 22 వేల మంది మరణించారు. ఒక్క న్యూయార్క్ నగరంలో 6,898 మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్-19 మరణాల విషయంలో... వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్, ఇటలీలను కూడా దాటుకుని, అమెరికా మొదటి స్థానానికి చేరుకుంది.

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇలా చేయడం ఆ దేశ చరిత్రలోనే తొలిసారి.

  2. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా ఇంట్లో పార్టీ, కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, AFP

    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రజలు వారి వారి ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించినా, కొంతమంది ఓ ‘పెద్ద’ పార్టీ చేసుకున్నారు. అయితే, ఈ పార్టీలో కాల్పుల కలకలం రేగింది.

    పార్టీలో ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిగాయి. దీంతో ఆరుగురికి తూటా గాయాలయ్యాయి. బాధితుల్లో నలుగురు మహిళలు, ఓ బాలిక, ఓ పురుషుడు ఉన్నారు.

    ఆసుపత్రిలో వాళ్లు చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదు.

    నలుగురు వ్యక్తులు ఈ దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత ఆ నలుగురూ అక్కడి నుంచి కారులో పరారయ్యారు.

    ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందని కెర్న్ కౌంటీ షెరిఫ్ విభాగం తెలిపింది.

  3. కరోనావైరస్ వ్యాప్తి ఆగడం లేదు: కేసీఆర్

    ప్రపంచవ్యాప్తంగా, దేశమంతటా, తెలంగాణలోని పరిణామాలు గమనిస్తుంటే కరోనావైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వ్యాఖ్యానించారు. పరిస్థితి గమనించి ప్రజలు ఇంతకుముందు కన్నా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

    తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలిందని, ఇద్దరు చనిపోయారని, చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తంగా 531 మందికి కరోనావైరస్ సోకిందని అన్నారు. వారిలో 103 మంది డిశ్చార్జి అయ్యారని, 16 మంది మరణించారని చెప్పారు. 412 మంది కరోనావైరస్ రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు.

    ఈ పరిస్థితి ఉన్నందునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు.

    ‘‘కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం కాదు. ఆ నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటిస్తేనే సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

    కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆదివారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ సమీక్ష సాగింది.

  4. మరణం వైపు నెడుతున్నారు’: పాక్ పాలిత కశ్మీర్‌లో వైద్యుల నిరసన

    పాక్ పాలిత కశ్మీర్‌లో వైద్యుల నిరసన

    ఫొటో సోర్స్, ANI

    కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించే దుస్తులు (పీపీఈ కిట్లు) లేకపోవడంపై పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరసనకు దిగారు.

    రక్షణ కిట్లు ఇవ్వకుండా ప్రభుత్వం తమను మరణంవైపు నెడుతోందంటూ ముజఫరాబాద్‌లోని అంబోర్ ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చేపట్టారు.

    ‘‘అంబోర్ ఆసుపత్రిలో 40 మంది సిబ్బంది ఉన్నాం. పీపీఈ కిట్లు ఇస్తే, ఉతుక్కొని మళ్లీ మళ్లీ వాడుకుంటాం. కనీసం 40 మందికి పీపీఈ కిట్లు అందించే స్థితిలో ప్రభుత్వం లేదా? మమ్మల్ని చావమని వదిలేయాలని మీకు ఓట్లు వేశామా?’’ అని ఓ వైద్యుడు ప్రశ్నించారు.

    మాస్కులు, గ్లవ్స్, గౌన్లు కూడా తమకు ఇవ్వడం లేదని, ఇక పీపీఈ కిట్లు ఎలా ఆశిస్తామని ఆయన అన్నారు.

    పాక్ పాలిత కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో వైద్య వసతులుగానీ, పరీక్ష కేంద్రాలు గానీ అందుబాటులో లేవు. కరోనావైరస్ అనుమానిత రోగులు కూడా జనం మధ్య తిరుగుతున్నారు.

    ఇప్పటివరకూ పాక్ పాలిత కశ్మీర్‌లో 745 మందికి పరీక్షలు నిర్వహించగా, 34 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. పరీక్షలను ఎక్కువగా చేపడితే, పాజిటివ్ కేసులు మరింతగా బయటపడే అవకాశాలున్నాయి.

  5. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు...

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 18.5 లక్షల మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 1.15 లక్షల మంది మృతి చెందారు. 4.2 లక్షల మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం నాడు 1514 మంది ప్రాణాలు విడిచారు.

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జీవితాంతం వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.

    భారత్‌లో కేసుల సంఖ్య 8,400 దాటింది. 273 మంది మరణించారు.