You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ఇంటి నుంచి బయటకు వస్తే ఫేస్‌ మాస్కు తప్పనిసరి చేసిన దిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బాధితుల సంఖ్య 14,50,343ను దాటింది. మృతుల సంఖ్య 83,568 దాటింది.. ఇప్పటి వరకూ 3 లక్షల మంది ఈ వ్యాధి నుంచి బయట పడ్డారు.

లైవ్ కవరేజీ

  1. ముంబయిలో బయటికి వెళ్లేవారికి మాస్క్ తప్పనిసరి-బీఎంసీ

    ముంబయిలో బహిరంగ ప్రాంతాల్లో తిరిగేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

    ముంబయిలో ఏదైనా కారణాలతో రాకపోకలు సాగించేవారు బహిరంగ ప్రాంతాల్లో గుడ్డ మాస్క్ లేదా మూడు పొరలు ఉన్న మాస్క్ ధరించడాన్ని బీఎంసీ తప్పనిసరి చేసింది అని ఏఎన్ఐ చెప్పింది.

  2. కరోనావైరస్: ఆఫ్రికాలో ఏం జరుగుతోంది?

    ఆఫ్రికాలో 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    "కోవిడ్ వేలాది మరణాలనే కాదు, ఆర్థిక, సామాజిక విధ్వంసాన్ని కూడా సృష్టించగలదు" అని డబ్య్లుహెచ్ఓ అధికారి మాటషిడిసో మోటీ చెప్పారు.

    • సోమాలియా దేశ ప్రజలు, ఆధునిక సోమాలీ సంగీతం సృష్టికర్తల్లో ఒకరైన అహ్మద్ ఇస్మాయిల్ హుస్సేన్ హుదైదీకి నివాళులు అర్పిస్తున్నారు. కోవిడ్-19 సోకడంతో ఈయన 92 ఏళ్ల వయసులో లండన్‌లో చనిపోయారు. ఈయన్ను ‘కింగ్ ఆఫ్ అవుడ్’ అంటారు.
    • లాక్‌డౌన్ సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి లంచ్ చేసినందుకు దక్షిణాఫ్రికా కమ్యూనికేషన్స్ మంత్రి స్టెల్లా డబేనీ అబ్రహామ్స్ ను రెండు నెలలు సస్పెండ్ చేశారు.
    • కరోనా మహమ్మారి వ్యాపించడంతో ఇథియోపియా అత్యవసరస్థితి ప్రకటించింది. పది కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఈ దేశంలో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు.
    • ప్రపంచమంతా మహమ్మారితో పోరాడుతుంటే, ఇథియోపియా ప్రథమ మహిళ ‘దేవుడి దయ’ కోసం ప్రార్థించండి అంటూ ఒక సువార్త పాటను విడుదల చేశారు.
    • కరోనా వైరస్ వ్యాపించకుండా ఇరుకుగా ఉన్న జైళ్లను ఖాళీ చేయడానికి డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1200 మంది ఖైదీలను విడుదల చేసింది.
  3. కరోనావైరస్: మధ్యప్రాచ్యంలో పరిస్థితి

    యూదుల సెలవు దినం కారణంగా ఇజ్రాయెల్ అంతటా మామూలుగా మూసివేత విధించారు.

    శుక్రవారం వరకూ దేశంలో అన్ని రవాణా సౌకర్యాలనూ నిలిపివేశారు.

    ఇజ్రాయెల్‌లో 9400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 వైరస్ వల్ల ఇప్పటివరకూ 71 మంది మృతిచెందారు.

    ఈజిఫ్టులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1450 చేరింది, 94 మంది మృతిచెందారు. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసంలో అన్నిరకాల బహిరంగ, మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    కరోనా మహమ్మారితో పోరాడ్డానికి 5 బిలియన్ డాలర్ల రుణం అందించాలని ఇరాన్ ఐఎంఎఫ్‌ను కోరింది. రుణాల ఆమోదంలో ఎలాంటి వివక్షా చూపకూడదని దేశాధ్యక్షుడు హసన్ నూరానీ హెచ్చరించారు. ఇరాన్ ఆ రుణ మొత్తాన్ని ఆంక్షలను ఎదుర్కోడానికి ఉపయోగించవచ్చని అమెరికా చెబుతోంది.

    కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 62,589కి చేరింది. ఇప్పటివరకూ 3872 మంది చనిపోయారు.

    ఆంక్షలను, సామాజిక దూరం పాటించకపోతే, రాబోవు వారాల్లో దేశంలోని 2 లక్షల మందికి కరోనా వైరస్ సోకవచ్చని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2795కు చేరింది. 41 మంది మృతి చెందారు.

  4. కరోనావైరస్: యూరప్‌లో ఏం జరుగుతోంది?

    యూరప్‌లో మహమ్మారి విజృంభిస్తుంటే, స్పందించడం ఎలా అనేదానిపై ప్రభుత్వ సంస్థల్లో, ఈయూ నేతల్లో విభేదాలు పెరుగుతున్నాయి.

    ఈయూ ఆర్థిక మంత్రులు 16 గంటల చర్చల తర్వాత కూడా ఆర్థికంగా స్పందించేందుకు ఇంకా అంగీకరించలేదని చెప్పారు.

    దక్షిణ యూరప్‌లో కరోనాకు తీవ్ర ప్రభావితమైన ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు తమకు తగినంత సాయం చేయలేదని అంటుంటే... నెదర్లాండ్స్, జర్మనీ లాంటి ఉత్తర ఈయూ దేశాలు మిగతా దేశాల అప్పులు తమపై పడుతాయేమోనని భయపడుతున్నాయి.

    • యూరోపియన్ యూనియన్ అగ్ర శాస్త్రవేత్త మడూరా ఫెరారీ, రాత్రి సమావేశాల నుంచి వెళ్లిపోయారు. ఈయూపై నమ్మకం కోల్పోయానని అన్నారు.
    • కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన స్పెయిన్‌ ప్రాంతీయ అధికారులు దేశంలోని మరణాల సంఖ్య అధికారిక గణాంకాల కంటే రెట్టింపు ఉండవచ్చని ఎల్ ముండో వార్తా పత్రికకు చెప్పారు.
    • లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ఈస్టర్ సర్వీసులకు హాజరు కావాలనుకున్న కొందరు కాథలిక్కుల ప్రయత్నాలను జర్మనీ కోర్టు అడ్డుకుంది.
    • కరోనా ప్రభావిత పట్టణాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సందర్శించినపుడు, జనం ఆయన్ను పలకరించడానికి బయటికి రావడంతో విమర్శలు ఎదుర్కున్నారు. ఆ సమయంలో దూరంగా వెళ్లాలని సామాజిక దూరం పాటించాలని మాక్రాన్ ప్రజలకు చాలాసార్లు చెప్పారు.
  5. ఇది ఆంక్షలు సడలించే సమయం కాదు: డబ్ల్యుహెచ్ఓ

    వచ్చే వారం రోజులు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడానికి సరైన సమయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగ్ చెప్పారు.

    "ఆంక్షలు సడలించడానకి ఇది సమయం కాదు. ఇది మన చర్యలను రెట్టింపు చేయాల్సిన సమయం" అన్నారు.

    "మనం అప్రమత్తంగా ఉండాలి. ఒక చివరి పాయింట్‌కు వచ్చేశాం అనుకోవడం చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యానికి వైరస్ ఎలాంటి అవకాశం ఇవ్వదు" అని క్లూగ్ చెప్పారు..

  6. లాక్‌డౌన్ ఎత్తివేతతో వుహాన్‌లో మళ్లీ సందడి

    డిసెంబర్‌లో కరోనా వైరస్ బయటపడడంతో రెండు నెలల పాటు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత, వుహాన్‌లో మళ్లీ సాధారణ జీవనం మొదలైంది.

    నగర ప్రజలను మళ్లీ బయటకు రావడంతో 76 రోజులు నిర్మానుష్యంగా కనిపించిన వుహాన్ వీధులు మళ్లీ సందడిగా మారాయి.

    నగరం నుంచి వెళ్లే జాతీయ రహదారులపై టోల్ గేట్లు మళ్లీ తెరిచారు.

    నగరం నుంచి రైళ్లు, విమాన సేవలు మళ్లీ ప్రారంభించారు.

  7. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో కరోనా కేసు నమోదు

    దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి జిల్లా వాసి కుమార్తెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.

    దీంతో భూపాలపల్లి జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు తెలిపారు.

    20 ఏళ్ల బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    కరోనా పాజిటివ్ అయిన ఆమె తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  8. కోవిడ్-19 పరీక్షల కోసం ఏపీలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సిద్ధం

    కరోనావైరస్పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తయారైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడానికి సిద్ధం చేశారు.

    రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేశారు.

    ఏపీ ప్రభుత్వం మొదట 1000 కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా 50 నిమిషాల్లోనే కరోనా పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు.

    ఒక్క ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ ద్వారా రోజుకు 20 పరీక్షలు చేయవచ్చు. మరో వారం రోజుల్లో పది వేల కోవిడ్ టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

  9. గుజరాత్‌లో 14 నెలల బాలుడి మృతి

    గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో 14 నెలల వయసున్న ఓ బాలుడు కరోనావైరస్ కారణంగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ బాలుడికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు ఏప్రిల్ 5వ తేదీన గుర్తించారు.

    అతడికి రెండు రోజులుగా కృత్రిమ శ్వాస అందిస్తున్నారని, వివిధ అవయవాలు విఫలమవటంతో బుధవారం చనిపోయాడని పీటీఐ ఒక కథనంలో పేర్కొంది.

    ఆ చిన్నారి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని అజాంగడ్ ప్రాంతానికి చెందిన వలస కార్మికులు. వారు ఇటీవలి కాలంలో ఎటూ ప్రయాణించలేదు.

    వారి శిశువుకు వైరస్ సోకినట్లు గుర్తించిన తర్వాత బాలుడి తల్లి (21 ఏళ్లు) తండ్రి (24 ఏళ్లు) ఇద్దరినీ క్వారంటైన్‌లో ఉంచారు.

    మొత్తం జామ్‌నగర్ జిల్లాలో కరోనావైరస్ నిర్ధరణ అయిన మొట్టమొదటి కేసు, ఇప్పటివరకూ బయటపడిన ఏకైక కేసు ఈ శిశువుదే. గుజరాత్‌ మొత్తం మీద వైరస్ సోకిన వారిలో అతి పిన్న వయస్కుడు ఈ బాలుడే.

    అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించినప్పటి నుంచీ.. అది ఎలా సోకిందనే మూలాన్ని తెలుసుకోవటానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు.

    గుజరాత్‌లో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు: 179

    మరణాల సంఖ్య: 16

  10. భారత్‌లో ఒక్కరోజులో 773 కేసులు, మొత్తం కేసుల సంఖ్య 5194

    భారత్‌లో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5194కు చేరింది.

    మంగళవారం ఒక్క రోజే 773 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 35 మంది మరణించారు.

    ఇప్పటి వరకూ 149 మంది కోవిడ్-19 బారిన పడి మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

  11. కరోనావైరస్ కారణంగా కండోమ్‌ల కొరత ఏర్పడనుందా?

    కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కండోమ్‌ల కొరత ఏర్పడనుందా? అవుననే చెబుతోంది అతిపెద్ద తయారీ సంస్థ.

    ప్రపంచంలోనే రబ్బర్ ఉత్పత్తిలో మలేషియా ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే కండోమ్‌లలో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే తయారవుతాయి.

    ఇతర ఎన్నో దేశాలలాగే మలేషియాలో కూడా ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో కండోమ్‌ల ఉత్పత్తి తగ్గిపోయింది.

    రాబోయే నెలల్లో కచ్చితంగా కండోమ్‌ల కొరత ఎదురవుతుందని కారెక్స్ సంస్థ యజమాని గో మియా కియాట్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి కారెక్స్ సంస్థ నుంచే తయారవుతుంది.

    ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దాని అనుబంధ సంస్థ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీకి అవసరమైన కండోమ్‌లలో ఇప్పటివరకూ కేవలం సగం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపింది.

    “కండోమ్‌లు లేదా ఇతర గర్భనిరోధక సాధనాల కొరత అవాంఛిత గర్భాల సంఖ్యలో పెరుగుదలకు కారణమవుతుంది. ఇది యుక్తవయసు బాలికలు, మహిళలు, వారి భాగస్వాములు, కుటుంబాలపై ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎన్నో పరిణామాలకు దారితీస్తుంది” అని ఐరాస అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారని ఏఎఫ్‌పీ తెలిపింది.

    దీనివల్ల సురక్షితం కాని అబార్షన్లు, సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు, హెచ్ఐవీ కూడా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

  12. ఏపీలో 15 కొత్త కేసులు, మొత్తం కేసుల సంఖ్య 329

    ఆంధ్ర ప్రదేశ్‌లో మరో 15 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

    నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3 కేసులు నమోదయ్యాయి.

    కొత్తగా నమోదైన 15 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 329కి చేరింది.

  13. గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా లేదు, చైనా చెబుతున్న ఈ మాటలు నమ్మొచ్చా?

    మంగళవారం తమ దేశంలో ఒక్క కరోనావైరస్ రోగి కూడా మరణించలేదని చైనా ప్రకటించింది. జనవరి నుంచి ఇప్పటివరకూ చైనాలో ఒక్క రోగి కూడా మృతిచెందకపోవడం ఇదే మొదటిసారి.

    కానీ, దీంతో అందరూ ఏకీభవించడంలేదు. ఎందుకంటే, అధికారిక సమాచారాన్ని విడుదల చేసే విషయంలో చైనా విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమే. జీడీపీ సమాచారాన్ని వెల్లడించే సమయంలో కూడా చైనా ఎప్పుడూ ఇలానే వ్యవహరిస్తుంది.

    అసలు చైనా దృష్టిలో నిర్థరిత కేసు అంటే ఏంటి అనేదానిపై కూడా దృష్టి పెట్టాలి.

    కరోనావైరస్ నిర్థరిత కేసు అంటే ఏంటో జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఏడు విభిన్న నిర్వచనాలిచ్చింది.

    “వుహాన్‌లో నమోదైన తీవ్రమైన నిమోనియా కేసులపైనే ప్రాథమికంగా దృష్టిపెట్టారు. ఆ తర్వాత ఇచ్చిన నిర్వచనాలను ముందు నుంచి అన్వయించి చూసుకుంటే చైనాలో కనీసం 2,32,000 కేసులు నమోదై ఉండాలి” అని బీబీసీకి ఓ ప్రొఫెసర్ తెలిపారు.

  14. వెల్లుల్లి, ఉల్లి తినండి, తమ ప్రజలకు ఉత్తర కొరియా సూచన

    ఇప్పటివరకూ తమ దేశంలో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ, అక్కడి అధికారులు కొన్ని వారాలుగా పరిమిత స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

    కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలో సూచిస్తూ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

    వైద్యుల సలహాలు తీసుకోకుండా స్వయంగా ఎలాంటి మందులూ తీసుకోవద్దని హెచ్చరించింది. ఎవరికి వారే యాంటీవైరల్ మందులను వాడొద్దని సూచించింది.

    అలాగే, ఆల్కహాల్ వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది కాబట్టి దాని జోలికి వెళ్లొద్దని తెలిపింది.

    రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేసేలా చూసుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంప్రదాయ పద్ధతులను పాటించాలని సూచించింది. వెల్లుల్లి, ఉల్లి, తేనె తీసుకోవాలని తెలిపింది.

    మాస్కులు ధరించాలని, వాటిని తరచూ మార్చుకుంటూ ఉండాలని చెప్పింది. యాంటీబయోటిక్స్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని వాడొద్దని సూచించింది.

  15. కరోనావైరస్- లాక్‌డౌన్ ఎప్పుడు, ఎలా ముగుస్తుంది?, సరోజ్ సింగ్, బీబీసీ ప్రతినిధి

    లాక్‌డౌన్ ఎత్తేస్తారా? దానిని ఎప్పుడు, ఎలా ముగిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలపై ఒక కన్నేద్దాం.

    మనకు వేరే దారి లేదు. లాక్‌డౌన్ కొనసాగించాలి. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని నేను గౌరవ ప్రధానమంత్రికి అపీల్ చేస్తున్నాను. దానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు.

    -కె.చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి

    ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ కొనసాగించవచ్చు అనిమీడియాలో గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. అది చూస్తున్న ప్రజలు పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14 తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. మా రాష్ట్రంలో ఒక్క కేసు ఉన్నా లాక్‌డౌన్ తెరవడం మంచిది కాదు.

    -అవనీశ్ అవస్థీ, యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి

    కేంద్రం రాష్ట్రాలను దీనిపై సలహా కోరింది. రాష్ట్రాలు తమ పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. లాక్‌డౌన్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంరాజస్థాన్.

    -అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

    మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తోంది.

    -రాజేశ్ టోపే, ఆరోగ్య మంత్రి, మహారాష్ట్ర

    ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 20న లాక్‌డౌన్ ఎత్తివేస్తే, అస్సాం బయట ఉన్న అసామియా యువతీయువకులు అందరూ ఒకేసారి రాష్ట్రంలోకి వస్తారు. వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌కు పంపడం అసాధ్యం, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం వారందరినీ పెట్టడానికి తగినన్ని క్వారంటైన్ కేంద్రాలు లేవు.

    -హిమంత్ బిస్వా శర్మ, ఆరోగ్య మంత్రి, అస్సాం

    ఈ ప్రకటనలన్నీ దేశంలోని పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చేసినవి. ఇవన్నీ చూస్తుంటే ఏప్రిల్ 14 తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదు అనే విషయం స్పష్టం అవుతోంది.

    కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైపు నుంచి కూడా కొన్ని ఆంక్షలు విధిస్తామని చెబుతున్నాయి.

    అయితే ఈ లాక్‌డౌన్ ఎలా ఎత్తివేస్తారు? ప్రభుత్వం బ్లూ ప్రింట్ ఏంటి? ఈ విషయాలను తెలుసుకోడానికి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో బీబీసీ మాట్లాడింది. ప్రభుత్వం కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన 11 కమిటీల్లో ఒకదానికి ఆయన అధ్యక్షుడు కూడా.

  16. ఆసియాలో ఏం జరుగుతోంది?

    చైనా: కరోనావైరస్ మహమ్మారి పుట్టిన వుహాన్‌లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించారు. అయితే ఆసియాలోని ఇతర దేశాలన్నీ ఈ వైరస్‌తో సతమతమవుతున్నాయి.

    జపాన్: పెద్ద నగరాల్లో ఎమర్జెన్సీని విధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన ఆంక్షలు అమలుచేయబోతున్నారనే సంకేతాలను ఇది ఇస్తోంది.

    దక్షిణ కొరియా: తాజా సమాచారాన్ని ఈ దేశం వెల్లడించలేదు. కానీ, కొన్ని రోజులుగా రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్లు 50లోపే ఉంటున్నాయి. చైనా తర్వాత అత్యంత ప్రభావితమైన ఈ దేశంలో కేసుల తగ్గుదల ఓ గణనీయమైన పురోగతి అనుకోవచ్చు.

    ఇండోనేషియా: ఇప్పటికీ హాట్‌స్పాట్‌గానే ఉంది. మంగళవారం ఒక్కరోజే 2,738 మంది పాజిటివ్ అని తేలింది. కానీ ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అని వైద్యులు భావిస్తున్నారు. జకార్తాలో సామాజిక ఆంక్షలు విధించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన బాండ్లను జారీచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

    ఫిలిప్పీన్స్: దేశంలోని దాదాపు సగం జనాభా ఈ నెలాఖరు వరకూ హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.

    కొలంబియా: వచ్చేవారం జరగాల్సిన కొత్త సంవత్సర వేడుకలను వాయిదా వేసింది.

    మలేషియా: ఆగ్నేయ ఆసియాలో ఎక్కువ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదైన దేశం ఇది. ఇప్పటివరకూ 4000 మందికి పాజిటివ్ అని తేలింది.

  17. "ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి", ఉత్తరాఖండ్ పోలీసుల అవగాహన కార్యక్రమం

    ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి అంటూ ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు కరోనావైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

    యముడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఇంట్లో ఉండాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

  18. రెండో రోజూ ఐసీయూలోనే బోరిస్ జాన్సన్

    కరోనావైరస్ బారినపడి సెయింట్ థామస్ హాస్పటల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు వరుసగా రెండోరోజు కూడా ఐసీయూలోనే చికిత్స అందించారు.

    ప్రధాని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.

    లాక్ డౌన్ కొనసాగించాలా, సడలించాలా అనే అంశంపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన సమావేశం జరగలేదని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.

    బోరిస్ జాన్సన్ ఓ పోరాటయోధుడని, ఆయన కచ్చితంగా, పూర్తిగా కోలుకుంటారని ప్రస్తుతం పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తున్న విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం జాన్సన్ సాధారణ ఆక్సిజన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, వెంటిలేటర్ వంటి ఎలాంటి కృత్రిమ శ్వాస అందించడం లేదని రాబ్ తెలిపారు.

    లండన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నైటింగేల్ హాస్పటల్లో మంగళవారం నుంచి కోవిడ్-19 రోగులకు చికిత్సను ప్రారంభించారు.

  19. డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేత: ట్రంప్

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు అందించే నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

    “ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా భారీ మొత్తంలో నిధులను అందిస్తోంది. నేను ప్రయాణాలపై నిషేధం విధించినప్పుడు ఆ సంస్థ నా నిర్ణయాన్ని విమర్శించింది. చాలా విషయాల్లో వాళ్లు తప్పులు చేస్తున్నారు. వాళ్లు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మేము డబ్ల్యూహెచ్‌ఓకు అందించే నిధులను నిలిపివేస్తున్నాం” అని ట్రంప్ ప్రకటించారు.

  20. అమెరికాలో ఒక్కరోజులో 2000 మంది మృతి

    అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతోంది. కేవలం ఒక్క రోజులోనే అక్కడ 2000 మరణాలు సంభవించాయి.

    మొత్తం కేసుల సంఖ్య 3,96,223. ఇప్పటివరకూ 12,844 మంది మరణించారు.

    21,849 మంది కోవిడ్-19 బారి నుంచి కోలుకున్నారు.

    ఒక్క న్యూయార్క్‌లోనే 4000 మంది మరణించారు.