కరోనావైరస్: ప్రపంచమంతటా 18 లక్షలు, భారత్‌లో 8,400 దాటిన కోవిడ్ కేసులు,

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 1 లక్ష 10 వేలు దాటింది. భారత్‌లో 273 మంది చనిపోయారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 531కి చేరింది. ఏపీలో 15 కొత్త కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్య 420కి పెరిగింది.

లైవ్ కవరేజీ

  1. పాకిస్తాన్ వల్లే గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కేసులు పెరిగాయి, ఆరోపించిన హక్కుల కార్యకర్త

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాన్ నుంచి వచ్చిన కరోనావైరస్ రోగులను పాకిస్తాన్ తమ ప్రాంతానికి పంపించడం వల్లే తమ ప్రాంతంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయని గిల్గిత్ బాల్టిస్తాన్‌కు చెందిన ఓ సీనియర్ కార్యకర్త ఆరోపించారు.

    పాక్ పరిపాలనలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇప్పటి వరకూ 215 కేసులు నమోదయ్యాయి. మరింత మందికి పరీక్షలు నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులన్నీ కూడా ఇరాన్ నుంచి ఇక్కడకు వచ్చినవారి ద్వారా వెలుగుచూసినవే.

    “అనుమానిత రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఇక్కడ లేవు. కానీ పాకిస్తాన్ ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఇరాన్ నుంచి వచ్చిన యాత్రికుల బృందాన్ని ఇక్కడకు అనుమతించేసింది. ఇదే గిల్గిత్ అధికారులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని పెంచింది” అని వాషింగ్టన్ నుంచి వచ్చి, ఇక్కడే ఉంటున్న గిల్గిత్ బాల్టిస్టాన్‌కు చెందిన కార్యకర్త సెంజ్ హెచ్ సెరింగ్ ఏఎన్ఐకు తెలిపారు.

    పాక్ పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన సౌకర్యాలు లేవు.

    మార్చి 23న ఒసామా రియాజ్ అనే ఓ యువ వైద్యుడు కోవిడ్-19 కారణంగా మృతిచెందాడు. ఇరాన్ నుంచి టఫ్తాన్ మీదుగా ఇక్కడకు వచ్చిన అనుమానిత కరోనావైరస్ రోగికి చికిత్స అందిస్తుండగా ఆ వైద్యునికి కూడా వైరస్ సోకింది. సరైన రక్షణ సౌకర్యాలు లేకుండానే రోగులకు చికిత్స అందించడం వల్లే అతడికి కూడా ఆ మహమ్మారి సోకి, మరణించాడు.

    ఫిబ్రవరిలో ఇరాన్‌తో తమకున్న 960 కి.మీ. సరిహద్దును మూసివేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది. కానీ, తమ ప్రజలు ఆ దేశానికి తీర్థయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోలేకపోయింది. కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి.

    పాకిస్తాన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంలో విఫలమైందని, దాని ఫలితమే కేసుల సంఖ్యలో పెరుగుదల అని సెంజ్ ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ముందుగానే స్పందించి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని ప్రశంసించారు.

  2. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8356, మరణాల సంఖ్య 273

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    భారత్‌లో గత 24 గంటల్లో కరోనావైరస్ బారిన పడి 34 మంది మరణించగా, 909 కొత్త కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 8356కు పెరిగింది. ఇప్పటివరకూ మొత్తం 273 మంది మృతి చెందారు.

    716మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.

  3. కోవిడ్-19పై పోరుకు మరో రూ.1900 కోట్లు సాయం ప్రకటించిన బ్రిటన్

    కరోనావైరస్: యెమెన్‌లో ప్రజల నుంచి సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను పరిశీలిస్తున్న వైద్య సిబ్బంది

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, యెమెన్‌లో ప్రజల నుంచి సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను పరిశీలిస్తున్న వైద్య సిబ్బంది

    ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.1900 కోట్లు) సహాయంగా అందిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

    శరణార్థి శిబిరాలకు ఈ నిధుల ద్వారా ప్రయోజనం కలుగుతుందని బ్రిటన్ అభిప్రాయపడింది.

    విదేశాల్లో కొన్ని చోట్ల నెలకొన్న అపరిశుభ్ర ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు, వారి ద్వారా మరోసారి బ్రిటన్ లాంటి దేశాలకు వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ఈ నిధులు ఉపకరిస్తాయని బ్రిటన్ మంత్రి ఒకరు తెలిపారు.

    కరోనావైరస్‌పై పోరుకు ప్రస్తుత సాయంతో బ్రిటన్ ఇప్పటి వరకూ అందించిన మొత్తం నిధులు 774 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.7338 కోట్లు) చేరుకున్నాయి.

    డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (డీఎఫ్ఐడీ) అంచనాల ప్రకారం కోవిడ్-19పై పోరుకు అధిక మొత్తంలో సాయం అందించిన దేశాల్లో బ్రిటన్ ఒకటి.

    ఈ నిధులతో శరణార్థి శిబిరాలు, సైనిక సంఘర్షణల్లో నలిగిపోతున్న ప్రజలు నివసించే ప్రదేశాల్లో చేతులు కడుక్కునేందుకు ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించేందుకు కృషిచేస్తామని డీఎఫ్ఐడీ వెల్లడించింది.

    అంతర్యుద్ధం కారణంగా అరకొర వైద్య సౌకర్యాలతో సతమతమవుతున్న యెమెన్‌కు ప్రత్యేక సాయం అందిస్తామని డీఎఫ్ఐడీ తెలిపింది.

    కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి పేద దేశాలకు ధనిక దేశాలు అన్ని రకాలుగా సాయం అందించకపోతే మరోసారి మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

    ప్రస్తుతం బ్రిటన్ ప్రకటించిన 200 మిలియన్ పౌండ్లలో 130 మిలియన్ పౌండ్లు డబ్ల్యూహెచ్ఓతో సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలకు అందుతాయి.

    మరో 50 మిలియన్ పౌండ్లు రెడ్ క్రాస్‌కు అందుతాయి. మిగిలిన 20 మిలియన్ పౌండ్లు ఎన్జీవోలకు అందిస్తారు.

  4. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం.

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి. ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు...

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 17.7 లక్షల మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 1.08 లక్షల మంది మృతి చెందారు. 4.02 లక్షల మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. మృతుల సంఖ్యలో ఇటలీని దాటి అమెరికా మొదటి స్థానానికి చేరుకుంది.

    తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తామని తెలిపారు.

    ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో మరి కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని ఈ సమావేశంలో సంకేతాలిచ్చారు.

    కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నామని, ప్రధాని తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి సహకారం అందిస్తామి ఏపీ సీఎం జగన్ తెలిపారు.

    లాక్ డౌన్ ఇప్పుడే ఎత్తేస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని, వైరస్ తిరగబడి ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువవుతాయంటూ ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.